S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎలావుందీ వారం? ( ఫిబ్రవరి 7 నుండి 13 వరకు)

మేషం (ఏప్రిల్ 15 - మే 14)

విద్వాంసులు, ఉన్నత వర్గాలతో పరిచయాలు ఏర్పడుతాయి. సంస్కృతీ సంప్రదాయాల పట్ల ఉత్సుకత పెరుగుతుంది. బంధుమిత్రులలో మీ ప్రాబల్యం పెరుగుతుందని చెప్పవచ్చు. క్రీడలు, కళలలో మీ ప్రావీణ్యం బహిర్గతమవుతుంది. ఆత్మీయుల క్షేమ సమాచారాలు తెలుసుకుంటారు. ఉద్యోగాభివృద్ధి, రచనా వ్యాసంగాలలో కొత్తదనం, విలువైన వస్తువులు అందుబాటులోనికి రావడం, దేవాలయాలు సందర్శించడం బుధ, గురువారాల్లో ఉంటాయి. నూతన ప్రణాళికలకు వలసిన ఆదాయం లభిస్తుంది.

వృషభం (మే 15 - జూన్ 14)

నష్ట నివారణ చర్యలు చేపట్టి, ఆగిపోయిన లావాదేవీలను పూర్తి చేస్తారు. 12, 13 తేదీల్లో ఒప్పందాలు, అనుమతులు లక్ష్య సాధనకు ఉపకరిస్తాయి. ఓపికతో చేసిన కృషికి తగ్గ సత్ఫలితాలు అందుతాయి. ప్రత్యర్థుల మీ ప్రతిభ ముందు పిపీలికాల్లా వీగిపోతారు. నిర్భయంగా, నిర్మొహమాటంగా వ్యవహరించి మీ ప్రాధాన్యతను పెంపు చేసుకో గలుగుతారు. పాత బాకీలు వసూలవుతాయి. భాగస్వాముల ఇబ్బందులు అర్థం చేసుకుని స్వాంతన, ఉల్లాసం కూర్చుతారు.

మిథునం (జూన్ 15 - జూలై 14)

ఉత్సాహవంతులైన మిత్రులు, అనుయాయులు లభిస్తారు. వారారంభంలో పనులు సాగక చికాకులు పెరిగినా బుధవారం నుండి పరిస్థితులు చక్కబడతాయి. జరిగిన పొరపాటు సరిదిద్దుకునేందుకు అవకాశాలు లభ్యమవుతాయి. అనుకోని ఖర్చులు మీద పడ్డా తాత్కాలిక రుణాలు, చేబదుళ్ల ద్వారా నెగ్గుకు వస్తారు. అకాల భోజనం, నిద్రలేమిల వల్ల ఆరోగ్య స్థితిలో మార్పు రాకుండా జాగ్రత్త వహించండి.

కర్కాటకం (జూలై 15 - ఆగస్టు 14)

నిధులు దుర్వినియోగం కాకుండా చూచుకోండి. ఇతరులు మీ ద్వారా లాభాలు పొందినా కృతజ్ఞత చూపించకపోవచ్చు. అనవసర ఆలోచనలకు తావీయక బృంద కార్యక్రమాలు, భాగస్వామ్యాలతో కృషి చేసి మీ కార్యదక్షతను చాటుకుంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొంత ఆందోళన కలిగించవచ్చు. ఉభయతారక నిర్ణయాలు తీసుకుని పెద్దలను, పిన్నలను మెప్పిస్తారు.

సింహం (ఆగస్టు 14 - సెప్టెంబర్ 14)

మీ కృషిని తీవ్రతరం చేస్తే మంగళ, బుధవారాల్లో కొన్ని విజయాలు చవి చూస్తారనవచ్చు. అతిథులు, మిత్రుల రాకతో గృహ వాతావరణం సందడిగా ఉంటుంది. ఆర్థికపరంగా సంతృప్తికరమైన స్థితికి చేరుకుంటారనవచ్చు. అనుకోని పరిస్థితుల్లో ముఖ్య నిర్ణయాలు కొన్ని తీసుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తారు. శ్రద్ధ్భాక్తులున్న కార్యకర్తలు, అనుచరులు లభ్యమవడం చెప్పుకోదగ్గ విశేషం. రుణ విముక్తులవుతారు. సోదర వర్గంతో సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి.

కన్య ( సెప్టెంబర్ 15- అక్టోబర్ 14)

విద్యా వాణిజ్యాలలో ఆకస్మిక విజయాలు చేకూరుతాయని చెప్పవచ్చు. రుణ విముక్తులయ్యేందుకు కావలసిన ఆదాయం చేతికందుతుంది. అవివాహితులకు అనుకోని రీతిలో సంబంధాలు కుదరవచ్చు. ప్రత్యర్థుల బలహీనతలు మీకు ఉపకరించగలవు. సమాజంలో మీ ఉనికిని సుస్థిరం చేసుకునేందుకు నూతన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. మనోభీష్టాలకు, వృత్తి ధర్మాలకు చుక్కెదురైనా చలించక సమతుల్యం సాధించే ప్రయత్నం చేస్తారు. శ్రమ తగ్గుతుంది.

