S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తప్పు దారి

‘ఈ రాత్రి మనం తప్పకుండా వాళ్లని పట్టుకుంటాం’ సార్జెంట్ లజీర్ చెప్పాడు.
మేము ఫ్లోరిడా రాష్ట్రంలో అపలూసా కౌంటీలోని వాస్కో గ్రామం కోర్ట్ హౌస్‌లో ఉన్నాం.
నేను లౌడర్‌డేల్ నించి వచ్చాను. కొంతకాలంగా టీనేజర్స్ తప్పు దారి తొక్కే అంశం మీద దినపత్రికలకి కాలమ్ రాస్తున్నాను. అందుకు ఒకటి, రెండు సంచికలకి సరిపడే మెటీరియల్ దొరుకుతుందనే ఆశతో వచ్చాను. సార్జెంట్ లజీర్ నాకు గోడ మీది కౌంటీ మేప్‌ని చూపిస్తూ చెప్పాడు.
‘ఇవాళ పున్నమి. వాడు తప్పకుండా బయటకి వస్తాడు. ఈ పద్దెనిమిది మైళ్ల రోడ్ మీదకి. అంటే ఉచ్చులోకి వచ్చినట్లే. నేనీ రోడ్ అంతా నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ పరిశీలించాను. అటు, ఇటు లోతైన గోతులు, నల్లటి బురద నేల. వాటిలో మొసళ్లు. ఓసారి ఆ రోడ్ మీదకి ఎక్కితే దాని చివరి దాకా వెళ్లాల్సిందే. లేదా వెనక్కి మళ్లి బయటపడాలి. రోడ్ దిగి వెళ్లేందుకు వీల్లేదు. అది మృత్యుసమానం. కాబట్టి ఆ రోడ్‌కి రెండు వైపులా రోడ్ బ్లాక్స్‌తో కాపు కాస్తాం. వైర్లెస్‌తో రెండు వైపులా ఒకరితో మరొకరం టచ్‌లో ఉంటాం. ఆ రోడ్ మీదికి రాగానే వాడు ఇక సీసాలోకి వచ్చినట్లే. బిరడా పెట్టడమే తరువాయి’
‘నాకు రోడ్ బ్లాక్స్ గురించి తెలీదు. కాని మీరు చెప్పిందాన్నిబటిట అతను పట్టుబడచ్చనే అనిపిస్తోంది’ చెప్పాను.
‘మీరు నా కార్లో వస్తారు కాబట్టి మీరే చూస్తారు’ లజీర్ చెప్పాడు.
‘మీరు నాకోటి చెప్పలేదు. ఆ కుర్రాడు స్థానికుడే అని చెప్పారు. అతను ఎవరో తెలిసాక అతని ఇంటికి వెళ్లి అరెస్ట్ చేయచ్చుగా?’ అడిగాను.
‘నిజమే. కాని ఆ మూర్ఖుడు దారిదోపిడీలని ఆరంభించిన ఐదారు నెలల నించి మళ్లీ తన ఇంటికి తిరిగి రాలేదు. ఈ క్షణంలో అతని ఇంటి బయట ఇద్దరు ట్రూపర్స్ కాపలా ఉన్నారు. అతని తల్లిదండ్రులకి అతను ఎక్కడ ఉన్నాడో తెలీదు. అతని గర్ల్‌ఫ్రెండ్ క్లారెసా కూడా అతనితో కలిసి వెళ్లింది. ఆమె ఇంటి బయట కూడా కాపలా ఉంచాను. విశాలమైన పైన్ అడవిలో వాళ్లు ఎక్కడో దాక్కుని జీవిస్తున్నారు. బహుశ ఎవరో వదిలేసిన ఏ కేబిన్‌లోనో, రాత్రుళ్లు మాత్రమే బయటకి వచ్చి దోచుకుంటున్నారు’
నేను అర్థమైనట్లుగా తల ఊపాను.
‘ఈ రాత్రి దాకానే. కేవలం ఈ రాత్రి దాకానే. ఈ రాత్రితో వాడి నేర జీవితం అంతమై జైలు జీవితం ఆరంభం అవుతుంది’
‘ఓసారి హైవేలో మీరు వాడ్ని చూశారు కదా? మరి అప్పుడు పట్టుకోలేదే?’ ప్రశ్నించాను.
