S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రయోగశాల

సాధారణప్రచురణకు
ఎంపికైన కథ
*
‘ఒరేయ్ రాస్కెల్ ఇన్నాళ్లకి నేను బ్రతికున్నానని గుర్తు వచ్చిందట్రా నీకు? అసలు నినే్నం చెయ్యాలంటే..?’ బాల్య మిత్రుడు కిషోర్‌ని చేతులు రెండూ పట్టుకుని ఊపేస్తున్న నాకు.. లోపల వంటింట్లోంచే శ్రీమతి పిలుపు హెచ్చరించింది.
‘ఏవండోయ్ మీ మిత్రుడిని నిజంగానే తీసుకొచ్చారా? లేక నన్ను ఆట పట్టించడానికి ఎప్పటిలాగా మిమిక్రీ చేస్తున్నారా?’
‘చూసావుట్రా? నీ కారణంగా కట్టుకున్న పెళ్లానికి కూడా ఎంత లోకువై పోయానో? ప్రతిసారీ నువ్వు వస్తున్నానని రాయడం, నేనేమో పిచ్చివాడిలా ఆఫీసుకి సెలవు పెట్టి నీ కోసం రైలుస్టేషన్‌లో పడిగాపులు పడి కూర్చోవడం. చివరికి నువ్వేమో ‘క్షమించరా మాధవా! అనుకోని పని తగిలి బయలుదేరలేక పోయాను’ అంటూ నాకు మెసేజిలివ్వడం.. బొత్తిగా మా ఆవిడ నన్ను ఈ మధ్య నమ్మడం మానేసిందిరా? పైగా ఈ తల్లీకొడుకులు నన్ను వెర్రి వెంగళప్పను చూసినట్టు చూస్తున్నారంటే నమ్ముతావా?’
‘అబ్బా నీ మాటల ప్రవాహం ఆపరా బాబూ? నువ్వు ఏమీ మారలేదురా నందూ! అప్పుడూ ఇప్పుడూ వరద గోదావరివే’ అన్నాడు కిషోర్. వాడి దృష్టి మా ఫ్యామిలీ ఫొటో మీద పడింది. అది నెల్లాళ్ల క్రితం నేను మా ఆవిడ, నా ఇద్దరు సుపుత్రులు గంటలకు గంటలు మేకప్పు చేసుకుని మరీ తీయించుకున్న అపురూపమైన ఫొటో. అందరం అచ్చం సినిమా యాక్టర్లంత గ్లామరస్‌గా ఉంటాం అందులో.
‘ఆ ఫొటో ఎందుకురా మా కుటుంబ సభ్యులను ఇప్పుడే లైవ్‌లోనే చూద్దువుగాని.. ఇలారా.. కాస్త రిలాక్సవ్వు’ అంటున్నానో లేదో మళ్లీ శ్రీమతి అరుపు వినిపించింది వంటింట్లోంచి.
‘సిద్దూ! ఆ ఫేస్‌బుక్ వదిలి కాస్త బుద్ధిగా సాయం చెయ్యరా తండ్రీ! ఇవాళ మీ నాన్న పుట్టినరోజు కదా! ఇదిగో ఆయనకిష్టమైన చక్రపొంగలి, వాళ్ల మిత్రుడికిష్టమైన మొరం పులిహోర, గోంగూర పచ్చడి, కారం కూరిన గుత్తొంకాయ కూర డైనింగ్ టేబుల్ మీద సర్దు’
నేను రహస్యంగా చెప్పాను వాడికి.. ‘ఇప్పటికి నువ్వొస్తున్నావని చెప్పి నాలుగుసార్లు ఇవే ఐటమ్స్ చేయించానేమో మా శైలూకి నేనంటే మహా వెటకారంగా ఉందిరా. చేసినా చెయ్యకపోయినా ఈసారి కూడా మీ మిత్రుడు రాలేదు కదూ అన్నట్టుగా నన్ను దెప్పుతూ కొడుకులకు పని పురమాయిస్తూ నన్ను ఊరిస్తుంటుందిలే’ అన్నాను వాడి కళ్లల్లోకి చూస్తూ. అది విన్న కిషోర్ ముఖంలో అపరాధ భావంతోపాటు వాడి కళ్లు చెమర్చటం స్పష్టంగా కనిపించింది.
