S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చంపుతా లేదా చస్తా ( విలన్స్, స్కౌన్‌డ్రల్స్ అండ్ రాస్కెల్స్)

ఫిబ్రవరి నెలలోని రెండో సోమవారం రాత్రి పదకొండుకి మొదటి ఫోన్‌కాల్ వచ్చింది. మార్తా రిసీవర్‌ని అందుకుని చెప్పింది.
‘హలో’
‘ఈ నంబర్ని దినపత్రికలోని పర్సనల్ కాల్‌లో చూశాను’ ఓ ఆడకంఠం కొద్దిగా సందేహంగా చెప్పింది.
ఆ ప్రకటన సూయిసైడ్ ప్రివెన్షన్ 24 అవర్ సర్వీస్. కాన్ఫిడెన్షియల్. ఫ్రీ. 6482444.
ఆ నంబర్ మార్తాది కాదు. ఆ నంబర్‌కి వచ్చే ఫోన్‌కాల్ యాంత్రికంగా మార్తా ఇంటికి మళ్లింపబడుతుంది.
‘మీరు సూయిసైడ్ ప్రివెన్షన్‌కి డయల్ చేశారు. మీకేం సహాయం చేయగలను?’
కొద్ది క్షణాల నిశ్శబ్దం తర్వాత ఆమె కంఠం మళ్లీ వినిపించింది.
‘నేనెందుకు ఫోన్ చేశానో నాకు తెలీదు. నేను ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం లేదు. నాకు మనసు బాగాలేక ఎవరితోనైనా మాట్లాడాలి అనిపించి చేశాను’
కొందరు ఆత్మహత్య చేసుకోవాలని ఉందని చెప్పరని మార్తాకి అనుభవం మీద తెలుసు. చాలా ఆత్మహత్యల చరిత్రలు చూస్తే తాము ఆత్మహత్య చేసుకుంటామని ముందు అనేకసార్లు చెప్తారు. కొందరు ఎలాంటి హెచ్చరిక లేకుండా ఆత్మహత్య చేసుకుంటారు. ఆమె ఈ నంబర్‌కి ఫోన్ చేసిందంటే, ఆమెలో ఆత్మహత్య చేసుకునే ఉద్దేశం ఉండి ఉంటుందని మార్తా అనుకుంది.
‘మీ లాంటి వారితో మాట్లాడడానికే నేనున్నాను. మీకు మనసు ఎందుకు బాగాలేదు?’
‘అనేక సమస్యల వల్ల. మీకు నా కాల్‌ని ట్రేస్ చేయరు కదా?’
‘లేదు. ఆ పని చేస్తే ఎవరూ మాకు ఫోన్ చేయరు. మాకు ఫోన్ చేసేది ఎవరో తెలుసుకోవాలి అనుకుంటాం కాని చెప్పమని బలవంతం చేయం. మీరు అజ్ఞాతంగా ఉండదల్చుకుంటే అది మీ ఇష్టం. మీరు మీ పేరు చెప్తే అది బయటికి వెళ్లదని హామీ. పోలీసులు మీ ఇంటికి వస్తారని భయపడకండి’
‘మీరు మంచి మనిషిలా ఉన్నారు. మీ పేరేమిటి?’
ఫోన్ చేసిన వాళ్లకి స్వచ్ఛంద సేవకుల వివరాలు తెలియకూడదన్నది నియమం. కానీ అరవై ఏళ్ల మార్తా తన పేరు చెప్పింది.
‘నా పేరు జానెట్’ ఆమె చెప్పింది.
‘పూర్తి పేరు?’ మార్తా అడిగింది.
‘నా వయసు ముప్పై రెండు’ ఆమె ఆ ప్రశ్నకి జవాబు చెప్పకుండా చెప్పింది.
‘నాకన్నా మీరు బాగా చిన్నవారు. మీకు పెళ్లైందా?’ మార్తా ప్రశ్నించింది.

‘పదేళ్లయింది’
‘మీ వారు ఇప్పుడు ఇంట్లో ఉన్నారా?’
‘సోమవారం రాత్రుళ్లు బౌలింగ్‌కి వెళ్లి అర్ధరాత్రి దాటాక కానీ ఇంటికి రారు’
‘మీకు పిల్లలు ఉన్నారా?’