‘వాడి కారు గంటకి నూట అరవై మైళ్ల వేగంతో వెళ్లేలా ఇంజన్‌ని మార్చుకున్నాడు. నేను ఆ కారుకి యాభై గజాల దూరంలో ఉన్నాను. వాడి కారుని ఆపమన్న సౌంజ్ఞగా నా పోలీస్ కారు మీది లైట్లని వెలిగించి, సైరన్‌ని ఆన్ చేశాను. రెండు నిమిషాల్లో వాడి కారు మైలు దూరం వెళ్లిపోయింది. అంటే, నాలుగు నిమిషాల్లో రెండు మైళ్లు. నా అనుమానం వాడి కారు గంటకి నూట ఏభై మైళ్ల వేగంతో కూడా ప్రయాణించచ్చు. ఆ కార్లో ఇద్దరు ప్రయాణీకులు మాత్రమే పట్టేలా మిగిలిన సీట్లని, వెనక తలుపుల బరువుని తొలగించారు. కారంతా ఫ్రేమే. వాడు మోటార్ మెకానిజాన్ని నేర్చుకున్నాడు. పాడైన కార్ల డీలర్ నించి పోంటియాక్ కార్ ఇంజన్‌ని కొని దానికి అమర్చాడు. అన్నట్లు అతను పట్టుబడేదాకా మీరు వారిద్దరి తల్లిదండ్రులని ఇంటర్వ్యూ చేయకండి. వారి మధ్య రహస్య కాంటాక్ట్ ఉంటే వాళ్లు మన పథకాన్ని పసికట్టచ్చు. ఓసారి వాళ్లు పట్టుబడ్డాక మీ ఇష్టం’
‘సరే. రాత్రి ఎన్నింటికి బయలుదేరతాం?’
‘ఎనిమిదిన్నరకి మీరు ఇక్కడ ఉంటే చాలు’ నజీర్ చెప్పాడు.
ఆ గ్రామ జనాభా ఐదు వందలు. నేను గ్రామస్థుల్ని వాళ్ల గురించి విచారించాను. ఆ యువకుడి పేరు జో. ఆమె పేరు క్లారెసా. జోకి ఓ సోదరుడు, సోదరి ఉన్నారు. పదిహేడో ఏడు దాకా జో ఎవరూ గుర్తించనంత సాధారణ జీవితాన్ని గడిపాడు. ఆ తర్వాత ఒకటి, రెండుసార్లు బార్లో పోట్లాటలు మినహా అతనిలో నేర స్వభావాన్ని ఎవరూ గమనించలేదు. అందుకే జో దారి దొంగయ్యాడంటే ఆశ్చర్యపోయారు.
‘పెద్దయ్యాకే మనిషి స్వభావం బయటపడుతుంది. రివాల్వర్‌ని వంద డాలర్లకి కొనచ్చు. కష్టపడి సంపాదించడం దేనికి? దాన్ని ఉపయోగించి చాలా సంపాదించచ్చు అనుకునే యువత అమెరికాలో పెరిగిపోతోంది. డ్రగ్స్ మీద ఎలాంటి చిత్రమైన ఆలోచనలు వస్తాయో, పథకాలు తడతాయో ఎవరు చెప్పగలరు?’ పోస్ట్‌మాస్టర్ చెప్పాడు.
‘క్లారెసా చిన్నప్పటి నించే గయ్యాళి. బహుశ ఆమె ప్రభావంతోనే జో అలా మారి ఉంటాడని కొందరు అనుమానించారు. ఆమె లీరాయ్ అనే అతనితో కొన్ని నెలలు ప్రేమ వ్యవహారం నడిపింది. జో తన వెంట పడటంతో అకస్మాత్తుగా లీరాయ్‌ని వదిలేసింది. ఆమెకి అతని వెంట తల్లిదండ్రులకి చెప్పకుండా వెళ్లిపోయేంత ధైర్యం ఉందని నేను అనుకోలేదు. కాని టీనేజర్లని వారి హార్మోన్స్ తప్ప మెదడు శాసించలేదు. జో తను చావడమే కాక క్లారెసాని కూడా చంపేస్తాడు. పోలీసులు వాళ్లని కాల్చి చంపడానికి సిద్ధంగా ఉన్నారని విన్నాను. స్కూల్లో చక్కటి మార్కులు వచ్చేవి. చక్కటి అందగత్తె. దాంతో గర్వం కూడా. చాలా మంది యువకులు ఆమె వెంట పడేవారు’ వారి స్కూల్ టీచర్ చెప్పాడు.
