S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జనపదుల నోట.. ఆ పాట వినబడదేం?

మనిషికి ఎరుక కల్గినప్పటినుంచే సాహిత్యం వుందని స్థూలంగా చెప్పవచ్చు. సమాజ పరిణామక్రమంలో లిపి ఏర్పడి శిష్ఠ సాహిత్యంగా ఒక పాయగా రూపొందింది. శిష్ఠ సాహిత్యానికి ప్రతిగానే జానపద సాహిత్యం కొనసాగింది. అనేక సామాజిక కారణాలవల్ల ఇవ్వాళ జానపద సాహిత్యం కనుమరుగయ్యే స్థితి ఏర్పడింది. ఉపయోగంలోనే, పుట్టుక, మార్పు, అభివృద్ధి జానపద సాహిత్యానికి ఉంటుంది. జానపద సాహిత్య ప్రక్రియల్ని పాట, కథ, సామెత, పొడుపు కథలుగా చెప్పాలి. వీటిని ఉపయోగించే సమాజం కనుమరుగయ్యే క్రమంలో మనమున్నాం.
జానపద సాహిత్యానికి మాండలిక భాషా వినియోగం ప్రాతిపదిక. రవాణా, మాధ్యమం, విద్యావకాశాలవల్ల ఆధిపత్య సంస్కృతివల్ల మాండలిక భాషా వినియోగం క్రమంగా తగ్గుతూ వస్తూంది. వ్యవహర్తలో ఆధిపత్య వర్గాల భాషా ప్రయోగం ఊపందుకుంటూ వుంది. స్థానిక భాషా వ్యక్తీకరణ పద్ధతుల్ని భాషా రూపాల్ని న్యూనతాభావంతో చూసే స్థితి ఏర్పడింది. ఇరవై ఏళ్ల క్రితం ఇతర ప్రాంతాల్లోకి వచ్చిన కొత్త వ్యక్తి మాట్లాడితే ఏ ప్రాంతం వాడో గుర్తుపట్టగలిగేవాళ్ళం. ఇపుడా అవకాశం లేదు.
జానపద సాహిత్యంలో పాటది సింహభాగం. జానపద సాహిత్యానికి పుట్టినిల్లు గ్రామాలు. గ్రామాల్లో అనేక శుభకార్యాల్లోనూ, పనుల్లోనూ పాట పని జమిలిగా నడిచింది. ముఖ్యంగా శుభకార్యాల్లో పాటలేనిదే ఏ కార్యం కూడా ముందుకు నడవని స్థితి వుంటుంది. ఆ పాటలో ఆశీస్సులు, శుభాకాంక్షలు గొప్ప భవిష్యత్తు ఉండాలనే దీవెనలు పురాణ పాత్రల ఆధారంగా నడిచాయి. శుభకార్యాల్లోని తంతు లక్ష్యం పూర్తిగా కనుమరుగయింది. శుభకార్యాలంటే ముందు పెళ్లే గుర్తుకొస్తుంది. పెళ్లిలో పందిరి, పందిట్లో తలంటులు, కుంకుమ, పసుపు వినియోగం వంటివన్నీ భూస్వామ్య సంస్కృతివే అనుకున్నా అక్కడ వౌఖిక సాహిత్యం చిందులేసింది. భూస్వామ్య పరిస్థితివల్ల పరిపక్వతా జానపద సాహిత్యం కనబడుతుంది. శ్రామిక వర్గాల్లో కూడా ఉన్నత వర్గాలను అనుకరిస్తూ పాటలుండేవని జానపద గేయ సాహిత్య చరిత్ర చెబుతుంది. వాళ్ల ఊహల్లో వుండే నవ దంపతులే సీతారాముడుగానో, పార్వతి శివుడుగానో భావించి పాటలు పాడుకునేవారు. ఇవ్వాళ ఉన్నత వర్గాల్లో కాని, శ్రామిక వర్గాల్లోకాని పెళ్లిపాటలు