S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తొలితరం తెలంగాణ కథానిక

1910లో ‘ఆంధ్రభారతి’ అనే మాసపత్రిక ప్రారంభమైంది. సంపాదకులంటూ ప్రత్యేకంగా ప్రచురించని ఈ పత్రికలో ఒక పుటలో లేఖకులంటూ రచయితల చిట్టాని, పోషకులు అంటూ పత్రిక ప్రచురణకు తోడ్పడిన దాతల చిట్టా - ప్రతీ సంచికలో విడవకుండా ముందు పుటలుగా ప్రచురించారు.
ఆధునిక సాహిత్యానికి ఈ పత్రిక పెద్దపీట వేసింది. అందుకే 1910 ఫిబ్రవరి సంచికలో తనని తాను దిద్దుబాటు చేసుకుని సరళ గ్రాంథికం నుంచి మాట్లాడే భాషలోకి తిరగరాసిన గురజాడ ‘దిద్దుబాటు’, 1912లో తెలంగాణా ప్రాంతం నుంచి వచ్చిన మొదటి ఆధునిక కథ... కథానిక ‘హృదయశల్యం’, మాడపాటి హనుమంతరావు రాసినది ప్రచురితమయ్యాయి.
అంతకుముందు ఎన్నో కథలు వచ్చాయి. వాటిని మనం పరిగణనలోకి తీసుకోవడం లేదు. కథ - భాషాపరంగా, వస్తుపరంగా - శిల్పపరంగా - ఆధునీకరింపబడడంతో ‘కథానిక’ అనే పరిపూర్ణ వచన ప్రక్రియగా మారింది. అప్పట్నుంచీ వచ్చిన కథానికల్నే మనం పరిశీలిస్తున్నాం.
‘ఆంధ్రభారతి’లోనే జులై సంచికలో మాడపాటి హనుమంతరావు మరో కథానిక ‘నేనే’ ప్రచురితమైంది. అది సంస్కరణోద్యమ కాలం. సంస్కరణోద్యమ ప్రభావంతో మాడపాటి హనుమంతరావు ఈ సంస్కరణాభిలాష కథానికలు రాసారు. 1912లో ప్రచురితమైన మాడపాటి హనుమంతరావు రాసిన ‘ఎవరికి’ కథానిక ఇదే కోవకి చెందింది.
ఒద్దిరాజు సీతారామచంద్రరావు వైజ్ఞానిక నవలలతోబాటు వైజ్ఞానిక కథానికల్ని రాసారు. ఉదాహరణగా ‘అదృశ్య వ్యక్తి’ గురించి మాట్లాడుకుందాం. శరీరం లేకపోతే ఇంచక్కా ఎక్కడికిబడితే అక్కడికి వెళ్లి, కావలసినవన్నీ కావలసినంత తినవచ్చనుకుంటాడు. కలకత్తా విశ్వవిద్యాలయంలో పరిశోధనలు చేస్తున్న నళినీకాంత్ ఒకరోజు పిల్లి మాయం కావడానికి ఉపయోగించిన ఆమ్లము అతని మీద పడడంతో అతను అదృశ్య వ్యక్తి అవుతాడు. ఇది ఓ ఫాంటసి. శరీరం కనిపించకుండా పోవడంవల్ల మంచికన్నా చెడే ఎక్కువని గుర్తించిన అతను ఊళ్ళో అల్లకల్లోలం ప్రారంభం కావడంతో, పోలీసుల కోరికమీద పోలీస్‌స్టేషన్‌కి వచ్చి లొంగిపోతాడు. అక్కడ దొరతో ‘‘ఎవరికి బల శక్తులధికంగా ఉంటాయో వాళ్లు రాజ్యపాలన చేస్తారు. బలహీనుడు పరాధీనుడు. ఆంగ్లేయులు బలవంతులయ్యారు కాబట్టి బలహీనమైన భరత ఖండాన్ని తమ అదుపులోకి తీసుకోగలిగారు’’ అంటాడు.
అంతేకాదు ‘‘బలవంతులు కాబట్టే భరత ఖండాన్ని దోచుకుంటున్నారు. నేను కనిపించని పొట్టని నింపుకోవడం కోసం మాత్రమే మిఠాయి దొంగతనం చేసాను’’ అని అంటాడు.
‘‘నిన్ను మేము పట్టుకున్నాం. కానీ మమ్ముల్ని పట్టుకునే వాళ్లు లేరే’’ అంటాడు దొర. ‘‘నన్ను మీరు పట్టుకోలేదు. నేనే వచ్చాను’’ అంటూ అదృశ్య వ్యక్తిగా ఉన్న నళినీకాంతుడు దొర మొహమీద బలంగా గుద్దుతాడు. అదో విధంగా ఆంగ్లేయులకు హెచ్చరిక కూడ!
