S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రామాయణం.. మీరే డిటెక్టివ్ 44

సంతోషించే మిత్రులతో శ్రీమంతుడైన రాముడు రధాన్ని ఎక్కి జెండాలతో అలంకరించబడి, ఉత్తమమైన అగరు, చందన సువాసనలతో, అనేక మంది ప్రజలతో నిండి ఉన్న నగరాన్ని చూశాడు. అగరు పొగతో నిండిన రాజమార్గంలో ప్రయాణించాడు. ఆ దారి ఇరువైపులా మేఘాల్లా ఎతె్తైన తెల్లటి భవనాలతో వెలిగిపోతోంది. గంధం, ఉత్తమమైన సాంబ్రాణి, సుగంధ ద్రవ్యాలు, తెల్లటి పట్టు వస్త్రాలు, రంధ్రం చేయని ముత్యాలు, స్పటికంతో చేసిన అనేక వస్తువులు, విరిసిన పూలు, తినుబండారాలతో వెలిగిపోయే విశాలమైన ఆ ఉత్తమ రాజమార్గంలోకి రాముడు ప్రవేశించాడు. అతను చూసిన ఆ రాజమార్గం స్వర్గంలోని దేవమార్గంలా ఉంది. అక్కడి విశాల ప్రదేశాలన్నీ పెరుగు, అక్షింతలు, హవిస్సు, పేలాలు, పొగ, అగరు, గంధం, అనేక మాలలు, సుగంధ ద్రవ్యాలతో ఎప్పుడూ పూజింప బడుతూంటాయి. స్నేహితుల ఆశీస్సులు వింటూ అక్కడి వారందర్నీ తగిన విధంగా గౌరవిస్తూ రాముడు ముందుకి సాగాడు.
‘ఇవాళ రాజ్యాభిషిక్తుడవై నీ తాతలు, ముత్తాతలు అనుసరించిన మార్గాన్ని అనుసరిస్తూ రాజ్యాన్ని పాలించు’
‘రాముడు రాజైతే అతని తండ్రి, తాతల పాలనలో మేము ఎక్కువ సుఖంగా ఉంటాము. ఈ రోజు రాజ్యాభిషిక్తుడై ఊరేగే రాముడ్ని మనం చూడగలిగితే ఇక భోజనంతో కాని, ఇతర వ్యవహారాలతో కాని పనిలేదు’
‘మహాతేజశ్శాలి ఐన రాముడి పట్ట్భాషేకాన్ని మించిన ఇష్టమైంది ఏదీ లేదు’
రాముడు తన మిత్రులు తన గురించి చెప్పే ఈ మంచి మాటల్ని విని ఉదాశీనంగా ప్రయాణించాడు. రాముడు దూరంగా వెళ్లినా ఏ ఒక్కడూ తన మనసునీ, దృష్టినీ మనుషుల్లోని ఉత్తముడైన రాముడి మీంచి తీసుకోలేక పోయారు. రాముడ్ని చూడని వాడిని, రాముడి చేత చూడబడని వాడిని లోకులంతా నిందిస్తారు. అతను తనని తనే నిందించుకుంటాడు. ధర్మాత్ముడైన రాముడు నాలుగు వర్ణాలకి చెందిన ప్రజలందరి మీద, వృద్ధుల మీద దయ చూపిస్తాడు. అందుకే వారు అతని మీద అంత ప్రేమగా ఉన్నారు.
