S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

లౌక్యం( కథ )

ధనరాజు, గోపాలరాజు ఇరుగు పక్కపక్క గ్రామాల్లో ఉండే వ్యాపారులు. వారికి వ్యాపారంలో అంతర్గత పోటీ ఉండేది. తనదే అన్నింటిలో పై చేయిగా ఉండాలనే తపన ధనరాజులో కనిపించేది.
ఒకసారి గోపాలరాజు, ధనరాజు ఇంటికి వ్యాపార లావాదేవీలపై వచ్చాడు. మధ్యాహ్నం వేళైంది. పిండి వంటలతో భోజన ఏర్పాట్లు చేశాడు. సుష్ఠుగా తిన్న గోపాలరాజు ముఖం పువ్వులా వికసించింది. స్వగ్రామం బయల్దేరాడు. ఊరి పొలిమేరల వరకూ గోపాలరాజు వెంట ధనరాజు వచ్చాడు.
ఇంతలో గ్రామ పెద్ద రంగనాయకులు ఎదురయ్యాడు. ‘గోపాలరాజు గారూ! ఏమిటి ఇలా విచ్చేశారు?’ అంటూ ప్రశ్నించాడు. సమాధానం గోపాలరాజు చెప్పకముందే, ధనరాజు కలుగజేసుకుని ‘గేదెల కోసమని యాభై వేలు అప్పు అడిగితే ఇచ్చాను. నెమ్మదిగా తీర్చమని చెప్పాను. అంతే!’ అన్నాడు. గోపాలరాజు ఏ మాట చెప్పక ముందే ధనరాజు కదిలాడు. ‘సరే! తరువాత చూసుకోవచ్చ’ని గోపాలరాజు స్వగ్రామం చేరాడు.
నెల రోజులు పోయిన తరువాత ధనరాజు, గోపాలరాజు ఇంటికి వెళ్లవలసి వచ్చింది. ఇంటికి వచ్చిన ధనరాజును అతిథిగా ఉండమని బ్రతిమాలాడు. నోరూరించే పిండి వంటలు తయారుచేయిస్తున్నాడని ధనరాజుకు అర్థం అయింది. కాని భోజనానికి ఆగకుండానే బయలుదేరాడు. వెంట పొలిమేరల వరకు గోపాలరాజు మిత్రుణ్ణి ఆతిథ్యం స్వీకరించమని కోరుతూనే ఉన్నాడు. ఇక్కడ కూడా రంగనాయకులు ఎదురయ్యాడు.
‘ఏమిటి ధనరాజూ! ఊరక దయ చేయరు ధనరాజు వంటి మహనీయులు’ అంటుండగానే గోపాలరాజు కలుగజేసుకుంటూ ‘నా గేదెల పాలు ప్రతిరోజు ఈయన ఇంటికడ పోయించాను. ఆ బాకీలు సరిచూసుకోడానికి వచ్చాడు. గేదె బాకీ, పాలు బాకీకి సరిపోయిందని తెలిసి, ధనరాజు ఇంటి ముఖం పట్టాడు’ అన్నాడు.
ధనరాజు ముఖం చిన్నబోయింది.
‘గోపాలరాజూ! నీకు గేదెలే లేవు. నాకు పాలుపోయడం ఏమిటయ్యా’ అన్నాడు.
‘గేదెలు కాని, గేదెల పెంపకం కాని అవసరం లేని నాకు గేదెలకు అప్పు ఇచ్చాననడం సబబు! ధనరాజయ్యా’ అంటూ గోపాలరాజు నవ్వుతూ అన్నాడు.
‘ఇద్దరు చెప్పింది నిజమే! భోజనం వేళప్పుడు ప్రయాణమేమిటి? కదలండి భోజనానికి’ అని అన్నాడు రంగనాయకులు.
పెద్దమనిషి రంగనాయకులు మాటను కాదనలేక ధనరాజు కూడా భోజనానికి కదిలాడు.

-బెహరా ఉమామహేశ్వరరావు