S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సునాద వినోదులు - సుస్వర మూర్తులు *అమృతవర్షణి)

తిరువయ్యార్‌లోని ప్రణతార్తిహరుని దేవాలయం మాడవీధిలో పాతికేళ్ల కుర్రవాడు ఎవరి కోసమో వెదుకుతూ ఒకచోట ఆగాడు - చక్కని ముఖ వర్ఛస్సుతో కళకళలాడుతూ ఇంటి బయట అరుగు మీద పద్మాసనం వేసుకున్న ఓ వ్యక్తి కనిపించాడు. నమస్కరించి నిలబడ్డాడు. సాక్షాత్తూ పరమశివుని అవతారమా యన్నట్లు నుదుటిపై తెల్లని విభూతి రేఖలతో మెడ నిండా పుష్కలంగా వున్న రుద్రాక్ష మాలలతో పచ్చని దేహచ్ఛాయతో దైవ తేజస్సుతో కళకళలాడుతూ వున్న ఆ వ్యక్తి ‘ఎవరు కావాలి?’ అన్నాడు. తడబడుతూ.. ‘నమస్కారం స్వామీ! ఇక్కడ పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ ఇల్లెక్కడ?’ మైసూర్ నుండి ఆయన కోసం వచ్చాను. నా పేరు వాసు’ అన్నాడు.
అంతే. కాలుతొక్కిన త్రాచులా చివాలున అరుగు మీద నుంచి లేచిపోయి.. ఎర్రబడ్డ కళ్లతో కోపంతో ఊగిపోతూ గబగబా ఇంట్లోకి వెళ్లి తలుపులు మూసేసుకున్నాడు ఆ వ్యక్తి.
ఆయనెవరో కాదు. మహా వైద్యనాథ శివన్. ఆ విషయం వాసుకి తెలియదు.
ఏమీ అర్థంకాక, నిర్ఘాంతపోయిన వాసుదేవుడు అక్కడి నుంచి చకచకా ప్రక్క వీధిలోకి వెళ్లిపోయాడు.
మళ్లీ ఒక ఇంటి దగ్గర ఆగి చూశాడు. ఇంకెవరు? తనూహించిన గురువే.
కాస్త పొట్టిగా గుమ్మటంలా వున్న పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్‌ను గుర్తించిన వాసుదేవుడి నోట మాట లేదు. ఆనందంతో పాదాలకు నమస్కరించి ఉత్తరీయాన్ని నడుముకు చుట్టి రెండు చేతులూ కట్టుకుని నిలబడ్డాడు. తల నిమురుతూ ఆశీర్వదించి లోపలకు రమ్మన్నాడు పట్నం.
‘నా పేరు వాసుదేవాచార్య. ఇంట్లో ‘వాసు’ అని పిలుస్తారు. మీ పేరు విని, మీ పాట విని మీ దగ్గర శిష్యరికం చేయాలని వచ్చాను స్వామీ! నా కోరిక మన్నించి అనుగ్రహించరా?’ అంటూ, మైసూర్ మహారాజైన చామరాజు వొడియార్ రాసిన సిఫార్సు ఉత్తరం చూపించాడు వాసుదేవాచారి. తండ్రి రాజాస్థానంలో ఆస్థాన పండితుడు. ఉత్తరం చదివి సుబ్రహ్మణ్యయ్యర్ సంతోషించి వాసుదేవుణ్ణి కాళ్లు కడుక్కుని రమ్మన్నాడు. ఇద్దరూ కలిసి భోజనం చేశారు.
భోజనానంతరం తాంబూల చర్వణం చేస్తూ పడక్కుర్చీలో కూర్చుని వాసుదేవుడి తల్లిదండ్రులను గురించి అడిగాడు. అన్నిటికీ సమాధానమిచ్చిన వాసు,
‘మీరు మైసూర్ సంస్కృత పాఠశాలలో చేసిన సంగీత కచేరీ యింకా నా చెవుల్లో మారుమోగుతోంది. నన్ను మీ శిష్యుడిగా స్వీకరించి నాకు సంగీత విద్యా భిక్ష అనుగ్రహిస్తారనే ఆశతో వచ్చాను’ అని మళ్లీ అన్నాడు. ఆ మాటకు సంతోషించిన అయ్యర్ ‘అలాగే నన్నట్లు’గా తలూపాడు.
రోజులు గడుస్తున్నాయి. నెలలు గడుస్తున్నాయి. సంగీత పాఠమంటూ ప్రారంభం కాలేదు. రోజూ ఉదయానే్న లేవడం, తంబురా శృతిని సిద్ధం చేసుకుని గురువు ఎదురుగా కూర్చోవడం, ఆయన సాధన చేసినంతసేపూ వినడం తప్ప మరే కార్యక్రమమూ లేదు. వాసుకు మాత్రం సంగీత పాఠాలంటూ లేవు. మధ్యాహ్నం భోజనానంతరం సుబ్రహ్మణ్యయ్యర్ ఏవో కీర్తనలు కంపోజ్ చేసుకోవడం, సాయంత్రం కచేరీ వుంటే తనతోబాటు వాసుదేవుణ్ణి వెంట తీసుకుపోవడమే దినచర్యగా ఉంటోంది.