* * *
ఆ రాత్రి తొమ్మిదికల్లా నేను స్టేట్ రోడ్ నెంబర్ 21లో సార్జెంట్ లజీర్ కారులో ఉన్నాను. ఓ సన్నటి మట్టి రోడ్‌లో ఓ పెట్రోల్ కారు దాగి ఉంది. ఆ కారులోని ఏ లైట్లూ వెలగడం లేదు. పద్దెనిమిది మైళ్ల దూరంలో ఆ రోడ్ చివర రెండు పెట్రోల్ కార్లలో స్టేట్ ట్రూపర్స్ సిద్ధంగా ఉన్నారు.
దోమలు కుట్టకుండా అంతా మస్కిటో రెపల్లెంట్‌ని పూసుకుని చీకట్లో వేచి ఉన్నాం.
‘ఈ నెల్లో ఈ రోడ్ మీద పెద్దగా ట్రాఫిక్ ఉండదు’ లజీర్ చెప్పాడు.
‘ఇది టూరిస్ట్ సీజన్ కాదు. అందువల్ల రెండు కార్లని అడ్డంగా ఆపితే వాటిని దాటి వెళ్లలేడు. పైగా మన కార్ల ముందు వంద గజాల దూరం నించే అడ్డంగా ఇటుక రాళ్లు అడ్డదిడ్డంగా అమర్చాం. కాబట్టి వాటిని దాటాలంటే తప్పనిసరిగా తన కారు వేగాన్ని జో తగ్గించాల్సి ఉంటుంది. అతను ఎలుకల బోనులో పడ్డ ఎలుకే అవుతాడు’ లజీర్ నాకు హామీ ఇచ్చాడు.
నేను ఊహించిన దానికన్నా లజీర్ అధికంగా మాట్లాడుతాడు. అతను గత ఇరవై ఏళ్లుగా పోలీసు శాఖలో పని చేస్తున్నాడు. కొన్ని హింసాత్మక సంఘటనల్లో పాల్గొన్నాడు. అతను నాకా వివరాలు చెప్పడానికి కారణం, అతను వాటిని చెప్పే పద్ధతిని బట్టి తన మీద నేనో పుస్తకం రాస్తాననే ఆశ కావచ్చు అనిపించింది.
అప్పుడప్పుడు అతను కారు దిగి, అటు, ఇటు నడిచి మళ్లీ కారు ఎక్కసాగాడు.
‘సార్జెంట్. మీరు సరైన సమయాన్ని సరైన ప్రదేశాన్ని ఎన్నుకున్నారంటారా?’ నేను కొన్ని గంటలు గడిచాక ప్రశ్నించాను.
‘అతను పున్నమి రాత్రుల్లో దోచుకోవడం ఆపలేదు. రద్దీగా ఉండే మెయిన్ హైవేల్లోకి ఇంత దాకా వెళ్లలేదు. ఎప్పుడూ ఈ రోడ్లలోనే దొంగతనాలు చేస్తున్నాడు. పంతొమ్మిది మైళ్ల దూరంలో ఉన్న ఓ చిన్న గ్రామంలోకి మెరుపు వేగంతో దాడిచేసి, ఏ పెట్రోల్ బంక్‌నో, షాపునో దోచుకుని పారిపోతాడు. అతను దొంగతనానికి పాల్పడేది నెల్లో నాలుగైదు రాత్రుళ్లే. ప్రతీసారి క్లారెసా అతని పక్కన ముందు సీట్లో కూర్చుని బాధితులకి కనపడింది’
అకస్మాత్తుగా లజీర్ బయట పచార్లు ఆపి కార్లోకి ఎక్కి కూర్చున్నాడు. అతనిలోని ఉత్కంఠని నేను గమనించాను. దూరం నించి ఓ కారు వచ్చే శబ్దం వినిపించింది. వెంటనే అతను మైక్‌ని హుక్ నించి తీసి అవతల కాపున్న ట్రూపర్స్‌కి చెప్పాడు.