రాముడు నాలుగు వీధులు, దేవాలయ మార్గాలు, తోటలు, దేవాలయాలు దాటి వెళ్లాడు. అంతఃపుర ప్రాంగణంలోకి ప్రవేశించి తేజస్సుతో వెలుగుతూ, భూలోకంలో దేవేంద్రుడి భవనం లాంటి దశరథుడి ఇంట్లోకి వెళ్లాడు. దాని చుట్టూ మేఘాల్లా, కైలాస శిఖరాల్లా, తెల్లటి విమానాల్లా ఆకాశాన్ని అంటే అనేక భవనాలు, రత్నాలతో అలంకరించిన వర్ధమానాలు అనే రాజగృహాలు ఉన్నాయి. బాణాలతో కాపున్న రెండు ప్రాకారాలని రథం మీద దాటి, రాముడు మిగిలిన రెండు ప్రాకారాలని కాలి నడకన దాటాక తన పరివారాన్ని వెనక్కి పంపేసి అంతఃపురంలోకి ప్రవేశించాడు. రాముడు తండ్రి దగ్గరకి వెళ్లడం చూసిన అక్కడి వారంతా సంతోషిస్తూ, సముద్రుడు చంద్రోదయం కోసం వేచి ఉన్నట్లుగా అతను తిరిగి రావడానికి వేచి ఉన్నాడు.
రాముడు మంగళకరమైన ఆసనం మీద ఎండిపోయిన మొహంతో, దీనంగా ఉన్న తండ్రిని చూవాడు. పక్కనే కైకేయి ఉంది. రాముడు వినయంగా తండ్రి పాదాలకి నమస్కరించాడు. దశరథుడు ‘రామా!’ అని దీనంగా ఒక్క మాట మాత్రం పలికి కళ్లు నీళ్లు కమ్మడంతో చూడటానికి కాని, మరో మాట మాట్లాడడానికి కాని అశక్తుడు అయ్యాడు. గతంలో ఎన్నడూ చూడని భయంకరమైన తండ్రి రూపాన్ని చూసి రాముడు పాముని తొక్కిన వాడిలా భయపడ్డాడు. సంతోషం లేని దశరథ మహారాజు దుఃఖంగా, బాధగా అలజడి మనసుతో నిట్టూరుస్తూ, అలలతో లేచిపడే సముద్రంలా అశాంతిగా ఉన్నాడు. గ్రహణం పట్టిన సూర్యుడిలా, అబద్ధం ఆడిన ఋషిలా కళ తప్పి ఉన్నాడు. ఆయన్ని చూసి రాముడు భయపడ్డాడు. రాజులోని అనూహ్యమైన ఆ దుఃఖాన్ని గురించి ఆలోచిస్తూ పున్నమి నాటి సముద్రంలా బాధతో ఎగసిపడ్డాడు. తండ్రి మంచి కోరే బుద్ధిమంతుడైన రాముడు ఈ విధంగా ఆలోచించాడు.
‘ఎందుచేతనో నాన్న ఈ రోజు నన్ను సంతోషంగా పలకరించడం లేదు. ఇదివరకు కోపంగా ఉన్నప్పుడు కూడా నన్ను చూడగానే నాన్న ప్రసన్నుడయ్యేవాడు. అలాంటి నాన్న ఇవాళ నన్ను చూసి ఎందుకు విచారిస్తున్నాడు?’
తన తండ్రిని ఏమైందని ప్రశ్నిస్తే దశరథుడు మిన్నకున్నాడు.
ముఖంలో కళ తప్పిన రాముడు దీనంగా, దుఃఖంగా కైకేయికి నమస్కరించి చెప్పాడు.
‘నేను తెలీక ఏదైనా తప్పు చేశానా? నాన్నకి నా మీద ఎందుకు కోపం వచ్చిందో చెప్పు. నువ్వే నా మీద ఆయనకి అనుగ్రహాన్ని కలిగించాలి. ఎప్పుడూ నా మీద ప్రేమని చూపించి ఆయనకి నా మీద కోపం వచ్చిందా? వాడిపోయిన మొహంతో దీనుడై ఈయన నాతో మాట్లాడటం లేదు. శారీరక వ్యాధి కాని, మానసిక చింత కాని ఈయన్ని బాధించడం లేదు కదా? సుఖం అనేది ఎప్పుడూ లభించదు కదా. చూడటానికి ఆనందాన్ని కలిగించే భరతుడు కాని, మహాబలశాలి ఐన శతృఘు్నడికి కాని, నా తల్లులకి కాని అశుభం ఏదీ జరగలేదు కదా? నాన్నకి కోపం వచ్చినట్లైతే ఆయన్ని సంతోషపెట్టకుండా, ఆయన చెప్పిన పనిని చేయకుండా క్షణమైనా జీవించాలనే కోరిక నాకు లేదు. ఇహ లోకంలో తన జన్మకి మూల కారణమైన తండ్రి మనిషికి ప్రత్యక్ష దైవం. అలాంటి తండ్రి విషయంలో ఎవరైనా ఆయన మాటని వినకుండా ఎలా ఉండగలడు? గతంలో ఎన్నడూ లేని ఈ వికారం మా నాన్నైన మహారాజుకి ఎందుకు వచ్చిందో అడుగుతున్నాను. నిజం చెప్పు’
మహాత్ముడైన రాముడు ఇలా అడగ్గానే సిగ్గులేని కైకేయి తనకి లాభకరమైన మాటలని నిర్భయంగా చెప్పింది.