‘్ఛఛ ఆడపిల్లలా ఏమిట్రా ఆ కన్నీళ్లు?’
‘ఎందుకోగానీ ఎవరిని కలవడానికీ మనసురాక నాలుగైదుసార్లు ఏదో వంక పెట్టి ఇన్నిసార్లు నా ప్రయాణం కాన్సిలు చేసుకున్నందుకు ఇపుడెంతో బాధగా ఉందిరా నందూ! అయినా నేనేం మిత్రుడినిరా? ఇవాళ నీ పుట్టినరోజు అని కూడా ఎలా మర్చిపోయానో చూడు.. వట్టి చేతులతో వచ్చాను’
‘ఇన్నాళ్ల తర్వాత మనం కలుసుకోవడమే నువ్వు నాకిచ్చే అసలైన బహుమతిరా కిషోర్! ఆగు నా శ్రీమతిని పరిచయం చేస్తాను. గాయత్రీ.. ఒక్కసారి నీ వంటింటి సామ్రాజ్యాన్ని వదిలి బయటికి వస్తే నా ఆరో ప్రాణాన్ని కలుసుకుందువుగాని..’ అంటూ కేకేసేసరికి గాయత్రి కంగారుగా కొంగుకి చేతులు తుడుచుకుంటూ బయటకి వచ్చింది.
‘నమస్కారం అన్నయ్యగారూ! సారీ ఆయన అబద్ధాలాడుతున్నారనుకుని ఇంతసేపయినా బయటికి రానందుకు క్షమించండి’ తలెత్తి ఆమెను చూసి కిషోర్ మొహం తెల్లగా పాలిపోవడం కనిపించింది నాకు. గాయత్రికి కూడా కిషోర్‌ని చూసి ఒక్కసారిగా పలమారింది.
ఈ దృశ్యాన్ని నేను ముందుగానే ఊహించినా ఏమీ తెలియనట్టు ‘గాయత్రీ ఇప్పటికైనా నీ పతిదేవుడిని నమ్ముతావా? లేదా?’ అన్నాను. వెంటనే సర్దుకున్న గాయత్రి నవ్వేసింది.
‘అయ్యో నా మతిమరపుమండా పొయ్యి మీద అద్భుతమైన సాంబారు మరుగుతోంది. ఇపుడే వస్తాను’ అంటూ తన సహజ ధోరణిలో వండుతున్న వంటకం గురించి ముందుగానే నోరూరించి లోపలికి పరుగెత్తింది. గాయత్రికి తేరుకోవడానికి ఆ మాత్రం సమయం అవసరమని నాకు అర్థమైంది. ఎందుకంటే దీని వెనుక కాస్త చరిత్ర ఉంది.
* * *
‘ఒరేయ్ నందూ నువ్వు దేవుడివి నమ్మవు కదురా! నీకెలా చెప్పడమో?!’
‘అదేమిటి పెళ్లిచూపులకి వెళ్లి అమ్మాయి నచ్చింది తాంబూలాలు పుచ్చుకుందాం అని చెప్పి వచ్చాక ఇదేం ప్రశ్న? కొంపతీసి నువ్వు చూసొచ్చిన అమ్మాయి నన్ను గాని చేసుకుంటుందని అనుమానం వచ్చిందా ఏమిటి?’
పెల్లికూతురు గాయత్రి వాడికెంత బాగా నచ్చిందో తెలిసి కూడా వాడిని ఏడిపించాలనిపించింది నాకు.
కానీ కిషోర్ నా నెత్తిన ఠంగుమొట్టి అన్నాడు. ‘నోర్ముయ్యరా! నీకు నచ్చినా కూడా నినే్న కాదు అసలు నాకు తెలిసిన వాళ్లెవరినీ కూడా ఆ గాయత్రిని చేసుకోనివ్వను’ విస్తుపోవటం నా వంతయింది.
