S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వ్యాఖ్యాన ‘మల్లీ’నాథుడు

అంతరాయ తిమిరోప శాంతయే శాంత పావన మచింత్య వైభవం
తం నరం వపుషి కుంజరం ముఖేన్మహే కిమపి తుందిలం మహః
(ఊహింపనలవి కాని వైభవము కలవానిని, నర శరీరముతో, ఏనుగు ముఖముతో బొజ్జతో ప్రకాశించే మహా తేజస్సుని (వినాయకుని) విఘ్నాలను చీకటిని పోగొట్టుటకు మాటిమాటికి తలుస్తాను. ఇది మల్లినాథుడు రచించిన వినాయక ప్రార్థన.)
* * *
తెలంగాణ మాగాణములో అన్నం మెతుకు పెట్టే అవిభక్త మెదక్ జిల్లాలో పుట్టిన మహాకవి, మహా వ్యాఖ్యాత కోలాచలం మల్లినాథ సూరిని తలుచుకొంటే - ఆనంద మేఘసందేశం హృదయాకాశంలో ప్రతిధ్వనిస్తుంది. వ్యాఖ్యానమంటే మల్లినాథుడు. మల్లినాథుడు అంటే వ్యాఖ్యానం. వాడిపోని వ్యాఖ్యానపు మల్లెతీగలు అల్లుకొన్న దిక్కు (మల్లీనాథుడు) మల్లినాథుడు. సర్వశాస్త్ర మల్లుడు. ఆయన వ్యాఖ్యలు లేకపోతే కాళిదాసు, మాఘుడు, భారవి, హర్షుడు అర్థమయ్యేవారు కారు. వారి భావనలు హృదయాలలోకి ఇంకిపోయేవి కావు.
బాల్యం
ఈ మహానునావుడు చరిత్రాత్మకమైన మెదక్ పట్టణానికి 15 కి.మీ. దూరాన గల కొలిచలమలో (కోలాచలం, కొల్చారం) జన్మించాడు. ప్రసిద్ధ ఏడుపాయల వనదుర్గామాత గుడికి దగ్గరలో ఈ కొల్చారం గ్రామం ఉంది. ఇతని బాల్యం గురించి చిత్రమైన వృత్తాంతాలున్నాయి. ఒక యోగి మల్లినాథునికి మహాసరస్వతి మంత్రోపదేశం చేసి నాలుకపై బీజాక్షరాలు వ్రాసాడని ఒక కథనం.. ఏడుపాయల అమ్మవారి ఆలయ చరిత్ర గ్రంథంలో ఈ ప్రస్తావన ఉంది.
కాళిదాసులా మల్లినాథుడు కూడా మొదటి దశలో చదువుసంధ్యలు లేనివాడట. పెళ్లయితే సరిగా అవుతాడని చక్కగా చదువుకున్న అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. ఒకసారి పూజకు పూలు తెమ్మంటే మన మల్లినాథుడు పూజకు పనికిరాని మోదుగపూలు కోసుకొచ్చాడు. అవి పూజకు పనికిరావన్న విషయం కూడా అతనికి తెలియదు. అందరూ ఎగతాళి చేశారు. భార్య అతనికి బుద్ధి చెప్పాలని ఉప్పులేని చారు వడ్డించింది. ఉప్పు లేదేమని అడిగిన మల్లినాథునితో భార్య అన్నదట.
చారు చారు సమాభాతం/ హింగు జీర సమ్మిశ్రీతమ్/ లవణ హీనం న శోభస్తే/ పాలాశ కుసుమం యథా (‘ఇంగువ, జీలకర్ర వంటి దినుసులు వేసి బాగా చిక్కటి రంగుతో చేసినా తగినంత ఉప్పు లేని చారు - మోదుగ పువ్వులా శోభించదు)’ అందరి సమక్షంలో ఈ మాటలు విన్న మల్లినాథుడు బాధపడి కాశీకి వెళ్లి చదువుకొని ‘సూరి’ (పండితుడు)గా మారాడని వేరొక కథనం.
