S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తెలంగాణ సంప్రదాయ పద్య విద్య

గుడి కూలును నూయి పూడును
వడి నీటను చెరువు తెగును వనమును ఖిలవౌ
చెడనిది పద్మమొక్కటే
కుడి యెడమల కీర్తిగన్న గువ్వల చెన్నా!
*
గువ్వల చెన్న శతకకారుడు చెప్పిన ఈ పద్యం సప్త సంతానాలలో పద్యానికి ఉన్న స్థానాన్ని వెల్లడిస్తోంది. తెలంగాణలో పద్యం హృద్యమై, అనవద్యమై, ప్రవహించింది. తెలంగాణా మాగాణాన్ని సతత హరితమైన సాహితీ క్షేత్రంగా నిలిపింది. ఈనాడు శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రపంచం పరుగులు తీస్తోంది. భాషా సాహిత్యాలతో ఏం పని అన్న ధోరణి ప్రబలిపోయి, పిల్లలను ఇంజనీర్లనో, డాక్టర్లనో చేయాలన్న తపనతో ఆంగ్ల భాషా వ్యామోహం పెరిగిపోయి తల్లిదండ్రులను కార్పొరేట్ విద్యాసంస్థల వైపు పరుగులు తీయిస్తోంది. కంప్యూటర్లు, అంతర్జాలం, చరవాణి రూపంలో మునివేళ్ల అందుబాటులోకి వచ్చిన సమయంలో, ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగుభాష కొడిగట్టిన దీపం మాదిరిగా మారుతోందని భాషాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్న దశలో ప్రపంచ తెలుగు భాష మహాసభల్ని తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించుకుంటోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అన్నీ తానై ఈ సభలు విజయవంతం చేయడం కోసం కంకణ బద్ధులై పరిశ్రమిస్తున్నారు. గతంలోనూ ప్రపంచ తెలుగు మహాసభలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించారు. వాటికీ, ప్రస్తుతం జరుగబోతున్న సభలకు మధ్య గుణాత్మకమైన వ్యత్యాసం కనిపిస్తోంది. గత పాలకులు మహాసభలను ప్రకటించి, నిధులు కేటాయించి ఊరుకున్నారు. కానీ కేసీఆర్ స్వయంగా సాహిత్యాభిమాని కావడంవల్ల, సాహిత్యాభినివేశం గరిష్ఠ స్థాయిలో ఉండడం మూలంగా ఈ సభలు న భూతో న భవిష్యతి అన్న చందంగా నిర్వహించాలన్న పట్టుదలతో ప్రతి అంశంపైనా ప్రత్యేక శ్రద్ధ చూపుతూ మార్గదర్శనం చేస్తూ ఉండడం విశేషం. చరిత్రలో కవులను ఆదరించిన పాలకులు, స్వయంగా కవులై రాణించిన పాలకులు పలువురు కనిపిస్తారు. ననె్నచోడుడు, బద్ద్భోపాలుడు, గోన బుద్దారెడ్డి, శ్రీకృష్ణదేవరాయలు, ప్రతాపరుద్రుడు, సర్వజ్ఞసింగ భూపాలుడు, రఘునాథ రాయలు తదితర పాలకులు రాజకవులై రాణించిన వైనం మనకు చరిత్రలో కనిపిస్తుంది. ప్రజాస్వామ్య యుగం ప్రారంభమయ్యాక తెలుగు నేలలో అధికారం చేపట్టి ముఖ్యమంత్రులైన వారిలో పి.వి.నరసింహారావు కవిగా, రచయితగా, సాహితీవేత్తగా గణనకెక్కారు. ఆంధ్రుల ఆత్మాభిమానం నినాదంతో గద్దెనెక్కిన ఎన్‌టిఆర్ కవి కాకపోయినా సాహిత్యాభిమానం ఉన్నవారే. తెలంగాణా రాష్ట్రం అవతరించాక తొలి ముఖ్యమంత్రిగా పాలనా బాధ్యతలు చేపట్టిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలుగు సాహిత్యాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినవారే. విద్యార్థి దశలో వీరు కొన్ని కంద పద్యాలు రాశారు కూడా. చంద్రబాబు ప్రభుత్వంలో రవాణా శాఖా మంత్రిగా పని చేస్తూ, తెలుగుదేశం ప్రచార బాధ్యతలు నిర్వహించిన సమయంలో కొన్ని పాటలకు స్వయంగా రూపకల్పన చేశారు. ఉద్యమ సమయంలోనూ ఉద్యమగీతాలు తాను రచించడంతోపాటు పలువురు కవులకు సూచనలు చేసి గీత రచన చేయించారు.
