S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మహిమాన్వితం.. అమరారామం

భక్తుల కోర్కెలు తీర్చే ఆలయాలుగా గుంటూరు జిల్లాలోని శైవక్షేత్రాలు ప్రసిద్ధిగాంచాయి. పంచారామాల్లో ఒకటైన అమరావతిలో వెలసిన అమరలింగేశ్వరునితో పాటు కోటప్పకొండలో త్రికోటీశ్వరుని లీలలు మహిమాన్వితంగా భక్తులు విశ్వసిస్తుంటారు. ఏటా శివరాత్రి సందర్భంగా ఈ రెండు పుణ్యక్షేత్రాలకు వేలాది మంది భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారు. కోటప్పకొండ తిరునాళ్లను ఏపీ ప్రభుత్వం అధికారిక పండుగగా ప్రకటించింది. అమరావతిని కేంద్రప్రభుత్వం ప్రసాద్ పథకం కింద అభివృద్ధి చేస్తోంది. కోటప్పకొండలో గత నాలుగేళ్లలో సుమారు రూ 10 కోట్లతో అభివృద్ధిపనులు చేపట్టారు. నయనానందకరంగా ఉండే ఈ రెండు ప్రాంతాల చారిత్రక, ఇతిహాసక ఘట్టాలను అవలోకిస్తే పరమ శివుని లీలలు సాక్షాత్కరిస్తాయి.
మహిమాన్వితం..
బౌద్ధారామంగా పరిఢవిల్లుతున్న అమరావతి పంచారామంగా ప్రత్యేకతను సంతరించుకుంది. కృష్ణానదీ తీరాన దేవతలకు నిలయంగా భావించే పంచారామ క్షేత్రాల్లో అమరావతి ప్రథమమైనది. ఈ క్షేత్రంలో కొలువై ఉన్న అమరేశ్వరుడిని క్రౌంచనాధుడని కూడా పిలుస్తారు. ఇక్కడ దేవేంద్రుడు పూజించినట్లు పురాణాలు చెప్తున్నాయి. స్కంద పురాణంలో దేవదానవులు క్షీర సాగరాన్ని మధించిన సమయంలో పొందిన అమృత లింగాన్ని తారకాసురుడు అనే రాక్షసుడు అపహరించి తన కంఠాన ధరించి దేవతలను బాధించేవాడు. అంతట దేవతలు మహేశ్వరుడిని వేడుకోగా తారకాసురుడి బారి నుండి దేవతలను కాపాడేందుకు దేవతల సేనాని కుమారస్వామిని పంపుతారు. కుమారస్వామి తారకాసురిడితో యుద్ధం చేసి జయించి అతని కంఠాన ఉన్న అమృత లింగాన్ని ఛేదించాడు. దీంతో అమృతలింగం శకలాలుగా ఐదు ప్రదేశాల్లో పడుతుంది. అందులో ప్రథమ ఆరామంగా అమరారామం విరాజిల్లుతోంది. ఇక్కడి అమరేశ్వరస్వామి దేవతల గురువు బృహస్పతిచేత ఇంద్ర ప్రతిష్టులైన స్వామి జగద్విఖ్యాతులు. అమరేశ్వరస్వామి ఆదేశానుసారం శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమరావతి జమీందారుగా రాజధానిగా ఎంచుకుని కృష్ణాతీరాన అమరేశ్వరుని ఆలయం చెంతనే కోట నిర్మించారు. దేవాలయాన్ని అద్భుతంగా విమాన మంటపాలు, ప్రాకార గోపురాలతో నిర్మించారు. తన పరగణాలో ఏక ముహూర్తంలో 108 శివాలయాలను స్వర్ణ, ధ్వజ శిఖర ప్రతిష్ఠలు జరిపి అందుకు చిహ్నంగా రెండవ ప్రాకారంలో తులాభార మంటపాన్ని నిర్మించారు. ఆస్థాన పండితులైన ములుగు పాపయారాద్యులు నుండి శివదీక్ష తీసుకుని 33 సంవత్సరాలు పాలన సాగించి శ్రీ అమరేశ్వర స్వామి వారికి శాశ్వత, నిత్యధూప దీప నైవేద్యాలకు, అర్చకులు, పరివార సిబ్బందికి అసంఖ్యాకంగా అగ్రహారాలు, ఈనాములు అందించినట్లు చారిత్రక ఆధారాలు.