ముసలః కిసలాయతే (రోకలి చిగురించునా?) అని భార్య చదువులేని మల్లినాథుని ఎగతాళి చేయగా, కాశికి వెళ్లి చదువుకొని వచ్చి, ముసలః కిసలాయతే (రోకలి చిగురించునది) అని జవాబిచ్చాడని మరొక కథనం.
కాలము - బిరుదులు
మల్లినాథ సూరి కాలాన్ని ఆయన రచనలను అనుసరించి కొందరు విమర్శకులు అంచనా వేశారు. ప్రౌడదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న క్రమంలో ఒక వివాదం వచ్చింది. ఆ తగాదా పరిష్కారం చేయటానికి రాయలు ఒక ధర్మాసన నెలకొల్పి దానికి మల్లినాథుడిని అధ్యక్షుడిని చేయగా అతడు ధర్మనిర్ణయం చేశాడని వైశ్యవంశ సుధాకరమనే గ్రంథం ఉంది. దీనిని అనుసరించి అతడు క్రీ.శ.1350 నుంచి క్రీ.శ.1430 వరకు జీవించినట్లు విమర్శకులు భావించారు. మల్లినాథుడు లాంటి మహానుభావులు దేశకాలాతీతులు. మల్లినాథునికి మహామహోపాధ్యాయ (సర్వశస్తమ్రు లందు సిద్ధాంత స్థాపనము చేయువాడు) పదవాక్య ప్రమాణ పారావార ప్రవీణ (వ్యాస సదృశుడు) అను బిరుదులున్నాయి.
కావ్య శాస్త్ర వ్యాఖ్యాన గ్రంథాలు
మల్లినాథుడు కాళిదాసు రచించిన రఘువంశము, మేఘసందేశం, కుమార సంభవములకు ‘సంజీవిని’, శ్రీహర్షుని నైషథీయ చరితమునకు ‘జీవాతువు’, మాఘుని రచించిన శిశుపాలవధకు (మాఘము), ‘సర్వంకష’, భారవి కిరాతార్జునీయమునకు ‘ఘంటాపథము’, భట్టి కావ్యమునకు ‘సర్వపథీయము’, తార్కిక రక్షా సార సంగ్రహమునకు ‘నిష్కంటకము’ రచించాడు. వీటిలో కొన్నింటి విశేషాలను, మల్లినాథుని ప్రతిభను కొద్దిగా పరిచయం చేసుకొందాం.
వ్యాఖ్యాన పద్ధతి
కువ్యాఖ్య అను విషంతో మూర్ఛపోయిన కావ్యాలను తిరిగి బతికించటానికి మల్లినాథుడు వ్యాఖ్యానాలను రచించానని చెప్పుకొన్నాడు. దండాన్వయ పద్ధతి అవలంబించాడు. ఇందులో అన్వయం ప్రకారం అర్థాలుంటాయి. ప్రమాణాలతో అవసరమయినంత వరకే చెబుతాడు. మూలానికి విరుద్ధంగా వ్రాయడు. అది ఈ వ్యాఖ్యానంలో విశేషం. ప్రతి సర్గ వ్యాఖ్యానానికి ముందు అద్భుతమైన శ్లోకాన్ని రచిస్తాడు.
రఘువంశ సంజీవిని
మాతాపితృభ్యాం.. అని మల్లినాథుడు ఆది దంపతులను ప్రార్థించి రఘువంశ వ్యాఖ్యానము మొదలుపెట్టాడు. ఆ అర్ధనారీశ్వరులలో ఎడమభాగము పార్వతి, కుడి భాగము ఈశ్వరుడు. శంకరుని ఎడమ కంటి చూపు ప్రేమతో కుడివైపునకు ప్రసరించింది. అది గమనించిన పార్వతి కన్ను నమ్రతతో, సిగ్గుతో ముడుచుకు పోయింది. ఆ చూపుల దోబూచులకు నమస్కరిస్తున్నానని మల్లినాథుని సుకుమార భావన.
