S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నిర్మోహత్వమే నిశ్చల తత్త్వానికి మూలం

‘పరలోక సాధనమే మనసా
స్మరలోభ మోహాది పాపులను
స్మరియింపకే - శ్రీరామ భజన ॥
-జననాది రోగ భయాదులచే
జగమందు గల్గు దురాశలచే
తనయాది బాంధవుల భ్రమచే
తగుల నీదు త్యాగరాజ నుతుని భజన ॥
* * *
ఎనిమిదో యేట వేదాలలో పాండిత్యాన్ని సంపాదించి, పనె్నండో యేటికే మొత్తం సర్వ శాస్త్రాలనూ మధించి, పదహారో ఏటికి భాష్యాలను రాసి, ముప్పై రెండో ఏట శరీరానే్న వదిలేసి అపారమైన ఆధ్యాత్మిక సంపదను భారతీయులకు అందించిన మహానుభావుడు శంకర భగవత్‌పాదులు.
ఆయన ఒక వ్యక్తి కాదు. ఒక వ్యవస్థ. మత సంక్షోభం వున్న సమయంలో అవతరించి ఈ దేశపు టెల్లలు దాటి అవతలికి పోయేలా నాస్తిక వాదాలని తరిమికొట్టిన ధీశాలి, కారణ పురుషుడు.
ప్రయాణ సౌకర్యాలేమీ బొత్తిగా లేని ఆ రోజుల్లో అంటే మనకంటే ఎన్నో తరాలకు పూర్వమే కాశ్మీరు నుండి కన్యాకుమారి దాకా పర్యటించి ఈ జాతి జీవనానే్న మార్చేసిన శంకరులు మనకు నిత్య స్మరణీయుడు.
ఆయన ఓ రోజు శిష్యులతో కాశీలో వీధిలో నడిచి వెళ్తోంటే ఓ సంస్కృత పండితుడు శిష్యులను కూర్చోపెట్టి వ్యాకరణ సూత్రాల్ని వల్లె వేయించటం గమనించి జాలిపడ్డాడు.
ఈ సూత్రాలన్నీ చరమ దశలో ఏమీ ఉపయోగపడేవి కావనీ, బుద్ధిని గోవిందుడి వైపు మరల్చమని చెప్పిన ఉపదేశసారమే ఆయన భజగోవింద శ్లోకాలు. ఇందులో మొత్తం 12 శ్లోకాలుంటాయి. వీటికి ‘ద్వాదశ మంజరికా స్తోత్రం’ అని పేరు. శిష్యులు మరికొన్ని కలిపారు ఈ భజగోవింద శ్లోకాలకు.
ఎందరో మేధావులు వ్యాఖ్యానాలు రాశారు. జీవితమంటే అర్థం ఏమిటి? అని ఎవరైనా అడిగితే వచ్చే సమాధానం ఒక్క మాటలో ‘యదృవ్యం, తన్నశ్యం’ - కనిపించేదంతా అశాస్వతమే. శాస్వతమైనదొకటుంది.
చాలా సరళమైన మాటలతో అనంతమైన వేదాంతార్థాన్ని చొప్పించి ‘హాయిగా’ పాడుకున్నాడు త్యాగయ్య. విద్వత్ప్రదర్శన కోసమే సంగీతం అని భావించినప్పుడు దృష్టి సాహిత్యం మీద ఉండదు.
మనసును సాహిత్యం మీద కేంద్రీకరిస్తూ మాధుర్యం చిలికే గానానికి ఎప్పుడూ జనం దాసోహమవుతారు.
రాగాలు అందుకే పుట్టాయి.
ఒట్టి మాటలు కట్టిపెట్టమన్నాడో కవి.
గంటన్నర ఉపన్యాసం కంటే నాలుగున్నర నిమిషాల ఒక్క పాట తిన్నగా హృదయానికి చేరిపోతుంది. విన్నది ఆచరించాలనే బుద్ధిని ప్రేరేపిస్తుంది. సంగీతంలో వున్న ‘మాయే’ ఇది. కవి అయినంత మాత్రాన పాటలు అందరూ వ్రాయలేరు.
ఆరోహరణ, అవరోహణ స్వరాలు తెలిసినంత మాత్రాన అందరూ పాడలేరు.
సంగీతానికీ, సాహిత్యానికీ వున్న స్నేహంత ఎంత పాతదో, స్పర్థ కూడా అంతే.
