S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శుభ యుగాది ఈ ఉగాది

పంచపాదం పితరం ద్వాదశాకృతిం
దివ ఆహుః పరే అర్థే పురీషిణం
అధేమే అన్యఉపరే విచక్షణం
సప్త చక్రౌషడర ఆహురర్పిత మితి
-ఋగ్వేదం
***
సర్వ ప్రపంచమునకు పైభాగమునందుండి తన కిరణముల పరిపాక విశేషము చేత- సంవత్సరము, ఆయనము, ఋతువు, మాసము, పక్షము, దినము మొదలైన కాల భేదాల్ని ఏర్పరుస్తున్నది సూర్యుడు. కాలాన్ని ఏర్పరచి, భాగ విభాగాలుగా వున్న సంవత్సరంగా కొలత యిచ్చి, హేమంతము శిశిరమూ- ఒక ఋతువుగా చెపితే, అయిదు ఋతువులుగా లేక ఆరు ఆకులు అనగా ఆరు ఋతువులతో, ఏడు చక్రాల రథముతో ఏడు గుఱ్ఱాలుగా చెప్పబడే ఏడు రంగులతో లేక వారములని ఏడు దినములతో, పనె్నండు రూపాలుగా అనగా పనె్నండు నెలలుగా, అన్నిటికీ నియామకుడిగా, తండ్రిగా వ్యవహరిస్తున్నాడు సూర్యుడని ఋగ్వేదం చెపుతోంది.
కనుక జీవానికి, కార్యకలాపాలకు మూల కారణం సూర్యుడు. సూర్యుడు - శక్తి; చంద్రుడు సూర్యుని వెలుగు చేత ప్రకాశించినట్లే పదార్థం కూడా శక్తిద్వారానే ప్రకటితమవుతుంది. కనుక చంద్రుడే పదార్థం. అన్ని గ్రహములకు, భూమికి అగ్నితత్త్వాన్ని, తేజస్సును ఇచ్చేవాడు- సూర్యుడు. ద్రవత్వానికి, రసానికి కారణం- చంద్రుడు. వెలుగు చీకటుల, శక్తి పదార్థముల, క్రియాక్రియల పరస్పర సమ్మేళనమే- అనంతమైన కాలంగా సృష్టి ప్రళయాలుగా వ్యక్తమవుతుంది. ఇదే ‘కాల’ గమనానికి, గణనానికి మూలం. కాల సంబంధమైన పండుగ- ఉగాది.
కాలము అపరిమితమైనది. అపరిమితమైన కాలంలో పరిమితమైనది- మానవ జీవితం. ఎన్నో జన్మల పుణ్యఫలము చేత లభించేది మానవ జన్మ. కాలాన్ని కేవలము లౌకిక వ్యవహారముల నిమిత్తమైన, ధన కనక వస్తు వాహనముల కోసం వినియోగించి, వృథా చేయక కాలమును, కాయమును సార్థకం చేసికోవాలని హెచ్చరించే కాల సంబంధమైన పండుగ ఉగాది.
కాల స్వరూపం
సంవత్సరం సూర్య రూపమని ఉపనిషత్తులు చెపుతున్నాయి. పారమార్థికమైన చైతన్యమే కాల స్వరూపంగా, ‘సంవత్సర’మనే నామంతో చెప్పబడుతుంది. కాల స్వరూపుడైన పరమాత్మను సంవత్సరం అని పిలుస్తారని విశదీకరించారు శ్రీ శంకర భగవత్పాదులు.
కాలస్వరూపుడై సంవత్సర రూపంతో వెలుగొందేవాడు పరమాత్మ. సమస్తమును లెక్క చూచేవాడు-కాలుడు. సర్వజీవుల చరాచరముల ఆయువును గణనం చేసే కాలస్వరూపుడైన ఈశ్వరుడే ‘కాలుడని’ ఆయనే్న ‘కాలాయనమః’ అన్నారన్నారు ఆదిశంకరులు. ఆద్యంతము విలువైన కాలము భగవంతుని స్వరూపమే.