కనుమరుగవుతున్నాయి. తొందరగా వాడిపోని, సువాసనలిచ్చే టెంకాయపట్టలు, మామిడి తోరణాలు నామమాత్రంగా మిగిలిపోయాయి. పేరంటపు పాటలు మరచి దశాబ్దాలు గడిచిపోతూ వుంది. అలా పందిట్లో పాడుకోవడం న్యూనతగా భావిస్తున్నారు. ఇంటి దగ్గర వధువును కాని, వరుణ్ణి కాని తలంటి నలుగు పెట్టి హారతులిచ్చి, స్నానాలు చేయించి కొత్త బట్టలతో దైవదర్శనం పూర్తయితే కాని వధువుకాని, వరుడు కాని తలంబ్రాలకు సిద్ధమైనట్లు కాదు. ఈ క్రమంలో భిన్న సందర్భాల్లో పేరంటపు పాటలు వుండినట్లు బిరుదురాజు రామరాజు, నేదునూరి గంగాధరంగారు మొదలైన పరిశోధకులు నిరూపించారు. ఈ సాహిత్యమంతా చాలాకాలంనుంచి వుందని మనం పొరపడే అవకాశముంది. వ్యవసాయం అభివృద్ధి చెందినకొద్దీ, వ్యయసాయం ఓ మొగులు పెరిగే కొద్దీ విశ్రాంతి వర్గం బలపడినట్లుగానే ఈ సాహిత్యం బలపడుతూ వచ్చింది. మరిప్పుడు వ్యవసాయం అనేక ఒడిదుడుకులకు, ఆటుపోట్లకు, విధ్వంసానికి గురి అవుతూ వుంది. దీనికి సమాంతరంగా జానపద పాట కూడా ఒడిదుడుకులకు, ఆటుపోట్లకు గురి అవుతూ వస్తూ వుంది. ఇపుడు అన్ని కార్యక్రమాలు కెమెరాలకు ఫోజులివ్వడం, సినీ పాటల డెక్ సంగీతంతో పెళ్లి గడిచిపోతూ వుంది. ఇప్పుడిప్పుడు ఉన్నత వర్గాలు పట్టుచీరలతో కల్యాణ మండపాల్లో సినీ గీతాలకు స్టెప్పులేయడం చూస్తూ వున్నాం. ఈ ఉత్సాహంలో పేరంటాలు, పాటల ప్రసక్తే లేదు. ఈ గ్రామీణ సాంస్కృతిక విచ్ఛిన్నం ఏ రూపంలోకి పరిణమిస్తుందో పరిశోధకులు ఊహించాలి.
ఇక ‘కథ చెబుతాను ఊ కొడతావా?’ అన్న మాటను వెతుక్కోవాల్సి వస్తోంది. కథ చెబితే ఊ కొట్టేవాడు స్కూల్లో ఇచ్చే హోంవర్క్‌తో బండెడు పుస్తకాలు ముందేసుకుని వాటితో కుస్తీ పడుతుంటారు. కథ చెప్పేవాళ్ళకు చెప్పే ఓపిక కాని, తీరిక కాని వుండదు. ఈ ఇద్దరికీ తీరికుంటే పల్లెల్లోనూ ఇద్దరిమధ్యా టీవీ తిష్ట వేసుకుని వుంటుంది. కథన వ్యూహంలో శ్రోతను ఒక భావనా ప్రపంచంలోకి తీసుకువెళ్ళే అవకాశం వుంటుంది. ఆ భావనా ప్రపంచపు కలలో తన భవిష్యత్తును శ్రోత కలగంటాడు. ఈ కలను సాకారం చేసుకునేందుకు, పథకాలు రచించుకునేందుకు ఇతరుల తోడ్పాటుతో ఎదగడానికి అవకాశముంటుంది. ఈ ప్రయోజనాలు- వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడతాయి. రెడీమేడ్ కేకుల్లాంటి పుస్తకాలు రెడీమేడ్ స్వీట్లలాంటివే!
