త్యాగరాజ రామాయణం
Published Saturday, 24 March 2018రామాలయం లేని ఊరుగానీ, రామమందిరం లేని వీధిగానీ ఎక్కడా వుండదు. శ్రీమద్రామాయణం ఎవరో ఒక మహారాజు చరిత్రలా వుండి వుంటే ఈపాటికి జనం ఆ కథను ఏనాడో మరిచిపోయి వుండేవారు.
కానీ రామాయణ, భారత భాగవతలు మన జీవితాల్లో ఒక భాగమై స్థిరంగా ఉండిపోవడానికి కారణం వీటిలోని పాత్రల స్వభావాలు.
సూర్యవంశంలో పుట్టిన రామచంద్రుడు మానవుడై, భక్తసులభుడై, సుశీలుడై జగదానంద కారకుడై నిలిచాడు. కేవలం బోధన ద్వారా కాకుండా ఆచరణ ద్వారా సుస్థిర సమాజ స్థాపనే లక్ష్యంగా సాగింది రామకథ.
శ్రీమద్రామాయణం కావ్యం ఎన్నిసార్లు విన్నా ఎవరు చెప్పినా వీనులకు విందే. రామాయణానికి ఎనె్నన్ని వ్యాఖ్యానాలో, ఎనె్నన్ని ఉపాఖ్యానాలో, ఎందరెందరు పండితులు ఈ రామనామ సుధారస పానం చేసి మత్తిల్లిన వాల్మీకి కోకిలకు దాసోహమన్నారో తలలు వంచి నమస్కరించారో? శ్రీరామాయణాన్ని కథలుగా, హరికథలుగా, బుర్రకథలుగా చెప్పి చిత్ర విచిత్ర విన్యాసాలతో కూడిన జానపద కళారూపాలుగా ప్రదర్శించి ఆ పాత్రలన్నిటినీ మన హృదయాల్లో సుస్థిరం చేసుకున్నాం.
మెరుగు చెంగటనున్న మేఘంబుకైవడి నువిద చెంగటనుండ నొప్పువాడైన రామచంద్రుడు పోతనకు కలలో కనిపించడం, భాగవతాన్ని రచించమని కోరడం శివకేశవులకు భేదం లేదనేగా అర్థం?
పలికెడిది భాగవతమట పలికించు
విభుండు రామభద్రుండట, నేఁ
బలికిన భవహరమగునట, పలికెద
వేఱొండుగాథ బలుకగ నేలా’ యన్న పోతనకు శ్రీరాముడు పరబ్రహ్మ స్వరూపమై కనపడ్డాడు. ‘రామ’ అంటే శివకేశవ రూపం. రాముడే ప్రణవ స్వరూపుడు.
‘ఎవరని నిర్ణయించేదిరా’ అనే కృతిలో ‘త్యాగరాజు’ శివమంత్రానికి ‘మ’ జీవమని, మాధవ మంత్రానికి ‘రా’ జీవమన్నాడు, - చాలు. యింతకంటే వివరణ అక్కర్లేదేమో. అంతేనా? ‘నామ రామాయణం చేస్తే చాలు రామాయణ గానం చేసినట్లే’ అని చేసి నిరూపించాడు.
‘చీమకు దోమ కన్నమిడి చేకొని ప్రోచు జగద్విభుండు/ తన్నామ జపంబు సేసికొను నాకొక పట్టెడు కూడు పెట్టడె’ అని మనసా వాచా కర్మణా నమ్మి తరించాడు. మనిషి మనిషిలోని మనిషిని గుర్తించి గౌరవించగలగటంలోనే ఉంది గొప్పతనం. ఆస్తుల వల్ల తరతమ స్థాయిలవల్లా కాదు. దేవతలకే సహాయపడ్డవాడు శ్రీరాముని తండ్రి భయంకరులైన రాక్షసుల్ని ముక్కుపచ్చలారని పసితనంలోనే ముప్పుతిప్పలూ పెట్టిన వీరుడు. రాచరికపు అహంకారం కంటే, ఆత్మీయత, అభిమానం అపారం.
బోయరాజు, గుహుడు, వానరుడు సుగ్రీవుడు, రాక్షస వంశంలోని విభీషణుడు, వీరంతా వారివారి సామాజిక స్థాయిల్లో, ఎటువంటి నియమాలతో పనిలేకుండా రాముడికి ప్రీతిపాత్రులయ్యారు. అందర్నీ రాముడు భ్రాతృభావంతోనే చివరిదాకా ఆదరించాడు. చివరకు ‘శబరి’ ఇచ్చిన ఫలాలు స్వీకరించి ఆనందించాడు. ఇవన్నీ ఒక ఎత్తు. రావణుని పట్ల రాముని ప్రవర్తన ఒక ఎత్తు.
తన భార్య నపహరించినవాణ్ణి కూడా ‘శరణంటే’ మన్నిస్తానన్న ఔదార్యం రాముడిది.
దుర్బల మనస్సున్న మనిషి ‘అవన్నీ అవతార పురుషులకే తప్ప మనకు కాదనుకుని ‘దైవీ గుణాల’తో చేర్చేసి, పూజలతో తృప్తి పడిపోతున్నాడు.