‘కాల’ పదములో ‘కా’ అనగా శుభములను, ‘ల’ అంటే అందించునది అని అర్థం. ‘అసమేవ అక్షయ కాలః’ అన్నది భగవద్వాక్యము. ‘అక్షయమైన కాలమును నేనే’ అని చెప్పారు పరమాత్మ. ‘కాలః కాలయ తామహః’ అన్నారందుకే.
‘కాలా అప్సు నివి శక్తే’ అని చెప్తోంది తైత్తిరీయ ఆరణ్యకం. కాలము జలములందున్నది. అనగా సంవత్సరానికి ‘నీరే’ స్థానం. ఆపోవా ఇదమగ్రే సవిల మాసేత్’ అన్న వేద ప్రమాణము చేత, సృష్టికి పూర్వం అంతాజలమయమే అగుట చేత సంవత్సరము మొదలగు కాలములకు జలమే ఆధారం. గ్రీష్మకాలంలో సూర్యకిరణముల చేత శోషింపబడిన జలములు, ఆ సూర్యకిరణముల యందుంటాయి. సూర్యకిరణముల యందున్న జలములను, వర్షఋతువులో మేఘములు పొందుతాయి. మేఘములయందున్న మెఱుపు సూర్యకాంతి. కనుక జలములకు సంవత్సర స్వరూపుడైన సూర్యుడు ఆధారం. జలము వల్లనే సంవత్సరానికి అవసరమైన జీవధాతువులు, ఆహారం లభిస్తాయి. కనుక సంవత్సరానికి జలము ఆధారం. కాలానికి, జలానికి వుండే అవినాభావ సంబంధం తెలిసికొంటే ‘కాలస్వరూపం - జీవితం’ అని స్ఫురిస్తింది.
ప్రకృతి శోభ
మోడువారిన జీవితాలను చైతన్యవంతం చేసి, వైషమ్యాలు, వైరుధ్యాలు, వైమనస్యాలను తొలగించి, నవ్య తేజస్సుతో భవిత ప్రగతికి బంగారు బాటలు దిద్దే మహోదాత్త శక్తి- ప్రకృతి. మృగ నగ ఖగ తరులతాదులు, చకటి వెలుగులన్నీ ప్రకృతి వరప్రసాదమే. సూక్ష్మరూపంగా తన్మాత్రలుగా- శబ్ద స్పర్శ రూప రస గ్రంధములుగా, తనలో అదృశ్యంగా ఉండే పంచభూతములను దర్శించి , అవగాహన చేసికోవటానికి, బాహ్య ప్రపంచంలోని భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశాన్ని గురించి ఆలోచించాలి. అదే ప్రకృతి శోభ. అదే కాలస్వరూపం. అదే పరమాత్ముని వెలుగు. దీనే్న హృద్యంగా అందించాడు త్యాగరాజస్వామి ‘పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగ తెలుసకోరే..’ అన్న వాగధీశ్వరీ రాగ కీర్తనలో.
వసంత ఋతువు
సమస్త విశ్వంలో పదార్థ ధర్మాలకు ప్రతీకలైన ‘వసువులు’ అధిదేవతలుగానున్న వసంత ఋతు ఆగమనంతో ప్రకృతిలో నవజీవనం వెలిగి, నూతనత్తేజోత్సాహము వెల్లివిరుస్తుంది. కనుకనే ‘‘ఋతూనాం కుసుమాకరః. ఋతువులలో వసంత ఋతువును నేనే’’ అని శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీత పదవ అధ్యాయంలో వివరించాడు.