తెలంగాణ కవులు, సాహితీవేత్తలకు చరిత్రలో సముచిత స్థానం లభించలేదన్న భావన ఉద్యమకాలంలో ఈ ప్రాంత సాహితీవేత్తలలో బలంగా వినిపించింది. ఇప్పుడు తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక, తెలంగాణ సాధించిన ఉద్యమనేత నేతృత్వం వహిస్తున్న ప్రభుత్వ ఆధ్వర్యంలో సభలు జరుగనున్నాయి. అందుకే ఈ సభలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దేశ విదేశాల్లో స్థిరపడిన సాహితీవేత్తలను ఆహ్వానించి తెలుగు సాహితీ వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పనున్న తరుణంలో తెలుగు భాషకు పుట్టినిల్లయిన తెలంగాణ ప్రాంతంలో గత వెయ్యేళ్లుగా పరిఢవిల్లిన సాహిత్య సంపదను పునర్మూల్యాంకనం చేసుకోవడం అవసరం.
తేరా పలకా బలపము
ఈరా అయవారికిపుడు యింపలరంగా
పోరా ప్రొద్దున లేచియు
రారా భోజన వేళకు రాజకుమారా! వంటి చాటు పద్యాలను నిన్న మొన్నటి తరం వరకు పసిపిల్లలకు ఉగ్గుపాలతో రంగరించి పోశారు. నిజాం పరిపాలనా కాలంలో తెలుగు భాషా సాహిత్యాలు ఆదరణకు నోచుకోని సమయంలో సైతం వీధి బడులలో రామాయణ, భారతేతిహాసాల్లోని ఘట్టాలు, శతక పద్యాలు, వామన చరిత్ర, రుక్మిణీ కల్యాణం, ప్రహ్లాద చరిత్ర, కుచేలోపాఖ్యానం వంటి పోతన భాగవత కథలను కంఠస్థం చేయించేవారు.
ఈనాటికీ గ్రామాల్లోని వృద్ధులు వీధిబడుల్లో తమ విద్యాభ్యాస రీతుల్ని కథలు కథలుగా చెప్తుంటారు. ప్రాచీన కావ్యాల్లోని పద్యాలను గొంతెత్తి పాడుతుంటారు. స్వయంగా కేసీఆర్ కూడా తాను బడిలో చదివిన మహాభారత పద్యాల్ని పలు సభల్లో ప్రస్తావించి సాహిత్యాధ్యయనం తనలో కలిగిన స్ఫూర్తిని వివరించడం తెలిసిందే. సమకాలీన రాజకీయాలలో చెప్పదలుచుకున్న అంశాన్ని సూటిగా శ్రోతల మనస్సులకు హత్తుకునే విధంగా ఉపన్యసించడంలో కేసీఆర్ తర్వాతే ఎవరి పేరైనా చెప్పుకోవాలనడం అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. నిరంతర పుస్తక పఠనం, సంప్రదాయ సాహిత్య అధ్యయనం ఆయనను అంతటి వక్తగా తీర్చిదిద్దింది. ఆయన ఉపన్యాసాలలో ప్రాచీన కావ్యాలు, చాటువులు, శతక పద్యాలు తరచుగా ఉపయోగించడం లోకవిదితమే. తెలుగు భాషా సాహిత్యాలతో ఇంతటి తాదాత్మ్య స్థితి ఉండడం వల్లనే భాషాభివృద్ధికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. తెలుగుకు పూర్వ వైభవం తెచ్చే దిశగా, తెలంగాణ సాహితీ వైభవం ప్రపంచం ఎదుట ఆవిష్కృతమయ్యే విధంగా సభలు నిర్వహించడంతోపాటు జూనియర్ కళాశాల స్థాయి వరకు తెలుగు బోధనను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించింది. తెలంగాణ ఆవిర్భవించాక ప్రతి ఏటా ఆవిర్భావ దినోత్సవాలలోనూ, ఉగాది పర్వదిన వేడుకలలోనూ ఇతోధికంగా తెలంగాణ కవులు, పండితులను సత్కరించుకోవడం చూస్తూనే ఉన్నాం.