సామెతలు కనుమరుగు కావడం వ్యవహర్త భాషా సౌందర్య వినియోగ దారిద్య్రానికి ప్రతీక. వ్యవహర్త తాను చెప్పదలచుకున్న విషయాన్ని బలంగా వ్యక్తీకరించడానికి సామెతల్ని ఉపయోగిస్తాడు. వ్యవహర్త చైతన్య స్థాయిని బట్టి సామెతల వినియోగం వుంటుంది. ఇదివరకే పరిశోధకులు సామెతల వినియోగాన్ని గురించి చాలా వివరించి ఉన్నారు. సామెతల్లో కూడా గ్రామీణ జీవితం సంస్కృతి, జీవన స్థాయి వంటివాటితో తరతమ భేదాలుంటాయి. సౌందర్యాత్మక వ్యక్తీకరణ గ్రామీణ సంస్కృతికి చిహ్నం. ఆ చిహ్నాలన్నీ వెండితెర, బుల్లితెర ప్రభావంతో మూలబడ్డాయి. భాషా వినియోగ స్థాయి వ్యవహర్త చైతన్య స్థాయిని బట్టి వుంటుంది. ఇతర భాషా వ్యవహర్తల సంపర్కంవల్ల ఆదానప్రదానాలు పెరిగి పదాల వినియోగ పద్ధతి, వాటి సూటిదనపు వ్యక్తీకరణ తగిన సందర్భం ఎన్నుకోవడంలో వ్యవహర్త వెనుకబడ్డాడు. ఈ కారణాలవల్ల సామెతల వినియోగం తరిగింది.
ఒకానొక సందర్భంలో శిష్టులు, జానపదులు సామెతల సమానంగానే వాడుకునేవారు. గ్రామీణ జీవనం ఏ కారణాలవల్ల ధ్వంసమవుతూ వుందో అవే కారణాలు భాషా విధ్వంసానికి కారణాలవుతున్నాయి. ఇందులో అనివార్య సందర్భాలు కూడా ఉన్నాయి.
జానపద సాహిత్యంలో పొడుపు కథలది విశిష్ట భాగం. విరామ సమయాల్లో ఒకరు పొడుపు కథ చెబితే ఎంతమందైనా విప్పడానికి సిద్ధం కావచ్చును. వయోనియమం లేదు. నిరంతరం పొడుపు కథలు సాగుతున్నంతకాలం అక్కడ గుమికూడిన వారంతా అమితోత్సాహంతో వుంటారు. పొడుపు కథలు బుద్ధికి పదునుపెడతాయి. వాటి నిర్మాణం కూడా లయాత్మకంగా వుంటుంది. భాషా సరళత దేశీయత ప్రాంతీయత ముద్రలుంటాయి. హాస్యం, జుగుప్సను కలిగి వుంటాయే కాని వాటి భావన వెగటు పుట్టే స్థాయికి పోవు. అలాగే శృంగారపరమైన పొడుపు కథలున్నా మనసు పాడుచేసే విధంగా మాత్రం వుండవు. ఆలోచనలు పెంచడానికి, బుద్ధి చతురతను పెంచడానికి, మార్మిక భావనలు పెంచడానికి పొడుపు కథలు ఉపకరిస్తాయి. పొడుపు కథల రాత్రుల్లో విరామ విశ్రాంతి వేళల్లోనే కొనసాగుతుంటాయి. ఇవ్వాళ అంత తీరిక కల్గిన సమాజం కనుమరుగవుతూ వుంది. పొడుపు కథలు కేవలం జానపదుల్లోనే కాదు శిష్టులు కూడా పొడుపు కథల్ని పద్యాల్లో రచించారు. శిష్ఠ సాహిత్యంలో సామెతలు కొనసాగినా అవి జానపదుని భావనలు కావు. అలాగే పొడుపు కథలు కూడా పద్యాల్లో రచింపబడినా అవి శిష్ఠ భావనలే, పద్య రచన ప్రభావం తగ్గిన కొద్దీ పద్యాల్లో పొడుపు కథలు కూడా మృగ్యమవుతున్నాయి.
ఈ సందర్భంగా మరో విషయం చెప్పుకోవాలి. తెలుగు భాషా ఉద్యమకారులు శిష్ట సాహిత్యం మూలబడిపోతుందని బాధపడతారేగాని జానపద సాహిత్యాన్ని గురించి మాట్లాడరు. జానపద సాహిత్య విధ్వంసాన్ని, కనుమగరువుతున్న క్రమాన్ని గురించి మాట్లాడాలంటే గ్రామీణ జీవిత విధాన విధ్వంసాన్ని గురించి, దానికి కారణమవుతున్న మార్కెట్ విధానాన్ని గురించి అంతిమంగా ప్రభుత్వ విధానాన్ని గురించి మాట్లాడాల్సి వస్తుంది. క్రమంగా ఈ చర్చ రాజకీయార్థిక విధానాలవైపు వెళుతుంది. ఈ చర్చల్లోకి వెళ్ళడానికి భాషా ఉద్యమకారులకు అవగాహనైనా లేకుండాలి, లేక ఇష్టమైనా లేకుండా ఉండాలి.
