S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గుర్తింపు

పల్లెలో చదువు అయిదవ తరగతి దాకా సాగింది. పల్లెలో నా తరగతిలో నాకంటే తెలివిగలవారు ఎవరూ లేకపోవడం ఆశ్చర్యం కాదు. కనుక నాకు పోటీ లేదు. అయితే అది చదువు వరకు మాత్రమే. ఆటపాటలు నాకు అసలు చేతకావు. పల్లె బడిలో కూడా సంవత్సరానికి ఒకసారి ఆటల పోటీలు ఉండేవి. సెంటర్ స్కూల్ కనుక పక్క పల్లెల వాళ్లు కూడా పోటీలో పాల్గొనేవారు. ఆ పోటీల్లో నాకు పాల్గొనడానికి అవకాశం ఉండేది కాదు. తమ్ముడు కప్పగంతులు అనే పోటీలో గెలిచి రావడం నాకు గుర్తుంది. నాకు అది కూడా చేతనయినట్టు లేదు. అయితే నా కొరకేనేమో అన్నట్టు ఆటల పోటీలో భాగంగా ఒకసారి కథల పోటీ, పద్యాల పోటీ కూడా పెట్టారు. ఇక నాకు ఎదురేది? పక్క పల్లెల నుంచి వచ్చిన వారు పుస్తకాలలో నుంచి కథలను బట్టీపట్టి అప్పజెప్పారు. తరువాత నాకు మంచి మిత్రుడయిన విష్ణు కూడా అదే పద్ధతిలో కథ చెప్పినట్టు జ్ఞాపకం. బాగా గుర్తుంది. నేను మాత్రం అప్పటికే చందమామ, బాలమిత్ర తెగ చదివేవాడిని. ఎన్నో కథలు గుర్తుండేవి. భసాపంకం అన్న కథ పోటీలో చెప్పినట్టు నాకు గట్టిగా గుర్తుంది. భసాపంకం అంటే సభా కంపం అని అర్థం. అంటే పెద్దవాళ్లను చూచి మాటలు పొరపాటుగా పలకడం, మరొక కథ కూడా గుర్తుకు వస్తున్నది. అది చెవిటి వాళ్లకు సంబంధించిన కథ. నేను నాన్న దగ్గర నుంచి నేర్చుకున్న నాటకీయతను అంతా వాడి కథ చెప్పాను. బహుమతి గెలుచుకున్నాను. ఇక పద్యాల పోటీ. ఎదుటి వాళ్లంతా నాలుగు పద్యాలు చెపితే, నేను ఏకంగా సుమతి శతకం మొత్తం ఏకరువు పెట్టినట్టు గుర్తు. పెద్దవాళ్లు ఆపమంటే ఇక ఆపినట్టున్నాను.
చదువు పాలమూరికి మారింది. పల్లెలో ఎదురులేదు. పట్నంలో మ రి చాలామంది ఉంటారని, అం దులో నేను గుంపులో గోవింద అవుతానని మనసులో ఒక చింత కొంతకాలం ఉండేది. కానీ అది త్వరలోనే తీరిపోయింది. ఆటలు చేతగావు సరే గానీ, మాటలు, చదువుకు సంబంధించిన విషయాలలో మాత్రం మనకు మంచి అవకాశాలు ఉన్నాయని బాగా తెలిసిపోయింది. బేసిక్ స్కూల్‌లో చదివిన మూడు సంవత్సరాలు వరుసబెట్టి ప్రతి సంవత్సరం ఉత్తమ విద్యార్థి బహుమతి గెలుచుకున్నాను. ఒకసారి ఆ బహుమతి నాకు రాలేదని ముందే అర్థమయింది. సంగతి ఏమిటో తెలుసుకోవాలని చాలా ధయిర్యంగా స్ట్ఫారూమ్‌లోకి దూరాను. సమయానికి అక్కడ బహుమతుల నిర్ణయాలే జరుగుతున్నాయి. నాకు బహుమతి రాలేదట ఏమిటి? అని గట్టిగా అడిగేశాను. నాన్న అక్కడే ఉపాధ్యాయుడు. నేను మంచి విద్యార్థిని. కనుక పంతుళ్లు అందరితోను చాలా చనువుగా ఉండేవాడిని. వాళ్లు నాకు పట్టిక చూపించారు. అందులో