S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆత్మసమర్పణ (కథాసాగరం)

యాజిద్ గొప్ప సూఫీ మార్మికుడు. ఆయన్ది పెద్ద ఆశ్రమం. ఎందరో శిష్యులు ఉండేవాళ్లు. ఎందరో ఆయన దగ్గర శిష్యరికానికి వచ్చేవాళ్లు. వాళ్ల అర్హతని బట్టి పరీక్షలో నిగ్గు తేల్చేవాడు.
ఒకసారి ఒక వ్యక్తి బయాజిద్ దగ్గరకు వచ్చి ‘నేను మీ ఆశ్రమంలో చేరాలనుకుంటున్నాను’ అన్నాడు. బయాజిద్ ‘మా ఆశ్రమంలో రెండు రకాల వాళ్లున్నారు. మొదటి రకం శిష్యులు, రెండో రకం గురువులు. నువ్వు ఏ రకాన్ని ఎన్నుకుంటావు?’ అన్నాడు. అతను ‘నేను గురువును కావాలనుకుంటాను’ అన్నాడు. బయాజిద్ ‘అట్లాంటి తెగ మా దగ్గర లేదు. ఆశ్రమంలో ఉన్న వాళ్లంతా శిష్యులే. నీ తత్వాన్ని గ్రహించడానికి నేను అలా అన్నాను’ అన్నాడు. ఆ వ్యక్తి ‘అయితే నేను శిష్యుడిగా చేరుతాను’ అన్నాడు.
బయాజిద్ ‘నువ్వు శిష్యుడికి ఇక్కడ చేరడానికి పనికిరావు. ఎందుకంటే శిష్యరికానికి ఆత్మసమర్పణ భావం కావాలి’ అన్నాడు.
కొంతకాలం గడిచింది. ఆ ప్రాంతపు రాజయిన ఇబ్రహీం అక్కడికి వచ్చి ‘నేను నా సమస్త రాజ్యాన్ని పరిత్యజించాను. నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి. మీ ఆశ్రమంలో నాకు చోటు కల్పించండి’ అన్నాడు.
బయాజిద్‌కు సాధారణ వ్యక్తి అయినా, సామ్రాట్టయినా ఒకటే. ఆయన రాజుతో ‘నేను మిమ్మల్ని శిష్యుడిగా అంగీకరించే ముందు మీకు పరీక్ష పెడతాను. ఆ పరీక్షలో మీరు నెగ్గడాన్నిబట్టి మిమ్మల్ని శిష్యుడిగా స్వీకరించాలా? వద్దా? అన్నది నిర్ణయిస్తాను’ అన్నాడు.
ఇబ్రహీం ‘నాకు అభ్యంతరం లేదు. కారణం నేను నిర్ణయించుకొని వచ్చాను. ఎట్లాంటి పరీక్షకయినా నేను సిద్ధం’ అన్నాడు.
బయాజిద్ ‘మీరు నగ్నంగా తయారుకండి. నగరాన్ని చుట్టిరండి. అప్పుడు ఇదిగో నా చెప్పును మీకిస్తున్నాను. దాంతో తలమీద కొట్టుకుంటూ జనాల మధ్య తిరిగి రండి’ అన్నాడు.
సాధారణమయిన వ్యక్తులకు కూడా అహంకారాన్ని దెబ్బతీసే చర్య అది. అట్లాంటిది ఒక రాజుకు అంత కఠినమయిన పరీక్ష పెట్టాడు గురువు. గురువు మాటను శిరసావహించి రాజు తన బట్టలు తీసి నగ్నంగా తయారయి గురువు చెప్పు తీసుకుని తలకేసి కొట్టుకుంటూ నగరంలోకి వెళ్లిపోయాడు.
అక్కడ వున్న జనం, శిష్యులు విస్తుపోయారు. రాజ్యాన్ని వదులుకుని శిష్యుడిగా చేరడానికి వచ్చిన వ్యక్తిపై అంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించడం బాగాలేదని అన్నారు. బయాజిద్ ఏమీ బదులివ్వలేదు. రాజు కోసం ఎదురుచూస్తూ కూచున్నాడు.
రాజు నగ్నంగా నగరమంతా తిరిగి వచ్చాడు. చెప్పుతో తలపై కొట్టుకుంటూ వచ్చాడు. వచ్చిన రాజుని బయాజిద్ సాదరంగా ఆహ్వానించాడు. రాజు పాదాలపై పడి ‘నువ్వు జ్ఞానాన్ని అందుకున్నవాడివి. అద్వితీయుడివి’ అన్నాడు.
ఇబ్రహీం ‘నాలో ఒక హఠాత్ పరిణామం సంభవించింది. నేను మరో వ్యక్తిగా మారాను. ఏదో అద్భుతం నాలో పరివర్తన తెచ్చింది. నగరమంతా నన్ను చూసి నవ్వింది. కానీ అదంతా నేను పట్టించుకోలేదు. పరివర్తనలోని పరవశాన్ని ఆనందించాను’ అన్నాడు.
దానే్న ఆత్మసమర్పణ అంటారు. ఆత్మసమర్పణకి అంతస్థులు ఉండవు. అంతరాలుండవు. ఆనంద తరంగాలుంటాయి.
*

- సౌభాగ్య, 9848157909