S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నిజమైన భక్తుడు (కథాసాగరం)

అబూసరి బట్టల కొట్టు నడిపేవాడు. మార్కెట్ మధ్యలో అతని షాపు ఉండేది. వచ్చీపోయే జనాలతో మార్కెట్ రద్దీగా ఉండేది. సందడిగా వుండేది. అబూసరి షాపునకు జనాలు బాగా వచ్చేవాళ్లు. వాళ్లతో మాటలు కలిపి సరదాగా కబుర్లు చెబుతూ, అందరి క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ అబుసరి వ్యాపారం కొనసాగించేవాడు. అతనికి ఒంటరిగా ఉండడం ఇష్టముండదు. మనుషులతో గడపడమంటే అతనికి ఆనంద. తనకు అవసరమయిన బట్టలు యితర షాపుల వాళ్ల దగ్గర కొంటూ, తన దగ్గర వున్న బట్టలు అమ్ముతూ బేరసారాలు సాగించేవాడు.
కాని మధ్యాహ్నం అయ్యేసరికి షాపునకు తెరదించి ఒక మూల భక్తిశ్రద్ధలతో భగవంతుణ్ని ప్రార్థించేవాడు. మళ్లీ తెర లేపి వ్యాపారం కొనసాగించేవాడు.
ఒకరోజు ఒక ముల్లా అబూసరి దగ్గరికి వచ్చి, ‘నేను దేవుడికి చాలా దగ్గరవాణ్ని. నా ఆనందాన్ని నీతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను’ అన్నాడు.
అబూసరి ‘నువ్వెక్కడుంటావు?’ అని ముల్లాని అడిగాడు.
ముల్లా ‘నేను ఎడారిలో వుంటాను. దైవచింతనలో గాఢంగా వుంటూ దేవుని ఆశీర్వాదాలలో తేలుతూ వుంటాను’ అన్నాడు.
అబూసరి ‘నువ్వు ఎడారిలో నివసిస్తున్నావంటే నువ్వు యింకా స్వర్గానికి చాలా దూరంగా వున్నట్టే లెక్క. జ్ఞానోదయం పొందిన వ్యక్తి జనం మధ్య ఉండాలి. ఒంటరిగా కాదు. ఎందుకంటే దేవుడు అందరిలోవాడు. అందరిలో వుండేవాడు. అందరిలో వుండే దేవుణ్ని కాదని నువ్వు ఒంటరిగా వుంటే అందర్నీ వదిలి దేవుడు నీ ఒక్కడి కోసం రాడు. ఇక్కడ ఇంతమంది మధ్యలో ఉంటే ఒక్క క్షణం కూడా దేవుణ్ని మనం వదిలి వుండం’ అన్నాడు.
ఆ మాటలకు ముల్లా నిరుత్తరుడయ్యాడు.

- సౌభాగ్య, 9848157909