‘లేరు. రెండుసార్లు అబార్షన్ అయింది’ జానెట్ చెప్పింది.
‘అంటే మీరు ఇంట్లో వొంటరిగా ఉన్నారన్నమాట?’
‘అవును’
‘మీ పూర్తి పేరు చెప్తారా జానెట్?’
‘తప్పనిసరా?’ ఆమె అడిగింది.
‘అవసరం లేదు. మీ భర్త ఏం చేస్తారు?’
‘ప్రొఫెషనల్’
‘మీ భర్తవల్ల మీకేమైనా ఇబ్బంది కలిగి ఈ నంబర్‌కి ఫోన్ చేశారా?’
‘లేదు. ఫ్రెడ్ మంచి భర్త’
ఆమె భర్త పేరుని మార్తా ఓ కాగితం మీద జానెట్ పేరు పక్కన రాసింది. ఫోన్ లోంచి ఆమెకి కూకూ శబ్దం పదకొండుసార్లు వినిపించింది. నేపథ్య శబ్దాలు ఫోన్ చేసేవారుండే ప్రదేశాన్ని సూచిస్తూంటాయి. ట్రాఫిక్ శబ్దాలు, రైలు వెళ్లే శబ్దాలు మొదలైనవి. వారింట్లో కుకూ గడియారం ఉందని మార్తా కాగితంలో రాసుకుని అడిగింది.
‘మీ మనసు బావుండక పోవడానికి కారణం ఏమిటి జానెట్?’
‘నేను మీకు ఫోన్ చేసినప్పటికన్నా ఇప్పుడు మనసు తేలికపడింది. బాధలేదు. మళ్లీ ఎప్పుడైనా నా మనసు బావుండనప్పుడు మీకు ఫోన్ చేయచ్చా?’ ఆమె కంఠం జీరగా వినిపించింది.
‘మీ కాల్ నాకు రాకపోవచ్చు. మరే స్వచ్ఛంద సేవకురాలికైనా వెళ్లచ్చు’
‘మీరు డ్యూటీలో ఎప్పుడుంటారు? నాకు మీతోనే మాట్లాడాలని ఉంది’
‘సోమ, బుధ రాత్రుళ్లు. ఎనిమిది నుంచి ఉదయం ఎనిమిది దాకా మాత్రమే’
‘అలా అయితే ఆ సమయంలోనే నాకు మనశ్శాంతి పోయేలా చూసుకుంటాను. నాతో మాట్లాడినందుకు థాంక్స్ మార్తా’
‘నాకూ సంతోషంగా ఉంది. మీలో సెన్సాఫ్ హ్యూమర్ ఉంది. గుడ్. మీ మనసు ప్రశాంతంగానే ఉంది కదా?’ మార్తా అడిగింది.
‘అవును. మీ మాటలవల్ల’
* * *
రెండో ఫోన్ కాల్ బుధవారం రాత్రి పదకొండింటికి వచ్చింది. రిసీవర్ ఎత్తగానే కుకూ సంగీతం వినిపించింది.
‘మార్తా?’ ఆ ఆడ జీర కంఠం తర్వాత వినిపించింది.
‘చెప్పండి జానెట్’
‘ఓ! నా కంఠాన్ని గుర్తు పట్టారా? మీకు చాలా కాల్స్ వస్తూంటాయి కాబట్టి గుర్తు పట్టరనుకున్నాను’

‘మీరు బాగా గుర్తున్నారు. మళ్లీ మనసు బాగా లేదా?’
‘అస్సలు బాగాలేదు. సోమవారం మీకు ఓ అబద్ధం చెప్పాను’ జానెట్ చెప్పింది.
‘అలాగా? ఏమిటది?’
‘నాకు ఆత్మహత్య చేసుకునే ఉద్దేశం లేదని. కాని చేసుకోవాలని నాకు ఎప్పుడూ అనిపిస్తూంటుంది.’
‘ఈ రాత్రి మీ భర్త ఇంట్లో ఉన్నారా జానెట్?’
