S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జలాంతర్యామి

సాగరతీరంలో ఎగసిపడే అలలను చూస్తూంటే మనసు ఉప్పొంగిపోతూంటుంది... హాయిగా.. స్వేచ్ఛగా ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూంటాం.. కానీ ఆ స్వేచ్ఛ, ఆ నిర్భయత్వం మనకు ఎవరివల్ల దక్కుతున్నాయి?
***
ఆ ఎగసిపడే అలల మాటున... గంభీరంగా... నిశ్శబ్దంగా.. పరచుకున్న అనంతసాగర అంతర్భాగంలో తిమింగలంలా.. నీడలా జారిపోతూ... దూసుకుపోతూ... చెవులు రిక్కించి శత్రువుల కదలికలను కనిపెడుతూ.. మనల్ని రక్షిస్తూ... అవసరమైతే ఎదురుదాడికి సిద్ధమయ్యే సబ్‌మెరైన్ వ్యవస్థ...నీళ్లలో నిఘానేత్రం. జలధిలో చాపకింద నీరులా దొంగదెబ్బ తీసేందుకు జొరబడే శత్రుమూకల నిశ్శబ్ద కదలికల అలికిడిని అలవోకగా గుర్తించి వెంటాడి వేటాడే సబ్‌మెరైన్‌లు భారత నావికాదళంలో బలమైన వ్యవస్థ. ఆ వ్యవస్థకు నమ్మకమైన స్థావరం విశాఖ.
***
తిమింగలాల మాదిరిగా నీళ్లపై తేలియాడుతూ చటుక్కున నీటిలోకి మునిగిపోతూ రూపంలో, ప్రయాణంలో, పరాక్రమంలో విభిన్న ఆయుధ వ్యవస్థ సబ్‌మెరైన్. వీటి పరాక్రమాన్ని, వీటి నిర్వహణలో జాగ్రత్తలను, ప్రమాదాలను కళ్లకు కట్టేలా ఎన్నో చలనచిత్రాలు చూసి నివ్వెరపోని, ఆశ్చర్యపోని, గర్వపడని ప్రేక్షకులు తక్కువగానే ఉంటారు. సరే, ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే....

భారత నావికాదళ రక్షణ వ్యవస్థలో సబ్‌మెరైన్‌ల పాత్ర గణనీయంగా పెరుగుతోంది. ‘ఇయర్ ఆఫ్ సబ్‌మెరైన్’గా ఈ ఏడాదిని పాటిస్తున్నారు. మనదేశంలో జలాంతర్గాముల వ్యవస్థకు విశాఖ ప్రధాన కేంద్రంగా వర్థిల్లుతోంది. గడచిన యాభై ఏళ్లుగా ఒక్కో అడుగూ ముందుకు వేస్తోంది. మన సబ్‌మెరైన్‌ల ప్రత్యేకతలు, అందులో పనిచేసే రక్షణ సిబ్బంది పనితీరు, పరిస్థితులను తెలుసుకోవడం ప్రతిఒక్కరికి అవసరం.
