S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రామాయణం.. 50 మీరే డిటెక్టివ్

ఉన్నతమైన మనసు గల కౌసల్య దుఃఖాన్ని వదిలి, నీళ్లతో ఆచమనం చేసి శుచిగా రాముడికి మంగళక్రతువులు పూర్తి చేసి చెప్పింది.
‘రామా! నిన్ను ఆపటం నా వల్ల కావటంలేదు. ఇప్పుడు వెళ్లి త్వరగా తిరిగి రా. సత్పురుషుల మార్గంలో నడు. రఘు వంశంలో పుట్టిన నువ్వు ఏ ధర్మాన్ని ధైర్యంగా, నియమంగా ఆచరిస్తున్నావో ఆ ధర్మమే నిన్ను రక్షించుగాక! నాలుగు వీధుల్లోని దేవాలయాల్లో నువ్వు ఎవరికైతే నమస్కరించే వాడివో ఆ దేవతలు, మహర్షులు అరణ్యంలో నిన్ను రక్షింతురు గాక! ధీమంతుడైన విశ్వామిత్రుడు నీకు ఇచ్చిన అస్త్రాలన్నీ నిన్ను ఎల్లప్పుడూ రక్షించుగాక! బలాఢ్యుడైన నువ్వు చేసిన పితృసేవ, మాతృసేవ, సత్యం నిన్ను రక్షిస్తూండగా చిరంజీవిగా ఉండు. రామా! సమిథలు, కుశలు, పవిత్రాలు, అగ్నివేదికలు, దేవాలయాలు, పూజాగృహాలు, పర్వతాలు, వృక్షాలు, మొక్కలు, నీటి మడుగులు, పక్షులు, పాములు, సింహాలు నిన్ను రక్షించుగాక! సాధ్యులు (దేవతలు) విశ్వదేవతలు, మరుత్తులు, మహర్షులు, ధాతా, విధాత, పూష, భగుడు, ఆర్యమ, ఇంద్రుడు, ఇంకా సకల లోక పాలకులు నిన్ను రక్షించుదురుగాక! ఋతువులు, పక్షాలు, నెలలు, సంవత్సరాలు, రాత్రుళ్లు, పగళ్లు, ముహూర్తాలు ఎల్లప్పుడు నీకు క్షేమం చేయు గాక! స్మృతి, ధృతి, ధ్మం, కుమారస్వామి, చంద్రుడు, బృహస్పతి, సప్తఋషులు, నారదుడు నిన్ను రక్షించు గాక! నేను పూజించిన ప్రసిద్ధమైన ఆ దిక్కులు, దిక్పాలకులు కూడా నిన్ను అరణ్యమంతటా ఎల్లప్పుడూ రక్షించెదరు గాక! అరణ్యంలో ఉన్నప్పుడు పర్వతాలు, సముద్రాలు, వరుణుడు, స్వర్గం, ఆకాశం, భూమి, నదులు, నక్షత్రాలు, ఇళ్లు, గృహ దేవతలు, అహోరాత్రాలు, ఉభయ సంధ్యలు నిన్ను రక్షించు గాక! పవిత్రమైన ఆరు ఋతువులు, నెలలు, సంవత్సరాలు, కలలు, కాష్టలు (కాల విభాగానికి చెందినవి) నీకు సుఖాన్ని ఇచ్చు గాక!