‘లేరు. నేషనల్ డెన్.. ఊరెళ్లారు. నేను వొంటరిగా ఉన్నాను’
నేషనల్ డెన్? మధ్యలో కావాలని ఆపేసింది. అదేమై ఉండచ్చు?
‘మీ సమీపంలో ఎవరైనా మీ ఇంటికి రావడానికి ఇష్టపడే ఫ్రెండ్సున్నారా?’
‘నా మనసులోని విషయాలు నా మిత్రులు ఎవరికీ చెప్పను’
‘అసలు మీకు ఏమైంది?’
‘అది ఇంతవరకు నేనెవరికీ చెప్పలేదు. అందువల్లే నాకు పిచ్చెక్కినట్లవుతంది’
‘మీరు మీ భర్తని ప్రేమిస్తున్నారా?’
‘ఆఁ నా భర్త కూడా నన్ను బాగా ప్రేమిస్తారు. కానీ అప్పుడప్పుడు ఆయన్ని చంపాలనే కోరిక నాలో కలుగుతూంటుంది. మొన్న ఆదివారం అర్ధరాత్రి నేను మంచం దిగి వంట గదిలోకి వెళ్లి మాంసం కోసే కత్తిని తీసుకున్నాను. పడక గదిలో నిద్రిస్తున్న ఫ్రెడ్‌ని చూశాక తమాయించుకుని ఆగాను. అందుకే మర్నాడు రాత్రి మీకు ఫోన్ చేశాను’
మార్తా గుండె కొట్టుకునే వేగం పెరిగింది. ఏక్యూట్ న్యూరోసిస్‌తో బాధపడే సైకో ఈమె! అలాంటి వారు ఆమెకి ఫోన్ చేయడం అది మొదటిసారి. మార్తా సోషల్ వర్కర్‌గా పనిచేసి రిటైరైంది. ఆమె మానసిక శాస్త్రంలో నిపుణురాలు. జానెట్‌కి తక్షణం చికిత్స జరగకపోతే ప్రమాదం అనుకుంది.
‘దీన్ని మీరు ఇంకెవరికైనా చెప్పారా?’ మార్తా అడిగింది.
‘లేదు. మీకు మాత్రమే’ జానెట్ వేదనగా చెప్పింది.
‘మీకు ఇలాంటి ఆలోచనలు ఉన్నాయన్న సంగతి మీ భర్తకి తెలుసా?’
‘తెలీదు. నేనంటే ఆయనకి బాగా ప్రేమ. అందుకే నేను మామూలుగా ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నాను. ఫ్రెడ్‌ని చంపే కంటే నేను మరణించడం ఉత్తమం కదా?’
‘ఈ రెంటి అవసరం లేదు జానెట్. నువ్వు నాకు సలహా కోసం ఫోన్ చేసావు అనుకుంటున్నాను. దాన్ని తీసుకోడానికి సిద్ధమేనా?’
‘ఏమిటది?’ జానెట్ కంఠం గుసగుసగా వినిపించింది.
‘మీ మానసిక ఆరోగ్యం సరిగా లేదని మీకు తెలుసనుకుంటాను. మానసిక చికిత్సకి ఇది మొదటి మెట్టు. తనలో ఎలాంటి దోషం లేదని భావించే మానసిక రోగికి చికిత్స కష్టం’
‘మా ఫేమిలీ డాక్టర్‌ని కలిసి ఈ విషయాలు చెప్పలేను. అతను నా మరిదే’
‘మీ భర్తకి కాని, ఫేమిలీ డాక్టర్‌కి కానీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎల్లో పేజెస్‌లో అనేక మంది సైకియాట్రిస్ట్‌ల ఫోన్ నంబర్లు మీకు కనపడతాయి. లేదా నేను ఓ డాక్టర్ పేరు, నంబర్ ఇవ్వగలను’
చాలాసేపు నిశ్శబ్దం. తర్వాత జానెట్ అడిగింది.
‘అతను నా భర్తకి చెప్పడా?’
‘డాక్టర్స్‌కి కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఉంటుంది. రోగి తనకి చెప్పే సమాచారం అంతా రహస్యమైంది. దాన్ని ఇతరులకి చెప్పకూడదు’
‘మీరు చెప్పే డాక్టర్ నాకు సహాయం చెయ్యగలరా?’ ఆశగా అడిగింది.
