S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నవ జీవనానికి నాంది

పచ్చని ఆకులతో, పుష్పాలతో, ఫలాలతో వృక్షాలు, పచ్చిక బయళ్లు, లేతమామిడి చిగుళ్లు తిని కుహూ కుహూ అంటూ పంచమ స్వరంతో కూసే కోయిల, పువ్వులలో నుండే మధువును గ్రోలి ఝంకారం చేసే తుమ్మెద, పురివిప్పి నృత్యం చేసే నెమలి, రామణీయకతతో ఆనంద సౌందర్యంతో, వింత సోయగంతో నున్న ప్రకృతి కాంత మ్రోడు వారిని మానవ హృదయాలలో వసంతోదయం కలుగజేస్తుంది. సృష్టిలో నవజీవనం వసంత కాలాగమనంతో ప్రారంభవౌతుంది. భగవంతుని ఈ చరాచరాత్మకమైన సృష్టిలో నూతన చైతన్యం కలిగిస్తుందీ వసంత కాలం. చైతన్యవంతమైన నవ జీవనానికి ప్రారంభం ఉగాది. మన పర్వదినాలలో ఉగాది అత్యంత ప్రాధాన్యం వహించింది. దీనికి కారణం సృష్టికర్తయైన బ్రహ్మ తన అనంతమైన సృష్టినంతనూ ఈనాడే బహిర్గతం చేశాడు. అందువల్ల ఉగాది మనందరికీ పర్వదినం.
ఉగాది పద నిర్వచనం
ఉగాది అను పదం యుగాది నుండి పుట్టింది. సంస్కృతంలోనున్న యుగాది అను మాటకు కృత, త్రేత, ద్వాపర, కలియుగాలలో ఏదో ఒక యుగానికి ఆది లేక ప్రారంభం అని అర్థం. కాని తెలుగు ఉగాదిని సంవత్సరాది అను అర్థంతో వాడుతున్నాం. మన ఉగాది చాంద్రాయణ సంవత్సరాది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడే ఈ పండుగ వస్తుంది. కమలాకరభట్టు, హేమాద్రి మున్నగు పండిత ప్రకాండులు ఉగాది - చైత్ర శుద్ధ పాడ్యమి యేయని నిర్ధారించిరి. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగను తెలుగు ప్రజలేకాక, మహారాష్ట్రులు, కర్ణాటకులు కూడా జరుపుకుంటారు.
వివిధ మాసాలలో వచ్చే
సంవత్సరాదులు
సంవత్సరాది అందరికీ ఒకే రోజున, ఒకే మాసంలో వస్తుందనడానికి వీలు లేదు. సంవత్సర పరిగణాన్నిబట్టి కొన్నిచోట్ల చైత్రమాసంలోను, మరికొన్ని చోట్ల కార్తీక మాసంలోను, మరికొన్ని చోట్ల మార్గశిర మాసంలోను, మరికొన్ని చోట్ల ఫాల్గుణ మాసంలోను సంవత్సరాదులు (ఉగాదులు) వస్తాయి.
అభ్యంగన స్నానం
ధర్మసింధువు, నిర్ణయ సింధువు అనే ధర్మశాస్త్ర గ్రంథాలు ఉగాది నాడు మనం చెయ్యవలసిన విధులు చెప్పాయి. వాటి ప్రకారం ప్రజలంతా సూర్యోదయానికి పూర్వమే నిద్ర నుండి లేచి నూనెతో తలస్నానం చేస్తారు. ఉగాది వంటి పర్వదినాలలో లక్ష్మీదేవి నూనెలోను, గంగాదేవి నీటిలోను ఉంటారని పెద్దలు చెబుతారు. కాబట్టి ఆ రోజు నూనెతో తలస్నానం చేసినవారు లక్ష్మీ గంగాదేవుల అనుగ్రహం పొందుతారు. అంతేకాక అభ్యంగన స్నానం వల్ల అవయవ పుష్టి కలుగుతుంది. స్నానానంతరం నూతన వస్త్భ్రారణ ధారణ చేస్తారు.