ఎదురుచూసి చూసి, విసుగెత్తి పోయాడు వాసు. తల్లిదండ్రులను చూడాలనే మిషతో గురువు దగ్గర సెలవు తీసుకుని బయలుదేరాలనే నిర్ణయానికొచ్చి వసారాలో నిలబడ్డాడు.
పట్నం ఈ విషయాన్ని గ్రహించాడు. వాసుని అనునయిస్తూ ‘చూడు వాసూ! సంగీతంపై భక్తితో నా దగ్గరకు వచ్చావు. నీ ఆసక్తిని గమనిస్తున్నాను. నిన్ను నిరుత్సాహపరుస్తానా? నీకు సంస్కృతం బాగా వచ్చు. భాష మీద పట్టుంది. మంచి అదుపు ఉంది. శ్రద్ధ ఉంది. ఒకటి రెండుసార్లు వింటే గీతాలు, వర్ణాలు ఏకబిగిని నేర్చేసుకుంటే వచ్చేస్తాయి. పెద్ద సమస్య కాదు. కానీ, మనోధర్మంతో నీకు నువ్వు పాడే సంగీతముంది చూశావ్! అది ఒక్కరోజులో వచ్చేది కాదు. ఒక్క నెలలోనో, ఏడాదిలోనో లొంగిపోదు. నాతోబాటు కూర్చుని నా సంగీతం యిన్నాళ్లుగా వింటున్నావు. నీకేమనిపించింది?
‘నే పాడే కీర్తనలు ఇంతవరకూ ఏవేవో వింటున్నావు గదా. ఇంతవరకూ అసలైన సిసలైన సంగీతం నేర్చుకోవడానికి నిన్ను సిద్ధం చేశాను. శృతిలో నిలిపి ఎలా పాడాలో, ఏ మాటకు ఎంత ఊపిరిని బిగించాలో గొంతులో మాధుర్యాన్ని తెస్తూ, భావంతో ఎలా పాడాలో ఈపాటికే గ్రహించి వుండాలి. ఔనా? యింతవరకూ నువ్వు చూసినవి ఉత్సవ విగ్రహాలు. లోపలికిరా! అసలైన మూల విరాట్టును చూపిస్తాను’ అని తన పూజా మందిరంలోని తంబురా శృతి చేసి తనకు బాగా ఇష్టమైన ‘బేగడ’ రాగంలో ‘అనుదినమును కావుమయ్య’ కీర్తన పాఠాన్ని వాసు చేతిలో పెట్టాడు.
అంతే వాసు కళ్లలో నీళ్లు గిర్రున తిరిగాయి. గురువుగారి పాదాలపై మోకరిల్లాడు.
వాసుదేవాచారి పట్నం దగ్గర నేర్చుకున్న తొలి కీర్తన అదే.
వాసుదేవుని ఆనందానికి అవధుల్లేవు. గురుకుల వాసం చేస్తూ అలా కొన్నాళ్లపాటు గురువును ఆశ్రయించుకుని మహావిద్వాంసుడైన మైసూర్ వాసుదేవాచారి వాగ్గేయకారుడై, సంగీత కళానిధియై విద్వాంసులకే విద్వాంసుడయ్యాడు.
త్యాగరాజ శిష్య పరంపరలో ప్రముఖుడైన పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్, విద్వాంసులకే విద్వాంసుడు. ఆ గురుపరం నుండి వచ్చిన వాసుదేవాచారి. శతవర్ష జీవి. చాలాకాలం మద్రాసులోని అడయార్ కళాక్షేత్రంలో పని చేశారు.
1896లో పట్నం దగ్గర చేరి పదేళ్లపాటు ఆయన శిష్యరికంలో అఖండమైన సంగీత జ్ఞానాన్ని సంపాదించిన వాసుదేవాచార్య కీర్తనలన్నీ ప్రసిద్ధమై విద్వాంసుల వల్ల రాణించాయి. ఆయనకు లభించిన సత్కారాలు, సన్మానాలు, బిరుదులు అసంఖ్యాకం.
తెలుగులోనూ, సంస్కృతంలోనూ 300కు పైగా కీర్తనలు రచించారు.
మైసూర్‌లోని మహారాజా వారి ప్యాలెస్‌లో జరిగే శరన్నవరాత్రి వైభవం అందరూ ఎరిగినదే.
