S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పవిత్ర లింగాలు.. పంచారామాలు

పూర్వం రాక్షసుల పీడ ఎక్కువ కావడంతో దేవతలు శివుడ్ని ప్రార్థించారు. శివుడు త్రిపురాసురుడనే రాక్షసుడిని సంహరించాక, ఆ రాక్షసుని మెడలోని శివలింగం అయిదు ముక్కలుగా ఛేదించబడి గాలిలో ఎగసి అయిదు ప్రాంతాల్లో పడ్డాయి. ఆ ముక్కలు పడిన అయిదు ప్రాంతాల్లోను శైవక్షేత్రాలు వెలిశాయి. అవే పంచారామాలు అని పెద్దలు చెబుతారు.
అత్యంత మహిమాన్వితమైన శైవక్షేత్రాలుగా ఆంధ్రప్రదేశ్‌లోని పంచారామ క్షేత్రాలు విలసిల్లుతున్నాయి. వీటిలో రెండు తూర్పు గోదావరి, మరో రెండు పశ్చిమ గోదావరి జిల్లాలో వుండగా, ఐదో క్షేత్రం గుంటూరు జిల్లా అమరావతిలో ఉంది. అత్యంత ప్రాచీనమైన ఈ క్షేత్రాల్లో శివలింగాలను స్వయంగా పురాణ పురుషులే ప్రతిష్ఠించినట్టు శాసనాలు వెల్లడిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు (క్షీరపురి)లో స్వయంగా శ్రీరామచంద్రుడే ప్రతిష్ఠించినందున క్షీరారామంగా పేరుగాంచింది. భీమవరంలో చంద్రుడు ప్రతిష్ఠించినందున సోమారామంగా, తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో కుమారస్వామి ప్రతిష్ఠించినందున కుమారారామంగా ప్రసిద్ధిచెందాయి. ద్రాక్షారామంలో శివుడిని సూర్యుడు ప్రతిష్ఠించినట్టు ప్రతీతి. గుంటూరు జిల్లా అమరావతిలో దేవేంద్రుడు ప్రతిష్ఠించినందున అమరారామంగా ప్రసిద్ధి చెందింది. ఈ అయిదు క్షేత్రాల్లో ఉన్నది పరమ శివుడే అయినప్పటికీ, సామర్లకోట, ద్రాక్షారామలో భీమేశ్వరుడిగా, పాలకొల్లులో క్షీరా రామలింగేశ్వరునిగా, భీమవరం గునుపూడిలో సోమేశ్వరునిగా, అమరావతిలో అమరేశ్వరునిగా పూజలందుకుంటున్నారు.
పాలకొల్లు క్షీరా రామలింగేశ్వరస్వామి...
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో క్షీరారామలింగేశ్వరుడు కొలువైవున్న క్షీరారామంలో గర్భాలయాన్ని ఆనుకుని దక్షిణ దిశలో గోకర్ణేశ్వర, విఘ్నేశ్వర ఆలయాలు, ఉత్తర దిశలో సుబ్రహ్మణేశ్వరస్వామి, జనార్దన స్వామి ఆలయాలు ఉంటాయి. మధ్యలో క్షీరారామలింగేశ్వరుడు కొలువుదీరివుంటాడు. క్షీరారామలింగేశ్వరుని ఎదురుగా అతి పెద్ద ఏకశిల నంది విగ్రహం ఇక్కడ దర్శనమిస్తుంది. స్వామివారి మూలవిరాట్‌ను నాలుగువైపులా దర్శించుకునే విధంగా చిన్న కిటికీలు అమర్చి వుంటాయి. ఆలయ ప్రాకారం చుట్టూ సూర్య భగవానుడు, కాశీ విశే్వశ్వరుడు, పార్వతి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు, నగరలింగేశ్వర , డుండి విఘేశ్వరుడు, వీరభద్రుడు, సప్తమాతృకలు, కనకదుర్గమ్మ, బ్రహ్మ, సరస్వతి, కుమారస్వామి, కార్తికేయుడు, మహిషాసుర మర్దని, నాగసర్పం, సుంద, ఉపసుందులు, నటరాజు, దత్తాత్రేయుడు, కాలభైరవుడు, నాగేశ్వరుడు, శనైశ్వరుడు, శంకర భగవాత్పాదులు, రాధాకృష్ణుల విగ్రహాలు కొలువై రమణీయంగా భక్తులకు దర్శనమిస్తాయి. శివరాత్రి మహాపర్వదినం నాడు ఆలయంలో క్షీరారామలింగేశ్వరుడు, క్షేత్రపాలకుడు జనార్దనస్వామి వార్ల కల్యాణ ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి సోమవారం స్వామివారికి ప్రత్యేక అలంకరణ, 500 మందికి అన్నదానం, కళారాధన కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి నెల మాస శివరాత్రి సందర్భంగా లీలా కల్యాణం వైభవంగా సాగుతుంది. 108 బంగారు పుష్పాలతో పూజలు నిర్వహిస్తారు.
పాలకొల్లులో క్షీరారామలింగేశ్వరుడు నెలకొనివున్న ఆలయం పశ్చిమ గోదావరి జిల్లాలోనే అతి పెద్ద గోపురంగా ప్రసిద్ధి. తొమ్మిది అంతస్తులతో 120 అడుగులు ఎత్తులో ఈ గోపురం రెడ్డిరాజుల కాలంలో నిర్మించారని శాసనాలు చెబుతున్నాయి. సువిశాలమైన ఆలయం చుట్టూ ఉన్న మండపం ఆలయానికి ప్రత్యేక శోభనిస్తుంది. 10వ శతాబ్దంలో వేలుపతి దేవన్న కవి ఆలయ ప్రాకారాన్ని నిర్మించాడని, 918లో చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని నిర్మించాడని, 1157లో గుండాంబిక వెళంటి చోళుని భార్య అఖండ దీపాలు ఈ ఆలయానికి బహూకరించినట్లు శాసనాలు చెబుతున్నాయి. ఇక్కడకు సమీపంలోని దగ్గులూరు గ్రామానికి చెందిన ఒక కుటుంబం సంవత్సరం పొడవునా నేసిన తలపాగాను స్వామివారికి సమర్పిస్తారు. దీనిని గోపురం శిఖరం నుండి ఆలయ శిఖరం వరకు కట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఇక్కడ ఉన్న శివుడిని ఈశాన్య రూపుడని చెబుతారు.
భీమవరం శ్రీసోమేశ్వర జనార్దన ఆలయం...
పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వారి ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని గునుపూడి గ్రామంలో నెలకొనివుంది. తూర్పు చాళుక్యరాజులలో ప్రసిద్ధుడైన మొదటి చాళుక్య భీముడు 9వ శతాబ్దంలో ఈ దేవాలయానికి గోపురం, ప్రాకారం నిర్మించినట్లు చారిత్రాత్మక ఆధారాలున్నాయి.
ఈ దేవాలయం గురించి భీమఖండం, బ్రహ్మండ పురాణం, స్కందపురాణంలో పేర్కొన్నారు. ఈ ఆలయంలో లింగభాగాన్ని సాక్షాత్తూ చంద్రుడే స్వయంగా ప్రతిష్ఠించడం వల్ల లింగం అమావాస్య నాడు గోధుమ నలుపు వర్ణంలో, పౌర్ణమి నాడు శే్వతవర్ణం లో దర్శనమిస్తుంది. లింగం పైభాగంలో అన్నపూర్ణ అమ్మవారి విగ్రహం ఉండడం ఈ దేవాలయానికి మరొక ప్రత్యేకత. ఈ విధంగా దేశంలో మరెక్కడా కానరాదు. ఈశ్వరుడు గంగను శిరస్సుపై ధరించాడనడానికి ప్రతీకగా ఈ విధంగా నిర్మితమైందని భక్తజనుల నమ్మకం. ఈ దేవాలయానికి జనార్ధన స్సామి క్షేత్ర పాలకుడు. ఇక్కడే ఆంజనేయస్వామి, కుమార స్వామి, నవగ్రహ ఆలయాలు కూడా ఉన్నాయి. గాలిగోపురానికి ఇరువైపులా సూర్యభగవానుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వాములను ప్రతిష్ఠించారు. ఈ దేవాలయానికి తూర్పు వైపున చంద్రపుష్కరిణి అనే తటాకం ఉంది. దీన్ని సోమగుండంగా పిలుస్తారు. శివరాత్రికి ఇక్కడ నిర్వహించే తెప్పోత్సవం, రథోత్సవం ఎంతో గుర్తింపుపొందాయి.
సామర్లకోట భీమేశ్వరస్వామి ఆలయం
తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలోని శ్రీ చాళుక్య కుమారారామ భీమేశ్వర స్వామి ఆలయం అద్భుత శిల్ప కళాఖండంగా పేరొందింది. శ్రీ భీమేశ్వరాలయం వెలసిన భీమవరం గ్రామం ప్రస్తుతం సామర్లకోట పట్టణంలో ఒక భాగంగా ఉంది. ఇది పూర్వం చాళుక్య భీమవరంగా ప్రసిద్ధి చెందిందని భీమేశ్వరాలయంలోని పలు శిలా శాసనాల ద్వారా తెలుస్తోంది. చారిత్రకంగా చూస్తే క్రీస్తుశకం 872 నుండి 921వ సంవత్సరం వరకు మొదటి చాళుక్య భీమ నృపాలుడు కుమారారామమునే తన రాజధానిగా చేసుకుని రాజ్యపాలన చేసి భీమేశ్వర స్వామిపై అమిత భక్తితో ఆలయానికి సువిశాలమైన ప్రాకార మండపాదులు నిర్మింపచేశాడు. ఈ మహారాజుకు స్వామియందుగల అపారమైన భక్తివల్లే స్వామి చాళుక్య కుమారారామ భీమేశ్వరడయ్యారు. రాజు పేరుతో, స్వామి పేరుతో ఊరు చాళుక్య భీమవరమైంది. శ్యామలాంబ గుడి, దాని చుట్టూ ఒక కోట ఉండేదని ఆ కారణంగా ఇది శ్యామలకోట అని పిలువబడిందని, కాలక్రమంలో సామర్లకోటగా మారిందని పెద్దలంటారు. సామర్లకోటలోని భీమేశ్వరాలయం వాస్తులో అచ్చంగా ద్రాక్షారామలోని భీమేశ్వరాలయాన్ని పోలివుంటుంది. ఈ దేవాలయం చుట్టూ చెక్కిన రాతితో కట్టిన రెండు ప్రాకారాలున్నాయి. బయటి ప్రాకారానికి నాలుగు దిక్కుల నాలుగు గోపుర ద్వారాలున్నాయి. ఈ గోపుర ద్వారానికి ఇరువైపులా అర్ధమండపాలున్నాయి. లోపలి ప్రాకారం సమతులంగా రెండు భాగాలుగా చేయబడింది. మధ్య భాగంలో చూరు ఉన్నది. ఈ లోపలి ప్రాకారానే్న గోడగా ఉపయోగించి గుడి చుట్టూ రెండంతస్తుల మండపం నిర్మించారు. ఈ మండపం పైఅంతస్తుకు చేరడానికి తూర్పు భాగంలో మెట్లున్నాయి. ఈ లోపలి మండపం కింద భాగాన దక్షిణం వైపున వినాయకుని గుడి, సూర్యనారాయణమూర్తిగుడి, తూర్పు వైపున గిరిజా సుందరిదేవి గుడి ఉంది. లోపలి ప్రాకారం మధ్యలో ఉన్న భీమేశ్వరుని ఆలయం చతురస్రాకారంలో రెండు అంతస్తులతో నిర్మించారు. కింది అంతస్తులో ప్రతిష్ఠించిన లింగం చాలా ఎత్తయినది. కనుక ఇది కింద అంతస్తు పైకప్పుగుండా పోయి రెండవ అంతస్తులో ప్రవేశించి ఓంకార స్వరూపుడైన శివుడు కొలువుదీరినందున ఇది మహా శైవక్షేత్రంగా విరాజిల్లుతోంది. సాక్షాత్ శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దేవాలయానికి సమతూగగల ఈ ఆలయం భారీ ప్రాకారంతో సువిశాల ప్రాంగణంతో అలరారుతోంది. శ్రీశైలం మల్లిఖార్జున ఆలయం మాదిరిగా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆలయ కమిటీ యోచిస్తోంది.
ఈ రెండవ అంతస్తుకు దక్షిణ భాగంలో ఉన్న మెట్ల మార్గం ద్వారా ప్రవేశించాలి. ద్రాక్షారామంలో ఉన్నట్లుగానే ఇక్కడ కూడా గుడి ఆవరణలో భీమేశ్వరాలయం పోలికతో ఒక చిన్న గుడి నమూనా ఉంది. ఈ దేవాలయంలో క్రీస్తుశకం 1447 నుండి క్రీస్తుశకం 1494 మధ్య కాలంలో జారీచేసిన 31 శాసనాలున్నాయి. ఇవన్నీ దాన శాసనాలే. వీటిలో కొన్ని శాసనాలను బట్టి తూర్పున ఉన్న ముఖ మండపం నిర్మాణం క్రీస్తుశకం 1334లో జరిగినట్లుగా తెలుస్తుంది. ఆలయం పై భాగాన ప్రదక్షిణలు చేసే మార్గంలో స్వామి ఎదుట నిల్చినప్పుడు కుడి పక్కన ఉన్న స్తంభంపై జ్యోతిర్లింగాకృతి అయిన శివుని ఆద్యంతాలు కనుగొనేందుకు, విష్ణు వరహాకృతిలో లింగ మూలాన్ని కనుగొనడానికి బ్రహ్మ హంస వాహనంపై చివరి భాగాన్ని కనుగొనడానికి ప్రయాణించి వెడుతున్న దృశ్యాన్ని చూడవచ్చు. శ్రీ కుమారారామ భీమేశ్వర స్వామి వారి దేవేరిని ఇక్కడ శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అని పిలుస్తారు. అపురూప సౌందర్యవతి అయిన ఈ మాతను చూడడానికి రెండు కళ్లూ చాలవు. ఆలయంలో ఊయల స్తంభం నేటికి ఊపితే ఉగుతుంది. ఆలయంలో వందలాది స్తంభాలు ఉన్నప్పటికీ శిల్పి తన శిల్ప కళా వైవిధ్యంతో నిర్మించడంతో ఏ రెండు స్తంభాలూ ఒకేలా ఉండకపోవడం గమనార్హం. ఈ ఆలయంలో చైత్ర వైశాఖ మాసాల్లో సూర్య కిరణాలు ఉదయం పూట స్వామి వారి పాదాలను, సాయంత్రం వేళ అమ్మవారి పాదాలను తాకి పునీతం అవుతుంటాయి. ఆలయం పడమటి గోడలో అమర్చిన గణపతి విగ్రహం ఉంది. ఈ గణపతి నాభిలో వజ్రం ఉండేదట. ఆరోజుల్లో ఈ వజ్రం నుండి వచ్చే కాంతులే రాత్రిపూట భక్తులకు మార్గదర్శకంగా ఉండేవట. అందుకే ఈ గణపతి వజ్రగణపతి అయ్యాడు. ఆలయానికి పడమర దిక్కున ఏకాశిలా స్తంభం ఉంది. ఆలయంలో ఏకశిలా నంది, ఏక శిలా కప్ప స్తంభంలు నేటికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయని చెప్పవచ్చు
ద్రాక్షారామ భీమేశ్వరాలయం...
పంచారామ క్షేత్రాల్లో మరొకటి తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామ శ్రీ భీమేశ్వరాలయం. ఇది దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శివాలయం. ఇక్కడ సప్త గోదావరులు అంతర్వాహినులై ప్రవహిస్తున్నాయి. చారిత్రక ప్రాధాన్యం కలిగిన శాసనాలు ఎన్నో ఇక్కడ లభిస్తాయి. పురాణ, చారిత్రక, ఆధునిక యుగాల శిల్ప కళాభిరామం- ద్రాక్షారామం. కవి సార్వభౌమ శ్రీనాథుడు తన భీమేశ్వర పురాణంలో ద్రాక్షారామ వైభవాన్ని, ప్రాభవాలను చక్కగా వర్ణించాడు. నాలుగు పక్కలా గోపురాల నిర్మాణ వైశిష్ఠ్యాన్ని ఉగ్గడించారు. దక్షిణ నందన వన వాటి, దక్షవాటి అని శ్రీనాథుడు అభివర్ణించారు. దక్షుడు యజ్ఞం చేసిన ప్రదేశం కనుక ద్రాక్షారామ అయ్యింది. ద్రాక్షారామలోని శ్రీ భీమేశ్వరస్వామిని సూర్యుడు ప్రతిష్ఠించాడని భీమేశ్వర పురాణం చెబుతోంది. ఇక్కడ శివలింగం ఎత్తు 15 అడుగులు కాగా చుట్టూ రెండంతస్థుల ఆలయం ఉంది. ఆలయం కింది అంతస్తు చీకటిగా ఉంటుంది. ఈ అంతస్తులో ప్రదక్షిణలు చేసి, పైఅంతస్తులో శివార్చనలు జరపడం ఇక్కడి ఆచారం. లింగం శిఖరాన గంట్లు పడి ఉంటుంది. ఈ గంట్లు అర్జునుడు శివునిపై ప్రయోగించిన అస్త్రాల వల్ల ఏర్పడిన తూట్లని అంటారు. శివుడు ఛేదించిన లింగ భాగాన్ని ద్రాక్షారామలో ప్రతిష్ఠింపదలచిన సప్తరుషులు ముహూర్తాన్ని నిశ్చయించి స్థల శుద్ధికి గోదావరిని ఆహ్వానిస్తారు. గోదావరి అంగీకరించి, వారి వెంట ప్రవహిస్తుండగా రాక్షసులు యజ్ఞోపకరణాలు ఆ వెల్లువకు కొట్టుకుని పోయేలాచేశారు. తుల్యభాగుడు అనే రుషి మధ్యవర్తిత్వం జరిపి గోదావరి సప్త రుషుల అంతర్వాహినిగా ద్రాక్షారామ చేరేందుకు ఒప్పందం చేశారని, అందువల్లే సప్త గోదావరిగా ఏర్పడిందని పురాణ కథనం. శివుని అర్ధాంగి సతీదేవి దక్షుని యజ్ఞశాలలో అవమానింపబడి అగ్నికి ఆహుతికాగా శివుడు తన జడ నుండి వీరభద్రుడిని సృష్టించి పంపాడు. వీరభద్రుడు ద్రాక్షారామాన్ని ధ్వంసం చేసినట్టు కూడా పురాణ కథలో ఉంది. ఈ ఆలయంలో శ్రీలక్ష్మీ నారాయణస్వామి, విరూపాక్ష స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామితోపాటు శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఉన్నారు. 382 శాసనాలు దేవాలయం గోడలపై దర్శనమిస్తాయి. ఈ శాసనాలు 11 నుంచి 15వ శతాబ్దానికి చెందినవిగా చారిత్రకులు విశే్లషిస్తున్నారు. ఈ పంచారామాలు బౌద్ధ కేంద్రాలని, బౌద్ధమతం క్షీణదశలో ఈ ఆలయాలను శైవాచార్యులు చేజిక్కించుకుని శైవక్షేత్రాలుగా మార్చారనే కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ ఏకాదశి రోజున శ్రీ భీమేశ్వర స్వామి వారికి, క్షేత్రపాలకుడైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారికి, శ్రీ చండికా సమేత శ్రీ సూర్యేశ్వర స్వామి వారికి పాంచాహ్నికంగా ధ్వజారోహణ, కల్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ద్రాక్షారామ శ్రీ భీమేశ్వరాలయం దేవదాయ, ధర్మదాయ శాఖ అధీనంలో ఉన్నప్పటికీ కేంద్ర పురావస్తుశాఖ పూర్తి పర్యవేక్షణలో ఉంది.

చిత్రం..క్షీరారామ క్షేత్రం

-రమేష్, అప్పలాచార్యర్, అయ్యప్ప, రాజు