రాణి సుదక్షిణాదేవి గర్భం ధరించింది. ‘అభ్యంతరలీనపావకాం శమీమివ (03-09)’ అని కాళిదాసు వ్రాశాడు. అంటే లోపల దాగి ఉన్న అగ్ని కల జమ్మి తీగ వలె సుదక్షిణాదేవి ఉన్నదని అర్థం. ఈ సందర్భమునకు తగినట్లు మల్లినాథుడు మహాభారత అనుశాసనిక పర్వాన్ని, శాకుంతలాన్ని (దుష్యనే్తనాహితం..) ఉదాహరించి అర్థాన్ని అరటి పండు ఒలిచినట్లుగా చెప్పాడు.
సీతను విడిచిపెట్టిన ఘట్టంలో లక్ష్మణుని వలన విషయం తెలిసిన సీతాదేవి భూమిపై పడి మూర్ఛపోతుంది. సీతాదేవికి భూదేవి తల్లి. కనుక ఇక్కడ మల్లినాథుడు - స్ర్తిలకు ఆపదలలో తల్లి శరణమని అద్భుతంగా వ్యాఖ్యానించాడు.
కుమార సంభవ సంజీవిని
కుమార సంభవంలో పంచమ సర్గ 13వ శ్లోకంలో ద్వరుూషు అను పాఠాన్ని పూర్వ వ్యాఖ్యానకర్తలు స్వీకరించగా సూరి ‘ద్వరుూషు’ అనే పదాన్ని తిరస్కరించాడు. ‘ద్వయే పి’ అని వ్యాకరణ శాస్తప్రరంగా మల్లినాథుడు సమర్థించాడు.
కుమార సంభవంలో మాయా బ్రహ్మచారి వేషంలో ఉన్న శివుడు పర్వాతిని ‘సుభ్రు’ (అందమైన కనురెప్పలు గలదానా 05-43) అని పిలుస్తాడు. సుభ్రు అనేది వ్యాకరణ విరుద్ధ పదమని కొందరు అన్నారు. అందుకే సుభ్రూః అనే మరొక పాఠాన్ని తీసుకొని పూర్వ వ్యాఖ్యాతలు వ్యాఖ్యానిస్తే మల్లినాథుడు తిరస్కరించాడు. ‘సుభ్రూః’ అ పాఠాన్తరకరణము సాహసమని సున్నితంగా చెప్పాడు. మల్లినాథుని వ్యాఖ్యాన శైలి ఇలా సున్నితంగా ఉంటుంది.
మేఘ సందేశ సంజీవిని
శరణం కరవాణి.. అని మల్లినాథుడు ఈ కావ్య వ్యాఖ్యలో సరస్వతీదేవిని మొదట పొగిడాడు.. అమ్మా! సరస్వతీ! కదిలేది, కదలనిది అగు ఈ చరాచర ప్రపంచానికి ఆశ్రయింపదగినవి, సుఖ శాంతి నిలయమైన నీ పాద పద్మాన్ని ఆశ్రయిస్తాను. దయతో నిండిన నీ చల్లని చూపులతో నన్ను కృతార్థుని చేసి, ధన్యుడిని చేయి తల్లీ! అని ఆర్తీతో నిండిన భావ నిర్భరమైన శ్లోకమిది. మల్లినాథుని వ్యాఖ్యతో 124 శ్లోకాల మేఘ సందేశం పండిత లోకంలో సుప్రసిద్ధమైనది. ‘మాఘే మేఘే, గతం వయః’ అని మల్లినాథుని మాట. అందువలన దీనికి, శిశుపాల వధకి వ్యాఖ్యానం రాయటానికి చాలా శ్రమపడ్డాడని తెలుస్తోంది.