మహారాజుల కాలం నుండి ఈనాటికీ దసరా ఉత్సవాలతో జరిగే సంగీత కచేరీలు ఎప్పుడూ ఓ ప్రత్యేక ఆకర్షణగానే ఉంటాయి. ఈ సందర్భంగా ఓసారి ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు జి.ఎన్.బాలసుబ్రహ్మణ్యం పాటకచేరీ జరుగుతోంది. ఎదురుగా మైసూర్ వాసుదేవాచారి ఆశీనులై కూర్చుని వింటున్నారు. ఖమాస్ రాగంలోని కీర్తన ‘బ్రోచేవారెవరురా’ అందుకున్నాడు. తాను రాసిన కీర్తన మొదటిసారి ఓ ప్రముఖ విద్వాంసుడు పాడుతుండగా విని ఆశ్చర్యానికి లోనై పరమానంద పడిపోయాడు. ఆ కీర్తన పాడిన మొదటి విద్వాంసుడు జి.ఎన్.బి.
జన్మ చరితార్థమైందని భావించి కచేరీ పూర్తవగానే ‘జిఎన్‌బి’ని కౌగిలించుకుని మనసారా అభినందించిన సన్నివేశాన్ని తన హృదయంలోనే పదిలపరచుకున్నాడు ఆ గాయక కవియైన వాసుదేవాచారి. జన్మనిచ్చిన తల్లిదండ్రులనూ, తాను కొలిచిన దైవసమానుడైన గురువునూ తలుచుకుని పులకించిపోయాడు.
* * *
పూర్వకాలంలో పల్లెటూళ్లలో, పెళ్లిళ్లు ఏకంగా ఐదు రోజులు జరిగేవి. పెళ్లికి ఎడ్లబండ్ల మీద బయలుదేరేవాళ్లు. ఒక్కో పెళ్లికి పాతిక, ముప్పై బళ్లు బయల్దేరేవి. రాత్రి కాస్త పెందలకడే భోజనాలు చేసి మెల్లగా బళ్ళను బయలుదేరదీసేవాళ్లు. అలా బయలుదేరిన వాళ్లందరికీ పెళ్లివారి ఊరికి దారి తెలుసుననని అనుకోకండి మీరు. వాళ్లందరికీ తెలియటం అసాధ్యం. ఎందుకంటే ఎక్కడెక్కడి నుండో వచ్చి చేరుకునే వాళ్లు. చిత్రమేమంటే దారి తెలియకపోయినా ఒక వరసలో బండెనక బండి వెళ్తూనే ఉండేది. ముందు బండి వాడు మాత్రం దారి తెలిసి ఉంటాడు. ఇక అంతే. మిగతా వారంతా కమ్మగా నిద్రపోయేవారు. మిగిలినవన్నీ బండి వెనక బండి వెళ్లిపోతూ సాగి తిన్నగా గమ్యస్థానానికి చేరి, పెళ్లిపందిరి దగ్గరకు వచ్చి ఆగేవి.
అలాగే, మన సమాజం కూడా తరతరాలుగా, కాలకాలాల్లో సంస్కరింపబడుతూ ఆచారాలు, వ్యవహారాలు, అలవాట్లు ఒకరి నుంచి మరొకరికి చేరుతూ స్థిరపడిపోయాయి. మన జాతి సంస్కృతికి ప్రతీకలుగా నిలిచాయి. సంప్రదాయ సంగీతం కూడా అంతే. ఒక్కొక్క విద్వాంసుడూ పదిమందిని తయారుచేసేవారు. ఉన్నత స్థాయికి చెందిన ఈ ఆత్మవిద్య.. అలా ఎందరో విద్వాంసుల వల్ల గురుశిష్య పరంపరగా పెరుగుతూ వస్తోంది.
కర్ణాటక సంగీతంలో ఎన్నో మేళకర్త రాగాలున్నాయి. మళ్లీ ఆ రాగాలకు మరెన్నో చిన్నచిన్న రాగాలు పుట్టుకొచ్చాయి. ఎందరెందరో సంగీత కర్తలు ఒకే రాగంలో ఎన్నో పాటలు కంపోజ్ చేశారు. ఒక పాటకూ మరో పాటకూ సంబంధం ఉండదు. ఏ రాగానికైనా ఒక భావం ఉంటుంది. మాటల్లో చెప్పలేని దాన్ని ఒక్కసారి శృతిలో లీనవౌతూ ‘సుస్వరంతో పాడితే తిన్నగా గుండె నిండా నిండిపోతుంది. స్వరసిద్ధి ఉంటేనే ఇది సాధ్యం. ప్రపంచమంతా తిరగండి. ఎక్కడ ఏ స్వరం వినిపించినా, అన్నీ ఈ సప్తస్వరాల పరిధిలోనే ఉంటాయి. మరో స్వరం వినబడే అవకాశం లేదు.