ఆరు ఋతువులలో మొదటిది వసంత ఋతువు.‘మధుశ్చ మాధవశ్చ వాసన్తికా వృతూ’ అన్నది శ్రుతి. చైత్ర వైశాఖ మాసములు కలది- వసంత ఋతువు. మధు పదానికి- చైత్ర సమాసము, అశోకవృక్షము, తేనె మున్నగు అర్థాలున్నాయి. పౌర్ణమి చిత్తా నక్షత్రంతో కూడి ఉండే మాసం- చైత్రమాసం. ‘ఇంద్రస్య చిత్రా’ చిత్తా నక్షత్రానికి అధిపతి ఇంద్రుడు. చిత్తా నక్షత్రం కుజునిది. కుజుడు అగ్ని సంబంధమైనవాడు. విశాఖ నక్షత్రంలో పౌర్ణమి వస్తే అది వైశాఖ మాసం. విశాఖ నక్షత్రానికి అధిపతి గురుడు. మాధవ పదానికి వైశాఖం, తేనె, ఇంద్రుడు అనే అర్థాలున్నాయి. చైత్రమాసంలో సూర్యుడు మేషరాశిలో ఉంటాడు. వైశాఖ మాసంలో వృషభరాశిలో ఉంటాడు. కుజ, గురువులు సూర్యునికి మిత్రులు, ఇంద్రాగ్నులు సూర్య స్వరూపులు. చిత్తా విశాఖా నక్షత్రకాంతులు, సూర్యకాంతులు. కనుక రవి మేష వృషభ రాశులలో ఉన్నపుడు కలిగే ప్రకృతి శోభ, దాని ప్రభావము; ఇంద్రాగ్నుల చిత్తా విశాఖ నక్షత్రముల ప్రభావములు, మేలు కలయికలో వచ్చేది- వసంత ఋతువని- జ్యోతిష వేద శాస్తమ్రులు పేర్కొన్నాయి.
ఉగాది పండుగ.. మాసములలో మొదటిది చైత్రము. పక్షములలో మొదటిది శుక్లపక్షం. తిథులలో మొదటిది పాడ్యమి, నక్షత్రములలో మొదటిది అశ్వని. వసంత ఋతువులో చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయానికి
పాడ్యమి వున్న తిథి రోజున, సంవత్సరం ఆరంభం అవుతుంది అని పండితులు నిర్ణయించారు. ఆ రోజు ‘ఉగాది’ పండుగను జరుపుకుంటారు.
ఉగాది అంటే ఏమిటి?
‘ఉగము’ ఆదిగా గలది ‘ఉగాది’. ఉగము అంటే జన్మ, ఆయుష్షు, యోగము, యుగము అనే అర్థాలున్నాయి. కనుక ఉగాది అంటే జన్మాది. ‘జననో జన జన్మాదిః భీమో భీమ పరాక్రమః’ అన్నది విష్ణు సహస్రనామం. కనుక జన్మాది శ్రీ మహావిష్ణువు. కనుక ఉగాది అంటే పరమాత్మ.
ఉగ్+ఆది = ఉగాది. ‘ఉగ్ ఆదౌయస్యసః ఉగాదిః’. ఉగ్ ఆది యందు గల రోజుగాది. ‘ఉ’ అంటే శివుడు. ‘ఉ’ ఆదిగా గలది ఉమ. కనుక ఉగాది అంటే ‘ఉమ’- ప్రకృతి శక్తి- బ్రహ్మ విద్య- కుండలినీ యోగ శక్తి- చేతనాచేతన జీవరాశికి ప్రతీక. సరైన జీవన విధానానికి ఉపకరించే అసలైన విద్యను నేర్చుకోవటానికి ప్రారంభ దినమే ఉగాది.
స్వరానికి, ఉగాదికి సంబంధం ఏమిటి?