ఈ రెండూ పరస్పరం సహకరిస్తూ అన్నదమ్ముల్లా బ్రతకాల్సినవే.
ఒక్కోసారి చాలా పేలవంగా వుండి, నీరసంగా కనిపించే మాటలు సంగీతంతో ఉత్తేజితవౌతాయి. సంగీతంలో అక్షర రమ్యతకు వున్న విలువ అపారం. వాగ్గేయకారులు యిందుకే పుట్టారు. యిందులో సాహిత్యాన్నీ సంగీతాన్నీ సమపాళ్లలో రంగరించి పాడుకున్న వారిలో చెప్పాలంటే త్యాగరాజు అగ్రగణ్యుడు. పంటి కింద రాయి పడ్డట్టుగా వుండే అక్షరాలు, పాడే వారికీ, వినేవారికీ కూడా యిబ్బందే. అక్షర రమ్యత లేని పాటలు పాడేందుకు పనికిరావు. ఎంత మహా పండితుడైనా మాటల్లో సరళత్వమంటూ లేకపోతే, అదో సర్కస్సులా వుంటుందే గాని, సంగీతంలా వుంటుందా? ఊపిరాడని మాటలు, ద్విత్వాక్షరాలు, దీర్ఘ సమాసాలూ పాడేందుకు పనికిరావనే సంగతి తెలిసిన కవులే కవులు- అందుకే పాటలెందరు రాసినా పేరు తెచ్చుకోగలిగేది మాత్రం కొందరే.
సంగీతం అంటే నోటిపాట. అచ్చుల మూలాన బ్రతికే కళ.
‘పూర్వికల్యాణి’ ప్రతిమధ్యమ రాగాలలో ఎంతో ప్రధానమైన రాగం. మనస్సును సంబోధించే ఈ కీర్తనలోని సాహిత్యం జీవనసారాన్ని చెబుతుంది.
నాద రుచి తెలిసిన వాడు కాబట్టి సంబోధించే మాటలన్నీ ప్రసన్నత కలిగి నాదం నింపుకుని చెవులకు సోకుతాయి.
ఈ కీర్తనలో జటిలమైన భాష లేదు. కుటిలమైన తర్కం లేదు. సాఫీగా, సరళంగా, ముక్కుకు సూటిగా చెప్పవలసినది చెప్పడంలో త్యాగయ్య ఎంతో మేధావి గాబట్టే, ఆ కీర్తనలింత వరకూ చెక్కుచెదరకుండా మన హృదయాలలో నిలిచిపోయాయి. నిజానికి చాలా మృదువుగా కనిపించే మాటలే అయినా తీక్షణమైన కొరడా దెబ్బల్లాంటి సందేశం వుంది.
బ్రతుకు ఎంత తొందరగా మృత్యువు వైపు వెళుతుందో మనిషి తెలుసుకోవాలనే త్యాగయ్య తపన యిందులో కనిపిస్తుంది. మనిషి ఎప్పుడూ అర్థకామాల కోసం నిత్యం వెంపర్లాడుతూనే ఉంటాడు. ధర్మం కోసం, అన్నిటికంటే మోక్షం కోసం పాటుపడేవారు మాత్రం ఏ నూటికో కోటికో ఒక్కరుంటారు. నిజానికి ఇది మాటల్లో చెప్పినంత సుళువైన విషయం కాదు.
జీవితమంతా ననే్న స్మరిస్తూ శరీరాన్ని వదిలిపెట్టే క్షణంలో కూడా స్మరించేవాడు పరమపదం పొందుతాడని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పితే సరిపోయిందా? ఆచరణలోకి రావద్దూ?
కుటుంబ జీవితం ప్రతి మానవుడికీ ఒక శాంతినీ, సౌఖ్యాన్నీ యిచ్చేది నిజమే అయినా ఒకరితో ఒకరి బాంధవ్యం ఎంతవరకో అంతవరకే గాని అది విడిపించుకోలేని బంధంగా పరిణమిస్తేనే ప్రమాదం. భార్యాభర్తలిద్దరూ ఆనందంగా అన్యోన్యంగా జీవించడం వరకే ప్రధానం.
ఆలోచన చేయగలిగే శక్తి లేనివాడికి సంసారం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. కానీ ఆనందం కంటే బ్రహ్మానంద స్థితి అంటూ ఒకటుందని చెప్పిన ఋషుల మాటలే మనకు వేదం.