‘నువ్వు సరిగ్గా గమనించావో లేదో గానీ ఆ గాయత్రి నుదురు ఎంత విశాలంగా ఉందో చూసావుగా. అలాంటి వాళ్లకి తొందరగా వైధవ్యం వస్తుందని మా గురువుగారు చెప్పారు’
నాకు కోపం వచ్చింది. ‘ఎవరూ రైల్లో కనిపించిన ఆ దొంగ దైవభక్తుడేనా?’
‘అలా అనకు. ఆయన ఉపాసకుడు. ఆయన చెప్పినవన్నీ జరుగుతాయని భక్తులకు నమ్మకం’
‘ఒరేయ్ కిషోర్! నీకు పెళ్లికూతురు ఏ కారణం చేతనయినా నచ్చకపోతే ఇష్టం లేదని చెప్పు అంతేగానీ ఇలాంటివి అన్నావంటే ఆ అమ్మాయికి ఈ జన్మలో పెళ్లికాక ఆ పాపం నీకు చుట్టుకుంటుంది.’
‘నువ్వు పాపం పుణ్యం గురించి మాట్లాడితే నవ్వొస్తుందిరోయ్’ అంటూ నవ్వాడేగాని అభిప్రాయం మార్చుకోలేదు వాడు.
వాడలా అనడానికీ కారణముంది. నా చిన్నతనంలో మా అమ్మ శివుడికి అభిషేకం కోసమని ఓ స్టీలు క్యారేజీతో పాలను గుళ్లో ఉన్న మా నాన్నగారి కివ్వమని పంపించింది. అపుడు కిషోర్ కూడా నాతోనే ఉన్నాడు. మేం వెళ్లే దారిలో ఓ పెద్దావిడ రోడ్డు మీద కళ్లు తిరిగి పడిపోయి ఉంది. అంతా చూసి వెళ్లిపోతున్నారేగాని ఎవరూ పట్టించుకోవడం లేదు. నాకు మనసాగలేదు. మేమిద్దరం ఆవిడను లేపి కూర్చో బెట్టి ముఖం మీద క్యారేజీలోని పాలను చిలకరించగానే తెలివొచ్చి దాహం అంది. నాకేం చెయ్యాలో తోచలేదు. కిషోర్ ‘అవి దేవుడి పాలురా. మీ అమ్మకి తెలిస్తే చావగొడుతుంది’ అంటున్నా వినకుండా కాసిని పాలను మూతలోకి వొంపి ఆవిడ నోట్లో పోసాను. తర్వాత ఆవిడ లేచి వెళ్లిపోయింది. నాకు భయం పట్టుకుంది. మా అమ్మ సంగతి గుర్తొచ్చి కిషోర్‌ను బతిమాలాను. ‘ఒరేయ్ మనం స్నేహితులం కదురా. మా అమ్మకు జరిగింది చెప్పకురా?’
‘మరి పాలు ఎందుకు తక్కువయ్యాయని మీ నాన్నగారు అడిగితే?’
‘నీకెందుకు ఆ విషయం నేను చూసుకుంటాగా?’ అని గుళ్లోకి వెళ్లే ముందే అక్కడ కుళాయి దగ్గర మూతలోకి నీళ్లు పట్టి ఆ వెలితి పూర్తి చేసేసి అభిషేకానికిచ్చేసాను. అప్పటికి కిషోర్ ఏమీ చెప్పలేదు గానీ ఓసారి వాడికీ నాకూ ఏదో విషయంలో తగువొచ్చి మా నాన్నగారికి ఈ విషయం చెప్పేసాడు. ఆ రోజు నా తాట ఒలిచినంత పని చేసారు మా నాన్న.
‘వేలెడంత లేవు గాని ఇలాంటి పాడుబుద్ధులు ఎక్కడ వచ్చాయిరా. ఎంగిలి పాలతో శివుడికి నా చేత అభిషేకం చేయిస్తావా? ఎంత పాపం చుట్టుకుందో కదురా’
మా అమ్మ అడ్డుకోకపోతే నా వీపు ఇంకా చిట్లిపోయేదే.
‘ఎందుకలా చేసావు నాన్నా తప్పు కదా!’ అని ఆ రోజు రాత్రి అమ్మ నా వీపు మీద మందు రాస్తూ లాలనగా అడిగింది.