‘ఉ’ అంటే ఉత్తమమైన ‘గం’ అంటే జ్ఞానం. ‘ఉగం’ అంటే ఉత్తమమైన జ్ఞానం. ఉత్తమమైన జ్ఞానం ఏమిటి? పరమాత్మ తత్త్వం- ఉత్తమమైన జ్ఞానం. పరమాత్మ వేద వేద్యుడు. కనుక వేద జ్ఞానం- ఉత్తమ జ్ఞానం. ‘ఉగాది’ అంటే ఉగమునకు ఆది, అంటే వేదమునకు ఆది- ఏమిటది? ఓంకారము. ఓంకార ప్రణవనాదము. ప్రాణాగ్నుల కలయికతో నాదము ఏర్పడుతుంది. ‘ప్రాణానల సంయోగము వల్ల ప్రణవనాదము సప్తస్వరములై పరగ’ అన్న సారమతి రాగ కీర్తనాచరణంలో మనకందించాడు నాదయోగి త్యాగరాజస్వామి. అదే దైవీ వాక్కుగా సృజింపబడుతోంది. ‘దైవీం వాచమనయంత దేవాః తాం విశ్వరూపాః పశవోవదన్తి’ అన్నది వేదం. దైవీ వాక్కుగా సృజింపబడిన నాదాన్ని ఇంద్రాది దేవతలు, వ్యవహార యోగ్యమగునట్లుగా అకారాది అక్షర స్వరూపముగా నొందించారు. ఈ విషయాన్ని ‘వేద పురాణాదుల కాధారవౌ’ అన్న ఆరభి రాగ కీర్తన అనుపల్లవిలో అద్భుతంగా పేర్కొన్నాడు త్యాగరాజస్వామి. అదే ప్రణవ నాదమయింది. ఇదే వేదనాదము. అవే సప్త స్వరములు- సరిగమపదని (షడ్జమం, రిషభం, గాంధారం, మధ్యమం, పంచమం, దైవతం, నిషాదం) కనుక ఉగాది అంటే వేదములకు ఆదియందున్న స్వరము- ఓంకార ప్రణవనాదమే అని అర్థం. ‘యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాం తేషు ప్రతిష్ఠితః’ అన్నది వేదం. స్వరము కూడా ఉగాదే. జగన్మోహన రాగంలో ‘శోభిల్లు, సప్త స్వర సుందరుల భజింపవే మనసా’ అన్న కీర్తనలో ఉగాది విశేషాలను గంభీరంగా, స్ఫూర్తిదాయకంగా అందించారు- బ్రహ్మ విద్యా సార్వభౌముడు, సద్గురు నాదయోగి త్యాగరాజస్వామి. ఉగాది రోజున తప్పకుండా మననం చేసికోవలసినవి పైమూడు కీర్తనలు.
విష్ణు సహస్రనామం
యుగ, సంవత్సర, ఋతు మాస స్వరూపుడని ‘అహః సంవత్సరో వ్యాళః ఋతు స్సుదర్శనః కాలః ఉగ్రః సవంత్సరో దక్షో వత్సరో వత్సలో వత్సా..’ అన్నది విష్ణు సహస్రనామం. ఇవన్నీ కాలము, ఋతువులు, సంవత్సరం, ఉగాది గురించి చెప్పినవే.
ఉగస్సు ఆది ఉగాది
ఉగమంటే నక్షత్ర గమనం. చుక్కల నడవడిక ఆరంభమైన కాలమే అనగా సృష్టి మొదలయిన కాలము యొక్క ఆది- ఉగాది. వేదాలను తస్కరించిన సోమకాసురుని చెంత నుండి వేదాలను గైకొని చతుర్ముఖునికి అందజేసిన శ్రీహరి మత్స్యావతారాన్ని చైత్రశుద్ధ పాడ్యమి నాడు దాల్చినట్లు పురాణాలు పేర్కొన్నాయి.
యుగాది - ఉగాది
మనకి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని నాలుగు యుగాలు చెప్పబడినాయి. పూర్వీకులు యుగారంభ దినమును పండుగ దినములుగా జరుపుకున్నారు. అంటే, నాలుగు రోజులు సంవత్సరంలో పండుగ జరుపుకునేవారు. కాని ఆ తరువాత ఖగోళ శాస్తవ్రేత్తలు, జ్యోతిష శాస్తవ్రేత్తలు ఒక నిర్ణయానికి వచ్చి వసంత ఋతువులో ప్రారంభ దినమున, చైత్రశుద్ధ పాడ్యమి రోజున సంవత్సర ప్రారంభ దినముగా నిర్ణయించి ‘యుగాది’గా కాక, ఉగాదిగా సంవత్సరం ఆరంభంలోనే ఉగాదిని జరుపుకోవాలని నిర్ణయించారు. అప్పటి నుండి ఉగాది పండుగను జరుపుకుంటున్నాం.
ఆచరించే ప్రధానాంశాలు
ఉగాది అంటే నూతన సంవత్సర ప్రారంభ దినం. నూతన సంవత్సరానికి స్వాగతం, గత సంవత్సరానికి వీడ్కోలు పలికేది ఉగాది. ఈ సంయోగ, వియోగముల మధ్య ఉండేది ‘ఉగాది’. ఉదయానే్న అభ్యంగన స్నానం, ఇష్టదేవతారాధన, ముఖ్యంగా సూర్య భగవానునికి అర్చన, భగవంతునికి నివేదించిన షడ్రుచులతో కలిసిన ఉగాది పచ్చడి సేవనం, పంచాంగ శ్రవణం.