మనది శాంతికాముక దేశం. దాయాదులు కాలు దువ్వుతున్నా, చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా, భారత్ మాత్రం సంయమనాన్ని పాటిస్తూ వస్తోంది. ప్రపంచ దేశాలకు స్నేహ హస్తాన్ని అందించాలన్నది భారత్ సంకల్పం. ఎంత సహనంతో ఉన్నా, శత్రు దేశాలు నిరంతరం భారత్‌పైవే చూస్తున్నాయి. ఇటువంటి సమయంలో మనం చేతులు ముడుచుకుని కూర్చుంటే సరిపోదు. అందుకే రక్షణ రంగాన్ని బలోపేతం చేయడానికి భారత్ కూడా అడుగులు ముందుకు వేస్తోంది. సాయుధ పరంగా, సైనిక పరంగా అగ్రరాజ్యాలకు ధీటుగా నిలిచేందుకు భారత దేశం వ్యూహ రచన చేస్తోంది. ఇప్పటికే బ్రహ్మోస్ క్షిపణి శత్రు రాజ్యాలకు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. క్షిపణుల తయారీలో భారత్ కూడా మరే దేశానికి తీసిపోదని అనేక సందర్భాల్లో నిరూపించింది. రక్షణ రంగానికి కావల్సిన ఆయుధాలను, నౌకలను నిన్న మొన్నటి వరకూ రష్యా నుంచి దిగుమతి చేసుకునే మన దేశం, ఇప్పుడు స్వశక్తిపై ఎదగాలని నిర్ణయించింది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రక్షణ రంగంలో ఏదైనా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించాలని ఆదేశించారు. అందుకు కావల్సిన సహకారాన్ని అందించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగ భారీ సంఖ్యలో యుద్ధ నౌకలు జలాంతర్గాములను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయాలని నిర్ణయించారు. ఇందులో ప్రధానమైనది ఐఎస్‌ఎస్ అరిహంత్. అత్యంత శక్తివంతమైన ఈ అణు జలాంతర్గామి ఇప్పుడు భారత రక్షణ రంగంలో కీలక పాత్ర పోషించబోతోంది. కొద్ది కాలం కిందటే సీ ట్రయల్స్ పూర్తి చేసుకుని, రక్షణ రంగంలో సేవలందించేందుకు సిద్ధంగా ఉంది. దీంతో భారత సరిపెట్టుకోలేదు. అరిహంత్ కన్నా మరింత శక్తివంతమైన ఐఎన్‌ఎస్ అరిథమన్‌ను కూడా తయారు చేసింది. ఇది కూడా మరి కొద్ది రోజుల్లో భారత నౌకాదళంలో చేరబోతోంది. సరిగ్గా 50 సంవత్సరాల కిందట చిన్నపాటి జలాంతర్గాములతో మనదేశంలో ప్రారంభమైన సబ్‌మెరైన్‌ల ప్రస్థానం ఇప్పుడు అణు జలాంతర్గాములతో శత్రు రాజ్యాలకు గుబులు పుట్టిస్తోంది. భారత నౌకాదళం ఈ ఏడాదిని ఇయర్ ఆఫ్ సబ్‌మెరైన్స్‌గా ప్రకటించింది. ఈ సంవత్సరం జలాంతర్గాముల స్వర్ణోత్సవాలను కూడా జరుపుకొంటోంది. భారత రాష్టప్రతి, సర్వ సైన్యాధ్యక్షుడు డిసెంబర్ ఎనిమిదవ తేదీన విశాఖలోని తూర్పు నౌకాదళంలో జరిగే సబ్‌మెరైన్ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొనబోతున్నారు.
సముద్ర గర్భంలో...
సముద్ర ఉపరితలానికి 300 మీటర్ల అడుగున సముద్ర గర్భంలో ప్రయాణం. వారాల తరబడి సూర్యరశ్మిని కూడా చూడలేని వైనం. ప్రతి క్షణం పోరాటం.. అనుక్షణం అప్రమత్తం.. దేశ రక్షణ బాధ్యతను సవాలుగా తీసుకుని, అత్యంత కఠిన పరిస్థితుల్లో విధులు నిర్వర్తించే సైనికుల గురించి చాలా మందికి తెలియదు. సముద్రం అడుగున ప్రయాణిస్తుందని, శుత్రువులను నిశ్శబ్దంగా మట్టుపెడుతుందని అనుకుంటారు. సముద్ర గర్భంలోకి ఒక్కసారి వెళ్లిన తరువాత తిరిగి బయటకు ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి. ఇదీ జలాంతర్గాముల్లోని సైనికుల జీవనశైలి. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసే జలాంతర్గామి నావికులే దేశ రక్షణ రంగంలో నిజమైన హీరోలుగా చెప్పుకోవచ్చు.