మాలోని అదృశ్య శక్తి మిమ్మల్ని ముప్పతిప్పలు పెడుతుందని ఆంగ్లేయుల్ని హెచ్చరించడం కూడా ఈ కథానికి అంతరార్థం ఒద్దిరాజు సీతారామారావు రాసిన ఈ కథానిక 1928 ఆక్టోబర్ ‘సుజాత’ పత్రికలో ప్రచురితమైంది. ఆయనే ఆంగ్ల అనుకరణను నిరసిస్తూ రాసిన మరో కథానిక ‘లండన్ విద్యార్థి’. స్వాతంత్య్రానికి ముందు బానిస భావాల్ని నిరసిస్తూ, స్వాతంత్య్రేచ్ఛతో తెలంగాణాలో కథానికలు వచ్చాయి. ఇది సంస్కరణాశతో రాసిన కథానికల దశ, ఈ దశకంలోనే ఆదిరాజు వీరభద్రరావు, సి.ఆర్. అవధాని, నందగిరి వెంకట్రావు, నందగిరి ఇందిరాదేవిలాంటి వాళ్లు తెలంగాణా ప్రాంతంలో ఆధునిక కథలు... కథానికలు రాసారు.
నందగిరి వెంకట్రావు ‘పటేలుగారి ప్రతాపము’ అనే కథానికలో పటేలు ప్రతాపం ఎంత నికృష్టమైనదో, కనిపించిన ఆడదాని మీద చూపించిన ఆ ప్రతాపం నాల్గు చావులకెలాకారణమైందో శక్తివంతంగా చూపించారు రచయిత.
‘‘రెండు లక్షలిస్తానంటే ఐదేళ్లు కాదు పదేళ్లు గృహనిర్బంధంలో ఉండగలన’’నని సేఠ్‌తో పందెం వేస్తాడు. నందగిరి ఇందిరాదేవి ‘పందెం’ కథానికలో నరోత్తందాస్ ‘‘కొన్నాళ్ళ క్రిందట రెండు లక్షల ఆస్తికోసం ఎన్నో కలలు కన్నాను అనుభవించినట్లే ఆనందించాను. కానీ నేడవి నాకనవసరం. కనుక నిర్ణీత సమయానికన్నా ముందుగా వెళ్ళిపోయి మన ఒప్పందాన్ని విచ్ఛేదం చేస్తున్నాను’’ అనే ఉత్తరాన్ని బెట్టి, రేపుదయంతో ఒప్పందం ముగుస్తుందనగా పారిపోతాడు నరోత్తందాస్. ప్రపంచమంతా మిధ్యనిపిస్తుంది అతనికి. ఈ స్వేచ్ఛ, జీవితం కూడా బుద్బుదప్రాయం! ఈ పదేళ్ళలో ఐహిక సుఖాలన్నింటినీ ఒంటరిగా గదిలో ఉండి పుస్తకాల ద్వారా అనుభవించావు ఇప్పుడీ జ్ఞానమంతా వ్యర్థం. ఎవరికైనా చావు తప్పదు అనే అభిప్రాయానికతను వస్తాడు. వినూత్న వస్తువు 1941 జనవరి గృహలక్ష్మిలో ఈ కథానిక వచ్చింది.
1932 ఆగస్ట్ ‘్భగ్యనగర్’ పత్రికలో అస్పృశ్యతా నిర్మూలనకు కంకణం కట్టుకుని అజ్ఞాతవాసి భాగ్యరెడ్డివర్మ రాసిన కథానిక ‘వెట్టి మాదిగ’. పల్లెల్లో కులాధిపత్యాన్ని ప్రదర్శిస్తూ, మానవత్వాన్ని మంటగలుపుతూ కొందరు అధికారాన్ని అడ్డంపెట్టుకుని అమాయక హరిజనుల్ని ఎలా హింసించేవారో ఈ కథానికలో హృదయ విదారకంగా చెప్పారు రచయిత. సాటి మనుషులు కొందరిని ఊరి బయట ఉంచడమే తప్పు. వాళ్లని తమ పాదాల కింద చెప్పులుగా చూడడం ఇంకా పెద్ద తప్పన్న విషయాన్ని నిర్భయంగా చెప్పారు రచయిత.
1930లో బూర్గుల రంగనాథరావు, నెల్లూరి కేశవస్వామి, ధరణికోట శ్రీనివాసులు, హీరాలాల్ మోరియా ‘సాధన సమితి’ని ప్రారంభించారు. ఆ సంస్థ ద్వారా ‘కథలెలా రాయాలి’ అనే గ్రంథాన్ని ప్రచురించారు. వీళ్ళే 1940లో అఖిలాంద్ర కథానికల పోటీని నిర్వహించారు. ఈ పోటీకి సురవరం ప్రతాపరెడ్డి, అడవి బాపిరాజు, చింతా దీక్షితులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. 1948లో బూర్గుల రంగనాథరావు - వాహ్యాళి, ధరణికోట, మా ఇంట్లో లాంటి కథానికా సంపుటాలు తెచ్చారు.
