S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దక్షిణ కాశి శ్రీముఖలింగం

శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖలింగం గ్రామంలో కొలువై ఉన్న శ్రీముఖలింగేశ్వరుని దర్శనం మోక్షానికి మార్గం. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ క్షేత్రం దక్షిణకాశీగా పేరొందింది. రాజులు, జమీందారులతో ఇక్కడి విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. ఇక్కడ సాక్షాత్తు శివుడే ఉద్భవించి ముఖ దర్శనం ఇచ్చారని అం దుకే ముఖలింగేశ్వరునిగా, మధువృక్షం(విప్పచెట్టు) పూజలందుకుంటుండడంతో మధుకేశ్వరునిగా పిలువబడుతోంది. ఆలయం వెనుక గలగలపారే వంశధార సెలయేరు ఉంది. ఉత్తరభాగంలో ఎతె్తైన కొండలు, చుట్టూ పచ్చని కొబ్బరిచెట్ల అందాల నడుమ ఈ క్షేత్రం కనిపిస్తూ భక్తులను ఆకట్టుకుంటుంది. ప్రధాన దేవాలయం మధుకేశ్వర ఆలయంతో పాటు భీముడు ప్రతిష్టించిన భీమేశ్వర ఆలయం, చంద్రుడు ప్రతిష్టించిన సోమేశ్వర ఆలయాలు ఉన్నాయి. ప్రధాన ఆలయ ప్రాంగణంలో ఉత్తర దిశగా వారాహి అమ్మవారు ఉంది. ఈ క్షేత్రంలో పంచాయతనం కలదు. గర్భగుడిలో కూర్చుని చూస్తే విఘ్నేశ్వరుడు, సూర్యనారాయణ స్వామి, మధుకేశ్వర, నారాయణుడు, వారాహి అమ్మవారు కనిపిస్తారు. అలాగే ఇక్కడ అష్టగణపతులు ఉన్నారు. దేశంలో ఏ దేవాలయమైనా తూర్పు ముఖంగా ఉంటుంది. ఇక్కడ సోమేశ్వర ఆలయం పశ్చిమముఖంగా ఉండటం విశేషం. ప్రధాన ఆలయం మూలవిరాట్ వెనుక గొప్ప చరిత్ర కలిగిన పానవట్టం నిర్మాణం ఉంది. గర్భగుడి ముఖద్వారం కన్న పెద్దదైన ఆలయంలో అలా ఉండడం ఇక్కడి చరిత్రకు ప్రత్యక్ష నిదర్శనం.
చిత్రశేణుడనే కోయ ప్రభువు ఈ ప్రాంతంలో జీవనం సాగించేవాడు. ఆయనకు చిట్టి అనే భార్య ఉండేది. కొన్నాళ్ల అనంతరం చిక్కల అనే పేరున్న జంగమ స్ర్తి శ్రీశైలం నుంచి కాశీపోవడానికి బయలుదేరి దారితప్పి ఆ అరణ్యంలోనికి వచ్చి చిత్రశేణుడి కంట పడింది. ఆమె అపురూప సౌందర్యాన్ని గాంచి మోహపరవశుడై వారిరువురూ ఒకరినొకరుమెచ్చి మొదటి భార్య అనుమతితో చిక్కల జంగమస్ర్తిని చిత్రశేణుడు వివాహం చేసుకున్నాడు. కొంత కాలానికి భార్యల నడుమ చెలరేగిన కలహాగ్ని వల్ల చిత్రశేణుడిలో సహనం, ఓర్పు నశించింది. మధువృక్షం పక్షపాతవైఖరే భార్యల నడుమ పరస్పర కలహాలను రేకెత్తించిందని చిట్టి, చిక్కలు పూజ చేస్తున్న మధువృక్షాన్ని గొడ్డలితో నరికివేశాడు. అది నేలకొరిగే తడవుగా మహాగ్నిజ్వాలలు అక్కడ గల పుట్టనుండి వెలువడ్డాయి. అగ్నిజ్వాలల నుండి స్వామి ప్రత్యక్షమైనట్టు పూర్వీకుల గాథ. ఈ చరిత్ర స్కందపురాణంలో ఉందని పలువురు చెబుతున్నారు. ఈ ఆలయ చరిత్ర వినాలంటే నెలలు కాలం పడుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి ఉత్తరభాగాన ఎతె్తైన కొండపై నరనారాయణుల ఆలయం ఉంది.