పంచాంగ శ్రవణం
తిథి వార నక్షత్రయోగ కారణములతో కూడినది పంచాంగం. తిథివలన సంపద, వారమువలన ఆయుష్షు. నక్షత్రము వలన పాపపరిహారము, యోగము వలన వ్యాధి నివారణం, కారణము వలన కార్యానుకూలత చేకూరుతాయి. పంచాంగ శ్రవణమువలన నవగ్రహ ధ్యానము వలన కలిగే శుభఫలితాలు కలుగుతాయి.
మన మహర్షులు, ప్రతి సంవత్సరానికి పరిపాలకులను నిర్ణయించారు. ప్రభవ నుండి అక్షయ వరకూ ఉండే అరవై సంవత్సరములకు, ఉగాది వచ్చిన సమయాన్ని, వారాన్ని బట్టి ఏఏ గ్రహములకు ఏఏ అధికారములు సంక్రమిస్తాయో తెలియజేసేది- పంచాంగం. నవ నాయక ఫలితములతోపాటు వర్ష లగ్న జగర్లగ్న ఫలితములు, ఆదాయ వ్యములు రాశి ఫలితాలను రాజ్యపూజ్య అవమానమును కందాయఫలములను, బేరీజు వేసి తెలియపరచేది ఉగాది పంచాంగం. ప్రతిరోజూ సూర్యోదయ సూర్యాస్తమయ సమయములు, పండుగలు విశేషములు, గ్రహణములు, నదీ పుష్కరములు, వౌడ్యదినములు మున్నగు విషయములను తెలియపరచేది పంచాంగం.
పంచాంగ శ్రవణ ఫలితం
శ్రీకల్యాణం గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం, గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణామ్ ఆయుర్వృద్ధిద ముత్తమం, శుభకరం సంతాన సంపత్ప్రదం, నానాకర్మ సుసాధనం సముచితం, పంచాంగ మాకర్ణ్యతామ్’’- పంచాంగం వినటం వలన సంవత్సరమంతా శుభము కలుగుతుంది. శతృబాధలు వుండవు. చెడు కలల వలన కీడు తొలగుతుంది. గంగలో స్నానం చేసినంత పుణ్యం, గోదానంతో సమానమైన మేలు చేకూరుతుంది. ఆయుర్దాయం పెరుగుతుంది. సంతాన సౌభాగ్యం లభిస్తుంది. నఅక శుభ పుణ్యకర్మలు నిర్వహించటానికి పంచాంగం సాధనమవుతుంది.
వర్షలగ్న, జగర్లగ్నములు
రవి, ఒక్కొక్క రాశిలో ఒక నెల ఉంటాడు. పనె్నండు రాశులు. రవి మేష రాశిలో ప్రవేశించిన సమయానికి లగ్నము కట్టి ఫలితాన్ని చూస్తే- అవి దేశ పరిస్థితులను, అభివృద్ధిని, కేంద్ర ప్రభుత్వ శాఖల పనితీరు, పురోవగతి, కేంద్ర రాష్ట్ర సంబంధములు మున్నగునవి బేరీజు వేసి చెప్పేది జగర్లగ్నం. చైత్రశుద్ధ పాడ్యమి ఏ సమయంలో వచ్చిందో (చంద్రగమనం) వచ్చిందో, ఆ సమయానికి లగ్న పరిశీలన చేసే పద్ధతిని, వర్షలగ్నమంటారు. రాష్టప్రురోగతి, వర్షపాతం, ఉష్ణోగ్రతలు, మంత్రులకు అధికారుల మధ్య సంబంధాలు మున్నగునవి తెలియపరుస్తుంది- వర్షలగ్నం.
