S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గంప కింద కోళ్లు(కథ)

సప్తగిరీశుని నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాజు అచ్యుత రాయలు ఉత్సవాలను ఘనంగా నిర్వహించదలిచాడు.
గ్రామీణ యువతని ఇందులో భాగస్వామ్యం చేయాలని ఆయన నిర్ణయం. పురుష బృందాలు, మహిళా బృందాలు తయారయ్యాయి. వారికి కోలాటం, చెక్క్భజన, పంటరి భజన, నగర సంకీర్తన, మెట్ల పూజ, సుప్రభాతం తదితర అంశాల పట్ల చక్కటి శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేశారు. రథాలను లాగడానికి, అశ్వగజ వాహనాలను లాగడానికి శారీరక దారుఢ్యం ఉన్న పురుష బృందాన్ని ప్రత్యేకంగా నియమించారు.
బృందాల పర్యవేక్షకుడిగా సేనాధిపతి సదాశివరాయలు ఎంపికయ్యారు. బృంద శిక్షకులుగా పాతిక మంది నిపుణులైన అధ్యాపక జట్లు పాల్గొన్నాయి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మూడు నెలల పాటు శిక్షణా తరగతులను శేషాచలం పర్వత శ్రేణుల్లో నిర్వహించారు. వారికి తగిన వస్తధ్రారణ, పరికరాలు, భోజన వసతులను సైతం ఏర్పాటు చేశారు. ఉదయం యోగ, రాత్రిళ్లలో ధ్యానం మరియు కీర్తనల ఆలాపన చేయించసాగారు.
రెండు వారాలు గడిచింది. రాజుగారు అభ్యర్థులు తీసుకుంటున్న శిక్షణా కార్యక్రమాలను పరిశీలించడానికి శిబిరానికి వెళ్లారు. అక్కడి బృంద నాయకుడు సేనాధిపతితోను, అధ్యాపక బృందంతోను సమావేశం ఏర్పాటు చేశారు.
సేనాధిపతి రాజుగారికి ఇలా నివేదిక సమర్పించారు. ‘రాజా! నేటి యువతకు శ్రమించడం పట్ల శ్రద్ధ తగ్గింది. సరదాగా కాలక్షేపం చేయడం తప్పితే వారికి ఒళ్లు వంగడం లేదు. బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా లేరు. వారికి ప్రసాదాలపైన ఉన్న శ్రద్ధ పనులలో వుండడం లేదు. వారిని భక్తి భావం, శ్రమ భావం, క్రమశిక్షణా భావం లాంటి మార్గాల వైపు మళ్లించడం చాలా కష్టంగా ఉంది.’
రాజు అందుకు అంగీకరించలేదు. ‘శిక్షణ ప్రారంభమై రెండు వారాలే గడిచింది కదా. శీఘ్రంగా ఫలితాలను ఆశిస్తే ఆశాభంగం కలుగుతుంది. వారిని వారి తల్లిదండ్రులు గంపకింద కోళ్లు లాగా పెంచి ఉంటారు. గంప మాత్రమే ప్రపంచమని విశ్వసించి గంప తీశాక పరిసరాలను చూసి కోడి బెదిరినట్లుగా వారి వ్యవహార శైలి ఉండి ఉంటుంది.
అంతేగాక వారికి ఈ నియమాలూ, పద్ధతులు కొంత కఠినంగా అనిపించి ఉండవచ్చు. పురిటికందుకు అన్నప్రాసన నాడు ఆవకాయ పెడితే ఎలా గగ్గోలు పెడుతుందో స్వేచ్ఛగా తిరుగుతున్న యువతకి ఈ శిక్షణ చెరశాల లాగా ఉండి ఉండవచ్చు. ఏది ఏమైనా యువతదే భవిత. అందులో సందేహం లేదు. వారిలో మార్పు వస్తుంది. వాస్తవాలు తెలుసుకుంటారు. గుడ్డు కోడిగా పరివర్తన చెందాలంటే మూడు వారాలు ఆగాల్సిందే కదా.
నాయకులమైన మనం ఓపికగా ఉండాలి. మనం శ్రమించాలి. శ్రమిద్దాం. వారిని మన దారిలోకి తీసుకొద్దాం. పురిటి నొప్పులుంటేనే కదా సుఖ ప్రసవం జరిగేది. వారు చిన్నచిన్నగా మారుతారు. బాధ్యతలు తీసుకుంటారు. అభివృద్ధి చెందుతారు. మన ప్రయత్నం మానకూడదు’ అని హితవు చెప్పారు.
యువత విషయంలో రాజుగారి సూక్ష్మ పరిశీలనకు అధ్యాపక బృందం ఆశ్చర్యపోయి లేచి నిలబడి చప్పట్లు చరిచారు.
శిక్షణ చక్కగా పూర్తి చేసిన యువ బృందాలు నిత్య కళ్యాణం పచ్చతోరణం అయిన శేషాచలంలో ఆడి పాడటంతో బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా ముగిసాయి.

-ఆర్.సి.కృష్ణస్వామి రాజు