‘తప్పకుండా’
‘ఆయన పేరు?’
‘డాక్టర్ ఆల్బర్ట్ మేనర్స్. మెడికల్ ఎక్సేంజ్ బిల్డింగ్‌లో ఆయన క్లినిక్ ఉంది. కాగితం, కలం ఉంటే రాసుకోండి’
‘డాక్టర్ ఆల్బర్ట్ మేనర్స్. మెడికల్ ఎక్సేంజ్ బిల్డింగ్. నాకు గుర్తుంటుంది. రేపు ఉదయం ఆయనకి ఫోన్ చేస్తాను. థాంక్ యూ మార్తా’
‘మీ భర్త ఇంటికి ఎప్పుడు వస్తారు?’
మార్తా ప్రశ్నకి సమాధానంగా లైన్ కట్ అయిన శబ్దం వినిపించింది.
ఈలోగా ఆమె తన భర్త చంపకూడదని మార్తా జీసస్‌ని ప్రార్థించి పడుకుంది.
* * *
జానెట్ నించి మూడో ఫోన్‌కాల్ సోమవారం రాత్రి తొమ్మిదికి కొద్ది నిమిషాలు ఉందనగా వచ్చింది. ఈసారి మార్తా ముద్ద మాటలు విని, అది జానెట్ కంఠంగా పోల్చుకోలేక పోయింది.
‘ఆలస్యమైంది. రేపటి దాకా ఆగలేను’
‘జానెట్?’ ప్రశ్నించింది.
‘అవును. హలో మార్తా?’
‘హ’ని మింగేసింది.
‘నువ్వేదైనా తీసుకున్నావా?’
‘ఆలస్యమైంది. రేపటిదాకా ఆగలేకపోయాను’
‘దేని కోసం ఆగడం జానెట్?’
‘పాయింట్‌మెంట్. డాక్టర్ మేనర్స్... ఈ రాత్రి బౌలింగ్ నించి రాగానే చంపేసేదాన్ని. దానికంటే ఇదే ఉత్తమం’ చాలా మత్తుగా ఆ కంఠం వినిపించింది.
‘జానెట్. ఏం తీసుకున్నావు?’ మార్తా గట్టిగా అడిగింది.
‘ఫ్రెడ్ కోసం ఈ పని చేసానని మీరు చెప్తారా? ఐ లవ్ హిమ్ అన్నానని కూడా చెప్తారా?’
‘మీ అడ్రస్ ఏమిటి? మీ వారు ఎక్కడ బౌలింగ్ ఆట ఆడుతున్నారు?’ మార్తా ఆదుర్దాగా అడిగింది.
‘ఎల్క్‌మెన్స్ లీగ్. ఆయనకి చెప్పండి.. చెప్పండి’ ఆమె కంఠం క్రమంగా బలహీనమైంది.
నేపథ్యంలో కుకూ తొమ్మిదిసార్లు అరవడం మార్తా విన్నది.
‘జానెట్!’ గట్టిగా పిలిచింది.
జవాబు లేదు. ఆమెని నిద్రలేపాలని ఎన్నిసార్లు పిలిచినా ఉపయోగం లేకపోయింది.
ఫోన్ చేసిన వాళ్లు అవతల వైపు పెడితే తప్ప కనెక్షన్ కట్ కాదు. కాబట్టి మార్తాకి డయల్ టోన్ వినిపించలేదు. ఐతే ఆపరేటర్‌ని పిలవడానికి మార్తా ఒకటిరెండుసార్లు హుక్‌ని నొక్కింది. అకస్మాత్తుగా డయల్ టోన్ వినిపించింది. జానెట్ ఫోన్‌ని ట్రేస్ చేసే ఒక్క అవకాశం పోయిందని మార్తా గ్రహించింది. వెంటనే మార్తా టెలిఫోన్ డైరెక్టరీ తీసుకుని స్థానిక ఎల్క్స్ క్లబ్ నంబర్ చూసి ఫోన్ చేసింది. అనేకసార్లు ఫోన్ మోగాక ఓ మగ కంఠం వినిపించింది.