‘అతను వస్తున్నాడు. సిద్ధంగా ఉండండి’
లజీర్ మైక్‌ని యథాస్థానంలో ఉంచిన కొద్ది క్షణాలకి ఓ కారు మా ముందు నించి వెళ్లింది. చీకట్లో కూడా ఆకారాన్ని బట్టి అది ఫోర్డ్ కార్ అని గుర్తించాను. లజీర్ తక్షణం పొదల చాటున ఉన్న మా కారుని రోడ్ మీదకి ఉరికించాడు.
‘మూర్ఖుడు కాకపోతే ఇంత పండు వెనె్నల్లో కూడా లైట్లు లేకుండా వెళ్తున్నాడు’
లజీర్ కూడా హెడ్‌లైట్లని వెలిగించకుండా దాన్ని అనుసరించాడు. నేను ఎదురుగా వెళ్లే కారు వంకే చూడసాగాను. మా కారు కన్నా అది వేగంగా వెళ్తోంది. లజీర్ వెంటనే ఏక్సిలేటర్ని తొక్కాడు. మా కారు వేగం కూడా పెరిగింది. అకస్మాత్తుగా లజీర్ హెడ్‌లైట్లని వెలిగించి, సైరన్ బటన్‌ని ఆన్ చేశాడు. కొద్ది నిమిషాలకి మా కారు అతవల రోడ్‌కి అడ్డంగా ఉన్న ఇటుక రాళ్లు, రెండు పెట్రోల్ కార్ల దగ్గరికి చేరుకుంది. పోర్డ్ కార్ అక్కడ లేదు.
అంతా కారు దిగాం.
‘వాడి కారు రాలేదా?’ లజీర్ ట్రూపర్ని ప్రశ్నించాడు.
‘రాలేదు’
‘ఐతే వాడు నా కారు పోలీస్ కార్ అని గ్రహించి మధ్యలో ఎక్కడో దాక్కున్నాడు. బహుశ గోతిలోకి పోనించి, నా కారు వెళ్లాక మళ్లీ వెనక్కి వెళ్లిపోయి ఉంటాడు. వాడు మనం అనుకున్న దానికన్నా మాయగాడులా ఉన్నాడు’ లజీర్ చెప్పాడు.
‘అవును. అలా దాక్కోడానికి చాలా గోతుల్లోకి మార్గం ఉంది’ ట్రూపర్లు చెప్పారు.
లజీర్ పద్దెనిమిది మైళ్లు చేరుకోవడానికి అరగంట పట్టింది. ఈలోగా ఆ కారు మాయం అయిపోయింది. లజీర్ తిరిగి నన్ను నా హోటల్ బయట దింపి చెప్పాడు.
‘ఈసారి ఇంకాస్త ఎక్కువ మందిని బయట కాపుంచుతాను. ప్రతీ రెండు మైళ్లకో పెట్రోల్ కారుని కాపుంచుతాను. అందుకు పొరుగూరు నించి కొన్ని పెట్రోల్ కార్లని తెప్పించాల్సి ఉంటుంది’
అతను చాలా నిరుత్సాహంగా కనిపించాడు.
మర్నాడు నేను తిరిగి లౌడర్‌డేల్‌కి వెళ్లిపోయాను.
* * *
కొన్ని రోజుల తర్వాత నాకు లజీర్ నించి ఫోన్ వచ్చింది.
‘మీరు జో అంతం చూడాలని అనుకుంటే వెంటనే బయలుదేరి రావడం మంచిది’
‘దొరికాడా?’ అడిగాను.