జలాంతర్గాముల గురించి సినిమాల్లో చూడ్డం తప్ప, దాని పనితీరు, అందులోని సైనికుల స్థితిగతుల గురించి చాలా మందికి తెలియదు. ఏ దేశ సైనికులైనా ప్రాణాలకు తెగించే సైన్యంలో చేరుతారు. ఆర్మీ, నేవీ, వైమానిక దళాల్లోని సైనికులు యుద్ధ సమయంలో తమ సాహసాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉండదు. కానీ, జలాంతర్గాముల్లో పనిచేసే సైనికుల పరిస్థితి వీరికి భిన్నంగా ఉంటుంది. ఒక్కసారి జలాంతర్గామిలో సముద్ర గర్భంలోకి వెళ్లిన సైనికులు ఇక బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోతారు. వారి కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారో కూడా తెలుసుకోలేని పరిస్థితి ఉంటుంది. హార్బర్ నుంచి బయల్దేరిన జలాంతర్గామి నెల, రెండు నెలలు పూర్తిగా సముద్ర గర్భంలోనే ఉండిపోవలసి వస్తుంది. కనీసం వారికి సూర్యరశ్మి కూడా చూసే అవకాశం ఉండదు. ఇందుకు తగ్గట్టుగా సైనికులు తమను తాము మలుచుకుంటారు. ప్రతీ జలాంతర్గామికి ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేసుకున్న తరువాత కానీ అది బయటకు రాలేదు. అత్యంత భయంకరమైన వాతావరణంలో జలాంతర్గాములు ముందుకు సాగుతుంటాయి.
యుద్ధ విమానాలు, నౌకల్లో అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలు ఉంటాయి. సుదూర ప్రాంతాల్లో ఉన్న శత్రు నౌకలను, విమానాలను పసిగట్టే పరికరాలు అందుబాటులో
ఉంటాయి. ముఖ్యంగా సమాచార వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. కానీ సబ్‌మెరైన్‌లో పనిచేసే సైనికులకు ఇవేవీ అందుబాటులో ఉండవు. కేవలం వీరు చెవులతోనే పనిచేయాల్సి ఉంటుంది. శత్రు దేశాల నౌకలను, లేదా జలాంతర్గాములను మట్టుపెట్టడానికి బయల్దేరిన జలాంతర్గామికి తమ ముందు ఏముందో తెలియదు. దారి పొడవునా మందుపాతరలు ఉంటాయి. వాటి ఉనికిని ముందుగానే గుర్తించి, ముందుకు సాగిపోతుండాలి. శత్రు నౌక ఎంత దూరంలో ఉందన్న విషయాన్ని ఇందులో పనిచేసే సైనికులు సోనార్ (శబ్దం) ద్వారానే తెలుసుకోవాలి. శత్రు దేశానికి చెందిన నౌకల ప్రొఫెల్లర్ శబ్దాన్ని బట్టి ఆ నౌక ఎంత దూరంలో ఉంది, దాని నుంచి తమకేమైనా ఆపద సంభవించబోతోందా? అన్న విషయాన్ని చాలా సున్నితంగా పరిశీలించాలి. ముందుగా జలాంతర్గామికి దగ్గరగా వస్తున్న యుద్ధ నౌకను మట్టుపెట్టడానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. దీనికి చాలా కసరత్తు అవసరం ఉంటుంది. సముద్ర ఉపరితలంపై ఉన్న యుద్ధ నౌకలు, సెన్సార్లతో గాలిలో తిరిగే హెలికాప్టర్లు సేకరించిన సమాచారాన్ని సబ్‌మెరైన్‌లో ఉన్న సిబ్బందికి అందిస్తారు. దాన్ని బట్టి శత్రు దేశాల నౌకపై దాడికి సబ్‌మెరైన్ కెప్టెన్ వ్యూహ రచన చేస్తాడు. శత్రు నౌకను మట్టుపెట్టడానికి జలాంతర్గామిలోని క్షిపణులను కచ్చితంగా ప్రయోగించాలి. ఒక్కసారి గురితప్పితే, ఇక ఈ జలాంతర్గామి శత్రువుల నుంచి తప్పించుకోవడం కష్టమవుతుంది. సముద్ర గర్భంలో ఉన్న శత్రు జలాంతర్గాములను, యుద్ధ నౌకలను 360 డిగ్రీల కోణంలో నిరంతరం పర్యవేక్షిస్తూ, శత్రువుల జాడ కనిపెడుతుంటారు. జలాంతర్గామిలో కమాండింగ్ కంట్రోల్ వ్యవస్థ ఉంటుంది. సబ్‌మెరైన్‌కు సంబంధించిన అన్ని విభాగాలను ఇక్కడి నుంచే నియంత్రిస్తుంటారు. బయట నుంచి సమాచారం ఇక్కడికే అందుతుంది. శత్రు నౌకల సమాచారాన్ని సేకరించడం, దాడుల ప్రణాళికను ఇక్కడే అమలు చేస్తారు. సాధారణంగా జలాంతర్గామి సముద్రగర్భంలో 250 నుంచి 300 మీటర్ల అడుగున ప్రయాణిస్తుంది. అప్పుడప్పుడు బయటకు వచ్చి పెరిస్కోప్ ద్వారా సముద్ర ఉపరితలాన్ని పరికిస్తుంటారు.
