S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బాధల బిడారులోంచి

దేహంలోకి రహస్యంగా ఇంకిపోయిన
ఈ షడ్రుచుల ప్రవాహం అంచున
కన్నీళ్లకు అందని కవిత్వం వైపు
కొంతమంది పరుగులు తీస్తున్నారు
ప్రేమ కొన్నిసార్లు ధూపమై అంతటా వ్యాపించాక
రహస్యాలు తెలియని ఆత్మశోధనా సముద్రంలో
నాల్గు కన్నుల నీటి ప్రపంచాలు
సంసారంలో బందీలవుతున్నాయి
అన్ని రుచుల్నీ పుక్కిలించిన
చిన్ని ప్రపంచం ముందు
రెక్కలు విప్పుకుని ఎగరలేక
గాయాలు మానినా
వాటి తాలూకు జ్ఞాపకాల మచ్చలు చెరగలేదు
శరీర కావ్యాల దుఃఖాలాపన ప్రతీ గొంతు నిండా
ఆత్మగౌరవ సంతకాల మీద
విషపు పూల నగిషీలు చెక్కుకుంటూ
అశ్రువొక్కదానికే
అస్పృశ్యత లేదని పసిగట్టినా కూడా
మన చుట్టూరా రంగవల్లులు దిద్దుకుని
పంచేంద్రియాల్ని పట్టెమంచాల మీద
అసహనంగానే వాల్చుకుంటున్నాం.
ఒక విసుగునీ, మరొక అసహనాన్ని
కాంక్రీటు సౌధాల మధ్య బంధించుకుని
తల్లివేరుని మర్చిపోయి
దిక్కుతోచని స్థితిలోకే మనిషి ప్రయాణం
దృశ్యాల సమూహం నుంచి
దేహం చీలుతున్నప్పుడు
చీకటంతా గుండెల్లో గూడు కట్టుకున్నాక
ఇప్పుడు వెనె్నలకి చీకటికీ తేడా తెలీని స్థితి
కంటిపాపల మీద పుష్పించిన స్వప్నం
ఎప్పుడో జారిపోయింది కవిత్వంతో కల్సి
ఇపుడు తేలాల్సిన అసలు నిజం ఏందంటే
చెదిరిపోయిన ఆ సుందర ఆవిష్కారాలెక్కడ
జ్ఞాపకం నుంచి తప్పిపోయిన ఆ ధగ్ధ దృశ్యాలు ఏవి?
బాధల బిడారులోంచి తొంగిచూస్తున్న
భయమే లేని స్వాప్నిక ప్రపంచమేది
అవిశ్రాంతంగా స్రవించే ఈ కన్నీటికి సమాప్తి ఎక్కడ

మట్టి పరిమళాన్ని దేహం నిండా నింపుకుని
భూమి మీద మమకారం పెంచుకున్న
వాడి మరణ వాంగ్మూలమేది
జీవితం మొదలూ చివర్లని స్పర్శించిన
యోగులూ జ్ఞానులూ ఏరి
బాధని అక్షరంగా మల్చుకున్న గుండెకి
వగరు బతుకుల సహచర్యమే మిగిలాక
జీవ లక్షణం లేని జన ప్రవాహం ముందు
ఇప్పుడు మనిషి ఒంటరివాడే
ఒంటరివాడే...
*

-ఖాదర్ షరీఫ్ 9441938140