‘ఆచూకీ తెలిసింది. రూట్ ట్వంటీ సెవెన్లో అతను తన కారుని ఓ సరస్సులోకి తోసేసాడు. అది పనె్నండో మైలురాయి సమీపంలో ఉంది. దాన్ని క్రేన్‌తో బయటకి తీసే ఏర్పాటు చేశాను. డ్రైవర్ చెప్పడం ఆ కార్లో ఇంకా దాని డ్రైవర్, ఆ అమ్మాయి ఉన్నారు. స్థానిక రేడియోలో ఇది పెద్ద వార్తగా ప్రసారం అవుతోంది. అంత వేగంగా డ్రైవ్ చేస్తూ కంట్రోల్ చేయలేక పోయినట్లున్నాడు’
నేను సమయం వృథా చేయకుండా అతను చెప్పిన ప్రదేశానికి నా కార్లో వెళ్లాను. ఆ ప్రదేశాన్ని కనుక్కోడానికి ఇబ్బంది పడలేదు. అక్కడ హైవే పక్కన వంద దాకా కార్లు, టీవీ కెమెరా యూనిట్ వేన్లు కనిపించాయి. ట్రాఫిక్ పోలీస్ నా కారుని ఆపితే అతనికి నా ప్రెస్ ఐడెంటిటీ కార్డ్‌ని చూపించి చెప్పాను.
‘నన్ను సార్జెంట్ లజీర్ ఆహ్వానించాడు’ చెప్పాను.
అతను నా కారుని చెరువు వైపు రోడ్ మీదకి మళ్లించాడు. దూరం నించే నాకు లజీర్ ఆ చెరువు ఒడ్డున కనిపించాడు. కారు దిగి అతని దగ్గరికి నడిచాను. మొహాన మాస్క్‌తో, వీపుకి ఎయిర్ టేంక్‌తో స్విమ్మింగ్ ఫిన్స్ ధరించిన ఒకతను పెద్ద హుక్‌ని తీసుకుని చెరువులోకి దూకడం చూశాను. లజీర్ నన్ను చూసి చేయూపి చెప్పాడు.
‘కొద్దిసేపట్లో ఆ కారు పైకి లేస్తుంది. అది ఇరవై అడుగుల లోతులో నల్లటి, చిక్కటి బురదలో చిక్కుకుంది. మొదటిసారి మడ్‌గార్డ్ మాత్రమే ఊడి వచ్చింది’
‘ఎలా కనుక్కున్నారు?’ ప్రశ్నించాను.
‘ఇవాళ ఉదయం చిన్న విమానంలో చెరువు మీద ఎగిరే ఓ పైలట్ కిందుగా ఎగిరేప్పుడు నీరు స్వచ్ఛంగా అద్దంలా ఉండి కింద ఏదో కనిపించింది. ఇంకోసారి ఇంకాస్త కిందికి వస్తే, అది కనపడింది. ఆ ప్రదేశాన్ని గుర్తుపెట్టుకున్నాను. ఆ మూడు చెట్లకి సూటిగా వందడుగుల దూరంలో ఆ కారుంది. విమానం దిగి ఇంటికి వెళ్లాక నాకు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే డ్రైవర్‌ని పంపి ముందు నంబర్ ప్లేట్‌ని తెప్పించాను. అది జో కారుది. వెంటనే మీకు ఫోన్ చేసాను’
కొద్ది క్షణాలాగి మళ్లీ చెప్పాడు.
‘అతన్ని నేను పట్టుకోవడం నాకు, జోకి పోటీ లాంటిది. అతన్ని నేను స్వయంగా ప్రాణాలతో పట్టుకోవాలనే నా కోరిక తీరనేలేదు’
నేను చుట్టూ చూశాను. పసుపుపచ్చ క్రేన్. దాని పక్కనే బయటకి తీసాక కారుని తీసుకెళ్లడానికో పెద్ద ఓపెన్ లారీ కనిపించాయి. అంబులెన్స్‌లో వచ్చిన వారు దానికి ఆనుకుని సిగరెట్ తాగుతూ తమలో తాము ఏదో మాట్లాడుకుంటున్నారు. కారు బయటకి రావడం చూడ్డానికి దూరంగా చాలామంది గుంపుగా నిలబడ్డారు. వాళ్లు చెరువు వైపు రాకుండా ఇద్దరు పోలీసులు కంట్రోల్ చేస్తున్నారు. కొందరు కోక్ తాగుతూ ట్రాన్సిస్టర్‌లో ఈ సంఘటనకి సంబంధించిన వార్తని వింటున్నారు. ఓ కుర్రాడు తన వెంట తెచ్చిన గిటార్ని వాయిస్తున్నాడు. కొందరు అతని చుట్టూ చేరి దాన్ని వింటున్నారు. ఒకరిద్దరు ఆ సంగీతానికి అనుగుణంగా నృత్యం చేస్తున్నారు. అక్కడ ఓ కార్నివాల్ జరుగుతున్నట్లుగా నాకు అనిపించింది.

