S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రంగవల్లికలు... శుభ సంకేతాలు

సంక్రాంతి పండుగ ఇంకా నెల రోజులు ఉందనగానే తెలుగు వాకిళ్లు ముగ్గులతో కళకళలాడుతుంటాయి. అసలు, ఈ ముద్దులొలికే ముగ్గులలోనే సంక్రాంతి శోభంతా ఇమిడి ఉందేమో ననిపిస్తుంది. సంధ్యా సమయంలో తెలుగింటి ఆడపడుచులు తలారా స్నానం చేసి, ముగ్గు గినె్నలను చేతబట్టుకుని వాకిళ్లలో ఏకాగ్ర చిత్తంతో ముగ్గులను తీర్చిదిద్దే దృశ్యం కన్నుల పండువుగా ఉంటుంది. ముగ్గులు వేయడంలో మగువలది అందెవేసిన చేయి. అందుకేనేమో రంగవల్లులు రమణుల కళానైపుణ్యానికి ప్రతీకలుగా సెలవిచ్చాడో కవిపుంగవుడు.
ముగ్గుల విశిష్టత గురించి మన ప్రాచీన గ్రంథాలలో అనేక విధాలుగా వివరించారు. ముగ్గులు ఉండే లోగిళ్లలో లక్ష్మీదేవి నివసిస్తున్న లక్ష్మీ స్తోత్రంలో పేర్కొనబడింది. వాత్సల్యమూర్తి యగు భగవంతుడు గోవు రూపంలో వచ్చి వాకిట నిలబడినట్లుగా ప్రతీతి. అందుకే ఆవు పేడతో వాకిళ్లను అలికి ముగ్గులు తీర్చిదిద్దుతారు.
అంతేకాదు. సంక్రాంతి అనగానే ముగ్గులతోపాటు ఆ ముగ్గుల మధ్య కొలువుతీరిన గొబ్బెమ్మలు కూడా మన స్మృతిపథంలో కదలాడుతాయి. స్ర్తిలకు విశేషించి కనె్నపిల్లలకు గొబ్బెమ్మ పూజల వలన సర్వ శుభాలు జరుగుతాయని మన తెలుగువారి నమ్మకం. ఈ గొబ్బెమ్మ పూజ గోదాదేవి పూజకు ప్రతిరూపం. సాక్షాత్తు మహా విష్ణువు ధర్మపత్నియే గోదాదేవి. కాలక్రమంలో గోదాదేవి పూజ కాస్తా గొబ్బెమ్మ పూజగా ధనుర్మాసంలో ప్రాచుర్యాన్ని పొందింది. సంధ్యా సమయంలో ఈ గొబ్బెమ్మలను ఆరాధించడం వలన వీటిని ‘సందె గొబ్బిళ్లు’ అని కూడా అంటారు. ఈ గొబ్బెమ్మలను ఆవుపేడతో తయారుగావించి ముగ్గుల మధ్యన ఉంచి, పసుపు కుంకుమలతో, రకరకాల పుష్పాలతో స్ర్తిలు పూజలు చేస్తారు. ధనుర్మాసమంతా తెలుగింటి ఆడపడుచులు రకరకాల ముగ్గులను తీర్చిదిద్దడంలో, గొబ్బెమ్మలను పూజించడంలో హడావిడిగా కనిపిస్తారు.
ముగ్గులు శుభానికి సంకేతాలుగా అనాది కాలం నుంచి భావించబడుతున్నాయి. సంక్రాంతి సమయంలో ఏ గుమ్మంలోనయినా ముగ్గు లేదంటే ఆ ఇంట్లో ఏదో కీడు కలిగిందని నేటికీ మన గ్రామీణులు భావిస్తారు. ‘తీరయిన సంపద ఎవరింట నుండు - దినదినము ముగ్గున్న లోగిల్ల నుండు’ అన్నాడో సినీ కవి. మామూలు రోజుల్లోని మాటేమో గానీ తెలుగువారి పెద్ద పండుగయిన ‘సంక్రాంతి’ శుభ సమయాన ముంగిళ్లలో ముగ్గులు లేకపోవడం సంప్రదాయ రీత్యా గర్హించతగ్గ విషయం. అశుభానికి అది తార్కాణం. అందుకేనేమో ‘ముగ్గులేని ముంగిటకు పండుగ నాడైనా ముష్టిది రాదు’ అనే సామెత ఏర్పడింది.
సంక్రాంతినాడు పెట్టే ముగ్గులలో రథం, తులసికోట, వైకుంఠ ద్వారం, పద్మాసనం మొదలైనవి ప్రధానమైనవి. ఈ ముగ్గులనే కాకుండా రకరకాల చుక్కల ముగ్గులను ప్రత్యేకంగా నేర్చుకుని తెలుగింటి ఆడపడుచులు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్లుగా తమ వాకిళ్లను కన్నుల పండువుగా అలంకరించుకుంటారు. ఈ సంక్రాంతి ముగ్గులు మనకు కన్నుల పండుగ గావించడమే కాదు కార్టూనిస్టులకు చక్కని ప్రేరణ కూడా కలిగిస్తాయి. సంక్రాంతి ముగ్గుల మీద అసంఖ్యాకంగా వెలువడే కార్టూన్లు మనలను కడుపుబ్బ నవ్విస్తాయి.

-కె.వి.నాగేశ్వరరావు