గృహస్థులు సంసార బాధ్యతల నుండి పారిపోయి సన్న్యసించమని ఏ గురువూ చెప్పడు సరికదా అన్ని బాధ్యతలనూ సక్రమంగా నిర్వహిస్తూ దేనియందూ తగులుకోక అప్రమత్తంగా వుండమని చెప్పే భావం ఈ త్యాగరాజ కీర్తనలో కనిపిస్తుంది.
వయసు గతించి వనం తగ్గినకొద్దీ రుంక తృష్ణ ఎక్కడుంటుంది? నీరు ఎండిపోతే యింక చెరువుతో పని ఏముంది?
సిరిసంపదలు కాస్తా హరించుకుపోతే యింక ఆశ్రీత జనాలెక్కడుంటారు?
తత్త్వ జ్ఞానం కలిగితే సంసార వ్యామోహం ఎక్కడుంటుంది?
కట్టుకున్న తర్వాత కష్టమైనా సుఖమైనా చుట్టుకోకుండా వుండవు.
భద్రాచల రామదాసు పనె్నండేళ్ల పాటు చెఱసాల పాలై, నఱక బాధలు పడ్డా, రామనామం వదల్లేదు - నమ్మి చెడేవాడంటూ వుండడు’ అనే మాటకు సాక్షి ఆయనే.
సంసారాన్ని తరించే తరుణోపాయాన్ని గజేంద్ర మోక్షంతో పోలుస్తారు. సంసారమనే బందిఖానా నుండి బయటపడాలన్నా మనకు భద్రాచల రామదాసే శరణ్యం.
కర్ణాటక సంగీతంలో వేలాది రాగాలున్నాయి. కొత్తగా సృష్టించవలసిన అవసరమంటూ కలుగదు. ఉన్న రాగాలు కొన్నైనా, జీవితంలో ఏ విద్వాంసుడైనా పాడగలిగితే అదే పదివేలు.
మన వాగ్గేయకారులంతా ఒకే రాగంలో ఎన్నో కీర్తనలు అందించారు. ఏమిటి కారణం? రాగానికి ముగింపు అంటూ వుండదు. పాడిన కొద్దీ రాగవిస్తృతి పెరుగుతూనే ఉంటుంది.
తోడి, కల్యాణి, కాంభోజి, ఖరహరప్రియ, భైరవి లాంటి రాగాలతో ఒక్కో వాగ్గేయకారుడు ఎనె్నన్నో కీర్తనలు రచించారు. జ్ఞానమొసగరాదా అనే ప్రసిద్ధమైన త్యాగరాజ కీర్తన. పూర్వికల్యాణి రాగంలో మరొకటి ఉంది. ముద్దుస్వామి దీక్షితుల వారి ‘మీనాక్షీ మేముదందేహి’ అనే ప్రసిద్ధమై న కృతి కూడా పూర్వి కల్యాణి రాగంలోదే. ‘గమకక్రియ’ అని దీక్షితుల వారి సంప్ర దాయం లో పిలుస్తారు.
త్యాగ య్య గారికి ముందు సంగీతముంది. ఆయన తర్వాత కూడా ఎందరో వాగ్గేయకారులు ఉద్భవించారు.
కాని మూర్తిత్రయం వారి రాక వల్ల కర్ణాటక సంగీతం యొక్క రూపురేఖలే మారిపోయాయి. కీర్తనలో ఒక మాట ఎనే్నసి సంగతులతో హృదయానికి చేర్చవచ్చునో అంత సంగీతాన్ని పుష్కలంగా పంచిన వాగ్గేయకారుడు త్యాగరాజు. అందుకే ఆయన కీర్తనలలో మాటలు తక్కువగా వుంటూ ఆపాతమధురమై మనసును పట్టిలాగే సంగీతమే ఎక్కువగా కనిపిస్తుంది.
గాయకులు మనోధర్మంతో స్వేచ్ఛగానూ, భావయుక్తంగానూ పాడగలిగే సావకాశం త్యాగరాజ కీర్తనలకుంది.
త్యాగరాజ కీర్తనలలోని అర్థం తెలుసుకుని పాడాలనే నియమం కలిగి, వినాలనిపించేలా శ్రోతలకు రుచిని పుట్టించవలసిన బాధ్యత సంగీత విద్వాంసులపై ఉంది.