కానీ నారదాంశ సంభూతుడైన త్యాగరాజు ఎంచుకున్న మార్గమే ఎంతో విలక్షణమైనది.
రామచంద్రుడి పట్ల ఆయనకున్న భక్తి అదేదో ఒక ప్రత్యేక రసం కాదు. అన్ని రసాలూ అందులో కలిసిపోయి ఉన్నాయి.
త్యాగరాజు రాముడి సౌందర్యాన్ని వర్ణించినట్లు ఏ నాయిక నాయకుణిణ వర్ణించింది?
త్యాగరాజు రాముడి పొందు కోరినట్లు ఏ ప్రేయసి తన ప్రియుడి కోసం విలపించింది? పొందు కోరింది?
త్యాగయ్య రాముడి కోసం పరితపించినట్లు ఏ కాముకి వియోగ బాధతో విలపించింది? ప్రత్యక్షమై ఎదురుగా తనతో మాట్లాడినట్లుగా భావించాడు కాబట్టే ఆ కీర్తనలన్నీ యింతకాలమూ సజీవంతో వున్నాయి.
శ్రీరామాయణంలోని బాలకాండ మొదలు చివరి దాకా ఆయన దర్శించిన పాత్రలు, పాత్ర స్వభావాలు కళ్లకు కట్టినట్లు జీవభాషలో చిథ్రించిన మహానుభావుడు. ఆయన ప్రసిద్ధమైన కీర్తనల్లోని ప్రతి పల్లవీ, ప్రతి చరణమూ, రసికజన హృదయాల్లో స్థిరమైపోలా? ఆయన భక్తి పారవశ్యాన్ని మాటల్లో వర్ణించ వీలవుతుందా? పోతనకు కూడా శ్రీరామాయణాన్ని వ్రాయాలనే ఆశ వుండేదట. అయితే అప్పటికే కొందరు దాన్ని తెనిగించారని తెలిసినా, ‘నా అదృష్టం కొద్దీ భాగవతాన్ని నా పూర్వీకులు నాకు వదిలిపెట్టారని ఆనందించాడట. పోతన తన భాగవత పద్యాలలో నాదసుధా మాధుర్యాన్ని నింపినట్లుగా త్యాగయ్య తన మధురమైన కీర్తనలతో రామభక్తి రామాయణ గాథను మన కళ్లెదుట సాక్షాత్కరింపజేసి ధన్యుడైయ్యాడు.
బాలకాండ నుంచి చివరి దాకా సాగిన శ్రీరామాయణ గాథను ప్రతిబింబిస్తూ కనబడే ఆ పల్లవులు చాలు. ఆ పాటలకు పల్లవులే ప్రాణం.
ఎవరికై అవతారమెత్తితివో/ ఇప్పుడైన తెలుపవయ్యా!/ అవనికి రమ్మని పిలిచిన మహారాజు/ ఎవడో వానికి మ్రొక్కెద రామ నీ ॥
వేద వర్ణనీయవౌ నామముతో/ విధి రుద్రాదులకు మేల్ని రాపముతో/ మోద సదనమగు పటు చరితముతో/ మునిరాజ లేషి త్యాగరాజ నత ॥
రామ లక్ష్మణ భరత శతృఘు్నలకు నామకరణం చేసినది వశిష్టుడు. రూప, గుణ సౌందర్యానికి సరిపడ్డ పెట్టిన ఆ పేర్లకే మురిసిపోయి పాడుకున్న కీర్తనకు ఖరహర ప్రియ రాగం కేంద్రమైంది.
‘పేరిడి నిన్ను పెంచిన వారెవరే/ వారిని జూపవే శ్రీరామయ్య/ బుద్ధిమాన్, నీతిమాన్, వాగ్మీ శ్రీమాన్ శత్రుని బర్హణః’ అని వాల్మీకి చెప్పినట్లు విభీషణుడు వచ్చి శరణంటే అప్పుడు కూడా రావణున్ని పల్లెత్తు మాటనడు సరికదా శరణాగతుడికి ముందు అభయమిచ్చి మాట్లాడతాడు రామచంద్రుడు.
తోడి రాగంలో ‘ఏమని మాట్లాడితివో రామ/ ఎవరి మనసు కేవితమో తెలిసి॥
మామ సురలనుజులు తలిదండ్రులు/ భామలు పరిజనులు స్వ వశవౌట ॥
రాజులు మునులు సురాసురులు వరదిగ్రాజులు/ మరి శూరులు శశధర దిన/ రాజులు లోబడి నడువను త్యాగ /రాజ వినుత తానభయముగ, ముద్దుగ ॥
విశ్వామిత్ర యాగ రక్షణ సందర్భంలో వెడలెను కోదండపాణి - అనుజ సౌమిత్రి గూడి పుడమిలొ జనులెల్ల పొగడ పూజితుడగు మునితో గూడి ॥
శిరమున కొండియుజార - ఉరమున హారములు/ కరమున శరచాసములు ఘనముగ మెరయ/ మెరయ సురుచిర వాద్యములు మ్రోయ - సురులెల్ల నుతులుసేయ / వరత్యాగ రాజనుతుడు - అసుర భారమెల్ల దీర్ప ॥
తోడి రాగంలోని ఈ కీర్తనలో దేవతలకు సంతోషం కలగటానికి, కారణం భువి, దివి రెండూ రావణ భారంతో కృంగిపోతున్నాయి కాబట్టి వసుధ భారం తీర్చడానికి బయలుదేరినట్లుగా వర్ణించాడు.
