S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎడ్లబండ్ల నుండి హెలికాప్టర్ వరకు..

మానవ జీవితంలో మార్పు కీలకమైంది. కాలం తెచ్చే మార్పులతో మానవ నాగరికత విరాజిల్లుతూ వస్తోంది. కాలం-మార్పులు కలిసే ప్రయాణిస్తుంటాయి. ప్రయాణానికి సంబందించి కూడా సమాజంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కాలం మహిమే అలాంటిది. ఒకప్పుడు ఎడ్లబండ్లు ప్రధాన ఆకర్షణగా జరిగే మేడారం మహాజాతర నేడు హెలికాప్టర్ ప్రయాణానికి చేరుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుత భూపాలపల్లి జయశంకర్ జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో జరిగే మేడారం జాతరైన ఆదివాసీ,గిరిజన జాతర ఆసియాఖండంలో జరిగే అతిపెద్ద గిరిజన జాతర. ఒకప్పుడు ఎడ్లబండ్లతో దూరప్రాంతాల నుండి జాతరకు తరలివచ్చేవారు. కాలక్రమేణా జాతరకు రవాణామార్గం మెరుగై ప్రస్తుతం హెలికాప్టర్ ద్వారా కూడా జాతరకు రాగలగడం విశేషం. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరలో రెండు ప్రధాన గద్దెలు, ఇద్దరు వనదేవతలు ఆ నాలుగు రోజులే జాతరకు అత్యంత కీలకం. ఆ నాలుగురోజులు కోటిమంది భక్తులను ఒక్కచోటుకి చేరుస్తాయి. కుగ్రామాలన్ని జనసాగరంగా మారుతాయి. మేడారం కీకారణ్యం జనారణ్యంగా మారుతుం. గిరిజనగూడెంలో పుట్టిన సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటుతుంది. కోయదొరల ఇంట పుట్టిపెరిగి అణగదొక్కచూసిన రాజుపై కనె్నర్ర చేసి శతాబ్దాల కిందటే నారీభేరి మోగించి చరిత్రకే కొత్త భాష్యం చేప్పిన వీరవనితలే శ్రీ సమ్మక్క సారలమ్మలు. కత్తిపట్టిన చేతుల్లో కరుణ నింపుకున్న ఆదివాసీ బిడ్డలను కొలిచి మొక్కే సందర్భమే ఆ నాలుగు రోజుల మహాజాతర. ఈ నెల 31 నుండి నాలుగు రోజుల పాటు వైభవంగా జరుగబోతుంది.
మొదటి రోజు సారలమ్మ రాక...
సమ్మక్క కుమార్తె అయిన సారలమ్మ నివాసం కనె్నపల్లి. మేడారం గద్దెలకు దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కనె్నపల్లి కుగ్రామంలోగల చిన్న దేవాలయంలో ప్రతిష్ఠింపబడిన సారలమ్మ ఈ నెల 31 బుధవారం సాయంత్రం మేడారంలోని గద్దె వద్దకు చేరుతుంది. ఉదయం వేళ దేవతకు పుజారులు సుమారు రెండు గంటలపాటు అత్యంత గొప్యంగా పూజలు నిర్వహిస్తారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న, కడుపు పండాలని కోరుకునే వారు వందలాది మంది తడిబట్టలతో గుడి ఎదుట సాష్టాంగ నమస్కారాలతో ‘వరం’ పడుతారు. దేవతా రుపాన్ని చేతబట్టుకొని గుడిబైటకు వచ్చిన పూజారులు ‘వరం’ పడుతున్నవారిపై నుండి నడిచివెళ్తారు. ఆ సారలమ్మే తమ పైనుండి నడిచి వెళ్తుందని భక్తుల విశ్వాసం. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు వారి వారి హోదాను మరిచి సారలమ్మను మోస్తున్న పూజారిని తమపై నడిపించుకుంటారు. అతణ్ని దేవదూతగా భావిస్తారు. గ్రామ మహిళలు మంగళ హారతులిచ్చి నీళ్లు ఆరబోసి కొబ్బరికాయ కొడుతూ కనె్నపల్లి నుండి మేడారానికి సారలమ్మను సాగనంపుతారు. తల్లిని తాకాలనే ఉత్సాహంతో ఎగబడే భక్తులను నివారించేందుకు వందల సంఖ్యలో పోలీసులు వలయంగా ఏర్పడి రక్షణ కల్పిస్తారు. అక్కడి నుండి సారలమ్మ జంపన్న వాగుమీదుగా నేరుగా మేడారంలోని తల్లిసమ్మక్క దేవాలయానికి చేరుకుంటుంది. సారలమ్మ జంపన్న వాగును దాటుతున్న క్రమంలో వాగులో పుణ్యస్థానాలు చేస్తున్న భక్తులు రెండుచేతులు పైకెత్తి అమ్మవారికి స్వాగతం పలుకుతారు. తడిబట్టలతో శివసత్తుల పూనకాలతో ఊగిపోతారు.