ఆ కార్లో మరణించింది జో, అతని గర్ల్‌ఫ్రెండ్ క్లారెసా కాకపోతే ఇలా ఇక్కడ ఉత్సవ దృశ్యాలు కనపడవని నాకు అనిపించింది.
చెరువులో నీళ్లు కదలడం మొదలవగానే నెమ్మదిగా అక్కడ నిశ్శబ్దం అలుముకుంది. ఆ ప్రాంతంలోకి దిగిన బలిష్టమైన ఇనప వైర్ పైకి లేవసాగింది. ఆ వైర్‌కి తడి నాచు, కలుపు మొక్కలు అంటుకుని ఉన్నాయి. క్రమంగా బురద నీరు పైకి లేచింది. ఆ నీరు కారగానే కారు తలుపు అద్దాలు మెరుస్తూ కనిపించాయి. సగం దాకా కారు నీళ్లల్లో లేచింది. క్రేన్ ఆపరేటర్ లాఘవంగా, మృదువుగా దాన్ని పైకి లేపాడు.
ఆ కారు కిటికీ అద్దాల్లోంచి ఓ జంట కనపడగానే అకస్మాత్తుగా అక్కడ గుసగుసలు వినపడ్డాయి. సీట్ బెల్ట్‌లు కట్టుకున్న వారి తలలు పక్కకి ఒరిగి ఉన్నాయి. నాకు శవాలని చూడటం చాలా భయం. వెంటనే నేను లజీర్‌తో చెప్పకుండా కారెక్కి హోటల్ గదికి చేరుకుని ఓ డ్రింక్‌ని ఆర్డర్ చేశాను. నేరాన్ని నమ్ముకున్న ఓ యువ జంట ఆయుష్షు ముగియకుండానే మరణించడం నన్ను చాలా బాధించింది. అలాంటి బాధ వల్లే అసలు నేనీ కాలమ్‌ని మొదలుపెట్టింది.
నేను టైప్‌రైటర్ ముందు కూర్చుని టైప్ చేయసాగాను. ఆదివారం కాలమ్‌లో అది వస్తుంది. రెండు వేల మాటలు టైప్ చేయడానికి నాకు ఎప్పటికన్నా ఎక్కువ సమయం పట్టింది. ఎందుకంటే నేను ఇద్దరి కోసం దాన్ని రాయాలి. ఒకటి ఎడిటర్ కోసం. అది ఆయనకి నచ్చితేనే అచ్చులోకి వెళ్తుంది. రెండోది పాఠకుల కోసం. ప్రతీ పత్రికా విలేకరికీ ఉండే ఇబ్బందే ఇది. ‘ఓ జంట తమ మేథస్సుని, నైపుణ్యాన్ని, శక్తిని, కలలని నేర ప్రపంచానికి అంకితం చేయడం నేను ఊహించలేక పోతున్నాను’ అనే మొదటి వాక్యం రాయడానికే నాకు చాలా సమయం పట్టింది. మొదటి వాక్యమే పాఠకుల చేత మిగిలింది చదివిస్తుంది. అది ఆసక్తిని రేకెత్తించాలి. అదే సమయంలో వాళ్లు ఏం చదవబోతున్నారో చూచాయగా తెలియజేయాలి.
నేను క్రితం సారి ఆ గ్రామం నించి వెళ్లే ముందు జో, క్లారెసా తల్లిదండ్రులని ఇంటర్వ్యూ చేసుకుని రాసుకున్న నా నోట్ బుక్‌ని మధ్యమధ్యలో చూసుకుంటూ మొత్తానికి ఆ వ్యాసాన్ని ముగించాను. అది నాకు ఎంతో తృప్తిగా వచ్చింది. 1960లలో అమెరికాలో వచ్చిన సెక్స్‌వల్ రివల్యూషన్ చివరకి అమెరికన్ యువతని ఎక్కడికి తీసుకెళ్లిందో ఆ వ్యాసంలో అంతర్లీనంగా వివరించాను. లేదా క్లారెసా జోతో అంత ధైర్యంగా వెళ్లగలిగేది కాదు.