తుల (అక్టోబర్ 15- నవంబర్ 14)

వృత్తి వాణిజ్యాల్లో, మబ్బు వీడిన చంద్రుడిలా ఇబ్బందులు తొలగి ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. చిరకాల మిత్రులను కలసి ఆనందిస్తారు. అనుకోని ప్రయాణాల వల్ల అలసట తప్పకపోవచ్చు. నవీన దృక్పథాలు, ఆలోచనలతో సమాజాన్ని మేల్కొలిపేందుకు సమాయత్తమవుతారు. స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం మీరు చేసే ప్రయత్నాలు రాణిస్తాయి. ప్రత్యర్థులు మీ ధాటికి కకావికలవుతారనవచ్చు. విలువైన, సమయానుకూలమైన సలహాలతో సన్నిహితుల ఇబ్బందులను తొలగించ గలుగుతారు.

వృశ్చికం (నవంబర్ 15-డిసెంబర్ 14)

తగినంత సమయం, కావలసిన వనరులు లేకపోయినా ఏకాగ్రచిత్తంతో ప్రయత్నించి లక్ష్యాలను చేరుకోగలుగుతారు. అంతర్గతంగా దాగి వున్న ప్రతిభా ప్రావీణ్యతలు బయటపడేందుకు తగిన సమయం ఆసన్నమయిందని చెప్పవచ్చు. పెట్టుబడులు లాభిస్తాయి. మంచివారితోటి, కళాకారులతోటి సత్సంబంధాలు ఏర్పడుతాయి. కుటుంబ వ్యక్తులు అభివృద్ధి పథంలో దూసుకుపోవడం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు కొన్ని ఈ వారంలో ప్రారంభం చేస్తారు. ఆధ్యాత్మిక చింతన మనశ్శాంతిని చేకూర్చుతుంది.

ధనస్సు (డిసెంబర్ 15-జనవరి 14)

మొహమాటాలు వదిలి మీ సమస్యలను గూర్చి సన్నిహితులతో చర్చించడం శ్రేయస్కరం. ఆర్థిక లావాదేవీలు మందగతిని సాగుతాయి. క్రయ విక్రయాలు, ఒప్పందాలు పునః పరిశీలన ద్వారా భవిష్యత్ లావాదేవీలను గూర్చి అవగాహన పెంచుకుంటారు. ఆత్మీయుల సలహాలు ఉపకరిస్తాయి. అదనపు బాధ్యతలు, భారం పెరిగినా సందేహించక నిర్మాణాత్మక కార్యక్రమాలపై దృష్టి పెడుతారు.

మకరం (జనవరి 15-ఫిబ్రవరి 14)
అధికారులు మీకు సహకరిస్తారో లేదోనన్న మీమాంస నుండి బయటపడి నిశ్చింతగా మీ బాధ్యతలను నిర్వహిస్తారు. అకాల భోజనం, శారీరక శ్రమ తప్పకపోయినా అన్ని వర్గాల వారిని సంతృప్తిపరిచేందుకు ప్రయత్నిస్తారు. సాధించిన విజయాలు మీలో నూతనోత్తేజాన్ని కలిగిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. సందర్భోచిత సలహాలు, వ్యాఖ్యలతో అందరినీ ఆకట్టుకుంటారు.

కుంభం (ఫిబ్రవరి 15-మార్చి 14)

వినయం, విజ్ఞత ప్రదర్శించి అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. మీరు చేసిన ప్రతిష్టాత్మక, దీర్ఘకాలిక వ్యవహారాలు ప్రముఖుల దృష్టిని ఆకర్షిస్తాయి. కొన్ని విషయాల్లో మీ సహచరులు, అనుయాయులపై ఆధారపడటం తప్పకపోవచ్చు. ఆది, సోమవారాల్లో గృహ సంబంధ విషయాలు, భాగస్వాముల అవసరాలు గుర్తించి మీ వంతు బాధ్యతను నెరవేర్చుతారు. ఆత్మీయులు, ఆలుబిడ్డల కోసం, విలాసాల కోసం ధనం కేటాయించి వినియోగిస్తారు.

మీనం ( మార్చి 15- ఏప్రిల్ 14)

క్రయ విక్రయాలలో అనుకూలత, ద్రవ్య లాభం వారారంభంలో మిమ్మల్ని ప్రోత్సహించేదిగా ఉంటుంది. మిమ్మల్ని విమర్శించే వారికి మాటలతో కాక చేతలతో సరైన సమాధానమిస్తారు. సేవాభావంతో కృషి చేసి ఆత్మీయుల అభిమతాలు నెరవేర్చుతారు. గతించిన వాటి గురించి చింతించక, సాధించబోయే విజయాలకై కృషిని పెంపు చేయవలసిన తరుణమిదని తెలుసుకుంటారు. కీలక రంగాల్లో పనిచేసే వారి అనుభవాలు మీలో నూతనోత్తేజాన్ని, చైతన్యాన్ని నింపుతాయి.

ఎస్.రవిప్రకాశ్