నవలల్ని తలపించే సుదీర్ఘమైన కథలు రోజుల తరబడి కొనసాగే కథలు కూడా ఏనాడో కనుమరుగయిపోయాయి. అందులో కథా వస్తువుకంటే కథనం ముఖ్యం. కథ చెప్పేవారి వినేవారి మధ్య వుండే సంబంధం మరీ ముఖ్యం. కథను విసుగురాకుండా, ఆసక్తికరంగా మలుపులు తిప్పుతూ ఒకచోట హాస్యస్ఫోరకంగానూ, మరొకచోట కరుణభయానక వర్ణనలతో చెప్పే తీరు గమనించతగ్గది. ఈ కథన విధానాన్ని నిర్మాణాన్ని భాషాశాస్తవ్రేత్త గొప్పగా, శాస్ర్తియంగా విశే్లషించగలరు.
విద్యాముద్రణా సౌకర్యాలు పెంపొందడంతో వౌఖిక, జానపద సాహిత్యపు అవసరం తీరిందని ఒక వాదన వినిపిస్తుంది. ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో పాట నిర్వహించిన పాత్రను గుర్తుచేసుకోవాలి. వేలాది ప్రజల్ని రాజకీయ చైతన్యవంతుల్ని చేయగలిగింది పాట. వ్యాసాలు, కవిత్వ సంకలనాలు వెలువడినా పాట కలిగించిన సంచలనం ఈ ముద్రణా సాహిత్యం కలిగించలేదు. గొప్ప విద్యావంతులైన మేధావుల ప్రసంగాలు కూడా వౌలిక సాహిత్యంగానే పరిగణించాలి. ముద్రణా సౌకర్యం, కంప్యూటర్ల ద్వారా భాషాంతరీకరణ సౌకర్యాలు అభివృద్ధి చెందినా వౌలికంగా భావవ్యాప్తి ఒకటి జరుగుతూనే వుంటుంది. పరిణామక్రమంలో పురోగమన తిరోగమన అభివృద్ధిలో అవసరాలకు అనుగుణమైన మార్పులు అన్ని రంగాల్లోనూ వున్నట్లే భాషా వినియోగంలోనూ వున్నాయి.
లిఖిత సాహిత్యంలోనూ, వౌఖిక జానపద సాహిత్యంలోనూ సామాజిక చిత్రణ అంశాలుంటాయని డి.డి.కోశాబిం, ఇ.హెచ్.కౌర్ వంటివారు నిరూపించారు. ఈనాడు ఈ సంప్రదాయాన్ని కొనసాగించడానికి ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన అవసరం వుంది.
జానపద సాహిత్యంలో దేశకాలాల్ని అనుసరించి కొత్త అంశాల్ని ఆయా రూపాల్లో జొప్పించి నవ్యత చేకూరుస్తారు. అవిచ్ఛిన్నత జానపద సాహిత్యంలో కొనసాగింపు వుంటుంది. ఆయా కాలాల్లో, సంఘటనలు సాహిత్యంలోకి వచ్చి కొత్తదనాన్ని సమకూర్చుకుంటుంది. శ్రోత నిత్య చైతన్యవంతుడుగా వుంటాడు. వౌఖిక సాహిత్యానికి శిష్ఠుడు జానపదులు ఇద్దరూ సమానులే. జానపద సాహిత్యానికి సందేశమే ప్రధానమవుతుంది. సాహిత్య విలువ ఉద్దేశ్యం కొనసాలంటే జానపద వౌలిక సాహిత్య సంప్రదాయాన్ని కొనసాగాలంటే ప్రణాళికలు రూపొందించుకోవాలి.
*

- కె. నాగేశ్వరాచారి 9441139652