గృహాలంకరణం
సంవత్సరాదినాడు రంగవల్లులతో, వివిధ పుష్ప తోరణాలతో, మామిడి ఆకులతో గృహాలంకరణ గావింపబడుతుంది. తరువాత దేవుని గదిలో మంటపాన్ని ఏర్పరచి అందు నూతన పంచాంగాన్ని సంవత్సరాది దేవతలను అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.
ఉగాది పచ్చడి
వేపపువ్వు, చెరుకు ముక్కలు, కొత్త చింతపండు, కొత్త బెల్లం, మామిడికాయ ముక్కలు, నేయి, కారం, శనగపప్పు, ఉప్పు మున్నగు వస్తువులతో కూడిన ఉగాది పచ్చని సేవిస్తారు. ఈ షడ్రసాత్మకమైన ఉగాది పచ్చడి సుఖ దుఃఖ మిశ్రమమైన మానవ జీవితానికి సంకేతంగా పేర్కొనబడింది.
పంచాంగ శ్రవణం
ప్రజలు పంచాంగ శ్రవణం ద్వారా నూతన సంవత్సర గోచార ఫలాలు, కందాయ ఫలాలు, ఆదాయ వ్యయాలు, ధరవరలు, శీతోష్ణస్థితులు, పంటలు, వర్షాలు, దేశ స్థితిగతులు మున్నగు అనేక విషయాలు వింటారు.
దేవతాపూజలు
అంతేకాక ఉగాదినాడు ఇంద్రధ్వజ పూజ, బ్రహ్మధ్వజ పూజ, దమనక పూజ, ఛత్రచామరాది స్వీకారం, సర్వాపచ్ఛాంతికర మహాశాంతి, పౌరుష ప్రతి పద్వ్రతము ప్రపాదాన ప్రారంభం, రాజదర్శనం, వసంత నవరాత్ర ప్రారంభం మున్నగు పూజలు, వ్రతాలు ప్రజలు జరుపుకుంటారు.
సుఖ సంతోష దినం
ఈ రోజు ప్రజలంతా ఆనందంగా ఉంటారు. కారణం ఏమంటే ఈ రోజు ఉత్సాహంతో ఉంటే సంవత్సరమంతా సుఖ సంతోషాలతో ఉంటుందనీ, దుఃఖంతో ఉంటే సంవత్సరమంతా కష్టాలతో గడుస్తుందనీ ప్రజల నమ్మకం. అందువల్ల ప్రజలంతా ఉగాది నాడు ఆనందంగా, సంతోషంతో గడుపుతారు.
నూతన వ్యాపారాలు
సంవత్సరాదినాడు వర్తకులు కొత్త చిట్టాలను ప్రారంభిస్తారు. కొందరు నూతన వ్యాపారాలు మొదలుపెడతారు. వృత్తి పనివారు, శ్రామికులు వారివారి పనిముట్లను పూజిస్తారు. రైతులు ఏరువాక సాగిస్తారు. పండితులు వేద శాస్త్ర, పురాణ గ్రంథాలను పూజిస్తారు.
ఉగాది ప్రాశస్త్యం
మనం ఉగాదిగా పరిగణిస్తున్న చైత్ర శుద్ధ పాడ్యమికి పౌరాణికంగాను, ఖగోళ శాస్త్ర రీత్యాను, చారిత్రకంగాను ఎంతో ప్రాముఖ్యమున్నది.
బ్రహ్మపురాణం
బ్రహ్మ పురాణం బ్రహ్మ ఆదిలో తాను ఈ చరాచరమైన సృష్టినంతా చైత్ర శుద్ధ పాడ్యమి నాడే ప్రారంభించాడని తెలుస్తుంది. అందువల్ల ఈ రోజు మానవ కోటికంతకూ పర్వదినం.
నారద పురాణం
చైత్ర శుక్ల పాడ్యమినాడు సూర్యోదయ కాలమున సూర్యుడు అధి దేవతానున్న కాలమున ఆదివారం నాడు బ్రహ్మ సృష్టిని బహిర్గతం చేసినట్లు నారద పురాణం చెబుతుంది.
మత్స్య పురాణం
మత్స్యావతారమున విష్ణుమూర్తి మత్స్య రూపంలో సముద్రంచొచ్చి వేదాలను దొంగిలించిన రాక్షసుని చంపి తిరిగి బ్రహ్మకు వేదాలను అందజేసిన శుభదినం చైత్రశుద్ధ పాడ్యమియే.