ఒక్కసారి వినగానే ఆహా! అని. ఏదో మత్తు జల్లినట్లుగా మైమరపించే రాగాలున్నాయి.
మరి కొన్ని రాగాలకు అసలు వాటి ఉనికే ఉండదు. రక్తిగా వుండవు. పుస్తకాల్లో పేర్లుంటాయి. వాటి జోలికి పెద్దపెద్ద వాగ్గేయకారులే వెళ్లలేదు. మంచి ఆకర్షణతో రక్తిగా వుండే రాగాలలో ఖమాస్ ఎంతో ప్రసిద్ధమైనది.
ఈ రాగంలో వున్నవన్నీ ప్రసిద్ధవౌతూ మనసు దోచినవే. అందులో ఈ ‘బ్రోచేవారెవరురా! నిను వినా రఘువరా! నీ చరణాంబుజములునే విడజాల కరుణాలవాల॥ బహుళ ప్రసిద్ధం.
కొనే్నళ్ల క్రితం ఈ ఒక్క కీర్తన సినిమాల్లో వాడటం వల్ల (పాడటం వల్ల) శాస్ర్తియ సంగీతం నేర్చుకోవాలనే ఉత్సాహంతో, ఉబలాటంతో సంగీత కళాశాలల్లో చేరిపోయిన వారనేకమందిని చూశాం.
కానీ, ముక్కునుబట్టి పాడేసే పాటకూ గురుముఖంగా కొనే్నళ్లపాటు, నియమ నిష్టలతో సాధన చేస్తే తప్ప లొంగని శుద్ధమైన సంప్రదాయ సంగీతానికీ ఉన్న తేడాను అతి తొందరలోనే గుర్తించగలిగారు. తట్టుకోగలిగిన వారే, సంగీతాన్ని ఆశ్రయించారు.
రామకృష్ణ పరమహంస ఆర్తిగా దుఃఖిస్తూ ఆవేదనతో అమ్మవారిని అడిగేవాడట.
‘అమ్మా! కాలచక్రం శరవేగంతో తిరిగిపోతోంది. నాకా వయసు మళ్లిపోతోంది. నాకున్న జ్ఞానాన్ని ఇచ్చి వెళ్లాలని ఉంది. యోగ్యత కలిగిన శిష్యుణ్ణి చూపించవా తల్లీ! అనడిగేవాడట. ఆ కోరిక ‘వివేకానందుడి’ వల్ల తీరింది. పరిపూర్ణ జ్ఞానం కలిగిన విద్వాంసులు పదిమందికీ తమ విద్యను పంచాలనుకుంటూ, అర్హులైన వారి కోసం ఎదురుచూస్తూంటారు. పాత్రకు తగిన దానం చేయాలనుకుంటారు. శ్రద్ధాళులైన వారని ఉద్ధరించే ప్రయత్నం చేస్తారు. చౌకబారు ఆలోచనలతో వున్నవాళ్లు ఏమీ సాధించలేరు.
వేద విద్యతో సమానమైన ఈ సంగీతం గురుముఖతః నేర్చుకోవలసినదే. మరో దారి లేదు.
సనాతన సంప్రదాయ విలువలతో కూడిన దివ్యమైన ఈ సంగీతాన్ని భయభక్తులతో శ్రద్ధతో అధ్యయనం చేయాలే గానీ, లౌకిక ప్రయోజనాలే లక్ష్యంగా ఉండకూడదనే సంకల్పంతో వున్న వారికే కీర్తి దక్కింది. ఉగ్గుపాలతోనే సంగీతం అబ్బిన ఉద్దండులు చాలా అరుదుగా ఉంటారు. వెనుకటి రోజుల్లోని త్యాగారాజాది వాగ్గేయకారులందరికీ సంగీత సాహిత్యాలు రెండూ సమానంగా అబ్బటానికి కారణం, సద్గురువులే. వారి సంస్కారమే, అనూచానంగా అందరికీ అలవడింది.
ఓ విద్వాంసుడు సంగీత విద్యలో సంపూర్ణత్వం పొందిన తర్వాత వారు చేరవలసిన స్థితి ఒకటి ఉంది. ఆ స్థితిని అందుకోగల విద్వాంసులు మాత్రమే సంగీత ప్రయోజనం సాధించి, జీవిత పరమార్థాన్ని అందుకుంటారు.
నిజమైన అటువంటి ‘నాదయోగులు’ భౌతికంగా మనకు కనిపించకపోయినా, శాశ్వతంగా ఎక్కడో వారి కోసమే వున్న తపోలోకాల్లో విహరిస్తూనే ఉంటారు.
*

చిత్రాలు.. మైసూర్ వాసుదేవాచార్య *జిఎన్.బాలసుబ్రహ్మణ్యం
*మైసూర్ వాసుదేవాచారి గురువు పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్

- మల్లాది సూరిబాబు 9052765490