విలంబ నామ సంవత్సర దేవత
‘విలంబ సంజ్ఞం మనసా సవితారం స్మరామ్యహం, చాప బాణ ధరం దోర్బ్యాంతు రజ్గ వార వాహనమ్’’ ఈ విలంబ నామ సంవత్సరమునకు ‘సివతార’ దేవత. సవిత అంటే సూర్యుడు. ఈ సంవత్సరమంతా సూర్యారాధన (ఆదిత్య హృదయ స్తో పారాయణ, అష్టోత్తర శతనామములతో అర్చన మొదలగునవి) ఆరోగ్యాన్నిస్తుంది, యత్న కార్య సిద్ధి జరుగుతుంది. 60 సంవత్సరముల క్రితం వచ్చిన విలంబ నామ సంవత్సరం శుక్రవారం వచ్చింది, కనుక ఆ సంవత్సరానికి రాజు శుక్రుడు. ఈ సంవత్సరం శ్రీవిలంబ నామ సంవత్సరం ఆదివారం వచ్చింది. కనుక ఈ సంవత్సరానకి రాజు రవి. ప్రభవ నుంచి అక్షయవరకు ఉన్న 60 సంవత్సరాలలో 32వ సంవత్సరం విలంబ నామ సంవత్సరం. సంఖ్యశాస్త్ర ప్రకారం 32 అంటే ఐదు. అయిదు అంకె బుధుడు. విజ్ఞాన కారకుడు. ఆర్థిక సంబంధ విషయములు, వాణిజ్యసంబంధ విషయాలపై ఆదిపత్యము బుధునిది. కనుక ఈ సంవత్సరం భారతదేశం వర్తక, వాణిజ్య ఆర్థికపరంగా అభివృద్ధి చెందుతుందని ఆశిద్దాం.
ఉగాది పండుగకు దీప్తి
కాలము భగవంతుని స్వరూపం. కాలశక్తి ఈ దృశ్య ప్రపంచమును చిత్రించి, పరిణామగతిని కలిగిస్తుంది. కనుక చీమ నుండి బ్రహ్మ వరకు, చేతనా చేతనా ప్రకృతియందు ‘కాల’ ప్రభావము ఉంటుంది. కాలప్రాముఖ్యాన్ని గుర్తెరిగి, కేవలము ప్రపంచ విషయాసక్తులతో కాలాన్ని వెలిబుచ్చక, ఋజువర్తనతో ఆదర్శ జీవితాన్ని గడిపి, గమ్యస్థానాన్ని చేరి, సార్థకత చెందాలి. ఎంతకాలము ఎచ్చట ఏమి అనుభవించినా, పక్షులు తిరిగి తిరిగి తమ గూటికి చేరుకున్నట్లు, వివేకులు జన్మాది శ్రీరామ దివ్య చరణములనే ఆశ్రయించి, ‘కాల’ నిమిత్తమైన భయాన్ని పొందారని చెప్తూ ‘నీ పాదములను ఆశ్రయించిన నన్ను రక్షించటానికి కాలహరణమేలరా సీతారామ’ అన్న సద్గురు త్యాగరాజస్వామి వారి శుద్ధ సావేరి రాగ కీర్తన ఉగాది పండుగకు దీప్తినిస్తుంది.
ఉగాది- ఆదిశంకరులిచ్చిన స్ఫూర్తి
‘దినయా మిన్యౌ సాయం ప్రాతః, శిశిర వసంతా పునరాయాతః, కాలం క్రీడతి గచ్ఛ త్వాయుః తదపి, న ముంచత్వా శావాయుః’- రాత్రింబవళ్ళు ఉదయాస్తమానాలు, ఆకురాలే కాలము చిగురించే కాలము మళ్లీ మళ్లీ వస్తూ వుంటాయి. కాలం అన్నింటికంటే బలీయమైనది. దాని క్రీడా విలాసాలలో ఆయుష్షు క్షీణిస్తూనే వుంటుంది. తరాలు గడుస్తూనే వుంటాయి. అయినా మనిషిలో ఉండే స్వార్థం, మూర్ఖత్వం తొలగవు. ‘కాలఃక్రీడతి’ అన్నారు ఆదిశంకరులు.