ఒక అబ్బాయికి నాకన్నా ఎక్కువ మార్కులు వచ్చినట్టు చూపించారు. చిత్రంగా ఆ అబ్బాయి నాన్నగారు కూడా ఆ బడిలోనే ఉపాధ్యాయుడు. నాన్నకు మంచి మిత్రుడు కూడా. అసలు సంగతిని నను పసిగట్టాను. అతనికి నాకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన మాట నిజమే. కానీ ఎక్కువ శాతం రాలేదు. తరగతి తేడా లేదా సిలబస్ తేడా గురించి నాకు గుర్తులేదు గానీ, మాకు మొత్తం ఏడువందల మార్కులు ఉంటే ఆ అబ్బాయి క్లాసు వారికి ఆరు వందలే ఉన్నాయి. ఆ సంగతి నేను పెద్దలకు గుర్తు చేశాను. వాళ్లంతా నోళ్లు వెళ్లబెట్టారు. బహుమతి నాకు ఇవ్వక తప్పలేదు. ఆ బడిలో ఉండగానే జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్‌లో పాల్గొన్నాను. నిజానికి పనె్నండవ తరగతి వరకు విద్యార్థులంతా ఉపన్యాసం, వ్యాస రచన పోటీలలో పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో రెండు బహుమతులు నాకే వచ్చాయి. సైన్స్ ఫెయిర్‌లో బహుమతి ఇచ్చినప్పుడు మామూలుగా వెళ్లి అందుకున్నాను. అందరు చప్పట్లు కొట్టారు. మరుసటి రోజున బడిలో ప్రార్థన అనే అసెంబ్లీ జరుగుతున్నది. శ్యామసుందర రావుగారు హెడ్మాస్టర్. ముఖ్యమయిన విషయాలు చెప్పవలసి వచ్చినప్పుడు ప్రార్థన తరువాత ఆయన అందరినీ ఉద్దేశించి మాట్లాడేవారు. ఆ రోజున కూడా ఆయన మాట్లాడడం మొదలుపెట్టారు. పిల్లలు, చదువులు గురించి ఏదో చెప్పి అంతకు ముందు రోజు సైన్స్ ఫెయిర్‌లో నేను సాధించిన విజయం గురించి చాలా గొప్పగా వర్ణించారు. నన్ను వేదిక మీదికి పిలిచారు. సర్ట్ఫికెట్‌లను మళ్లీ ఒకసారి నాకు ఇచ్చి అందరిచేత చప్పట్లు కొట్టించారు. ముందు రోజు చప్పట్లు నాకు గొప్పగా తోచలేదు. అక్కడ చేరిన మనుషులంతా ఎక్కడి వారు అక్కడిగా వెళ్లిపోతారు. ఇక్కడి వారు మాత్రం సంవత్సమంతా నాతోనే ఉంటారు. పైగా నాన్న కూడా అక్కడే ఉన్నాడు. సాయంత్రం ఆయన నాకు ఒక సంగతి చెప్పాడు. బహుమతి రెండవసారి అందుకున్న నేను కళ్లలో నీళ్లు పెట్టుకున్నానట. అది నాకు గుర్తులేదు. గుర్తింపు అన్న ఒక అనుభవానికి అది ప్రతిక్రియ మాత్రమే. గుర్తింపు అలవాటయి పోయింది.
హైస్కూల్ చేరుకున్నాను. అక్కడ కూడా చాలా రకాల కార్యకలాపాలలో మంచి పేరు సంపాదించుకున్నాను. స్కౌటింగ్‌లో రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందాను. సైన్స్ ఫెయిర్‌లో కూడా బహుమతులు గెలుచుకున్నాను. వెంకటరత్నం మాస్టారు నాన్నకు మిత్రులు. నాకు చదువు చెప్పలేదు గానీ, నన్ను ఎంతో అభిమానించారు. ఆయన రూపొందించిన రెండు ప్రయోగాలను సైన్స్ ఫెయిర్‌లో ప్రదర్శించి బహుమతి గెలుచుకున్నాను.