కాళిదాసు ఈ శ్లోకంలో సీత అనలేదు. జానకి అన్నాడు. ఏంటండి రెండింటికి తేడా అంటారా? సీత అంటే నాగలి చాలు. జానకి అంటే జనకుని కూతురు. ‘ఇయం సీతా మమ సుతా’ (ఈ సీత నా కూతురు) అని తన గొప్పతనాన్ని చెప్పకుండా చెప్పిన మహా యోగి పుంగవుడైన జనకుని కూతురు జానకి. ఇంకా ఆమె స్నానం చేసిన నీళ్లు ప్రవహిస్తున్న ప్రాంతంలో యక్షుడుంటున్నాడు అన్నాడు. ‘నేను పరమ పవిత్రనయితే ఆంజనేయుని అగ్ని బాధించకుండా ఉండు గాక’ (సుందరకాండ 53 సర్గ 28 శ్లోకం) అని లంకలో పలికిన పరమ పునీత సీత. యక్షుడు పొరబాటు చేసినప్పటికీ మంచి ప్రదేశంలో ఉంటున్నాడు కనుక వాడికి మంచి జరుగుతుందనే వ్యంగ్యాన్ని సీతమ్మవారి పవిత్ర విశేషణాల ద్వార కవి చెప్పాడు. ఈ విశేషాలన్నింటిని వ్యాఖ్యాత సూచించాడు. ఇలా ఎన్నో అద్భుతమైన విశేషాలు మల్లినాథుని మేఘసందేశ వ్యాఖ్యానంలో చూడవచ్చు.
ఘంటాపథం (కిరాతార్జునీయం)
‘్భరవి పలుకులు కొబ్బరికాయతో సమానాలు వాటిని నేను పగుల కొడతాను. రసికులు ఆస్వాదించండి’ అని భారవి కవి గొప్పతనాన్ని చాటుతూ మల్లినాథుడు ఈ వ్యాఖ్యానం ప్రారంభించాడు.
రాజు గురించి చెబుతూ భారవి ‘క్షయయుక్తమపి..’ (2-11) అనే శ్లోకం వ్రాసాడు. విదియనాటి చంద్రుడు క్షీణించినవాడే. అయినప్పటికీ అతడు సహజమైన కాంతిని కలిగి ఉంటాడు. వృద్ధి కొరకు ఉదయించాడు, అందువల్ల ఆపదలు పోయినందువల్ల ప్రజలు గౌరవిస్తారు. అలాగే క్షీణదశలో నున్న రాజు కూడా తనకు స్వభావమైన తేజస్సు కలిగి, వృద్ధి కొరకు ప్రయత్నించి, ఆపదలు తొలగించుకొంటే అతనికి నమస్కరిస్తారు.. అని ఈ శ్లోక భావం.
ప్రతిపత్ అంటే పాడ్యమి అని అర్థం. కానీ ఇక్కడ మల్లినాథుడు ప్రతిపత్ చంద్రః అంటే ద్వితీయా చంద్రుడని అర్థం చెప్పాడు. (ప్రతిపత్ శబ్దేన ద్వితీయా గ్రహణం, ప్రతిపది తస్య అదృశ్యత్వాత్ ఇతి.) ఎందుకంటే పాడ్యమి నాడు చంద్రుడు కనబడడు కనుక పాడ్యమి అని అర్థం చెబితే ఔచిత్యభంగం అవుతుంది కనుక. ఇది మల్లినాథుని వ్యాఖ్యాన చాతురి.
సర్వంకష (శిశుపాల వధ)
ఈ వ్యాఖ్య ప్రారంభంలో శారదా శారదాంభోజ.. అను ప్రార్థనా శ్లోకాన్ని మల్లినాథుడు వ్రాసాడు. శరదృతువులో సేవించదగినది కనుక సరస్వతీదేవికి శారదా అని పేరు. శారదా దేవి శరత్ కాలంలోని పూర్ణిమా చంద్రుడిలా వెలుగుతుంటుంది. ఆమె ముఖం తెల్లని పద్మం. అటువంటి శారదా దేవి ఎప్పుడూ మా ముఖములో నివసించుగాక! అను అద్భుత భావగరిమ ఈ శ్లోకంలో ఉంది.
సంజీవినిలో మల్లినాథ సూరి వ్యాఖ్యానం తూలిక (చిన్న ఈక). ఘంటాపథంలో ‘శానశీల’ (స్వర్ణచ్ఛేదన సాధన విశేషము). ఈ ‘సర్వంకష’లో మల్లినాథుని వ్యాఖ్యానం సంశయచ్ఛేదంలో ‘అసిలత’. గుణ ప్రకాశంలో విద్యుల్లత. రస భావావిష్కరణలో కల్పలత అని చెప్పిన చలమచర్ల రంగాచార్యుల వారి మాట నూటికి నూరుపాళ్లు సత్యం.