స్వామివారి ఓంకారానికి ప్రతి రూపంగా లలాటంలో మూడు చిన్న చిన్న గుంతలు దర్శనమిస్తాయి. ఆరుద్ర నక్షత్రాన స్వామివారికి అన్నాభిషేకం నేటికీ నిర్వహిస్తున్నారు. కిరాట రూపంలో ఉన్న శివుడు అర్జునుడితో యుద్ధం చేసినప్పుడు పార్శ్వ భాగంలో గాయమైనప్పుడు ప్రవహించిన రక్తపు చారలు ఈనాటికీ ఇక్కడి శివలింగంపై సాక్షాత్కరిస్తుంటాయి. ఇక్కడి శివలింగం 7 అడుగులు ఉండటంతో ప్రత్యేక మిద్దె పై నుంచి అభిషేకాలు చేస్తారు. ప్రసాద్ పథకం ద్వారా అమరావతి క్షేత్రానికి రూ 17 కోట్లు మంజూరయ్యాయి. స్నానఘట్టాలు, ఆలయ ఆధునికీకరణ, క్యూలైన్లు, గ్రానైట్ మండపం అభివృద్ధి చేశారు. సుమారు రెండున్నర కోట్లతో గాలిగోపురం నిర్మాణం జరుగుతోంది.
మూడు కొండల మధ్య ...
నరసరావుపేటకు 15 కిలోమీటర్ల దూరంలోని కోటప్పకొండ చారిత్రక ప్రసిద్ధి గాంచింది. మూడు కొండల మధ్య కొలువై ఉన్న ముక్కంటి భక్తులకు కొంగుబంగారంగా నిలుస్తున్నాడు.
దక్షయజ్ఞం అనంతరం ఈశ్వరుడు సతీవియోగంతో ప్రశాంతత కోసం త్రికూటాద్రి (కోటప్పకొండ) పర్వతంపైన పుష్కరకాలం వటుడిగా తపస్సు ఆచరిస్తుండగా సదాశివుని అనుగ్రహం కోసం బ్రహ్మ, విష్ణు, సకల దేవతలు, రుషి పుంగవులు స్వామి కటాక్షం కోసం అక్కడ తపమాచరించి ప్రసన్నుడిగా స్వామిని దర్శించుకుని జ్ఞానదీక్ష పొందారు. అందువల్లే ఈ క్షేత్రం మహాపుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది.
జంగమ దేవర రూపంలో..
కోటప్పకొండ పురాణగాథ వింటే ఇక్కడ వెలసిన త్రికోటీశ్వరుని లీలలు అవగతమవుతాయి. ఈ ప్రాంతంలో గొర్రెల కాపరి సుందుడు అతని భార్య కుందిరి జీవనం సాగిస్తున్నారు. వారికి కాలక్రమంలో ఆనందవల్లి అనే కుమార్తె జన్మించింది. అప్పటి నుంచి వారికి అష్టయిశ్వర్యాలు సిద్ధించాయి. ఆనందవల్లి శివ భక్తురాలు. చిన్నతనం నుంచి యాంత్రిక జీవనాన్ని వదిలి త్రికోటీశ్వర పర్వతంపై నిత్యం తపమాచరించేది. అంతట శివుడు ఆమెకు జంగమదేవర రూపంలో ప్రత్యక్షమవుతాడు. ఆనందవల్లి పాప వినాశన దూన వద్దకు వెళ్లి తీర్థం రుద్ర శిఖరానికి తెచ్చి జంగమయ్యకు అభిషేకాది పూజలు చేసేది. ఆమెను పరీక్షించేందుకు పలువిధాలుగా కష్టపెడుతున్నప్పటికీ పూజలు మానలేదు. అంతట జంగమయ్య- ఇంటికి వస్తాను. అక్కడే వ్రతమాచరించాలని, వెనుతిరిగి చూడవద్దని చెప్తాడు. ప్రళయధ్వనులకు తాళలేక ఆనందవల్లి బ్రహ్మశిఖరం వద్ద వెనుతిరిగి చూస్తుంది. జంగమయ్య అక్కడే శిలగా మారతాడు. ఆ చోటనే కోటేశ్వరాలయం నిర్మించారు. ఈ ఆలయానికి దిగువ భాగాన గొల్లభామ శిలగా మారిన ప్రాంతంలో ఆనందవల్లి గుడికట్టారు. ఈ గుడిని సాలంకయ్య నిర్మించినట్లు స్థలపురాణం చెప్తోంది. రుద్ర శిఖరంపై స్వామివారు తపమాచరించారు. ఇక్కడే పాత కోటీశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఆరుద్రోత్సవం