సముద్ర గర్భంలో ఉన్న జలాంతర్గాములను, ఉపరితలంపై ఉన్న యుద్ధ నౌకలనే కాదు, సముద్ర గర్భం నుంచి భూతలంపై ఉన్న శుత్రు శిబిరాలను కూడా నాశనం చేయగల శక్తి ఉంటుంది. సముద్ర గర్భంలో నిశ్శబ్దంగా ప్రయాణిస్తూ, శత్రు మూకల పీచమణచడానికి ఉపయోగపడేది కేవలం జలాంతర్గామి మాత్రమే. అందుకే ఇప్పుడు అన్ని దేశాలూ జలాంతర్గాముల ప్రాధాన్యతను గుర్తించి, పెద్ద ఎత్తున వాటిని తయారు చేస్తున్నాయి.
ఇది మరో ప్రపంచం
బయటకు సాదాసీదాగా కనిపించే జలాంతర్గామిలో మరో ప్రపంచమే ఉంటుంది. సంక్లిష్టమైన సాంకేతిక వ్యవస్థ ఇందులో ఉంటుంది. సబ్‌మెరైన్‌లో ప్రవేశమే చాలా క్లిష్టం. అందులో గడపడం మరింత కష్టం. మూడు మార్గాలు ఉంటాయి. ముందు, వెనుక మార్గాలతోపాటు, ప్రమాద సమయాల్లో తప్పించుకునేందుకు ఒకే ఒక్క మార్గం ఉంటుంది. యుద్ధ సమయాల్లో పరిస్థితి గంభీరంగా మారిపోతుంది. సోనార్ వ్యవస్థ మాత్రమే పనిచేస్తుంది. ప్యాకేజి ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. ఒక సబ్‌మెరైన్‌లో 100 నుంచి 120 మంది వరకూ పనిచేస్తారు. ఇందులో ఒక్క కెప్టెన్‌కు మినహా మిగిలిన అధికారులకు కానీ, సిబ్బందికి కానీ క్యాబిన్‌లు ఉండవు. యంత్రాల మధ్య సర్దుకుని పడుకోవాలి. ఒక్కోసారి క్షిపణుల మధ్యే కునుకు తీయాల్సి ఉంటుంది. జలాంతర్గామిలో ఏసి ఉండదు. ముఖ్యంగా ఇంజన్, క్షిపణులు ఉన్న క్యాబిన్‌లలో వేడి ఎక్కువగా ఉంటుంది. దాన్ని తట్టుకుని పనిచేయడం తప్ప, వీరికి వేరే మార్గం లేదు. మూడు దశల్లో 18 గంటల చొప్పున పనిచేస్తుంటారు. చాలా సందర్భాల్లో వీరు నిద్రపోయే పరిస్థితి కూడా ఉండదు. కేవలం రెండు, మూడు గంటలు మాత్రమే నిద్రపోయే పరిస్థితులు ఉంటాయి. ఇందులో కేవలం రెండు టాయిలెట్స్ మాత్రమే ఉంటాయి. వీరంతా వీటిని మాత్రమే ఉపయోగించుకుని కాలకృత్యాలు తీర్చుకోవలసి ఉంటుంది. ఒక్కసారి స్నానం చేసి జలాంతర్గామిలో ప్రయాణం ప్రారంభించిన సైనికులు తిరిగి ఉపరితలం మీదకు వచ్చే వరకూ స్నానం చేసే పరిస్థితులు ఉండవు, ఎందుకంటే జలాంతర్గామిలో నీరు చాలా తక్కువగా ఉంటుంది. వీరంతా యూజ్ అండ్ త్రో బట్టలను మాత్రమే వినియోగిస్తుంటారు. రెండు, మూడు రోజులు వాడిన తరువాత ఆ బట్టలను పారేయాల్సిందే. ఇందులో ఒక డైనింగ్ హాల్ ఉంటుంది. ఒక్కోసారి ఈ డైనింగ్ టేబులే ఆపరేషన్ థియేటర్‌గా కూడా మారిపోతుంటుంది. యంత్రపరికరాల శబ్దం, అత్యంత ప్రమాదకరమైన క్షిపణుల మధ్య వీరి ప్రయాణం సాగుతుంది. నౌకాదళంలోని మిగిలిన సైనికులకు, జలాంతర్గామిలో పనిచేసే సైనికులకు శిక్షణలో కూడా తేడా ఉంటుంది. వీరిది కఠోర శిక్షణ. నిరంతరం ప్రమాదాల మధ్యనే జీవనం సాగించాలి. ప్రాణం మీద తీపి ఉండకూడదు. దేశభక్తి, అంకిత భావం, గుండె ధైర్యం ఉండే జలాంతర్గామి సైనికులు నిజమైన హీరోలు. వారి ఛాతిమీద ఉండే సబ్‌మెరైన్ బ్యాడ్జి చూసుకుంటూ వారు నిరంతరం ఉత్తేజాన్ని పొందుతుంటారు.