తెలుగు పద్యానికి జన్మభూమి తెలంగాణ
ఇప్పుడు ప్రపంచ తెలుగు మహాసభలు ఎందుకు అన్న ప్రశ్న రావడం సహజం. తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించాక వివిధ రంగాలలో పునర్నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైంది. కోటి ఎకరాలకు నీరందించాలన్న ప్రాజెక్టుల నిర్మాణం శర వేగంగా సాగుతోంది. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. ఇదే క్రమంలో రెండు వేల సంవత్సరాలుగా తెలంగాణాలో పరిఢవిల్లిన సాహిత్యాన్ని పునస్సమీక్షించుకుని తెలంగాణ సాహిత్య చరిత్రను నిర్మించుకోవలసి ఉంది. సమగ్రమైన తెలంగాణా నిఘంటువును నిర్మించుకోవలసి ఉంది. ప్రపంచానికి తెలంగాణ సాహిత్య వైభవం చాటి చెప్పడంతోపాటు పునర్నిర్మాణానికి తగిన స్ఫూర్తినిచ్చి కవులను, సాహితీవేత్తలను సమాయత్తం చేయడం కోసమే ఈ సభలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా సిఎం కేసీఆర్ చేసిన ప్రసంగం ద్వారా ప్రపంచానికి అర్థమైంది. ఆత్మ విస్మృతి నందిన తెలంగాణా ప్రాంతానికి గత సాహిత్య వైభవం ఇప్పుడు మళ్లీ కళ్ల ముందు సాక్షాత్కరిస్తోంది. నన్నయ మహాభారతంకన్నా ముందే తెలంగాణా ప్రాంతంలో గద్య, పద్య మిశ్రీతమైన చంపూ శైలి తెలంగాణా శాసనాల్లో కనిపించడం తెలుగు పద్యం ఇక్కడే పుట్టిందనడానికి ప్రబల సాక్ష్యమని ఆధునిక భాషావేత్తలు విశ్వసిస్తున్నారు. తెలంగాణాను తొలుత పరిపాలించిన శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు ప్రాకృత, సంస్కృత భాషలో శాసనాలు వేయించగా, నన్నయకన్నా ముందే తెలంగాణాలో కావ్య రచన జరిగి ఉంటుందన్న భావనకు ఆస్కారమిచ్చే మూడు శాసనాలు తెలంగాణాలో కనిపిస్తున్నాయి. ముదిగొండ చాళుక్య రాజు నిరవద్యుడు క్రీ.శ.935లో కొరవిలో వేయించిన శాసనం, క్రీ.శ.945లో జినవల్లభుడు వేయించిన కుర్క్యాల శాసనం, క్రీ.శ.1000 వ సంవత్సరానికి చెందిన విరియాల కామసాని వేయించిన గూడురు శాసనం. వీటిలో నిరవద్యుడు వేయించిన శాసనం గద్యంలో, కావ్య అవతారికల్లో కనిపించే శైలిలో ఉండగా, జినవల్లభుని కుర్క్యాల శాసనంలో మూడు కంద పద్యాలున్నాయి. విరియాల కామసాని గూడూరు శాసనంలో మూడు చంపకమాలలు, రెండు ఉత్పల మాలలు చక్కటి ఆలంకారిక శైలిలో ఉన్నాయి. క్రీ.శ.848లో అద్దంకిలో పండరంగడు వేయించిన శాసనం తరువోజ చందస్సులో ఉన్న మొదటి పద్య శాసనం కాగా, కందుకూరులో వేయించిన శాసనంలో సీస పద్యం కనిపిస్తున్నాయి. అయితే కావ్య శైలికి దగ్గరగా ఉన్న తెలంగాణా ప్రాంత శాసనాలు నన్నయకన్నా శతాబ్దికి పూర్వమే ఈ ప్రాంతంలో కావ్య రచన జరిగి ఉంటుందనడానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