సందర్భంగా కర్పూర జ్యోతి దర్శనం ఉంటుంది. విష్ణుశిఖరంలో దక్షయజ్ఞంలో పాల్గొన్న దేవతలు, రుషులు, పాప విమోచనం పొందిన పవిత్ర స్థలంలో పాపవిమోచనేశ్వరాలయం నెలకొల్పారు. దీనికి 600 అడుగుల ఎత్తులో త్రికోటీశ్వరస్వామి దేవాలయం నిర్మించారు. ఘాట్ రోడ్డు నిర్మాణంతో ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. బ్రహ్మచారి అయిన దక్షిణామూర్తి క్షేత్రం కావడంతో ఇక్కడ కల్యాణోత్సవాలు నిర్వహిస్తుంటారు. ధ్వజస్తంభం కూడా ఉండదు. ఎటువైపుచూసినా మూడు శిఖరాలుగా కోటప్పకొండ దర్శనమిస్తుంది. వీటిని బ్రహ్మ, విష్ణు, రుద్ర శిఖరాలుగా పిలుస్తారు. బ్రహ్మ శిఖరంపై బ్రహ్మ నివసించాడని ప్రతీతి. జ్యోతిర్లింగం ఈ ప్రాంతంలో లేకపోవడంతో బ్రహ్మ ఈశ్వరుని గురించి తపస్సు చేయగా అప్పుడు స్వామి ప్రత్యక్షమై బ్రహ్మ కోరిక తీర్చేందుకు జ్యోతిర్లింగంగా వెలిశాడని పెద్దలు చెప్తుంటారు. ఆ జ్యోతిర్లింగమే ప్రస్తుతం భక్తుల పూజలందుకుంటున్న కోటేశ్వర లింగం.
కొండపైకి మార్గాలు
దివ్య మహిమ కలిగిన త్రికూటాచలం పైకి చేరేందుకు ప్రస్తుతం రెండు మార్గాలు ఉన్నాయి. పాప వినాశన స్వామి దేవస్థానం పశ్చిమాన మెట్ల మార్గంతో పాటు వాహనాలతో పైకి చేరుకునేందుకు వీలుగా ఘాట్ రోడ్డు సదుపాయం కల్పించారు.
ఘాట్‌రోడ్డులో పర్యాటకం
కొండపైకి వెళ్లే ఘాట్‌రోడ్డులో ఇంకా అభివృద్ధిపనులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ భారీ స్థాయి ఆక్వేరియం ఉంది. నెమళ్లు, కొంగలు, దుప్పులు, జింకలు.. ఇలా అనేక వన్యప్రాణులు పర్యాటక క్షేత్రంలో ఉన్నాయి. టాయ్‌ట్రైన్ కొండ ప్రాంతంలో నాలుగు కిలోమీటర్ల మేర తిరుగుతుంది. ఇక్కడ ఏర్పాటుచేసిన పిల్లల రాజ్యం నిండా రంగుల రాట్నాలు, రోప్‌వే ఆకర్షిస్తుంటాయి. కాళింది మడుగులో బోటు షికారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రెండేళ్ల క్రితం ప్రభుత్వం కోటప్పకొండ తిరునాళ్లను అధికారిక ఉత్సవంగా ప్రకటించి ఉత్సవాలు నిర్వహిస్తోంది.

చారిత్రక విశేషాలు
చారిత్రక త్రికోటీశ్వరాలయం క్రీస్తుశకం 1172 నాటికే ప్రసిద్ధి చెందినట్లు వెలనాటి చోళరాజైన కుళోత్తుంగ చోళరాజు, సామంతుడు మురంగినాయుడు వేయించిన శాసనాల ద్వారా తెలుస్తోంది. నరసరావుపేట, చిలకలూరిపేట, అమరావతి, పెట్లూరివారిపాలెం జమీందార్లు, శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి భూములు సమర్పించినట్లు చారిత్రక ఆధారం. భక్తులైన సాలంకులు, అతని ముగ్గురు సోదరులు పంచబ్రహ్మ స్థానంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర లింగ స్వరూపులు కావడం ఆనందవల్లి (గొల్లభామ) శివైక్య సంధానమవడం ఈ క్షేత్ర వైశిష్ట్యం.

-పోపూరి శ్రీనివాసరావు