కాలేజి చేరుకున్నాను. అక్కడ రకరకాల కారణాలుగా చదువులో పస తగ్గింది. తెలంగాణ ఉద్యమం అందుకు ప్రధానమయిన కారణం. మొదటి సంవత్సరం చాలా చప్పగా గడిచింది. రెండవ సంవత్సరంలో ఒక విచిత్రం జరిగింది. కాలేజిలో తెలుగు సమితి అని ఒకటి ఏర్పాటు చేశారు. దానికి ఇద్దరు విద్యార్థులను నిర్వాహకులుగా ఎంపిక చేయాలి. ఆ ఎంపిక కొరకు వక్తృత్వ పోటీ పెట్టారు. ఎందుకోగానీ నేను పేరు ఇవ్వలేదు. మూడవ సంవత్సరం వారు నాకంటే బలంగా ఉంటారని బహుశా అనుకుని ఉంటాను. నేను తరగతిలో ఉన్నాను. దూరంగా ఒక హాల్లో ఉపన్యాసం పోటీ జరుగుతున్నదన్న సంగతి కనిపిస్తూనే ఉన్నది. అంతలో మా క్లాస్ అయిపోయింది. అందరము పోటీ జరుగుతున్న చోటుకి వెళ్లాము. నిజానికి పోటీ కూడా అయిపోతున్నది. నేను హాల్‌లోకి రావడం చూసి తెలుగు లెక్చరర్ గోపాల్‌రెడ్డిగారు ఒక ప్రకటన చేశారు. పేరు ఇవ్వని వారు కూడా ఎవరయినా మాట్లాడదలచుకుంటే రావచ్చు అని అంటూనే ఆయన నావేపు చూచి రమ్మన్నట్టు తల ఆడించారు. నేను వెళ్లాను. సాహిత్య ప్రయోజనం అన్న అంశం గురించి ధారాళంగా మాట్లాడాను. మొత్తం ప్రసంగంలో డ్రామా అన్న ఒక్క ఆంగ్ల పదం మాత్రమే వాడినట్టు నాకు బాగా గుర్తు ఉంది. నా ఉపన్యాసం తరువాత హాలు చప్పట్లతో మార్మోగింది. నేను కన్వీనర్‌గా ఎంపిక అయినట్టు అక్కడికి అక్కడ ప్రకటించారు గోపాల్‌రెడ్డిగారు. అంతకంటే ఆశ్చర్యం ఏమంటే, మూడవ సంవత్సరం విద్యార్థి శ్రీనివాసులు జాయింట్ కన్వీనర్. అతను నాకు సన్నిహిత మిత్రుడు. ప్రేమగా వచ్చి నన్ను అభినందించాడు. నొచ్చుకున్నట్టు ఎక్కడా కనిపించలేదు. సైన్స్ సమితి పక్షాన చేసిన ఒకటి, రెండు కార్యక్రమాలను గురించి విడిగా రాస్తే బాగుంటుందేమో!
మనిషికి గుర్తింపు అన్నది గొప్ప బలాన్ని ఇస్తుంది. పల్లెలో గెలిచాను. చిన్న బడిలో గెలిచాను. కాలేజిలో గెలిచాను. ఇక యూనివర్సిటీ స్థాయికి వెళ్లి చదువుకుంటున్నాను. చదువులో పోటీకి చోటు లేదు. ఎవరి కొరకో చదువుకోము. ఎవరికి వారు బాగా చదువుకోవాలని చదువుకుంటాము. మొదటి సంవత్సరంలో 74 శాతం మార్కులు వచ్చాయి. అందరూ ఆశ్చర్యపోయారు. ప్రాక్టికల్స్ కన్నా థియరీలో ఎక్కువ శాతం మార్కులు సంపాదించాను. రెండవ సంవత్సరంలో అది వీలు కాదని నాకు బాగా అనుమానంగా ఉండేది. పరీక్షలు రాసి ఇంటికి వచ్చాను. ఈ విషయం గురించి ఇంతకు ముందు రాసి ఉంటే నన్ను క్షమించాలి. సందర్భం కనుక స్వంత డబ్బా వాయించుకుంటున్నాను. ఎవరో వచ్చి నీవు యూనివర్సిటీ ఫస్ట్ వచ్చావట, అని చెప్పారు. నిజం చెపుతున్నాను. నాకు నమ్మకం కలగలేదు. నాకంటే బాగా చదువుకునేవారు, బొమ్మలు గీసేవారు, డిసెక్షన్స్ చేసేవారు ఒకరిద్దరు ఉన్నారని నా అనుమానం. అందుకే వెంటనే ఎగిరి గంతు వేయలేదు. నా హాల్‌టికెట్ పాలమూరులో ఉంది. అక్కడికి వెళ్లి ఆ నంబరు, తరువాత పేపరులో నంబర్ల క్రమం చూచిన తరువాత నాకు నమ్మకం కలిగింది. అప్పుడు సమీక్షించుకుంటే నాకు క్లాస్ ఫస్ట్, యూనివర్సిటీ ఫస్ట్ రావడానికి గల కారణాలు అర్థమయ్యాయి. కేవలం జ్ఞాపకశక్తి కారణంగా జవాబులు రాయడం వేరు, విషయం మీద లోతయిన అవగాహన కారణంగా జవాబులు రాయడం పూర్తి వేరు. నా చదువు, పరీక్షల్లో జవాబులు రాయడం కనీసం రెండవ సంవత్సరంలో ఈ రెండవ పద్ధతిలో సాగిందని గట్టి నమ్మకం. ఈ విషయం గురించి వేరుగా చెప్పాలి. వివరంగా చెప్పాలి. అది నాలాంటి వారికి, మరి కొందరికి సహాయంగా ఉంటుందని కూడా నమ్మకం. నా ఒక్కడికి గుర్తింపు వచ్చి లాభం లేదు, నాలాంటి వారు అందరికీ గుర్తింపు రావాలి. అది నా బాధ.

కె. బి. గోపాలం