‘ముని వేషం ధరించి మహారణ్యంలో తిరిగే నీకు దేవతలు, అసురులు ఎల్లప్పుడూ సుఖాన్ని ఇచ్చెదరు గాక! భయంకరమైన క్రూరమైన పనులు చేసే రాక్షసుల నించి, పిశాచాల నించి, మాంసాహారులైన సకల జంతువుల నించి నీకు భయం లేకుండు గాక! ప్రవేశించడానికి అలవి కాని ఆ అరణ్యాలలో నీకు కోతులు, తేళ్లు, ఈగలు, దోమలు, పాములు, ఇతర కీటకాలు బాధ కలిగించకుండు గాక! రామా! ఏనుగులు, కోరలు గల సింహాలు, పులులు, ఎలుగుబంట్లు, కొమ్ములు గల భయంకరమైన అడవి దున్నలు నీకు అపకారం చేయకుండు గాక! నీ దారి శుభప్రదం అవు గాక! నీ పరాక్రమం సఫలం అవు గాక! నువ్వు క్షేమంగా వెళ్లి సమస్త పనులని సాధించు. ఆకాశంలో, భూమి మీద ఉండే దేవతలు నీకు క్షేమం కలిగించెదరు గాక! నీ శత్రువుల వల్ల నీకు అపాయం కలగకుండు గాక! నీ స్నానాది సమయంలో అగ్ని, వాయువు, పొగ, ఋషి ముఖాల నించి వచ్చిన మంత్రాలు నిన్ను రక్షించు గాక! అడవిలో నివసించే నిన్ను అన్ని లోకాలకి ప్రభువైన శివుడు, బ్రహ్మ, అన్ని ప్రాణుల్ని రక్షించే విష్ణువు, ఋషులు, మిగిలిన దేవతలు అంతా రక్షించెదరు గాక!’
అధికమైన కీర్తి, విశాలమైన కళ్లు గల కౌసల్య దేవతలకి పుష్ప మాలలు, సుగంధం అర్పించి తగిన స్తోత్రాలు పఠించి వారిని పూజించింది. అగ్నిని రాజేసి రాముడి క్షేమం కోసం బ్రాహ్మణుడి చేత శాస్త్ర ప్రకారం హోమం చేయించింది. స్ర్తిలలో శ్రేష్ఠురాలైన కౌసల్య హోమం కోసం నెయ్యి, తెల్లని పూల మాలలు, సమిధలు, తెల్ల ఆవాలు తెప్పించింది. ఆ బ్రాహ్మణుడు ఎలాంటి దోషం లేకుండా శాస్త్ర ప్రకారం శాంతి హోమాన్ని చేసి మిగిలిన ద్రవ్యంతో బయట చేయదగ్గ బలులని చేశాడు. తేనె, పెరుగు, నెయ్యి, అక్షింతలతో బ్రాహ్మణుల చేత స్వస్తి చెప్పించి, రాముడికి అడవిలో క్షేమం కలిగించే మంత్రాలని చదివించింది. ఆ బ్రాహ్మణ శ్రేష్ఠులకి కోరినంత దక్షిణ ఇచ్చి రాముడితో చెప్పింది.
‘శంబరాసురుడ్ని చంపే సమయంలో దేవేంద్రుడికి ఏ శుభం కలిగిందో అదే శుభం నీకూ కలుగు గాక! పూర్వం గరుత్మంతుడు అమృతాన్ని తీసుకు రావడానికి వెళ్లేప్పుడు అతనికి కద్రువ ఎలాంటి శుభం చేసిందో ఆ శుభం నీకూ అవు గాక! అమృతాన్ని పుట్టించే సమయంలో దైత్యులని చంపడానికి బయలుదేరిన దేవేంద్రుడికి తల్లి దితి ఏ శుభం ఇచ్చిందో ఆ శుభం నీకూ అవు గాక! రామా! మూడు అడుగులు వేసి త్రిలోకాలని ఆక్రమించే సమయంలో సాటిలేని తేజస్సు గల శివుడికి ఏ శుభం కలిగిందో అది నీకూ కలుగు గాక! శుభకరమైన ఋతువులు, సముద్రాలు, ద్వీపాలు, వేదాలు, లోకాలు, దిక్కులు నీకు శుభాన్ని కలిగించు గాక!’
కౌసల్య రాముడి తల మీద అక్షింతలు ఉంచి శరీరానికి గంధం పూసి, ఫలాన్ని ఇచ్చే ప్రసిద్ధమైన, శుభకరమైన ఓషధిని రక్షగా కట్టి మంత్రాలతో అభిమంత్రించింది. దుఃఖంతో నిండి ఉన్నా, పైకి సంతోషంగా ఉన్నట్లుగా కనపడుతూ తడబడుతూ మాట్లాడింది. అవన్నీ నోట్లోంచి తప్ప మనసులోంచి రాలేదు. రాముడ్ని కౌగలించుకుని, తల వంచి వాసన చూసి చెప్పింది.