నాకు ఉక్రోషం వచ్చింది. ‘రాయికి ఎంగిలి అభిషేకం చేస్తే పాపం అయినపుడు నా దగ్గర పాలు ఉండీ ఆ పెద్దావిడకు ఇవ్వకపోతే ఆవిడ దాహంతో చచ్చిపోతే నాకు పాపం చుట్టుకోదా అమ్మా!’
‘ఆ దృష్టితో నువ్వు చేసింది తప్పు కాదు గానీ నాన్నా నువ్వు అసలు విషయం దాచి ఆ పాలలో నీళ్లు కలిపి నాన్నగారికివ్వడం తప్పుకాదంటావా? దేవుడికి అభిషేకాన్ని చేయించడం తప్పు కాదా చెప్పు’
‘తప్పేనమ్మా! నాన్నగారు తిడతారని అలా చేసాను. ఇంకెపుడు చెయ్యనులే’
అప్పటి నుంచి కిషోర్ నా మీద ఎపుడయినా కోపం వస్తే నీకు దేవుడు దెయ్యం పాపం పుణ్యం లేవురా అంటూ ఏడిపించేవాడు. మానవత్వమే దేవుడని నేను వాదిస్తే వాడు కనిపించిన ప్రతి రాయిలోను దేవుడున్నాడని వాదించేవాడు. దానివల్ల మా స్నేహానికి ఎప్పుడూ భంగం రాలేదు. కిషోర్ ఎప్పటికీ నా ప్రాణమిత్రుడే.
నేను ఆలోచనలో పడడం చూసి అన్నాడు. ‘ఏమో నువ్వేన్నాసరే నేను మాత్రం గాయత్రిని చేసుకోబోవడం లేదు.’
‘ఎవరో దారిన పోయే దానయ్య దేవుడు, జ్యోతిషం అంటూ ఏవో నాలుగు ముక్కలు కంఠస్థం చేసి చెప్పిన మాటలతో ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవడం మంచిదంటావా?’ అంటూ నేను భారంగా నిట్టూర్చాను.
కిషోర్‌కి ఈ పిచ్చి ఎలా పట్టిందో నాకు తెలుసు. ఆ రోజు మేమిద్దరం ఓ ఫ్రెండ్ పెళ్లికి హాజరై కాకినాడలో రైలెక్కాం. రాజమండ్రి స్టేషన్‌లో ఓ నలభయ్యేళ్ల సిద్ధాంతి ఎక్కి మా ఎదురుగా కూర్చున్నాడు. ఆయనకు సెండాఫ్ ఇవ్వడానికి వచ్చిన వాళ్లంతా వంగివంగి ప్లాట్‌ఫాం మీద నుంచే దణ్ణాలు పెట్టడం కనిపించి నేను పెద్దగా ఆశ్చర్యపోలేదు. ఆయన సిల్కు పైజామా, మెడలో రుద్రాక్షలు, చెవులకు పోగులు, వేళ్లకు ఉంగరాలు, చేతికి రాగి కడియం ఇవన్నీ చూస్తుంటే ఏ జ్యోతిష్కుడో అయి వుంటాడని తేలికగా అర్థమయింది.
ప్రతి మనిషికి భవిష్యత్తు తెలుసుకోవాలనే కుతూహలం అనాదిగా వస్తున్నదే అయినా ఆ పైత్యం ఈ మధ్య కాలంలో మరింత ముదిరింది. అందుకే ఈ కాలంలో బాబాలకు, జ్యోతిష్కులమని చెప్పుకునే వారికి కాలం నడుస్తోంది.
జ్యోతిష శాస్త్రంలో తప్పుందని నేను అనను. కాని ఈ కాలంలో దానిని బాగా అధ్యయనం చేసి చెప్పగలవాళ్లే కరువు. పైగా మిడిమిడి జ్ఞానంతో అవతలి వాళ్ల హావభావాలనుబట్టి కాస్త మనస్తత్వ శాస్త్రంతో కూడా పరిచయం ఉండి ఉంటే ఎదుటివారి బలహీనతలతో ఆడుకుంటూ దేవుడిని కూడా కలిపి సొమ్ము చేసుకునే వాళ్లే ఎక్కువ ఈ కాలంలో. అందుకే ఎదురుగా కూర్చున్న సిద్ధాంతిగారిని నేను ఎక్కువగా పట్టించుకోలేదు.