కోవింద్ చేతుల మీదుగా..
భారత రక్షణ రంగంలో విశేష ప్రతిభా పాటవాలు చూపిన విభాగాలకు భారత సర్వ సైన్యాధ్యక్షుడు, రాష్టప్రతి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కలర్స్ (ప్రత్యేక పతాకం)ను బహుమతిగా ఇస్తుంటారు. నౌకాదళంలో జలాంతర్గాముల సేవలను అభినందిస్తూ భారత రాష్టత్రి రాజ్‌నాథ్ కోవింద్ ఈ ఏడాది డిసెంబర్ ఎనిమిదవ తేదీన విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలో జరగనున్న ఓ కార్యక్రమంలో జలాంతర్గాముల విభాగానికి ఈ కలర్స్ బహుకరించనున్నారు. భారత జలాంతర్గాముల ప్రస్థానంలో ఇది ఒక ప్రధాన ఘట్టంగా పేర్కొన వచ్చు.
విశాఖలోనే శిక్షణ
భారత నౌకాదళానికి చెందిన జలాంతర్గాముల్లో పనిచేసే సైనికులకు విశాఖలోని ఐఎన్‌ఎస్ శాతవాహనలో శిక్షణ ఇస్తుంటారు. ఈ శిక్షణ కేంద్ర సబ్‌మెరైన్ హెడ్‌క్వార్టర్స్ ఐఎన్‌ఎస్ వీరబాహు (్ఫ్లగ్ ఆఫీసర్స్ సబ్‌మెరైన్)కు అనుంబంధంగా పనిచేస్తోంది. ఐఎన్‌ఎస్ వీరబాహును 1971 మే 19న విశాఖలో ప్రారంభించారు. దీన్ని ఎనిమిదవ సబ్‌మెరైన్ స్క్వ్రాడ్రన్ జలాంతర్గామి సైనికుల శిక్షణ కోసం ప్రారంభించారు. కమాండింగ్ ఆఫీసర్ నేతృత్వంలో వీరబాహు పనిచేస్తోంది. సింధుఘోష్ జలాంతర్గామి నౌకాదళంలో ప్రవేశించిన తరువాత ఇక్కడే 11వ సబ్‌మెరైన్ స్క్వ్రాడ్రన్ ఆవిర్భవించింది. దీంతో 1990లో ఐఎన్‌ఎస్ వీరబాహు స్థాయి పెరిగింది. సబ్‌మెరైన్ సైనికులకు శిక్షణ, నిర్వహణ, వౌలిక సదుపాయల కల్పన, పాలనా వ్యవహారాలు చూసుకునేందుకు వీరబాహును ఏర్పాటు చేశారు. దీనికి అనుబంధంగా పనిచేస్తున్న శాతవాహనలో సబ్‌మెరైన్ నావికుల కోసం అత్యాధునిక సామగ్రిని అందుబాటులో ఉంచారు.