శిశుపాల వధ 16వ సర్గలో దూత వాక్యాలను వర్ణించే శ్లోకాలున్నాయి. ఇవి పేలవంగా ఉన్నాయని పండితుల అభిప్రాయం. కావాలనే రాసినట్లున్నాయి. వల్లభ దేవుడు వీటికి వ్యాఖ్యానం రాశాడు. కాని మల్లినాథుడు అవి మాఘ కవి రచన కానందున ‘నా మూలం లిఖ్యతే కించిత్’ అని తాను చేసిన ప్రతిజ్ఞ ననుసరించి వ్యాఖ్యానం చేయలేదు.
‘సమాసోక్తి’ అలంకారాన్ని మల్లినాథుడు చాలా నేర్పుగా వివరించాడు. శిశుపాల వధలోని రాత్రివేల కలువల అందాన్ని వర్ణించే సందర్భంలో కవి ‘చంద్రుడు కలువలతో తెల్లవారేదాకా విహారాలు ఆడాడని’ చెప్పాడు. అతని చేతులు అంటే కిరణాలు పడమటి వైపునకు సాగిపోతూ వాటిపై విశ్రమించాడు. చంద్రునికి అలసట వచ్చి వివర్ణుడయ్యాడు. చంద్రుని చర్యలు దక్షిణ నాయకత్వాన్ని గుర్తు చేస్తాయి. రెండు అర్థాలు వచ్చే విశేషణాలను వాడటం వల్లనే ఇది సాధ్యం కనుక ఇది ‘సమాసోక్తి’ అలంకారం అని స్పష్టం చేశాడు.
జీవాతువు (నైషధం)
నైషధ వ్యాఖ్యానానికి జీవాతువు అనే
పేరు పెట్టాడు మల్లినాథుడు. జీవాతువు అంటే జీవనౌషధం అని అర్థం చెప్పాడు. నల మహారాజు కథను ఆస్వాదించిన పండితులు అమృతము కూడా ఆదరింపరు. (నిపీయ..) అను భావము గల శ్లోకముతో శ్రీ హర్ష నైషధం ప్రారంభమగుచున్నది. మల్లినాథుని వ్యాఖ్యానము కూడా ఇంతే. ఆ వ్యాఖ్యానము చదివిన పండితులు ఇతర వ్యాఖ్యానములను ఆదరింపరు. దాదాపు తొంభై ఏళ్లు జీవించాడు సూరి. కళ్లు తెరిచే ఓపిక లేకపోతే కింది రెప్పకు తాడుతో రాయి కట్టుకొనేవాడట. పై రెప్పకు కూడా తలపై నుంచి రాయి కట్టుకొని దీపం ముందు కూర్చుని కావ్యాలు చదువుతూ వ్యాఖ్యానాలు రాశాడట. ఇలా జీవితమంతా వ్యాఖ్యానాలకే అంకితం చేసిన మహానుభావులు అరుదు.
కాళిదాసు - మల్లినాథుడు
ఈ మహానుభావులిద్దరూ ఒకే కాలములో జీవించలేదు. కాని ఇద్దరిని కలుపుతూ ఒక అందమైన కథ సంస్కృత సాహిత్యములో ఉంది.
ఒక దాసీ చేతికి ఒక పెట్టెను ఇచ్చి ప్రియుని ఇంటికి ఒక యువతి పంపింది. ఆ పెట్టెపై పాము, శివుడు, ఆంజనేయుడు, సంపెంగల బొమ్మలున్నాయి. దీని భావమేమిటని సభలోని పెద్దలను, కవులను మల్లినాథుడు అడుగుతున్నాడని అనే అర్థం కల ఒక శ్లోకం రచించి మల్లినాథుడు భోజుని ఆస్థానానికి పంపాడట. దీని లోపలి భావాన్ని కాళిదాసు వివరించాడు. ‘అష్టవిధ నాయికలలో ‘ప్రోషితభర్తృక’ తన ప్రియునకు పంపుతున్న సందేశం ఇందులో ఉంది. తన విరహ బాధను చల్లని మలయమారుతం, మన్మథుడు, ఉద్యానవనాలు, తుమ్మెదలు అను నలుగురు పెంచుతున్నారనే విషయాన్ని వాటి శత్రువుల బొమ్మల ద్వారా ఆ యువతి వ్యంగ్యంగా చెప్పింది. 1.మాలయ మారుత శత్రువు పాము, 2.మన్మథుని శత్రువు శివుడు, 3.ఉద్యానవనముల శత్రువు కోతి (ఆంజనేయుడు), 4.తుమ్మెదల శత్రువులు సంపెంగలు’ అని కాళిదాసు చెబితే అందరూ హర్షధ్వానాలు చేశారు. కథ జరిగిందా? లేదా అనే విషయాన్ని పక్కనపెడితే కాళిదాసు కావ్యాలకు మల్లినాథుడు వ్యాఖ్యానం వ్రాస్తే, మల్లినాథుని శ్లోకానికి కాళిదాసు వ్యాఖ్యానం చేసిన అందమైన సందర్భం ఇది.