జనప్రవాహం తో నిండిన జంపన్నవాగు పూనకాలతో మారుమోగుతుంది. కొండాయి నుండి గోవిందరాజు, పూనుగొండ్ల నుండి పగిడిద్దరాజును పూజారులు అప్పటికే సమ్మక్క సన్నిధానానికి చేర్చగా సారలమ్మసహా వీరి ముగ్గురికి అక్కడ పూజారులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. అనంతరం వారిని గద్దెలపై ప్రతిష్ఠింపచేస్తారు.
రెండవ రోజు చిలుకల గుట్ట నుండి సమ్మక్క...
జాతర రెండవ రోజు ఫిబ్రవరి 1 గురువారం సాయంత్రం సమ్మక్క గద్దెపైకి వస్తుంది. ఆరోజు ఉదయమే పూజారులు చిలుకల గుట్టకు వెళ్లి వెదురు కర్రలు తెచ్చి గద్దెలపై ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం సమ్మక్క పూజా మందిరం నుండి పసిడి కండలను తెచ్చి గద్దెలపై నెలకొల్పుతారు. సాయంత్రం వేళ చిలుకలగుట్టపై కుంకుమ భరిణ రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపైకి తెచ్చేందుకు పూజారులు బయలుదేరుతారు. జాతర మొత్తానికి ప్రధాన ఘట్టం అయిన సమ్మక్క ఆగమనం కోసం లక్షలాది మంది భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. తల్లికి ఆహ్వానం పలుకుతూ అమ్మను కనులారా చూడడానికి ప్రాణాలకు తెగించి సాహసానికి ఒడిగడుతారు. ఎత్తెన ప్రదేశాలు, చెట్లు, చిటారు కొమ్మలు ఎక్కి ఎదురుచూస్తారు. సమ్మక్క కొలువైన ప్రదేశానికి చేరుకున్న పూజారులు అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తల్లిరూపాన్ని చేతబట్టుకున్న మరుక్షణమే ప్రధాన పూజారి మైకంతో ఒక్క ఉదుటున పరుగు తీస్తాడు. అక్కడ ఉన్న వందలాది మంది పోలీసులు రక్షణ ఏర్పాటు చేస్తారు. స్వయంగా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలోనే రక్షణ ఏర్పాట్లు ఉంటాయి. ఎస్పీ తుపాకితో గాల్లోకి మూడురౌండ్‌లు కాల్పులు జరిపి అధికార వందనంతో స్వాగతం పలుకుతారు. తుపాకి మోత విన్న మరుక్షణమే భక్తజనం ఉర్రూతలూగుతుంది. సమ్మక్కతల్లికి ఆహ్వానం పలుకుతూ జాతర అంతటా బలులు ఇవ్వడం ప్రారంభమవుతుంది. గద్దెల వద్దకు సమ్మక్క చేరు క్రమంలో భక్తులు ఎదుర్కోళ్లతో స్వాగతం పలుకుతారు. దేవతను పట్టుకున్న పూజారిని తాకేందుకే జనాలు పోటీలు పడుతారు. సమ్మక్క గుడిలో ప్రత్యేక పూజల అనంతరం కుంకుమ భరిణను గద్దెపైకి చేర్చుతారు. దీంతో మేడారం జాతర లాంచనంగా ప్రారంభమవుతుంది.
మూడవ రోజు...
2వ తేదీ శుక్రవారం రోజు అశేషభక్తజనానికి దర్శనం ఇస్తుంది. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారు. కోర్కెలు తీర్చమని కోరుకుంటారు. కోర్కెలు తీరనివారు కానుకలు చెల్లించి నిలువుదోపిడీ ఇవ్వడంతోపాటు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పిస్తారు. పసుపు కుంకుమలు, చీర,సారెలు సమర్పిస్తారు.
నాల్గవ రోజు...
మేడారం మహాజాతరకు వచ్చిన అశేష భక్తజనానికి దర్శనం ఇచ్చిన సమ్మక్క, సారలమ్మలు నాల్గవ రోజు శనివారం 3వ తేదీ సాయంత్రం తిరిగి వనప్రవేశం చేయడంతో జాతర ముగిసిపోతుంది. దేవతలను గద్దెపైకి తెచ్చే క్రమంలో పోలీసులు ఏవిధంగానైతే రక్షణ కల్పిస్తారో అదేవిధంగా కట్టుదిట్టమైన రక్షణ మధ్య అమ్మవార్లను సాగనంపుతారు. సమ్మక్క తల్లి చిలుకలగుట్టపైకి, సారలమ్మ తల్లి కనె్నపల్లికి తరలివెళ్లిన అనంతరం భక్తులు తిరుగుముఖం పడుతారు. గిరిజన జాతరగా కొలిచే మేడారం మహాజాతరకు వివిధ రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. తెలంగాణ కుంభమేళగా పిలిచే మేడారం జాతర ప్రతి రెండుసంవత్సరాలకు ఒకమారు వస్తుంది. జాతర సందర్భంగా ఇప్పటికే జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మేడారం జాతరకు వెళ్లే భక్తులంతా ముందుగా వేములవాడ శ్రీరాజరాజేశ్వరీ స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఇప్పటికే భక్తజనం అంతా వేములవాడ పయనమయ్యారు.

నార్లగిరి యాదగిరి, మహబూబాబాద్