క్రీ.శ.850 - 1000 జైన కవులు తెలుగు కావ్యాలు రచించారని నిడదవోలు వెంకటరావు తమ ప్రబంధ రత్నావళి పీఠికలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కవి జనాశ్రయ కర్త వేములవాడ భీమకవి నన్నయకన్నా పూర్వమే కావ్య రచన చేశాడన్న వాదమూ ఉన్నది. ‘వచియింటు వేములవాడ భీమన భంగి ఉద్దండలీల నొక్కొక్క మాటు’ అని శ్రీనాథుడిచే నన్నయ కన్నా ముందే పూర్వకవి స్తుతిలో పేర్కొనడం, అప్పకవి, వార్తాక రాఘవయ్య, కొరవి గోపరాజు, మొల్ల, పింగళి సూరన, చిత్రకవి పెద్దన వంటి పూర్వకవులు వేములవాడ భీమకవిని ప్రస్తుతించారు. తెలుగులో కవి జీవితములు రచించిన గురజాడ శ్రీరామమూర్తి భీమనతోనే కవుల జీవితాన్ని ప్రారంభించాడు. ఈయన రచనలుగా ప్రచారంలో ఉన్న రాఘవ పాండవీయం, నృసింహ పురాణం, హరవిలాసం, శతకంధర రామాయణం వంటి కృతులేవీ లభించక పోవడం దురదృష్టం. బద్దెన రచనగా ప్రచారంలో ఉన్న సుమతీ శతకం కంద పద్యాల్లో ఉండడం, కుర్క్యాల శాసనం కూడా కంద పద్యాలలోనే ఉండటంతోపాటు కామదం రాసిన వాడే కవి అన్న లోకోక్తి ఉండడం కందానికి పుట్టినిల్లు తెలంగాణాయే అని భావించడానికి వీలు కల్పిస్తోంది. తొలి తెలుగు శతకం వృషాధిపత శతకం. తొలి ఉదాహరణ కావ్యం, శివతత్వసారం రచించిన మల్లికార్జున పండితుడు. తొలి స్వతంత్ర ద్విపద కావ్యం రచించిన పాల్కురికి సోమన, భారతీయ సాహిత్యంలో అత్యంత ప్రధానమైనవిగా భావించిన భారత, భాగవత, రామాయణాల్లో
బమ్మెర పోతన భాగవతం, భాస్కర రామాయణ కవులు హుళక్కి భాస్కరుడు, మల్లికార్జునభట్టు, కుమార రుద్రదేవుడు రంగనాథ రామాయణ కర్త గోన బుద్ధారెడ్డి రామాయణ గాథను రచించగా, మారన మార్కండేయ పురాణాన్ని అనువదించి తొలి తెలుగు పురాణకర్తగా నిలిచారు. కొరవి గోపరాజు, సారంగు తమ్మయ్య, అంబికా శతకకర్త రావిపాటి త్రిపురాంతకుడు అదే కోవలో సంప్రదాయ పద్య విద్యకు పట్టంగట్టారు. జైమిని భారతం, శృంగార శాకుంతలం కావ్యాలను రచించి వాణి నా రాణి అని ప్రకటించుకున్న పిల్లలమర్రి పినవీరన, రేచర్ల ప్రభువు అనపోత నాయుని ఆస్థాన కవి విష్ణు పురాణకర్త పశుపతి నాగనాథుడు, నవనాథ చరిత్ర, హరిశ్చంద్రోపాఖ్యానం వంటి ద్విపద కావ్యాలు రచించిన గౌరన, సకల నీతిసమ్మతం, కామందకం, పంచతంత్రం, నీటి తారావళి వంటి కృతులు వెలయించి కుకవులు చెప్పిన కవితా నికరములు జలాక్షరముల వంటివని, సుకవులు చెప్పిన కవితా నికరములు శిలాక్షరములని లోకానికి చాటిన మదికి సింగన శ్రీరంగాతత్వం వంటి ప్రౌఢ ప్రబంధంతోపాటు రత్న శాస్త్రం, కవిగజాకుశం రచించి చిత్ర కవితా విన్యాసాలు రచించిన భైరవకవి, ఇభారాముడిగా పేరొందిన ఇబ్రహీం కులీ కుతుబ్‌షాహీ కాలంలో వర్థిల్లిన అద్దంకి గంగాధరుడు, మరింగంటి సింగరాచార్యులు, కందుకూరి రుద్రకవి (నిరంకుశోపాఖ్యానమనే కావ్యం, సుగ్రేవ విజయ యక్షగానం రచించిన కవి) తెలంగాణా పద్యానికి వనె్నలద్దిన మహనీయులు. సాహితీ లోకానికి అప్పకవీయం అందించిన పాలమూరు ముద్దుబిడ్డ కాకునూరు అప్పకవి, అచ్చ తెనుగు కావ్యం యయాతి చరిత్ర రచించిన పొన్నగంటి తెలుగన్న, చరిగొండ ధర్మన్న, కామినేని మల్లారెడ్డి, సురభి మాధవరాయలు, కంచెర్ల గోపన్న (రామదాసు - దాశరథి శతకకర్త) పెద సోమభూపాలుడు, కానాడం పెద్దన సోమయాజి, చినసోమ భూపాలుడు, పరశురామ పంతుల లింగమూర్తి తదితర ప్రాచీన అర్వాచీన కవులు తెలుగు భారతి కంఠసీమను పద్య మాలలతో అలంకరించి తరించారు.