బెస్త జీవితాన్ని ప్రతిబింబింప జేస్తూ సురవరం ప్రతాపరెడ్డి ‘నిరీక్షణ’ ఆ రోజుల్లోనే 24 భాషలలోకి అనువాదమైంది. నిజాం పాలనను ఎద్దేవ చేస్తూ మొగలాయి కథలు రాసారు.
మొట్నూరి కృష్ణారావు ఓ ముఖ్యపాత్ర చేసి పెండ్యాల శేషగిరిరావు కథానిక ‘నా స్నేహం’ 1943లో వచ్చింది. సాహిత్యాన్ని సమాజ శ్రేయస్సుకే కాక గౌరవమైన వృత్తిగా కూడా స్వీకరించవచ్చని చెప్పిన కథానిక.
మనల్ని కష్టపెట్టే నరుల జీవితం, మన జీవితం కన్నా ఏమీ భాగాలేదని తలపోసే ఎద్దుల కథ కాళోజీ ‘మనమే నయం’ కథానిక. కాళోజీ సమాజం మీద పెట్టిన చురకలు ఆయన కథానికలు, సురవౌళి కథానికలు నాటి సమాజానికి చురకలు.
దొరవారి భూములకు పూర్తిగా నీళ్లు వదిలితే మిగతా రైతులు భూములకు చుక్క నీరు కూడా అందని పరిస్థితులలో చెరువొడ్డున నీటిని అందరికీ అందేలా ఎలా చేయగలిగారో తమ కథానిక ద్వారా కాంచనపల్లి చిన వెంకట రామారావు బాగా చెప్పారు. ఆయన రాసిన మంచి కథానికలు ‘మన ఊళ్లో కూడానా...’ పేరుతో సంపుటిగా వచ్చాయి. గ్రామీణ వాతావరణానికి దర్పణం పడతాయి ఈ కథానికలు.
కొమరయ్య ఏ ఆశయం కోసం ప్రాణావిడిచాడో ఆ ఆశయం కోసం మందితో కంకణం కట్టించిన ‘ఊరేగింపు’ ఆవుల పిచ్చయ్య కథానిక, 1946 ఆగస్ట్ మీజాన్ పత్రికలో వచ్చింది.
వట్టికోట ఆళ్వారు స్వామి ‘చిన్నప్పుడు, జైలు లోపల’ లాంటి కథానికలు తెలంగాణా ప్రాంత ప్రజల బాధామయ జీవితాల్ని మనముందుంటాయి. సురవౌళి యానారెడ్డి, దాశరథి పోరాటాలనదగిన కతానికలు రాసారు. పొట్లపల్లి రామారావు శతజయంతి సంవత్సరమిది. ఆయన ‘న్యాయం’తోబాటు ‘ఊరు, అడవి, మా ఊరుకి ఆహ్వానం లాంటి గ్రామీణ జీవితాల్ని ప్రతిబింబించే కథానికల రాసారు. ఇది ఊరా? అడవా? అని కొన్ని సంబంధాలలో అంటుంటాం. అడవిలోలా కాకుండా ఊళ్లో మనిషికి మనిషి సాయం లభించాలన్నది ఆయన కోరిక. ‘మన ఊరుకి ఆహ్వానం’ కథానికలో ఆ ఊరు పొలిమేరలను ఆ ఊరులోని వాగు, రావిచెట్టు, గుడిసెలు, కరణం, ఇల్లుతో బాటు షావుకారులాంటి కొన్ని పాత్రల్ని పరిచయం చేసి ఊరుకుంటారు. పల్లెల పరిస్థితుల్ని ఆ వివరాలు పూర్తిగా చెబుతాయి. ఆయన వ్యవసాయమే వృత్తి పల్లె ప్రాంతాలలో ఉండడంతో పల్లెల మేలుకోసం ఎన్నో కథానికలు రాసారు.
ఇలా మొదటితరం తెలంగాణా రచయితలు అప్పటి సమాజాన్నిబట్టి ప్రక్షాళనకు కావలసిన విధంగా చక్కటి చిక్కటి కథానికల్ని రాసారు. ఆకాశం నుంచి నేలకి దిగిన కథానిక నేలబారున సాగకుండా నేల నలుచెరగులకూ వెళ్తూ అన్ని జీవితాల్ని, భాషల్ని స్వంతం చేసుకుంటూ మరింత సమాజ ఉపకారి అవుతూ వచ్చింది.
*

చిత్రం..మాడపాటి హనుమంతరావు

డా.వేదగిరి రాంబాబు 9391343916