* * *
మర్నాడు ఉదయం ఐదున్నరకి నాకు ఫోన్‌కాల్‌కి మెలకువ వచ్చింది.
‘హలో’ నిద్రమత్తులో కళ్లు తెరవకుండానే రిసీవర్ని తడిమి తీసుకుని చెప్పాను.
‘హలో, సిడ్?’
‘నేనే. హలో లజీర్. ఏమిటి ఈ సమయంలో ఫోన్ చేసారు?’ ఏదో విశేషం లేకపోతే అతను అంత పొద్దునే్న నాకు ఫోన్ చేయడని తెలిసి లేచి కూర్చుని అడిగాను.
‘సారీ’
‘ఏమిటి విషయం?’
‘మీరు చివరి దాకా అక్కడ ఉండాల్సింది సిడ్. పోస్ట్‌మార్టం చేసిన డాక్టర్ ఆ జంట నీళ్లల్లో గత ఆర్నెల్లుగా ఉన్నారని చెప్తున్నారు’
‘అంటే వాళ్లు మనం వెదికే జంట కాదా?’ వెంటనే అడిగాను.
‘వాళ్లే. సందేహం లేదు. క్లారెసా డెంటల్ రికార్డుల ప్రకారం అది క్లారెసా శవమే. జో అపెండిక్స్ ఆపరేషన్ వల్ల అతని శవాన్ని కూడా గుర్తించగలిగాం. బహుశ ఏం జరిగి ఉండచ్చంటే జో ఆమెని చూడ్డానికి ఆమె ఇంటికి వెళ్లాడు. ఆమె గర్భవతని తెలిసి వెంటనే, బహుశ గర్భవిచ్ఛేదానికి బయటకి బయల్దేరి ఉంటారు. ఎందుకంటే ఆమె ఇంకా హౌస్ గౌన్లోనే ఉంది. దారిలో ఆగి ఇంకా దుస్తుల్ని మార్చుకోలేదంటే, ఇద్దరూ ఎంత భయపడ్డారో అర్థం చేసుకోవచ్చు’
‘ఐతే ఇన్నాళ్లు దోచుకుంది వీళ్లు కాదన్నమాట’
‘అవును. ఇంకెవరో. సారీ’
నేను నెమ్మదిగా రాత్రి రాసిన వ్యాసాన్ని అందుకుని, విలువ లేని దాన్ని నలిపి డస్ట్‌బిన్‌లో పడేసాను.
మరో మూడు వారాల తర్వాత నాకు లజీర్ నించి మళ్లీ ఫోన్ వచ్చింది.
‘చివరికి వెనె్నల రాత్రుల్లో దొంగతనం చేసే హైవే దొంగల్ని పట్టుకోబోతున్నాం. ఈసారి పద్దెనిమిది కార్లు, పైన ఓ విమానం, ఎక్కువ రోడ్ బ్లాక్స్‌ని ఉపయోగిస్తున్నాం. ఈసారి వాళ్లని పట్టుకోవడం తథ్యం. పై ఆదివారం మీరు వస్తారా?’ ఆహ్వానించాడు.
‘క్లారెసా, జో మరణించాక అనవసరంగా వారిద్దరూ ఆ గ్రామస్థుల దృష్టిలో, చుట్టుపక్కల ఆరు కౌంటీల దృష్టిలో నేరస్థులు అవడం విచారకరం’ నెమ్మదిగా చెప్పాను.
‘అవును. ఒకోసారి అలా జరుగుతూంటుంది. వస్తున్నారా?’ అడిగాడు.
‘సారీ. లేదు. ఈసారి రాలేను. బెస్ట్ ఆఫ్ లక్ సార్జెంట్ లజీర్’ చెప్పాను.

(జాన్ డి మెక్‌డొనాల్డ్ కథకి స్వేచ్ఛానువాదం)