‘మన’ అరిహంత్
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అణు జలాంతర్గాని అరిహంత్ ఇప్పుడు భారత అమ్ములపొదిలో చేరింది. ఒక్క మాటలో చెప్పాలంటే, భారత అమ్ముల పొదిలో అరిహంత్ పాశుపతాస్తమ్రే. శత్రువుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న అరిహంత్ సీ ట్రయల్స్ పూర్తి చేసుకుని రక్షణ రంగంలో సేవలో ఉంది. ఈ జలాంతర్గామిని స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి, ప్రపంచ దేశాల్లో భారత్ తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. ఆరువేల టన్నుల 83 మెగా వాట్ల ప్రెషరైజ్డ్ లైట్‌వాటర్ రియాక్టర్‌తో పనిచేస్తుంది. అలాగే అణు విస్పోటనం కలిగించే సబ్‌మెరైన్ లాంచర్ బాలిస్టిక్ మిసైల్‌ను ప్రయోగించే సామర్థ్యం దీనికి ఉంది. 700 నుంచి 3500 కిలో మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను చేధించగల అగ్ని-3 బాలిస్టిక్ మిసైల్‌ను అరిహంత్‌లో అమర్చనున్నారు. శుత్రు నౌకలను, జలాంతర్గాములను ధ్వంసం చేయగల భారీ టార్పిడోలను ఇందులో అమర్చారు. అరిహంత్ ముందు ఐఎన్‌ఎస్ చక్ర లైట్ వాటర్ అణు జలాంతర్గామి భారత నౌకాదళానికి సేవలందిస్తోంది. అకుల్-2 తరగతికి చెందిన ఈ సబ్‌మెరైన్‌లో అణ్వాయుధాలను మోహరించే అవకాశం లేదు. అరిహంత్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే వరకు చక్ర సేవలను వినియోగించుకున్నారు.
జలాంతర్గాముల ఆవిర్భావం ఇలా...
జలాంతర్గాములను మొట్టమొదటిసారిగా 1914-18 మధ్య జరిగిన ప్రపంచ యుద్ధంలో వినియోగించారు. సముద్ర గర్భం నుంచి సముద్ర ఉపరితలం, భూతలంపై ఉన్న శత్రు నౌకలను, శిబిరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేయగలిగే ఏకైక వాహనం జలాంతర్గామి మాత్రమే. భారీ క్షిపణులను మోసుకువెళ్లి, శత్రువుల కంట పడకుండా తప్పించుకని, లక్ష్యాలను చేధించే విధంగా జలాంతర్గాములను రూపొందించారు. 1578, 1596, 1620 సంవత్సరాల్లో చరిత్రకారులు ఈ జలాంతర్గాముల గురించి తమతమ గ్రంథాల్లో కొంత సమాచారం ఇచ్చారు. 18వ శతాబ్దం మధ్యంలో ఇంగ్లండ్ దేశం సబ్‌మెర్జ్‌బుల్ జలాంతర్గామికి పేటెంట్ తీసుకుంది. 1747లో నతానియేల్ సైమన్స్ సబ్‌మెర్షన్ కోసం ఓ బాలిస్టిక్ ట్యాంక్‌ను ఉపయోగించి సబ్‌మెరైన్ రూపొందించాడు. ఆ తరువాత సబ్‌మెరైన్‌ల రూపకల్పనలో అనేక ప్రయోగాలు జరిగాయి. ఇవి పూర్తి స్థాయిలో ఫలితాలను అందించలేకపోయాయి. అనేక మార్పులు, చేర్పులు తరువాత 1775లో మొట్టమొదటి సైనిక జలాంతర్గామి అందుబాటులోకి వచ్చింది. అమెరికాకు చెందిన డేవిడ్ బుష్నిల్ దీన్ని తయారు చేశాడు.
19 శతాబ్దానికి ముందు జలాంతర్గాముల తరహాలో కొన్ని వాహనాలను అప్పటి అవసరాల కోసం నిర్మించారు. అవి పూర్తిగా నీటిలో మునగకుండా (సబ్‌మెర్జ్)గా పనిచేసేవి. కొన్ని తెరచాపతో నడిచేవి. 19వ శతాబ్దంలో ఈ సబ్‌మెరైన్‌లకు సంబంధించిన డిజైన్లు బయటపడ్డాయి. వాటినే ప్రపంచంలోని అనేక దేశాలు దత్తత తీసుకున్నాయి.