ఆయన ఈ బోగీలో ప్రయాణం చేస్తున్నట్టు ఎలా తెలిసిందో ఏమోగాని పక్క బోగీల్లోంచి కూడా ఎవరో ఒకరు వచ్చి సలహాలు తీసుకుని వెళ్తూనే ఉన్నారు. మా వాడు ఇంక ఆయనను వదల్లేదు.
‘పుట్టిన తేదీ సమయం ఊరు చెబితే చాలు. వేళ్లతో లెక్కలు వేసి చెప్పేస్తున్నారు అద్భుతం’ అంటూనే మావాడు తటాలున జేబులోంచి తనక్కాబోయే వధువు పుట్టిన తేదీ నక్షత్రం వివరాలు ఇచ్చి తనకు నప్పుతుందో లేదో చెప్పమని కోరాడు. వాడలా చేస్తాడని ఊహించని నేను కంగుతిన్నాను. నేను వారించేలోగానే సిద్ధాంతిగారు వేళ్లతో గాల్లో లెక్కలు వేసారు.
‘ఊహూ! మీ ఇద్దరికీ పాయింట్లు కలవలేదు. ఏ మాత్రం సరిపోదు. ఇంతకంటె చెడ్డ మాటలు నాచేత చెప్పించకు నాయనా!’ అమాయకమైన గాయత్రి ముఖం గుర్తొచ్చి నా ప్రాణం విలవిల్లాడిపోయింది.
సిద్ధాంతిగారు వెళ్లిపోతూ ‘ఎట్టి పరిస్థితుల్లోనూ పాతిక పాయింట్లయినా ఉన్న అమ్మాయినే చేసుకోండి. ఆమె త్వరలోనే మీకు తప్పకుండా తనంత తానే ఎదురవుతుంది చూడండి. నా జోస్యం తప్పదు. మీ దాంపత్య జీవితం పూల పడవలా సాగిపోతుంది. అన్నట్టు ఈ మధ్య నా వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో కూడా కుండలి వివరాలు పెట్టాను. మీకభ్యంతరం లేకపోతే మీరు మా ఇంటికి వచ్చి కూడా తెలుసుకోవచ్చు’ అన్నాడు మావాడిచ్చిన వెయ్యి నోటును జేబులోకి తోసుకుంటూ.
కిషోర్ వంక చూశాను. వాడు ట్రాన్స్‌లో ఉన్నవాడిలా అన్నాడు. ‘ఆయన చెప్పింది అక్షరాలా నిజంరా. మనం పెళ్లిచూపులకు వెళ్లొచ్చిన మర్నాడే నాకు యాక్సిడెంట్ ఎలా తప్పిందో చూడలేదూ నువ్వు?’
‘ఇది అన్యాయంరా. నీ నిర్లక్ష్యానికి గాయత్రిని ఎందుకు బాధ్యురాలిని చేస్తావు?’
నేను ఎంత నచ్చజెప్పాలని చూసినా వాడు వినలేదు. దానికి తగ్గట్టే తిన్న అన్నం అరక్క వాంతులయితే కూడా గాయత్రీ కారణమన్నాడు. పరధ్యానంలో వాడు చేసిన అవకతవకలన్నింటికీ ఆ అమ్మాయినే కారణం చేశాడు. ఆడపెళ్లి వాళ్లకి ఈ సంబంధం చేసుకోనని ఉత్తరం రాసేసాడని కిషోర్ అమ్మగారు గోల. ‘ఈ జన్మకి వీడి పెళ్లి నేను చూస్తానో లేదో? నువ్వయినా వాడికి నచ్చజెప్పవయ్యా! రోజురోజుకీ పిచ్చి ఎక్కువై పోతోంది. నాతో చెప్పి ఘోల్లుమన్నారు.
* * *
ఏడాది తర్వాత గాయత్రి నాకు ఓసారి బస్సులో తటస్థించి ‘మీరు నందన్ కదూ?’ అంటూ పలకరిస్తూంటే తెల్లబోయాను.