‘ఇది ఎమర్జెన్సీ. సూయిసైడ్ ప్రివెన్షన్ నించి మాట్లాడుతున్నాను. అక్కడ ఆడటానికి వచ్చిన ఫ్రెడ్‌తో అర్జెంట్‌గా మాట్లాడాలి’
‘ఇక్కడ పధ్నాలుగు టీమ్స్ ఆడుతున్నాయి. ఒక్కో టీమ్‌లో ఐదుగురు ఉన్నారు. వారిలో ఫ్రెడ్ పేరుతో ముగ్గురు ఉన్నారు. పూర్తి పేరు చెప్పండి’
‘తెలీదు. అతని భార్య పేరు జానెట్. అతని తమ్ముడు డాక్టర్’
‘మీకు కావల్సింది డాక్టర్ ఫ్రెడ్ వాటర్స్. ఆయన డెంటిస్ట్’
వెంటనే ‘నేషనల్ డెన్...’ అని జానెట్ ఆగిపోవడం అర్థమైంది. అది నేషనల్ డెంటల్ అసోసియేషన్.
‘హలో! జానెట్?’
అతను లైన్‌లోకి రాగానే మార్తా చెప్పింది.
‘నేను జానెట్‌ని కాను. సూయిసైడ్ ప్రివెన్షన్‌లో స్వచ్ఛంద సేవకురాల్ని. ఇరవై నిమిషాల క్రితం మీ భార్య నించి నాకు ఫోన్ వచ్చింది. మీరు వెంటనే ఇంటికి వెళ్లండి. ఆమె ఏదో మింగింది. నాతో మాట్లాడుతూ స్పృహ తప్పింది’
‘ఏమిటి?’ అదిరిపడ్డ ఫ్రెడ్ కంఠం వినిపించింది.
‘మాత్రలు మింగిందా?’
‘వెంటనే అంబులెన్స్‌కి ఫోన్ చేసి మీరూ ఇంటికి వెళ్లండి’
మార్తా తన నంబర్ ఇచ్చి ఏమైందో చెప్పమని కోరింది. ఐతే ఆ రాత్రి ఆమెకి ఫ్రెడ్ నించి ఫోన్ రాలేదు. తెల్లవారుజామున ఫోన్ మోగింది.
‘మిస్ మార్తా?’ ఓ కొత్త కంఠం వినిపించింది.
‘అవును’
‘నేను లెఫ్టినెంట్ హెర్మన్ ఏజల్‌ని. డాక్టర్ వాటర్స్ మీకు ఫోన్ చేయమన్నారు. అతనికి మాట్లాడే మూడ్ లేదు. అతని భార్య స్లీపింగ్ పిల్స్ మింగిందని ఫోన్ చేసింది మీరే కదా?’
‘అవును. ఇప్పుడు ఆమెకి ఎలా ఉంది?’ మార్తా ఆదుర్దాగా అడిగింది.
‘డాక్టర్ వాటర్స్ చెప్పడం సీసాలో మూడు డజన్లు కంటే ఎక్కువ మాత్రలు ఉన్నాయని. పోస్ట్‌మార్టంలో కాని ఎన్ని మింగిందో తెలీదు’
‘అయ్యయ్యో! ఆమె వయసు ముప్పై రెండే’ మార్తా బాధగా చెప్పింది.
తనకి ఆమె నించి వచ్చిన మూడు ఫోన్ కాల్స్

గురించి మార్తా లెఫ్టినెంట్ హెర్మన్‌కి చెప్పింది.
‘మీ స్టేట్‌మెంట్ తీసుకోవాలి. మీకు టైం ఉన్నప్పుడు దయచేసి ఒకసారి హెడ్ క్వార్టర్స్‌కి రండి’
మర్నాడు మార్తా దినపత్రికలో జానెట్ వాటర్స్ ఫొటో కోసం చూసింది. కానీ లోపలి పేజీల్లో ఆమె ఆత్మహత్య గురించి చిన్న వార్త ఉంది.
మార్తా స్టేట్‌మెంట్ తీసుకున్నాక హెర్మన్ చెప్పాడు.