‘రామా! రాజుకి కోపం కాని, కష్టం ఏదీ కానీ రాలేదు. ఈయన తన మనసులోని మాటని భయంతో చెప్పలేక పోతున్నాడు. ఇష్టమైన కొడుకైన నీకు అయిష్టమైన విషయం చెప్పడానికి నోరు రావడం లేదు. ఈ రాజు పూర్వం నాకో వరం ఇచ్చాడు. ఇప్పుడు సామాన్య మానవుడిలా దానికి పశ్చాత్తాప పడుతున్నాడు. దాన్ని నువ్వు తప్పకుండా నిలబెట్టాలి. నాకు వరం ఇస్తానని మాట ఇచ్చి, నీరు మొత్తం బయటికి ప్రవహించి వెళ్లిపోయిన చోట వృధాగా వంతెనని కట్టాలని చూస్తున్నాడు. రామా! సత్యం అన్ని ధర్మాలకి మూలమన్నది సత్పురుషులు అందరూ ఒప్పుకున్న విషయం. నీ కోసం రాజు ఇచ్చిన మాటని జవదాటకుండా చూడు. రాజు చెప్పబోయేది నాకు ఇష్టమైనదైనా, అయిష్టమైనదైనా సరే ‘నేను చేస్తాను’ అని నువ్వు చెప్తే, అదేమిటో ఇప్పుడు నీకు నేను చెప్తాను. రాజు చెప్పింది నువ్వు తప్పక చేస్తానని మాట ఇస్తే అది నేనే చెప్తాను. ఈయన స్వయంగా నీకు చెప్పలేడు’
కైకేయి మాటలకి రాముడు మనసులో బాధపడుతూ రాజసమక్షంలో ఆమెతో ఇలా చెప్పాడు.
‘్ఛ! ఎంత కష్టం! నా విషయంలో నువ్వు ఇలా మాట్లాడకు. తండ్రి చెప్తే నేను నిప్పులోనైనా దూకుతాను. మహారాజు, పూజ్యుడు, నా మేలు కోరేవాడు ఐన తండ్రి ఆజ్ఞాపిస్తే భయంకరమైన విషాన్నైనా తింటాను. సముద్రంలో ముణుగుతాను. దేవీ! దశరథుడికి ఇష్టమైన విషయం ఏదో నాకు చెప్పు. తప్పక చేస్తానని మాట ఇస్తున్నాను.’
చాలా దారుణమైన విషయాన్ని దుష్టురాలైన కైకేయి, నిజానే్న చెప్పే మంచి స్వభావం గల రాముడితో చెప్పింది.