‘మీ మిత్రునితో తాంబూలాల వరకు వచ్చి పెళ్లి ఆగిపోయిన గాయత్రిని. గుర్తు పట్టలేదు కదూ?’ నిజంగానే గాయత్రిలో చాలా మార్పుంది. సన్నబడిపోయింది. ముఖంలో గాంభీర్యం వచ్చింది. ‘పెళ్లిచూపులకు మీ స్నేహితుడు మీరు వచ్చి వెళ్లాక మా అమ్మా నాన్న ఎంత కృంగిపోయారో తెలుసా? నేను నచ్చకపోతే తప్పులేదు. కాని నా నుదురు విశాలంగా ఉండటం వలన నాకు వైధవ్య ప్రాప్తి ఉందని వద్దనేసరికి ఆ నోటా ఆ నోటా నలుగురికీ తెలిసి ఊళ్లో వాళ్ల మాటలు పడలేక మా అమ్మానాన్నా నిద్ర మాత్రలు మింగారని వాళ్లు రాసి పెట్టిన ఉత్తరం చూసి అర్థమైంది. అప్పటికప్పుడు ఆస్పత్రిలో చేర్పించకపోతే వాళ్లు
ప్రయోగశాల (10వ పేజీ తరువాయ)
మాకు దక్కేవారు కాదు. నా బెంగతోనే అమ్మ మంచం పట్టేసింది. నాన్నకు పక్షవాతం. అక్కడ ఉండలేక ఆ ఇల్లు అమ్మేసుకుని ఈ ఊరొచ్చాం. ఇక్కడ స్కూల్లో టీచర్‌గా చేరాను’ మా వాడి నిర్ణయంతో ఓ మధ్యతరగతి ఆడపిల్ల జీవితం ఎంత అభాసుపాలవుతుందని ఊహించనే లేకపోయాను.
‘ఇంతకీ మీ స్నేహితుడికి పెళ్లయిందా?’ ఆమె కంఠంలో చిరుకోపం ఎంత దాచినా దాగలేదు.
‘ఏమోనండీ తెలీదు. మేమెంత చెప్పినా వాడి కుండలి లెక్కలు వేసే ధోరణి మారలేదు. ఇపుడెక్కడున్నాడో కూడా తెలియదు. వాళ్లమ్మగారు కూడా వాడి పెళ్లి కోసం కలవరిస్తూనే బెంగ పెట్టుకుని ఈ మధ్యనే పోయారు’
గాయత్రి మనసు స్ర్తి సహజమైన కరుణతో ద్రవించినట్టుంది. ‘అయ్యో ఎంత పని అయింది’
ఆ రోజు గాయత్రితో వాళ్లింటికెళ్లి అక్కడి పరిస్థితి చూసి నా మనసు ద్రవించి పోయింది. నేను కిషోర్‌తో కలిసి వాళ్లింటికి పెళ్లిచూపులకి వెళ్లినపుడు చూసిన మనుషులకీ వీళ్లకీ పోలికే లేదు. జీవచ్ఛవాల్లా ఉన్నారు. ఆ తర్వాత వారాంతాల్లో వాళ్లింటికి వెళ్లడం.. కష్టం సుఖం మాట్లాడుతుండటం నాకు అలవాటుగా మారింది. ఓ ఆరు నెలల తర్వాత అడిగాను ‘ఈ నల్ల నందన్‌కి మీ జీవన సాహచర్యం లభించే అదృష్టాన్ని ప్రసాదించగలరా?’
గాయత్రి వింతగా చూసింది. ‘నా జాతకం తెలిసి కూడా ఈ మాట ఎలా అనగలుగుతున్నారు? మీ మిత్రుడనడం అని కాదు గానీ నిజంగానే నన్ను పెళ్లిచూపులు చూసి వెళ్లిన వాళ్లకి ఏదో ఒక ఆపద వస్తూనే ఉంది. దేవుడలా రాసిపెట్టాడు మరి’ ఆమె పంటి బిగువున అనడం నాకు తెలుస్తూనే ఉంది. ‘మధ్యలో దైవాన్ని ఎందుకు లాగుతారు? మనిషి మనిషికుండే నమ్మకాన్ని ఎలా క్యాష్ చేసుకోవచ్చా అని మాత్రమే స్వార్థంతో ఆలోచించే సిద్ధాంతుల వంటివారు అంతకంటె ఉన్నతమైనది ఇంకోటుందని గ్రహించలేక పోవచ్చు. మా కిషోర్ లాంటి బలహీనులకు మునుముందు మానసికంగా అది ఎంత నష్టం కలిగిస్తుందో నాకు మాత్రమే తెలుసు.’