‘జానెట్ మానసిక రోగి అని ఆమె భర్త ఎన్నడూ అనుమానించలేదు. డాక్టర్ ఆల్బర్ట్ మేనర్స్ దగ్గర జానెట్ వాటర్స్ నిజంగా అపాయింట్‌మెంట్ తీసుకుందా లేదా అని కనుక్కున్నాను. అది నిజమే అని తెలిసింది’
* * *
మార్తా డాక్టర్ ఫ్రెడ్ వాటర్స్ క్లినిక్‌కి ఫోన్ చేసి తన పంటి పరీక్షకి అపాయింట్‌మెంట్‌ని తీసుకుంది. కారణం అతని క్లినిక్ తన ఇంటికి ఏడు మైళ్ల దూరంలోనే ఉంది. తను ఎప్పుడూ వెళ్లే క్లినిక్ ముప్పై ఐదు మైళ్ల దూరంలో ఉండడంతో డాక్టర్ని మార్చింది.
వెయిటింగ్ హాలులో కూర్చుని మార్తా లేడీస్ మేగజైన్‌ని చదువుతూండగా, అకస్మాత్తుగా కుకూ శబ్దం వినిపించింది. తలెత్తి చూస్తే చెక్క గోడ గడియారం కనిపించింది. జానెట్ తనకి ఫోన్ చేసినప్పుడు వినపడ్డ కుకూ గడియారం ఇదే అయుండచ్చా? ఆమె రిసెప్షనిస్ట్‌ని అడిగింది.
‘డాక్టర్ వాటర్స్ ఇంట్లో కూడా ఇలాంటి గడియారం ఇంకోటి ఉందా?’
‘నేను ఎన్నడూ ఆయన ఇంటికి వెళ్లలేదు. ఇక్కడ చేరి రెండు వారాలే అయింది. డాక్టర్ వాటర్స్ భార్య దీన్ని ఇక్కడ ఉంచింది. బహుశా ఇంట్లోది అయి ఉంటుంది’
‘డాక్టర్ వాటర్స్ భార్యా? ఆమె పోయిందిగా?’
‘వారం క్రితం ఆయన తన రిసెప్షనిస్ట్ జోన్‌ని పెళ్లి చేసుకున్నారు’
మార్తా నివ్వెరపోయింది. మగాళ్లు ఇంతే అనుకుంది.
‘ఈ గడియారం జోన్ అపార్ట్‌మెంట్‌లోది. పెళ్లయ్యాక ఆమె డాక్టర్ వాటర్స్ ఇంటికి మారినప్పుడు చాలా సామాను అమ్మేసింది. దీన్ని తెచ్చి ఇక్కడ ఉంచింది’
మార్తా ఆశ్చర్యంగా ఆ గడియారం వంక చూస్తూ, ‘తనకి వచ్చిన ఫోన్‌కాల్స్ అన్నీ జోన్ అపార్ట్‌మెంట్ లోంచి ఎలా వచ్చాయి?’ అనుకుంది. ఆమెకి జవాబు తట్టలేదు.
డాక్టర్ ఫ్రెడ్ గదిలోంచి రోగి బయటకి వచ్చాక ఆయన ఇంటర్‌కంలో రిసెప్షనిస్ట్‌ని అడిగాడు.
‘ఇంక పేషెంట్లు ఉన్నారా?’
‘ఆఖరి పేషెంట్ ఉన్నారు డాక్టర్..’
ఆమె మార్తాని డాక్టర్ గదిలోకి వెళ్లమని చెప్పింది. అతని వయసు నలభై లోపే.
‘సారీ. మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు’ చెప్పాడు.
మార్తా పళ్లని పరీక్షించి చెప్పాడు.
‘మీ వయసుకి మీ పళ్లు ఆరోగ్యంగా ఉన్నాయి’
డాక్టర్ స్క్రేపర్‌ని, పిక్‌ని అందుకున్నాడు. ఆమె మాట్లాడలేక పోయింది. పనై మార్చా కుర్చీ దిగాక తలుపు తెరచుకుని ఇరవై ఐదేళ్ల యువతి లోపలికి వచ్చింది.
‘ఓ! సారీ. రోగి ఉన్నారని తెలీదు’ చెప్పి ఆమె వెనక్కి వెళ్తూంటే మార్తా అనుకోకుండా అడిగింది.