మల్లినాథుని రచనలు
1.వైశ్య వంశ సుధాకరం 2.రఘువీర చరిత 3.ఉదార కావ్యం 4.్భక్తి రహస్యం 5.నక్షత్ర పాతాధ్యాయం అనే అయిదు మల్లినాథ సూరి రచనలుగా లోకంలో ప్రచారంలో ఉన్నాయి. ఈ ఐదింటిలో మొదటి రెండు మాత్రమే దొరుకుతున్నాయి. దీనిలో 1.వైశ్య వంశ సుధాకరం గురించి మల్లినాథుని కాల నిర్ణయంలో మనం ప్రస్తావించుకొన్నాం. ఇక రఘువీర చరితం గురించి లఘు సమీక్ష చేద్దాం.
ఈ కావ్యం శ్రీరాముడు దండకారణ్యం ప్రవేశించటంతో ప్రారంభమై, పట్ట్భాషేకంతో ముగుస్తుంది. 7 సర్గల కావ్యం ఇది.
రామునిపై రాక్షసులు వేసే బాణాలు హిమాలయాలను మబ్బులు ఢీకొని వర్షం కురిసినట్లుగా ఉన్నాయంటాడు కవి. ఎంత అందమైన ఊహ! ‘సీత దూరమైతే వృక్షాలు కూడా కన్నీరు కారుస్తున్నాయి’ అంటూ ‘తుమ్మెదల రొద రోదన ధ్వని’లా ఉందని కవి ఉత్ప్రేక్షించాడు. పంపానదిని ఒక సుందర కన్యగా చెబుతూ నదిపై మంచును ఆమె కనుబొమల అల్లిక.. నదిలోని తామర పుష్పాలు ఆమె చేతులు, కాళ్లు ముఖం, కళ్లుగా కవి పోల్చాడు. ఇలా రమణీయమైన వర్ణనలెన్నో రఘువీర చరితంలో ఉన్నాయి.
మల్లినాథుని వినయం
‘ఎంతో చదువుకొన్నాడు. సాధన చేశాడు. అనితర సాధ్యమైన దీక్షతో కాళిదాసు కావ్యాలకు వ్యాఖ్యానాలు చేసాడు. కాని ఆ మహానుభావుడైన మల్లినాథుడన్న మాట ఇది. ‘కాళిదాసు గిరాం సారం కాళిదాసః సరస్వతీ/ చతుర్ముఖో దవా సాక్షాద్విదు ర్నానే్యతు మాదృశాః’ (కాళిదాసు వాక్కుల సారాంశం తెలిసిన వారు కాళిదాసు, సరస్వతీదేవి, బ్రహ్మ మాత్రమే.. నా వంటి వారికి - అది ఎన్నటికీ తెలియదు) ఈ మల్లినాథుని వినయం సర్వకాలాల్లోనూ అందరికి అనుసరణీయం. ఆయనలా కావ్యాలకు వ్యాఖ్యానం చేయలేం కాని, మల్లినాథుని వ్యాఖ్యానాలు శ్రద్ధతో చదువుకొని ఈ జన్మలో కొంతలో కాకపోతే కొంతయినా తరించగలం. స్వస్తి.
*

-డా.తాడేపల్లి పతంజలి 9866691587