S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘గర్భ’గుడి

ఒకరు గుడికి
మరొకరు మసీదుకి
వేరొకరు చర్చికి
ఇంకొకరు గురుద్వార్‌కి
జననం నుంచి మరణంలోగా
ఏదో ఒక సందర్భంలోనో
ఒకానొక సమయంలోనో
తమతమ ఆలయాల చుట్టూ ప్రతి ఒక్కరూ తిరిగేవారే..!
ఏమీ తెలియని పసితనంలోనో
తెలిసీ తెలియని బాల్యంలోనో
అన్నీ తెలుసుననుకునే యవ్వనంలోనో
తెలుసేమో! అనుకునే సందిగ్ధపు వృద్ధాప్యంలోనో
తమతమ మతాలకి సంబంధించిన ఆలయాల్ని
జీవితకాలంలో ఒక్కసారైనా సందర్శించుకునేవారే..!
ఆలయాల్లోని ఆకారాల్నో నిరాకారాల్నో దర్శించుకునేవారే..!
గర్భగుడిలో అడుగిడి చేతులు జోడించి
వేళ్లు మడిచి పిడికిళ్లు ముడిచి పెదాలకానించి
హస్తాలు పైకెత్తి చూపుల్ని విస్తరిస్తూ
ఆకాశరస్తాలపై సారించి మొక్కేవారే...!
అవునన్నా.. కాదన్నా...
మన ప్రమేయం లేకనే మన పుట్టుకన్నది
ఏదో ఒక మతంలో పురుడు పోసుకుంటుంది.
ఏ మత విశ్వాసాన్ని శ్వాసించే వారెవరైనా
తమతమ మతాలతో విశ్వసించి
మనుగడ సాగించే వారెవరికైనా
అమ్మ పాలే.. మురిపాలే...
అందరి తనువుల అణువణువునూ తడిమే అమృత తడి
గుడిసె లేనివారికి తలదాచుకునేందుకు ఉంటుంది
ఆకాశమంత అమ్మ ఒడి
గర్భాన ప్రతిష్ఠించుకుని
తొమ్మిది నెలలు మనలను తనలో మలచిన అమ్మ గర్భమే
అవనిలో అందరికీ
అసలు ‘గర్భ’గుడి

-యక్కలూరి శ్రీరాములు 9985688922