ఆధునిక యుగంలో సురవరం ప్రతాపరెడ్డి, కాపుబిడ్డ రచయితా గంగుల సాయిరెడ్డి, పద్య కవిత్వంతో నిజాం వ్యతిరేక పోరాటాన్ని ఉర్రూతలూగించి, అభ్యుదయ భావాత్వివిష్కరణకు పద్యాన్ని బలమైన ఆయుధంగా మలుచుకున్న దాశరథి, పోతన చరిత్రాన్ని రచించిన వానమామలై వరదాచార్యులు, వేముగంటి నరసింహాచార్యులు, కోవెల సుప్రసన్న, అవధాన సరస్వతిని అర్చించిన శతావధాని విఠాల చంద్రవౌళి శాస్ర్తీ, కోరుట్ల కృష్ణమాచార్యులు, గౌరీభట్ల రఘురాము శాస్ర్తీ, ద్వ్యర్థి కావ్య రచయితా అవధాని గౌరీభట్ల రామకృష్ణకవి, గుమ్మనగారి లక్ష్మీనరసింహశర్మ, అయాచితం నటేశ్వర శర్మ, రంగనాథ వాచస్పతి, అందే వెంకటరాజం, కిషన్‌రావు, అవధాన వేదికల ద్వారా ఆర్జించిన సన్మాన ద్రవ్యంతో అనంతసాగర్‌లో సరస్వతీ ఆలయం నిర్మించిన అష్టకాల నరసింహ రామశర్మ (పురుషోత్తముడు, తుకారామస్వామి, శ్రీరామచంద్రిక వంటి ప్రౌఢ కావ్యాల నందించారు.) శతావధాని జి.ఎం.రామశర్మ, శాస్త్రుల రఘురామశర్మ, ప్యారకభ శేషాచార్యులు, బెజుగామ రామమూర్తి ఇలా ఎందరో మహానుభావులు తెలంగాణకు చెందిన ఆధునిక కవులు పద్య ప్రసూనాలతో అక్షరార్చన గావిస్తున్నారు.
నెట్టింట్లో పద్య పరీమళం... ఇటీవలి కాలంలో సెల్‌ఫోన్ వాడకం పెరిగాక ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలలో ప్రత్యేక సమూహాలను ఏర్పరచుకుని పద్యప్రియులు పద్య రచన చేస్తున్నారు. చందస్సు, పద్యాల సవ్వడి, ప్రజా పద్యం, పద్యారాధన, రమణీయ పద్యారామం, పద్యామృతం వంటి సమూహాలు సృష్టించుకుని పద్య విద్యను ఆరాధిస్తూ, పద్య రచన గావిస్తూ రాణిస్తున్నారు. వీరిలో కొందరు చిత్ర, బంధ, గర్భ కవితా రీతులను ప్రదర్శిస్తూ తమ వైదుష్యాన్నీ, తెలంగాణా పద్య వైభవాన్నీ చాటుతున్నారు.
ఈనాటికీ తెలంగాణా ప్రాంతంలో రోజూ ఏదో ఒకచోట శతకమో, పద్య కావ్యమో, పద్య కవితా సంకలన ఆవిష్కరణమో, అష్టావధానమో జరుగుతూనే ఉంది. మరుగున పడిన ప్రాచీన, అర్వాచీన కవులతోపాటు, ఎంతో ప్రతిభ ఉన్నా ఇన్నాళ్లు సరైన గుర్తింపు పోమడలేక పోతున్న సమకాలీన కవులకూ ప్రపంచ తెలుగు మహాసభలు వెలుగునివ్వాలని, వెలుగునిస్తాయనీ భావిద్దాం.
*

చిత్రాలు..*వేములవాడ భీమకవి
*జినవల్లభుని శాసనం

-డా.చెప్పెల హరినాథశర్మ 9363460399