త్యాగయ్య కీర్తనలలోని ముఖ్య విశేషం ఆయన ప్రారంభించే పల్లవులే. ఈ ‘సుళువు’ ఆయనకు తెలిసినట్లుగా మరే యితర వాగ్గేయకారులకూ తెలియలేదేమో అనిపించేలా వుంటాయి.
బాలకనకమయ చేల సుజన పరిపాల
శ్రీ రమాలోల! విధృతశరజాల! శుభద!
కరుణాలవాల! ఘననీల! నవ్యవనమాలికా భరణ!
ఏల! నీ దయ రాదు? పరాకు జేసేవేల?
సమయము కాదు!
అను పల్లవి మాత్రం సంస్కృతంలో వుంటుంది. పల్లవి, చరణాలు సంస్కృత సమాసాలతో నిండి ఉంటాయి.
త్యాగరాజు 96 కోట్ల రామనామ జపం పూర్తవ్వగానే విశ్వామిత్రుడు వెంట యాగ రక్షణ కోసం వెళ్తున్న భంగిమలో రామలక్ష్మణులు సాక్షాత్కరించిన అనుభూతితో వెలువడిన కీర్తనగా చెప్తారు.
అహల్యా శాప విమోచన ఘట్టంలో (అమృతవాహిని రాగంలో) శ్రీరామ పాదమా నీ కృప జాలునే చిత్తానికి రావే!
శాపంబడగి రూపవతి టకహల్య
తపవేమి చేసెనో అని శ్లాఘిస్తాడు.
శ్రీరామాయణంలోని ముఖ్య ఘట్టం ‘శివధనుర్భంగం’
జనకుని ప్రతిజ్ఞ విన్న విశ్వామిత్రుడు చేసిన ఒక్క కనుసైగతో శ్రీరామచంద్రుడు అవలీలగా ధనుర్భంగం చేయటాన్ని ఒక చిన్న కీర్తనలో ఇమిడ్చి పాడుకున్నాడు.
‘అలకలల్ల లాడగ గని ఆ రాణ్ముని ఎటు పొంగెనో (మధ్యమావతి)
ఆయన దివ్య నామ కీర్తనలలో విశిష్టమైనది ‘శ్రీరామ జయరామ శృంగార రామయని చింతింపరాదె ఓ మనసా!’
యదుకుల కాంభోజి రాగంలోని ఈ కీర్తనలో...
కన్నతల్లి కౌసల్య, తండ్రియైన దశరథుడు, కంటికి రెప్పలా తనతోనే తిరిగిన సౌమిత్రి యాగ రక్షణ కోసం చేయిపట్టి నడిపించిన కౌశికుడు, రామచంద్రుని పాదస్పర్శతో పునీతురాలైన ‘అహల్య తనను ఎక్కుపెట్టుతున్న సమయంలో రాముణ్ణి స్పృశించిన శివచాపం, కన్యాదానం చేసిన జనకుడు, ధర్మమూర్తియైన శ్రీరాముణ్ణి భర్తగా పొందిన జానకి, తనకు లభించిన పుణ్యానికి కారకుడైన నారదుడు.. యిలా అందర్నీ స్మరించుకుని పొంగిపోతాడు త్యాగరాజు.
*
శ్రీమద్రామాయణాన్ని కథావస్తువుగా ఎందరో మహనీయులుగా హరికథలుగా గానం చేశారు. హరికథా పితామహుడైన ఆదిభట్ల నారాయణదాసు గారు రచించిన కథలలో ‘యథార్థ రామాయణం’ ‘జానకీ శపథం’ ప్రముఖమైనవి.
నెల్లూరు వాస్తవ్యులైన శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి (ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం తండ్రి) ఎంతో పేరున్న హరికథకుడు. పంచకావ్యాలు పఠించిన పండితుడు. ఆయన సరళ సంస్కృత పదజాలంతో, భావగంభీరతతో కూడిన కీర్తనలెన్నో రచించారు.
కాపీ రాగంలో రచించబడిన ఈ కీర్తన నారాయణదాసు గారికి అత్యంత ప్రీతిపాత్రమైనది.
ప॥ ఇకనైన నను కరుణింపుము అకలంక చరిత/ రఘువీర కృపావర
అ॥ జంకు గొంకులేక నీ పద జల జంబులకడ/ జాగి మ్రొక్కి వేడితి ॥
చ॥ భరియింపగ జాలను సంసారపు దరిగాన రాదు దయా సాగర శ్రీపతి పండితనుత చరితా - కరుణజూచి కరిని గాచినటు నను ॥