‘రామా! పూర్వం దేవాసురుల మధ్య జరిగిన యుద్ధంలో మీ నాన్నకి బాణాలు గుచ్చుకుని బాధ పడుతూండగా నేను రక్షించాను. అప్పుడు ఆయన నాకు రెండు వరాలు ఇచ్చాడు. వాటి ప్రకారం భరతుడికి రాజ్యాభిషేకం చేయాలని, నువ్వు ఈ రోజే దండకారణ్యానికి వెళ్లాలని నేను రాజుని కోరాను. నీ తండ్రి మాటని, నీ మాటని నిలబెట్టుకోవాలని అనుకుంటే నేను చెప్పినట్లు చేసి మీ నాన్న మాటని నిలబెట్టు. దాని ప్రకారం నువ్వు పధ్నాలుగేళ్లు అడవిలో ఉండాలి. పనె్నండేళ్లు అరణ్యవాసం, రెండేళ్లు అజ్ఞాతవాసం చేయాలి. నీ కోసం రాజు ఏర్పాటు చేసిన అభిషేక సామాగ్రితో భరతుడికి పట్ట్భాషేకం జరగాలి. నువీ రాజ్యాన్ని వదిలేసి, జింక చర్మాన్ని కట్టుకుని పధ్నాలుగేళ్లు దండకారణ్యంలో నివసించాలి. భరతుడు అయోధ్యలో ఉంటూ అనేక గొప్ప వస్తువులతో, ఏనుగులు, గుర్రాలు, రధాలతో ప్రకాశించే ఈ నగరాన్ని ఏలాలి. ఈ కారణం చేత నీ పై జాలి గల ఈ రాజు దుఃఖంతో మొహం వాడిపోయి నిన్ను చూడలేక పోతున్నాడు. రామా! రాజు చెప్పినట్లుగా చేసి నీ తండ్రి ఇచ్చిన మాటని నిలబెట్టే అవకాశం ఇచ్చి ఆయన్ని తరింపజేయి’
ఆమె ఆ విధంగా కటువుగా మాట్లాడినా రాముడికి ఏ మాత్రం దుఃఖం కలగలేదు. కాని దశరథుడు మాత్రం కొడుకు మీది ప్రేమతో చాలా బాధపడ్డాడు. (అయోధ్యకాండ సర్గ 17, 18)
ఆ రోజు ఆశే్లష తన దగ్గర వున్న అయోధ్యకాండలోని ఆ రెండు సర్గలని చూసుకుంటూ హరిదాసు చెప్పేది విన్నాడు. అతనికి హరిదాసు చెప్పిన దాంట్లో ఏడు తప్పులు కనిపించాయి. మీరు వాటిని కనుక్కోగలరా?
*
మీకో ప్రశ్న
*
భరతుడి భార్య పేరు ఏమిటి?
*
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు:
*
కౌసల్య తల్లిదండ్రులు ఎవరు?
*
-కోసల రాజు
సుకౌశలుడు, అమృతప్రభ
*
క్రిందటి వారం ప్రశ్నలకు సమాధానాలు:
*
1.కాపలా కాసే యువకులు అందమైన చెవి పోగులు ధరించారని వాల్మీకి రాసాడు. అది హరిదాసు చెప్పలేదు.
2.ద్వారపాలకులు కాషాయ వస్త్రాలని ధరించారు. తెల్ల దుస్తులని కాదు.
3.కుబేరుడిలా కూర్చున్న రాముడ్ని సుమంత్రుడు చూశాడు. కాని హరిదాసు ‘ఇంద్రుడిలా’ అని తప్పు పోలికని చెప్పాడు.
4.నిన్ను తూర్పున ఇంద్రుడు, దక్షిణాన యముడు, పశ్చిమంలో వరుణుడు, ఉత్తరాన కుబేరుడు రక్షించెదరు గాక!’ అని చివరగా
రాముడితో సీత చెప్పింది. ఇది హరిదాసు మర్చిపోయాడు.
5.రధం ముందు నడిచే భటులు ‘రాముడు వస్తున్నాడు’ అని అరుస్తూ నడిచారు. ఇది హరిదాసు చెప్పలేదు.
6.మేడల మీది ఆడవాళుల్ల ‘తల్లి కౌసల్య సంతోషిస్తుంది’ అన్నారు. హరిదాసు తప్పుగా ‘కైకేయి’ అని చెప్పాడు.
7.రాముడు రధం మీద ‘కుబేరుడిలా వెళ్లాడు’ అని వాల్మీకి పోల్చాడు. కాని హరిదాసు గతంలోలా మళ్లీ ‘ఇంద్రుడిలా’ అని తప్పు చేశాడు.

మల్లాది వెంకట కృష్ణమూర్తి