పోటీ మంచిదే!
Published Saturday, 12 August 2017అంటోంది టాలీవుడ్ టాప్‌స్టార్ రకుల్ ప్రీత్‌సింగ్. పరిశ్రమలోకి ఎంతమంది కొత్తవారు వస్తే అంత బావుంటుందని కూడా చెబుతోంది. కథానాయికల మధ్య పోటీ పెరగడం వల్ల దర్శక, రచయితలు మంచి పాత్రలపై దృష్టిపెడతారని, అలా చేయడం వల్ల పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ పుట్టుకొస్తాయని ఈ భామ నమ్మకం. తెలుగు చిత్రసీమలో ఏడాదికి ఐదు సినిమాలకు తక్కువ కాకుండా తన చేతిలో ఉంచుకొంటోంది. తను చేయబోయేది పెద్ద సినిమానా? చిన్న సినిమానా? అన్న తేడాలు ఈ అమ్మడికి లేవు. తనకు బాగా కలిసి వస్తుందనుకుంటే ఏ సినిమానైనా ఇట్టే ఒప్పుకుంటుంది. అయితే ఇప్పుడు తన దృష్టి తాజాగా తమిళ, హిందీ సీమలపైన కూడా పడింది. తెలుగులో మంచి అవకాశాలు.. టాప్ పొజిషన్ అయినా ఇతర భాషలపై దృష్టి మరల్చడంలో ఉద్దేశ్యం? అని రకుల్‌ని ప్రశ్నిస్తే- ‘‘ ఇతర భాషలనుంచి కూడా నాకు మంచి అవకాశాలు వస్తున్నాయి. బాలీవుడ్ సెట్లోనూ మా హైదరాబాద్ షూటింగ్ ఎలా ఉంటుందో తెలుసా? అంటూ ఇక్కడి కబుర్లే చెబుతుంటా. బాలీవుడ్‌లో మన తెలుగు చిత్రాల గురించే మాట్లాడుకుంటూంటాం. మహేష్‌బాబు ‘స్పైడర్’ సంగతులు అక్కడి వారు ఎంతో ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. భాష ఏదైనా నటన ఎక్కడైనా ఒక్కటే అన్నది నా అభిప్రాయం. పరిశ్రమలో కథానాయికల మధ్య పోటీ తత్త్వం మంచిదే. పోటీ వల్ల బాగా నటించాలన్న పట్టుదల పెరుగుతుంది’’అని చెప్పుకొచ్చింది. దటీజ్.. రకుల్!