ఉగాది సందేశం
ఉగాది ముఖ్యంగా కాలానికి, కాలప్రభావము గురించి తెలియజేసే పండుగ. కాలాన్ని సద్వినియోగం చేసికోవాలని నొక్కి చెప్పేది ఉగాది. సంవత్సర రాశిఫలాలుల ఎలా న్నా, దైవానుగ్రహ బలమునకు ప్రయత్నించాలి. దీన్ని పొందటానికి అడ్డుతగిలే గ్రహాలు మనలోని అహంకార మమకారములు. మన రాశి ఫలితాలు మన పవిత్ర సంకల్పముల మీద ఆధారం. సత్సంకల్పములను అలవరచుకోవాలి. గ్రహబలమేమి రామానుగ్రహబలమే బలము అన్నాడు గదా మహావాగ్గేయకారుడు.
నదిని దాటటానికి, ఇవతలి ఒడ్డున పడవను ఎక్కుతాం. నడిపేవాడు దిగమనేవరకు అవతలి ఒడ్డు వచ్చిందని తెలియదు. సుఖానుభవంతో కాలపరిమితి తెలియదు. వయసు తీరిపోతుంది. ఇది మానవ జీవితానికి అవతలి ఒడ్డు. వయసు నది, కాలము పడవ. వయసు అనే నదిని దాటటానికి కాలమనే పడవలో ప్రయాణం చేసేటప్పుడు నావలోని తోటి ప్రయాణీకులను అనగా తనతో సంఘంలో సహజీవనం చేసేవారిని, ఏకాత్మభావంతో దర్శించి, తనలో వున్న చైతన్యంఎదుటివారిలో ఉన్న చైతన్యం ఒక్కటేనన్న విజ్ఞాన వెలుగును దర్శించి, మానవ సేవలో మాధవసేవను దర్శించి సర్వమానవ సౌభ్రాత్రతో విశ్వమానవ కల్యాణాన్ని వీక్షించాలని ఉద్బోధిస్తోంది శ్రీ విలంబ నామ ఉగాది.
ఉగాది పచ్చడి
దీపారాధన చేసి, ఆదిత్య హృదయమస్తోత్రం చదివి, దేవతారాధన చేసుకుని, ఉగాది పచ్చడిని నివేదన చేసి, ప్రసాద స్వీకరణతో, గ్రహ పరిస్థితులెట్లా వున్నా, సంవత్సరాధి దేవత అనుగ్రహంతో, సంపూర్ణ ఆరోగ్య భాగ్యం లభిస్తుంది, సర్వకార్యములు జయప్రదమవుతాయి. ప్రకృతి కొత్తగా ప్రసాదించిన ఫలపుష్పాదులను, అర్థం పరమార్థంగల సంప్రదాయంతో, నివేదన చేసిన ఉగాది పచ్చడిని సేవించటం ఉగాది పచ్చడి విశిష్టతను తెలియజేస్తుంది. సర్వకాలములలోనూ సమతుల్యమైన ఆరోగ్యాన్ని పొందడానికి దోహదపడేది ప్రకృతి ప్రసాదం- వేప పువ్వు. జీవితాన్ని సమదృష్టితో చూడాలనే ఆధ్యాత్మికతను తెలియజేసేది ఉగాది పచ్చడి. వేపప్వు, మామిడి, బెల్లం, కొత్త చింతపండు, ఉప్పు, కారం (పచ్చిమిర్చి సన్నని ముక్కలు)- షడ్రుచుల సమ్మేళనంగా సమతుల్య జీవన విధానాన్ని ప్రకృతి పరంగానిర్వచిస్తోంది ఉగాది పచ్చడి. జఠరాగ్నిని ప్రజ్వలింపజేసి, శే్లష్మాన్ని హరించి, రక్తశుద్ధిని చేసి, వృద్ధి చేసి, ఆకలిని పెంపొందింపజేసి, మనోవ్యాధిని పోగొట్టి శాంతిని కలిగిచే ఉగాది పచ్చడిని ‘శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయచ, సర్వారిష్ట వినాశాయ నింబ కందాళ భక్తణం’ అని పఠిస్తూ సేవిస్తే ఆయురృద్ధి జరుగుతుందని, ఆయుర్వేద విజ్ఞాన శాస్త్రం పేర్కొన్నది.

-పసుమర్తి కామేశ్వర శర్మ 944077464