రామాయణం
పదునాల్గు సంవత్సరాలు అరణ్యవాసం చేసి రావణ సంహారానంతరం సీతా లక్ష్మణ సమేతంగా రాముడు చైత్రశుద్ధ పాడ్యమినాడు అయోధ్యకు తిరుగు ప్రయాణ సన్నాహాలు చేసిన రోజు కావటంవల్ల ఈ రోజు పుణ్యదినంగా ప్రజలు భావిస్తారు.
వసుచరిత్ర
పురు వంశరాజైన వసురాజు ఒక పర్యాయం వేటకు వెళ్లి అచ్చట ధ్యాననిష్ఠలోనున్న సమయాన ఇంద్రుడు ప్రత్యక్షమై అతిలోక సుందరమైన ఒక విమానాన్ని, ఎప్పటికీ వాడని ఒక పూలదండనిచ్చి, దీనిని యుద్ధంలో ఉపయోగించి అజేయుడవై యుండుమని చెప్పి అంతర్థానవౌతాడు. మహిమాన్వితమైన ఆ వస్తువులతో వసురాజు చైత్ర శుద్ధ పాడ్యమినాడు తన పట్టణంలో ప్రవేశిస్తాడు. ఆ వస్తువుల మహిమను తెలుసుకొన్న ప్రజలు ఇంద్రుని గూర్చి పెద్ద ఉత్సవం నిర్వహిస్తారు. అందువల్ల ఈ రోజు పర్వదినంగా పరిగణింపబడింది.
ఖగోళశాస్త్ర రీత్యా
ఖగోళ శాస్తర్రీత్యా కూడా చైత్ర శుద్ధ పాడ్యమి ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ రోజున సూర్యుడు భూమధ్య రేఖపై ఉంటాడని ప్రతీతి. అందువల్ల ఈరోజు యుగాదుల దిన, మాస, వర్షారంభము ఒకేసారి ఏర్పడతాయి.
విక్రమార్క చక్రవర్తి పట్ట్భాషేకం
మహావీరుడు, పరాక్రమశాలియైన విక్రమార్క చక్రవర్తి శకులను ఓడించి చైత్ర శుద్ధ పాడ్యమినాడు పట్ట్భాషిక్తుడైనాడు. విక్రమార్క శకం ఆనాడే ప్రారంభమయింది. అందువల్ల కూడా ఉగాది దినం పర్వదినంగా పరిగణింపబడుతుంది.
మొగలు చక్రవర్తులు - అగ్నిపూజ
మొగలు చక్రవర్తులు పాలించే కాలంలో వారు ఉగాదిని అగ్నిపూజ అనేవారు. ఉగాదిని పార్సీలు నౌరోజ్ అంటారు. ఆ రోజున వారు అగ్నిపూజ చేస్తారని ఔరంగజేబు తన కుమారునికి వ్రాసిన లేఖ వల్ల వెల్లడవుతుంది.
సిక్కులు - ఖలసా వ్రతం
పంజాబ్‌లో సంవత్సరాది రోజున ఉత్సవాలు జరుపుతారు. గురుగోవింద్ సింగ్ ఈ రోజుననే ఖలసా ధర్మాన్ని నడిపాడు. ఆయన జ్ఞాపకార్థం ఉగాదినాడు సిక్కులు ఉత్సవాలు జరుపుతారు.
బీహార్‌లో ఉగాది
ఉగాది బీహార్ ప్రాంతంలోని ‘హో’ అనే పేరుతోనున్న ఆదిమవాసులు గొప్ప ఉత్సవం చేస్తారు. వారానాడు భూదేవికి, సూర్యభగవానునికి వైభవంగా వివాహం జరిపి తర్వాత యువతీ యువకులు వివాహాలు జరుపుకుంటారు.
ఈ విధంగా ఉగాది ఒక పర్వదినమై సర్వమానవ హృదయాలను నూతన చైతన్యంతో రంజింపజేస్తుంది. ఉగాది నవ జీవనానికి నాంది.

-డా. రాపాక ఏకాంబరాచార్యులు 94404 94752