ఆలయ నిర్మాణం
కళింగదేశాన్ని పాలించిన జంగమ వంశీయ రాజులు రెండో కామవర్ణువుని శ్రీముఖలింగం ఆలయం నిర్మించారు. తరువాత ఆలయం శిథిలమైనట్టు చరిత్ర చెబుతోంది. కళింగాధిపతిగా ప్రఖ్యాతి పొందిన ఒడిశా రాష్ట్రంలోని పర్లాకిమిడి రాజు విష్ణువర్ధన్ గజపతికి స్వప్నంలో స్వామి కనిపించి- నేను మధుకావృక్షం కోటరంలో ఉన్నాను. రేపు నీవు వేటకు పోయేటప్పుడు నీకొక బంగారుచిలుక కనిపిస్తుంది. నీకు మార్గాన్ని నిర్దేశిస్తుంది. ఆ పక్షి ఏ పుట్టలో దూరుతుందో అందులో నేనుంటాను.. అని చెప్పాడట. ఆ ప్రాంతంలో నీకు నందివాహనం గల సువర్ణబంగారు నాణేలు లభిస్తాయి. ఆ ప్రాంతంలో భక్తుల రాకపోకలకు అనుకూలంగా బాగుచేయించి భోగభాగ్యాలను జరిపించమని స్వామి అదృశ్యమయ్యారని స్థల పురాణం చెబుతోంది. ఈ గ్రామ పొలిమేరల్లో ఒకటి తక్కువ కోటి లింగాలు ఉన్నట్టు పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయానికి వాస్తు శిల్పసంపద ప్రాచీనమైనదిగా గోచరిస్తుంది. సాహిత్యశిల్ప కళ అలయంలో దర్శనమిస్తాయి. ఒడిశాలోని భువనేశ్వర్‌లో గల ముక్తేశ్వర ఆలయం నిర్మాణం పద్ధతుల్లో ముఖలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణం గోచరిస్తున్నట్టు పెద్దల అభిప్రాయం. ఇక్కడ ఏటా మహాశివరాత్రి మొదలుకొని నాలుగు రోజులు ఉత్సవాలు జరుపుకొంటారు. మాఘమాసం పాడ్యమి ఘడియల్లో వంశధార నదిలో లక్షలాది మంది భక్తుల మధ్య స్వామికి చక్రతీర్థస్నానం జరుగుతుంది.
రవాణా సౌకర్యాలు
శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ప్రతి అర్థగంటకు ఒక బస్సు సర్వీసు అందుబాటులో ఉంటుంది. పాతపట్నం వెళ్ళే ప్రతి ఆర్టీసీ బస్సు శ్రీముఖలింగం వెళ్తుంది. దూరప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు రైలుమార్గంలో తిలారు రైల్వే స్టేషన్‌లో దిగాలి. అక్కడ నుంచి ప్రైవేటు వాహనాలు, ఆటోలు దొరుకుతాయి. అక్కడ నుంచి 22 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సివుంటుంది. శ్రీముఖలింగం వెళ్ళేందుకు ప్రధాన కూడలిగా చల్లవానిపేట జంక్షన్ ఉంటుంది. అక్కడకు చేరుకుంటే 17 కిలోమీటర్లు దూరమైనప్పటికీ, ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సు సర్వీసులు విరివిగా దొరుకుతాయి. ఒడిశా, కోల్‌కత నుంచి వచ్చే భక్తులు తిలారు రైల్వే స్టేషన్‌లో దిగి, అక్కడ నుంచి వాహనాల్లో శ్రీముఖలింగం చేరుకోవచ్చు.

-వురిటి శ్రీనివాస్