‘అయితే మీకు అదిగో పులి అంటే కూడా భయం లేదా? యాక్సిడెంట్లకు కూడా భయపడరా? చిత్రమే’
‘ఇంతటి సౌందర్యరాశిని చూసాక ఆ మాత్రం ఆక్సిడెంట్లు అవకపోతే మీ అందానికే అవమానం’
గాయత్రి ముఖంలో ఈసారి సిగ్గుతోబాటు రవంత కొంటెదనం. ‘అయితే దేవుడి భయం కూడా లేదంటారు. సాహసం చేస్తానంటారు’
‘సాహసం చేస్తేనేగా ఈ రాజకుమారి నాకు దక్కేది!’
ఆ తర్వాత గాయత్రితో నా పెళ్లి ఏ ఆర్భాటమూ లేకుండానే అతి సామాన్యంగా జరిగిపోయింది. మాకిపుడు ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు. ఇటీవలే మా బావమరిది రవీంద్ర పెళ్లి కూడా మా చేతుల మీదుగానే చేసాం. ఆరు నెలల క్రితం ఓ మిత్రుడి ద్వారా మా కిషోర్ తిరుపతిలో ఉన్నట్టు తెలిసి వాడి అడ్రసు కనుక్కుని ఉత్తరాల మీద ఉత్తరాలు రాసి బతిమాలి మరీ మా ఇంటికి ఆహ్వానించాను. అందుకే ఈ రోజు ఇద్దరికీ సర్‌ప్రయిజ్.
* * *
‘ఏమ్మా మా వాడు నిన్ను ఇబ్బంది పెట్టడం లేదు కదా!’ వాడికిష్టమైన వంటకాలను మా గాయత్రి కొసరి కొసరి వడ్డిస్తూంటే ఆప్యాయంగా అన్నాడు కిషోర్.
‘అబ్బే.. ఇద్దరు వస్తాదులను పెట్టుకుందిగా రక్షణ కోసం..’ నేను పిల్లలను చూపించేసరికి ఫక్కున నవ్వేశారు అందరూ.
మా మిత్రులిద్దరికీ ఆరు బయట పక్కవేసింది మా ఆవిడ.
వాడు అడిగాడు. ‘నీదీ నాదీ పుట్టిన తేదీ, టైము, ఊరు, నక్షత్రం, చివరికి ఆసుపత్రి ఒకటే కదురా!’
‘అందుకేగా మనిద్దరినీ అంతా కవలలనేవారు. అవునూ ఎందుకలా అడుగుతున్నావు?’
వాడు ఆకాశంకేసి చూస్తూ నసుగుతూనే అడిగాడు. ‘పదిహేనేళ్లుగా చిలకా గోరింకల్లా ఉన్నారని మీ కుటుంబాన్ని చూస్తూంటేనే అర్థమయిపోతోంది. మరి నాకు నప్పని గాయత్రి జాతకం...’
‘అందుకే మేరేజెస్ ఆర్ మేడిన్ హెవెన్ అన్నారు కదా! ఇంతకీ మీ సిద్ధాంతిగారు చెప్పిన పిల్ల నీకు కనబడనే లేదా?’