అంతటా, అన్నిటా వ్యాపించి మధురగానమవుతుంది.
* * *
శాస్త్రం, కళ.. ఈ రెండూ చాలా భిన్నం అనుకుంటారు చాలామంది. సైన్సులో కళనూ, కళలో సైన్సునూ దర్శించిన ‘స్టీవ్ జాబ్స్...’ మాటల్లోని అంతరార్థాన్ని తెలుసుకుంటే చాలు. మనం తల ఎత్తకుండా అరచేతిలో మొత్తం ప్రపంచాన్ని చూపిస్తూ, చుక్కలు చూపించిన ఘనుడు.. మూడు ఆపిల్స్ ప్రపంచ గతినే మార్చేశాయి. ఒకటి - ‘ఈవ్’ని ఆకర్షించింది. రెండోది ‘న్యూటన్’ని మేల్కొల్పింది. మూడో వ్యక్తియే ఈ స్టీవ్ జాబ్స్. ఈయన కేవలం కంప్యూటర్ ఐ పాడ్, ఐ ఫోన్ సృష్టికర్త మాత్రమే అనుకోవద్దు. జీవితసారాన్ని చిన్నవయస్సులోనే గ్రహించిన ధీశాలి.
నమ్మకంతోనే ముందుకు సాగాలి. విశ్వాసం ముఖ్యం. అంతరాత్మ, విధి, కర్మ - ఏదో ఒకటి నమ్మాలి. ఈ దృక్పథం నన్ను కృంగిపోనివ్వలేదు.
టెక్నాలజీ ప్రపంచాన్ని మార్చేస్తుందంటే నేను నమ్మను. మనం పుడ్తాం. కొద్ది కాలం జీవిస్తాం. యిది చాలా కాలంగా జరుగుతున్నదే. సాంకేతిక పరిజ్ఞానం దీనే్నమీ మార్చదు. టెక్నాలజీ జీవితాల్ని సుఖమయం చేయవచ్చు గానీ, జీవన గమనాన్ని మార్చదు. లేదు. యిది వాస్తవం. ఇప్పుడైనా మనసు చెప్పే మాట వినకపోతే ఎలా?-
మీ జీవితాన్ని మీరు జీవించండి. మరొకరి జీవితాన్ని అనుభవించవద్దు. యితరుల గొంతుల రొదలో మీ అంతరాత్మను మునిగిపోనివ్వవద్దు. మీ అంతరాత్మ చెప్పినది విని ఆచరించే దమ్మూ, ధైర్యమూ తెచ్చుకోండి. ఎప్పుడూ ఆనే్వషణలోనే వుండండి. విజయానికివే మూల సూత్రాలు - అన్న మాటల్లోని అంతరార్థాన్ని అర్థం చేసుకుంటే చాలు.
అంతటా, అన్నిటా వ్యాపించి వున్న పరమాత్మకు బదులుగా అవిద్య’ వలన మనిషికి కనిపించేది నానారూప గుణాలతో భూతంలా నాట్యంచేసే ప్రపంచం. దీనినే సంసారం అని పిలుస్తాం. అంతే.
ఈ సంసారం యొక్క మిథ్యా స్వరూపం తెలిసిపోయిన తర్వాత యింక సంసార భ్రాంతి ఎక్కడ? సంసారం అంటూ లేకుండానే సన్యాసియైన శంకర భగవత్పాదుల బోధించిన దానే్న త్యాగరాజు తన కీర్తనలో ఇమిడ్చేసి పాడుకున్నాడు.
వేదాంత సూక్ష్మాన్ని చిన్నచిన్న ఉపమానాలతో సులువుగా అర్థమయ్యేలా సంస్కృతంలో ఆదిశంకరులు చెప్పిన దానే్న త్యాగయ్య అచ్చ తెలుగులో చిన్నచిన్న మాటలల్లి పాడుకున్నాడు. ఎవరెలా చెప్పినా సారాంశం పట్టుకుంటే చాలు. దృఢ సంకల్పంతో, యింద్రియాలను, మనసునూ విషయాల వెంట పరుగెత్తనీయకుండా అదుపులో పెట్టుకుని మనోబుద్ధుల్ని గోవింద నామ స్మరణతో బ్రతికిన నాడు జీవితం ఒక మధుర గానమవుతుంది.

- మల్లాది సూరిబాబు 9052765490