1800 సంవత్సరంలో ఫ్రాన్స్ అమెరికన్ రాబర్ట్ పుల్టన్ మానవశక్తితో నడిచే జలాంతర్గామిని తయారు చేశాడు. 1804లో ఇది జల ప్రవేశం చేసింది. 1864లో అమెరికన్ సివిల్ వార్ చివరిలో కాన్ఫడరేట్ నౌకాదళానికి చెందిన హెచ్‌ఎల్ హన్లీ యూనియన్ స్లోప్ ఆఫ్ వార్ యుఎస్‌ఎస్ హౌసాటానిక్‌ను మట్టుపెట్టిది. ఈ ఓడను ముంచేసిన తరువాత హన్లీ కూడా నీట మునిగిపోయింది. ఈ జలాంతర్గామిలో భారీ విస్ఫోటనం జరగడం వలనే ఇది పేలిపోయిందని తేల్చారు.
1866లో సబ్‌మెరైన్ ఎక్స్‌పోజర్ మొదలైంది. జర్మన్ అమెరికన్ జులియస్ హెచ్ క్రోహిల్ రూపొందించిన జలాంతర్గామిలో అమలు చేసిన పరిజ్ఞానం ఇప్పటికీ అనేక దేశాలు తయారు చేస్తున్న జలాంతార్గాములలో వినియోగించుకున్నాయి. ఆ తరువాత కాలంలో జలాంతర్గాములపై అనేక ప్రయోగాలు జరిగాయి.
కేవలం యాంత్రికంగా పనిచేసే జలాంతర్గాములు మొదటి ప్రపంచ యుద్ధంలో సైనిక జలాంతర్గాములు అందుబాటులోకి వచ్చాయి. రెండో ప్రపంచ యుద్ధం నాటికి జలాంతర్గాముల ప్రాధాన్యత పెరిగింది. జర్మనీ జలాంతర్గాములు అట్లాంటిక్ యద్ధంలో అనేక నౌకల వినాశనం కోసం ప్రయోగించారు. మంచు గడ్డకట్టే సముద్రాల్లో కూడా అనేక జలాంతర్గాములు పనిచేసిన చరిత్ర ఉంది.
ఇవీ మన జలాంతర్గాములు
ఐఎన్‌ఎస్ అరిథమన్ (బాలిస్టిక్ సబ్‌మెరైన్). ఇది 6000 టన్నుల సామర్థ్యం కలిగి ఉంటుంది. భారత దేశంలో అత్యంత శక్తివంతమైన అణు జలాంతర్గామి ఇది.
* ఐఎన్‌ఎస్ అరిహంత్. ఈ అణు జలాంతర్గామి 2016 ఆగస్ట్‌లో భారత నౌకాదళంలో చేరి సేవలందిస్తోంది.
* ఐఎన్‌ఎస్ చక్ర (అతుల్ క్లాస్-2) 12,770 టన్నుల సామర్థ్యం కలిగిన ఈ సబ్‌మెరైన్ 2012లో రష్యా నుంచి 10 ఏళ్లపాటు లీజుకు తెచ్చుకున్నాం.
* కల్వరి క్లాస్‌కు చెందిన 1,870 టన్నుల సామర్థ్యం కలిగిన ఐఎన్‌స్ కర్జన్ (ఎస్52, 53, 54,55). ఇవి ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయి. ఇవి 2018-20 మధ్య రక్షణ రంగంలోకి చేరబోతున్నాయి.
అలాగే ఐఎన్‌ఎస్ కల్వరి, ఐఎన్‌ఎస్ ఖందేరి మరి కొద్ది కాలంలో భారత నౌకాదళానికి సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
* సింధుఘోష్ క్లాస్‌కు చెందిన ఎటాక్ సబ్‌మెరైన్స్ ఐఎన్‌ఎస్ సింధుఘోష్, సింధుధ్వజ్, సింధురాజ్, సింధువీర్, సింధురత్న, సింధుకేసరి, సింధుకీర్తి, సింధువిజయ్, సింధురాష్ట్ర. ఇవి 3,076 టన్నుల సామర్థ్యం కలిగినవి. ప్రస్తుతం ఇవి భారత నౌకాదళంలో సేవలందిస్తున్నాయి.
* శిశుమార్ క్లాస్‌కు చెందిన అటాక్ సబ్‌మెరైన్‌లు ఐఎన్‌ఎస్ శిశుమార్, సంకుష్, షల్కీ, షంకుల్. ఇవి 1850 టన్నుల సామర్థ్యం కలిగినవి.

-కె.వి.జి.శ్రీనివాస్