ఒక ప్రగాఢమైన నిట్టూర్పు వినబడింది. ‘ఏ పిల్ల జాతకం చూసినా ఎవరితోను నాకు కనీసం ఆరు పాయింట్లు కూడా కలిసి రాలేదు. చివరికి అంతంత మాత్రంగానే ఉన్న ఓ అమ్మాయికి ముప్పై పాయింట్లు వచ్చాయి. గురువుగారి మాటలు గుర్తొచ్చాయి. సంబంధం సెటిల్ చేసుకుందామని వెళ్లేసరికి అప్పటికి ఆ అమ్మాయికి పెళ్లయిపోయిందిరా.. క్రుంగిపోయాను. ఉద్యోగం కూడా వదిలేసి మళ్లీ దేశాలు పట్టుకుని తిరిగాను. పాపిష్టివాడిని.. నా కోసమే కలవరించే అమ్మ ఆఖరి క్షణాల్లో దగ్గర లేకుండా పోయాను. నాలాంటి బలహీనులకు ఆ మాత్రం శిక్ష పడాల్సిందే’ వాడి చెంపలు తడవడం కనబడింది.
‘మరి మీ సిద్ధాంతి గురువుగారు ఎపుడయినా కనిపించారురా?’ భుజం మీద ఓదార్పుగా చెయ్యేసాను.
వాడు తలదించుకుని అన్నాడు. ‘ఇక్కడికి వచ్చే ముందు ఓసారి రైల్లోనే వాళ్లబ్బాయి కనిపించి చెప్పాడు. ఆయనకు పక్షవాతం వచ్చింది.. ఓసారి వచ్చి చూడమని కోరాడు. ఆయన కుండలీ తప్పిందిట.. అందుకే ఈ నికృష్ట యోగం పట్టిందిట’
‘అమాయకులైన ప్రజల్ని మోసం చెయ్యడం చాలా తేలిక. అదే జీవితాశయంగా పెట్టుకుంటే ఎంతో డబ్బు, కీర్తి సంపాదించవచ్చు కాని మనశ్శాంతిని మాత్రం పొందలేం అని అర్థం అయి ఉంటుంది సిద్ధాంతిగారికి.’
‘నాకు ఈ మధ్యనే తెలిసింది.. మనకు ఆ రోజు రైల్లో కనిపించి ఆయనకు వంగివంగి దణ్ణాలు పెడుతూ కనిపించినావిడ వాళ్ల ప్రక్కింటావిడేనట.. ఆ రోజు రైలు ప్రయాణం మధ్యమధ్యలో వచ్చి కలిసిన వాళ్లు కూడా ఆయన శిష్యులేనని.. అదంతా ఓ వ్యాపారం.. మాయ.. అనుకోవాలి. కాలం పాదరసం లాంటిదని పట్టుకునేదాకా ఆగదని అది నా చేతిలోంచి జారిపోయాకనే తెలిసిందిరా! ప్చ్...’ అన్నాడు వెనక్కి వాలి అనంతాకాశంలోని నక్షత్రాలను దిగులుగా చూస్తూ...
వాడి గొంతులోని ఆవేదన ఓ మిత్రుడిగా నా మనసును కలచివేసింది. మా వాడి లెక్క ఎక్కడ తప్పినా కాలాన్ని మాత్రం వెనక్కి తిప్పలేం. వాడు యాభయ్యవపడిలోకి అడుగుపెట్టబోతున్నాడన్నది మాత్రం తిరుగులేని వాస్తవం. ‘ఒక్కటి మాత్రం నిజంరా మాధవా! నీ తెగువతో మీ అమ్మానాన్నల్ని ఒప్పించి గాయత్రిని పెళ్లాడే సాహసం చేసి నీ ప్రాణమిత్రుడి పాపాన్నీ తుడిచేసావు.’ నా మనసుకే తెలిసిన ప్రగాఢ రహస్యాన్ని నిద్రలో కలవరిస్తున్నాడు మా కిషోర్. గాఢంగా నిట్టూర్చాను. తప్పో ఒప్పో.. నాన్నచేత దెబ్బలు తప్పవని తెలిసీ చిన్నతనంలో రుద్రాభిషేకం పాలు దాహార్తితో వున్న ఓ తల్లి గొంతులో పోసినా.. గాయత్రి కంఠానికి పసుపుతాడు కట్టినా.. నేను మాత్రం నేను నమ్మే అంశాలకు నా జీవితానే్న ప్రయోగశాల చేసుకుంటున్నాను.

శ్రీమతి పి.వి.శేషారత్నం.. 98482 18762