‘రామా! అన్ని పనులు చక్కబెట్టుకుని సుఖంగా వెళ్లు. నువ్వు పనులన్నీ సక్రమంగా చేసి, ఆరోగ్యవంతుడివై సుఖంగా అయోధ్యకి తిరిగి వచ్చాక నిన్ను రాజుగా చూస్తాను. వనవాసం నించి తిరిగి వచ్చే నిన్ను విచారపు ఆలోచనలన్నీ పోయి, ఉదయించే చంద్రబింబంలా సంతోషంతో ప్రకాశించే మొహంతో నేను చూస్తాను. నువ్వు తండ్రి మాటని నెరవేర్చి అడవి నించి తిరిగి వచ్చి సింహాసనం మీద కూర్చుని ఉండటం చూస్తాను. రామా! వనవాసం నించి వచ్చాక సర్వమంగళ సంపన్నుడివై నువ్వు ఎల్లప్పుడూ నా కోరికలని, సీత కోరికలని తీరుస్తావు. రామా! ఇక్కడ నేను పూజిస్తున్న శివుడు మొదలైన దేవతలు, మహర్షులు, భూతాలు, మహాసురులు, ఉరగులు అడవిలోని నీ మంచిని ఎప్పుడూ కోరుకొందరు గాక!’
కౌసల్య ఇలా మాట్లాడుతూ నీళ్లు నిండిన కళ్లతో శాస్త్ర ప్రకారం స్వస్తియానాన్ని పూర్తి చేసి రక్షగా అతని చుట్టూ తిరిగి, మాటిమాటికీ గట్టిగా కౌగలించుకుంది. ఆ తర్వాత గొప్ప కీర్తిగల రాముడు ఆవిడ పాదాలని మళ్లీ మళ్లీ తాకి నమస్కరించి, కాంతితో వెలిగాడు. (అయోధ్య కాండ: 25వ సర్గ)
ఆ హరికథ విన్న శ్రోతల్లోని ఓ వృద్ధురాలు వణుకుతూ లేచి హరిదాసుతో చెప్పింది.
‘హరికథని మీరు ఎంత బాగా చెప్తున్నారంటే, మీతో సాక్షాత్తు హనుమంతుడే ఆ కథని పలికిస్తున్నాడని నాకు అనిపిస్తోంది. కాకపోతే మీరు చెప్పిన కథలో ఏడు తప్పులు ఉన్నాయి. అవేమిటో చెప్తా వినండి. ఈ కథని మళ్లీ చెప్పినప్పుడు మీరీ తప్పులని చెప్పకపోతే సరి’
ఆ తప్పులు ఏమిటో మీరు కనుక్కోగలరా?
*

మీకో ప్రశ్న
*
ద్వాపర యుగంలో కర్ణుడికి విలువిద్య
నేర్పించిన రాముడి కాలంనాటి
మహాత్ముడు ఎవరు?
*
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు:
*
శ్రీ తిక్కన సోమయాజి రాముడి మీద రాసిన పుస్తకం పేరేమిటి?
-నిర్వచనోత్తర రామాయణం
*
క్రిందటి వారం ప్రశ్నలకు జవాబులు
*
1.డగ్గుత్తికతో మాట్లాడింది కౌసల్య. కాని సుమిత్ర అని హరిదాసు తప్పు చెప్పాడు.
2.‘ఇతని సేవకులు కూడా ఉత్తమమైన ఆహారానే్న తింటారు కదా’ అని కౌసల్య చెప్పిన మాటని హరిదాసు చెప్పలేదు.
3.లేగ దూడ ఎటు పోతే దాని తల్లి దాని వెనకే వెళ్లదా? అని కౌసల్య చెప్పిన అందమైన ఉపమానాన్ని హరిదాసు చెప్పలేదు.
4.జటలు, నార బట్టలని ధరించిన నువ్వు అడవి నించి తిరిగి వచ్చే రోజు ఇవాళే అయితే ఎంత బావుండేది! అని చివర్లో కౌసల్య చెప్పిన మాటని హరిదాసు చెప్పలేదు.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి