S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విడాకులు మంజూరు చేసేది పంచాయితీలే

అమెరికాలో జ్యూరీ సిస్టమ్ ఉంది. ఏదైనా క్రిమినల్ కేసులో పనె్నండుమంది జ్యూరీ సభ్యులు కేసు విచారణని గమనించి తీర్పు చెప్తారు. బ్రిటన్‌లో కూడా జ్యూరీ పద్ధతి ఉన్నా, బ్రిటిష్ పాలిత ఇండియాలో అది లేదు.
కానీ మన దేశంలో పార్శీ కమ్యూనిటీలో జ్యూరీ సిస్టమ్ గత 150 ఏళ్లుగా కొనసాగుతోంది. 1959లో బాంబే హైకోర్టులో నౌకాదళ ఆఫీసర్ కె.ఎం.నానావతి హత్యానేరం విచారణ తర్వాత క్రిమినల్ కేసుల్లో జ్యూరీ పద్ధతిని నిషేధించారు. తన భార్య ప్రేమికుడు ప్రేమ్ అహూజాని చంపాడన్న నేరాన్ని విచారించాక నానావతిని జ్యూరీ సభ్యులు నిర్దోషిగా నిర్ధారించారు. నిందితుడు, జ్యూరీ సభ్యులు కూడా పార్శీలే కావడంవల్ల అతన్ని నిర్దోషిగా వదిలేశారన్న విమర్శ వల్ల వైవాహిక సంబంధమైన కేసులను మాత్రమే పార్శీ జ్యూరీ సభ్యులు విచారించడం జరుగుతోంది. మరే కమ్యూనిటీకి జ్యూరీ సభ్యుల సంప్రదాయం లేదు.
ఐతే ఇప్పుడు కేవలం విడాకుల కేసులని మాత్రమే వీరు విచారించి తీర్పు చెప్తారు. వీరి తీర్పుని శిరోధార్యంగా పాటిస్తారు తప్ప పార్శీలు తర్వాత విడాకుల కోసం భారతీయ కోర్టు గుమ్మాలు తొక్కరు. విడాకుల కేసుల్లో జ్యూరీ సభ్యులుగా అనేక సంవత్సరాల నించి చాలామంది కొనసాగుతున్నారు. ఉదాహరణకి ఆది నారిమన్ మోగ్రిలియా 1970 నించి జ్యూరీగా పనిచేస్తూ, తమ కమ్యూనిటీలోని వివిధ వైవాహిక స్పర్థలని వింటూ తీర్పులు ఇస్తున్నాడు. 75 ఏళ్ల ఈయన రిటైర్డ్ సేల్స్‌మేన్. ప్రతీ కేసులో మొత్తం ఐదుగురు జ్యూరీ సభ్యులుగా వ్యవహరిస్తారు. వీరు సాధారణంగా రిటైరైన వ్యక్తులే అయి ఉంటారు. బాంబే పార్శీ పంచాయత్ అనే ‘పార్శీ కమ్యూనిటీ కౌన్సిల్’ సంస్థ పదేళ్ల కాలం మనే్నలా ఇరవై మంది జ్యూరర్స్‌ని నియమిస్తుంది. పూర్వం జ్యూరీ సభ్యుల వయసు 21-60 దాకా ఉండేది. బాంబేలోని వృత్తి, వ్యాపారుల, మేధావుల నించి సీనియర్ పార్హీ పురుషులని జ్యూరీ సభ్యులుగా ఎంపిక చేసేవారు. ఐతే 150 ఏళ్లల్లో పరిస్థితులు చాలా మారాయి. వీరు బాంబే హైకోర్టులో రోజుకి ఆరుగంటల చొప్పున వరుసగా పది రోజులు కూర్చుని కేసులు వింటారు. విడాకులు ఇవ్వడమో, తిరస్కరించడమో చేస్తూంటారు. పార్శీలు బాంబేలోనే అధికంగా జీవిస్తున్నారు.
ప్రతీ కేసు విచారణకి ముందు జడ్జ్ చిట్టీలు వేసి, ఇరవై మందిలోని ఐదుగురు జ్యూరీ సభ్యులని ఎంపిక చేస్తాడు. ఇరుపక్షాల లాయర్లు తమ క్లయింట్‌కి లేదా తమ ప్రత్యర్థికి జ్యూరీ సభ్యులు బాగా పరిచయమైన వారు ఐతే, వారిని కాదనే అధికారం ఉంటుంది. జ్యూరీ సభ్యులు కేసు పేపర్లతో కోర్టు హాల్లో వేరే ఎన్‌క్లోజర్‌లో కూర్చుని విచారణని గమనించి, తమలో తాము సంప్రదించుకుని జడ్జికి తమ తీర్పుని చెప్తారు. ఈ జ్యూరీ సభ్యుల్లో రిటైరైన బ్యాంక్ ఆఫీసర్లు, టీచర్లు, డాక్టర్లు, పోలీసులు, ఇన్సూరెన్స్ ఏజెంట్లు ఇలా వివిధ వృత్తులకి చెందినవారు ఉన్నారు.
జ్యూరీ సభ్యులుగా వీరికి మధ్యాహ్న భోజనానికి, రవాణాకి రోజుకి 500 రూపాయలు పార్శీ పంచాయితీ కౌన్సిల్ ఇస్తుంది. పార్శీ విడాకుల కేసుల నిమిత్తం ముంబై కోర్టు ఏడాదిలో కొన్నిసార్లు ప్రత్యేకంగా కొంత సమయాన్ని కేటాయిస్తుంది. 2015 జులైలో అలా మూడోసారి 26 పార్శీ కేసులని పది రోజులు విచారించి తీర్పు ఇవ్వడం జరిగింది. ఐనా పేరుకుపోతున్న పార్శీ కేసులు అధికంగానే ఉన్నాయి.
విడాకుల కేసులు ఫైల్ చేసే పార్శీల్లో ఆడవారే అధికం. వీరంతా బీదవారు, చిన్న ఉద్యోగస్థులు. వీరీ కేసుల్లో అధిక భాగం గెలుస్తూంటారు. ఒకప్పుడు ద్వితీయ వివాహం, భార్యని వదిలేయడం, అక్రమ సంబంధం విడాకులకి ప్రధాన కారణాలుగా ఉండేవి. నేడు కలిసి జీవించ లేకపోవడమే ప్రధాన కారణం అవుతోంది. భార్యల్లో చదువుకున్నవారు, స్వతంత్రులు, ఆత్మవిశ్వాసం గలవారు పెరగడంతో విడాకులకి వారు మొగ్గు చూపుతున్నారు. కుటుంబాన్ని భర్త సెలవులకి మరో ఊరికి తీసుకెళ్లక పోవడం, తన భార్యకి సరైన సమయాన్ని కేటాయించక పోవడం, మతఛాందసుడై రోజూ 24 ఆలయాల్లో ప్రార్థన చేయడం లాంటి కారణాలవల్ల తను విడాకులు మంజూరు చేశానని మోగ్రెలియా చెప్పాడు. తన గయ్యాళి భార్యవల్ల తమ పనిలో మనసుని కేంద్రీకరించ లేకపోతున్నాననే ఓ భర్తకి కూడా ఆయన విడాకులు మంజూరు చేశాడు. ఉమ్మడి కుటుంబంలో నివసించే వారిలోనే విడాకులు ఎక్కువ. ఐతే బాంబేలో గృహ సమస్యలవల్ల ఇది తప్పడంలేదు.
పార్శీ విడాకుల కోర్టులు అనేకసార్లు విమర్శించబడ్డాయి. సంవత్సరంలో పార్శీ కేసులని కోర్టులు ఎప్పుడు తీసుకుంటాయో తెలియకపోవడంతో ఇరుపక్షాల వారు వేచి ఉండాల్సి వస్తోంది అనేది ఒకటి. పార్శీ కమ్యూనిటీ మొదటి నించి పాశ్చాత్య సంస్కృతిని అవలంబించేది. ప్రేమ వివాహాలు అధికంగా జరిగేవి. బాంబేలోని పార్శీ కాలనీల్లోనే పార్శీలు అధికంగా నివసిస్తారు. ‘కస్తో బౌ నౌరోజీ ఎన్ వాడియా ట్రస్ట్’ అనే చోట 5వేల అపార్ట్‌మెంట్స్‌లో పార్శీలు నివసిస్తున్నారు. బాంబేలో 70 వేల మంది పార్శీలు ఉన్నారు. ఇలా వీరు ముంబైలో పద్దెనిమిది కాలనీల్లో నివసిస్తున్నారు. మిగతా కమ్యూనిటీల్లోకంటే పార్శీల్లో పెళ్లి చేసుకునే సగటు వయసు అధికం. పెళ్లిళ్లు తక్కువగా చేసుకునే, పిల్లలు తక్కువగా పుట్టే కమ్యూనిటీ కూడా ప్రపంచంలో ఇదొకటి. ఓ పార్శీ పుడితే ముగ్గురు మరణిస్తున్నారు. నలభై శాతం మంది ఇప్పుడు తమ పార్శీ కమ్యూనిటీ బయటే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.

పద్మజ