‘మీరు జోన్ కదా?’
ఆమె ఆగి మార్తా వంక ప్రశ్నార్థకంగా చూసింది. డాక్టర్ వాటర్స్‌కి వారిద్దర్నీ ఒకరికొకర్ని పరిచయం చేయాలో వద్దో తెలీనట్లుగా చూశాడు.
‘జోన్. నన్ను గుర్తు పట్టలేదా? మార్తాని’
భార్యాభర్తల మొహాలు వెంటనే పాలిపోయాయి.
‘ఇదివరకు మనం ఎక్కడ కలిశాం?’ జోన్ అడిగింది.
‘్ఫన్‌లో మాత్రమే. ఎంతటి తెలివైన హత్యా పథకం! జానెట్ సైకోటిక్ అని, ఆత్మహత్య చేసుకోబోతోందని ఓ సాక్షిని తయారుచేసుకున్న పద్ధతి.. ఆమెకి మీ ఇద్దరిలో ఎవరు నిద్రమాత్రలు ఇచ్చారు? కాఫీతోనా?’
ఆ మాటలు మాట్లాడాక మార్తాకి తను తప్పుగా మాట్లాడిందని వాళ్ల చూపులని బట్టి అర్థమైంది.
‘నేను వెళ్తాను’ అని చెప్పి ఆవిడ భయంగా తలుపు వైపు నడిచింది.
తలుపు దగ్గర నిలబడ్డ జోన్ తన భర్తతో సాధారణ కంఠంతో చెప్పింది.
‘పొరపాటున రోగికి ఎక్కువ అనస్థీషయా ఇవ్వడం జరిగితే, మీకు వృత్తిపరంగా గౌరవం దెబ్బ తింటుంది. కానీ కోర్టులో హత్య విచారణ కంటే ఇది మంచిది’
పళ్ల డాక్టర్ మార్తా వంక, తన భార్య వంక మార్చిమార్చి చూశాడు.
‘తప్పుకో’ మార్తా భయంగా చెప్పింది.
జోన్ తన భర్తతో చెప్పింది.
‘మీకు ఇంకో దారి లేదు. అది ప్రమాదకరమైన మరణమే అవుతుంది. చాలా డెంటల్ హాస్పిటల్స్‌లో ఇలా జరిగింది’
డాక్టర్ వాటర్స్ ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా కదిలి మార్తా భుజాలు పట్టుకుని బలవంతంగా కుర్చీలో కూర్చోబెట్టాడు. ఆవిడ మెలికలు తిరుగుతూ కాళ్లతో చేతులతో తన్నసాగింది.
జోన్ కదిలి వచ్చి ఆమె మొహానికి గేస్ మాస్క్‌ని తొడిగింది.
అకస్మాత్తుగా మాస్క్‌లోంచి శబ్దం చేస్తూ వాయువు మార్తా ముక్కులోకి, నోట్లోకి వెళ్లసాగింది. దాంట్లోంచి బయటపడాలని మార్తా తలని అటు ఇటు ఊపుతుంటే, జోన్ కదలకుండా ఆవిడని పట్టుకుంది. మార్తా ఊపిరి బిగబట్టింది. ఆమె ఊపిరితిత్తులు పేలిపోతాయా అనిపించింది. అకస్మాత్తుగా ఆమెకి రిసెప్షనిస్ట్ కంఠం వినిపించింది.
‘రేపు ఉదయం నేను అరగంట ఆలస్యంగా... వ్వాట్!’
డాక్టర్ వాటర్స్ వెనక్కి తిరిగి, ఆమె వంక చూస్తూంటే మార్తా సగం లేచి నిలబడి మాస్క్‌ని తొలగించి అరిచింది.
‘హత్య! పోలీస్!’
తనని పట్టుకోబోయిన జోన్‌ని కాలితో బలంగా తన్నింది. తన పక్క నించి మార్తా పారిపోతూంటే, రిసెప్షనిస్ట్ తెల్లబోతూ చూసింది.
మార్తా కారు సరాసరి పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వైపు సాగింది.

(రిచర్డ్ డెమింగ్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి