S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

టీ-20 విశ్వరూపం ఐపీఎల్

ఇండియన్ ప్రీమియర్ లీగ్.. పొట్టి క్రికెట్‌ను పొట్టి పేరుతో చెప్పాలంటే ఐపీఎల్.. సునామీలా దూసుకొచ్చి, యావత్ క్రికెట్ ముఖచిత్రాన్ని మార్చేసిన టీ-20 టోర్నీ. అప్పటి వరకూ రాజ్యమేలిన ఇంగ్లీష్ కౌంటీల ప్రాభవం తగ్గిపోవడానికి ఐపీఎల్ కారణమైంది. ఆస్ట్రేలియా సూపర్ సిరీస్ బిగ్‌బాష్‌ను చావుదెబ్బ కొట్టింది. అప్పటికే కోట్లకు పడగలెత్తిన భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) ఆదాయాన్ని కొన్ని వందల రెట్లు పెంచేసింది. ఇప్పుడు బీసీసీఐకే కాదు.. క్రికెటర్లందరికీ ఇది ఓ బంగారు బాతు. బ్యాట్ లేదా బాల్ పట్టిన ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారి ఐపీఎల్‌లో ఆడితే జీవితం ధన్యమవుతుందని అనుకోవడంలో విడ్డూరం లేదు. ఐపీఎల్‌ను చూసి పాకిస్తాన్, బంగ్లాదేశ్, వెస్టిండీస్, శ్రీలంక, న్యూజిలాండ్ దేశాలు ప్రీమియర్ లేదా సూపర్ లీగ్ పేర్లతో టోర్నీలు మొదలుపెట్టాయి. కానీ, ఏవీ ఐపిఎల్ స్థాయిలో దేశ లేదా విదేశీ క్రికెటర్లను ఆకట్టుకోలేక పోతున్నాయి. పదిసార్లు అభిమానులను అలరించిన ఈ సూపర్ టోర్నీ మరోసారి కనువిందు చేసేందుకు ముస్తాబైంది. వనె్నతగ్గని క్రికెట్ మజాను పంచేందుకు సన్నాహాలు పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 7 నుంచి మే 27 వరకూ అంతర్జాతీయ క్రికెట్ క్యాలండర్ స్తంభించిపోవడం ఖాయం.
ఎన్నో హంగులు, మరెన్నో ప్రత్యేకతలతో యావత్ ప్రపంచ క్రికెట్ దిశను మార్చేసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మరోసారి అభిమానులకు పసందైన విందును అందించేందుకు ముస్తాబైంది. ఏప్రిల్ 7 నుంచి మే 27 వరకూ జరిగే ఈ టోర్నీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఐపీఎల్ కంటే ముందే ఇంగ్లీష్ కౌంటీలు, ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల టోర్నీలు ఉన్నాయి. ఐపీఎల్ ప్రభంజనాన్ని చూసిన తర్వాత దాదాపుగా అన్ని దేశాల్లోనూ ప్రీమియర్ లీగ్‌లు మొదలయ్యాయి. అయితే, మిగతా లీగ్స్ చుక్కల్లా మిణుకుమిణుమంటుంటే, ఐపీఎల్ మాత్రం చందమామలా వెలిగిపోతున్నది. ఒక రకంగా చెప్పాలంటే- పొట్టి క్రికెట్ విశ్వరూపమే ఐపీఎల్. క్రికెట్‌ను కొత్త పుంతలు తొక్కించిన ఏకైక టోర్నమెంట్ ఇదే. క్రికెట్ ప్రపంచంలో పెను తుపాను సృష్టించిన ‘పొట్టి క్రికెట్’ విందు దగ్గరపడుతున్నకొద్దీ అభిమానుల్లో ఉత్సాహం పెరిగిపోతున్నది. అమ్మకానికి ఉంచిన క్షణాల్లోనే టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుకావడమే ఈ టోర్నీకి ప్రజల్లో ఉన్న అభిమానానికి నిదర్శనం. మ్యాచ్ ఫిక్సింగ్ కేసు నేపథ్యంలో రెండేళ్ల సస్పెన్షన్‌కు గురైన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మళ్లీ రంగ ప్రవేశం చేయనుండడం ఈసారీ ఐపీఎల్ ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవాలి.
అవరోధాలను అధిగమించి.. గత పదేళ్ల కాలంలో ఐపీఎల్ ఎన్నో అవరోధాలను అధిగమించింది. ఎన్నో సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంది. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వెల్లువెత్తినా, భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) తీరుపై సుప్రీం కోర్టు మండిపడినా ఐపీఎల్‌కు ఆదరణ ఏ మాత్రం తగ్గకపోగా మరింత పెరిగింది. ప్రస్తుతం బీసీసీఐ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న పాలనాధికారులు బృందం (సీఓఏ) సైతం ఈ టోర్నమెంట్‌కు ఇతోథిక ప్రాధాన్యం ఇస్తున్నది. ప్రజాదరణతోపాటు బీసీసీఐకి కోట్లాది రూపాయలను ఆర్జించి పెడుతున్న ఐపీఎల్ తన ఆధిక్యాన్ని నిలబెట్టుకోవడానికి, తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించడానికి కారణాలు లేకపోలేదు. దీని రూపకల్పనే ఒక అద్భుతం. యూరోపియన్ ఫుట్‌బాల్ లీగ్ నుంచి ఇంగ్లీష్ కౌంటీస్ వరకూ వివిధ రకాల టోర్నీల మేలుకలయికగా రూపుదిద్దుకున్న ఓ దృశ్య కావ్యం ఐపీఎల్. అందుకే, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ అప్రతిహతంగా ముందుకు సాగుతునే ఉంది. ఈ అసాధారణ టోర్నీలో ఫ్రాంచైజీల విధానాన్ని ఇంగ్లీష్ కౌంటీలు, యుఫా సాకర్ నుంచి తీసుకున్నారు. ప్రారంభంలో చీర్‌లీడర్లు ఈ టోర్నీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. క్రికెట్‌లో చీర్‌లీడర్ల విధానం ఐపీఎల్‌తోనే మొదలైంది. ఇది టీ-20 ఫార్మెట్ కావడంతో, సుమారు మూడు గంటల వ్యవధిలోనే ఫలితం
తేలిపోతుంది. పైగా, క్రికెట్‌లో పేరొందిన ఎంతోమంది ప్రస్తుత క్రికెటర్లతోపాటు మాజీ ఆటగాళ్లను చూసే అవకాశం లభిస్తుంది. సినీ స్టార్లలో చాలా మందికి వివిధ ఫ్రాంచైజీల్లో వాటాలు ఉండడం కూడా ఐపీఎల్ విజయ రహస్యాల్లో ఒకటి. అన్ని అద్భుతాలనూ ఒకేచోట వీక్షించే అవకాశం దక్కుతుంది కాబట్టే ఐపీఎల్ మ్యాచ్‌లను చూసేందుకు అభిమానులు స్టేడియాలకు పరుగులు తీస్తున్నారు. టాలెంట్‌కు గ్లామర్ తోడై ఐపీఎల్‌కు కొత్త అందాన్నిచ్చింది. మన దేశంలో క్రికెట్ ఒక మతం. క్రికెటర్లను అభిమానులంతా సాక్షాత్తు దేవతల్లా ఆరాధిస్తారు. ఇక సినీతారలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెటర్లు, సినిమా స్టార్లు కలిస్తే ఇంకేముంటుంది? ఐపీఎల్ రూపంలో కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది.
క్యూ కడుతున్న క్రికెటర్లు
ఐపీఎల్‌కు క్రికెటర్లు క్యూట్టడానికి భారీగా లభించే పారితోషికాలే ప్రధాన కారణం. తాము తీసుకున్న మొత్తాలకు న్యాయం చేయడంతోపాటు, భవిష్యత్తు డిమాండ్‌ను మరింతగా పెంచుకోవాలన్న తాపత్రయం సహజంగానే క్రికెటర్లను పోరాట యోధులుగా మారుస్తుంది. అందుకే ప్రతి మ్యాచ్ ఒక యుద్ధాన్ని తలపిస్తుంది. దీనికితోడు కెరీర్ మొత్తంలో సంపాదించలేనంత భారీ సొమ్ము కేవలం ఒక ఐపీఎల్‌లోనే క్రికెటర్లకు లభిస్తున్నది. కాబట్టి, జట్టులో చోటును నిలబెట్టుకోవడానికి, మరుసటి సంవత్సరం డిమాండ్‌ను మరింతగా పెంచుకోవడానికి మైదానంలోకి దిగిన ప్రతి క్రికెటర్ చెమటోడుస్తాడు. సర్వశక్తులు ఒడ్డుతాడు. తాడోపేడో తేల్చుకోవాలన్న పట్టుదలతో పోరాటాలు చేస్తాడు. కోట్లాది రూపాయల ఆదాయం ఒకవైపు, జాతీయ జట్లలో స్థానం సంపాదించాలన్న ఆరాటం మరోవైపు. దీంతో చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా క్రికెటర్లను ఐపీఎల్ ఆకట్టుకుంటున్నది.
భారతీయులే మేటి..
గత ఏడాది జరిగిన పదో ఐపీఎల్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించిన 15 మంది ఉత్తమ ఆటగాళ్ల టాప్-5 జాబితాలో ఆరుగురు భారతీయులే కావడం విశేషం. అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లో డేవిడ్ వార్నర్ (సన్‌రైజర్స్- హైదరాబాద్) 641 పరుగులతో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. ఆతర్వాత నాలుగు స్థానాలను వరుసగా గౌతం గంభీర్ (కోల్‌కతా నైట్ రైడర్స్/ 498), శిఖర్ ధావన్ (సన్‌రైజర్స్- హైదరాబాద్/ 479), స్టీవెన్ స్మిత్ (రైజింగ్ పుణే సూపర్‌జెయింట్/ 472), సురేష్ రైనా (గుజరాత్ లయన్స్/ 442) దక్కించుకున్నారు. మొత్తం మీద ‘టాప్ ఫైవ్’లో ముగ్గురు భారతీయులే కావడం విశేషం. ఇక బౌలింగ్ విభాగానికి వస్తే, మొదటి మూడు స్థానాలు భారతీయలకే దక్కాయి. భువనేశ్వర్ కుమార్ (సన్‌రైజర్స్- హైదరాబాద్) 26 వికెట్లతో నంబర్ వన్ స్థానాన్ని సంపాదించాడు. జయదేవ్ ఉనాద్కత్ (రైజింగ్ పుణే సూపర్‌జెయింట్/ 24), జస్‌ప్రీత్ బుమ్రా (ముంబయి ఇండియన్స్/ 20) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. మిచెల్ మెక్‌క్లీనగన్ (ముంబయి ఇండియన్స్/ 19), ఇమ్రాన్ తాహిర్ (రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ 18) నాలుగు, ఐదు స్థానాలు దక్కించుకున్నారు.
కాగా, ఈ ఐపీఎల్‌లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌లో ఇద్దరు భారతీయులు ఉన్నారు. గ్లేన్ మాక్స్‌వెల్ (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్) 26, డేవిడ్ వార్నర్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) 26 సిక్సర్లతో మొదటి స్థానాన్ని పంచుకుంటున్నారు. రిషభ్ పంత్ (్ఢల్లీ డేర్‌డెవిల్స్) 24, కీరన్ పొలార్డ్ (ముంబయి ఇండియన్స్) 22, రాబిన్ ఉతప్ప (కోల్‌కతా నైట్ రైడర్స్) 21 చొప్పున సిక్సర్లు కొట్టారు.
ఛేజింగ్‌లో మేటి రాజస్థాన్
ఐపిఎల్ టోర్నీలో మొదటి ట్రోఫీని గెల్చుకున్న జట్టుగానేకాదు.. అత్యధిక పరుగులను ఛేజ్ చేసిన జట్టుగానూ రాజస్థాన్ రాయల్స్ గుర్తింపు పొందింది. 2008లో డక్కన్ చార్జర్స్‌పై ఏడు వికెట్లకు 217 పరుగులు సాధించి, లక్ష్యాన్ని ఛేదించింది. గత ఏడాది సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కింగ్స్ ఎలెవెన్ నాలుగు వికెట్లకు 211 పరుగులు, 2012లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై చెన్నై సూపర్ కింగ్స్ ఐదు వికెట్లకు 208, 2014లో చెన్నై సూపర్ కింగ్స్‌పై కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ నాలుగు వికెట్లకు 206 చొప్పున పరుగులతో విజయాలను నమోదు చేశాయి. 2010లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, 2010లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ రెండు వికెట్లకు 204 చొప్పున ఒకే రకమైన స్కోర్లు చేయడం విశేషం.
చెరగని మచ్చ..
యావత్ క్రికెట్ ప్రపంచంలో కొత్త ఒరవడి సృష్టించిన ఐపీఎల్‌కు స్పాట్ ఫిక్సింగ్ కారణంగా పడిన మచ్చ ఇంకా చెరగిపోలేదు. 2013లో జరిగిన ఆరో ఐపీఎల్‌లో చోటు చేసుకున్న ఫిక్సింగ్ ఉదంతం యావత్ భారత క్రికెట్ స్వరూపానే్న సమూలంగా మార్చేసింది. వివిధ కోర్టుల్లో కేసులు.. ఎన్నో మలుపులు.. చివరికి సుప్రీం కోర్టు జోక్యం.. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీ) ఉనికినే ప్రశ్నార్థంగా మార్చేశాయి. సుప్రీం కోర్టు నేరుగా జోక్యం చేసుకొని, పాలనాధికారుల బృందాన్ని (సీఒఏ) ఏర్పాటు చేయడమే ఇందుకు నిదర్శనం. ఏది ఏమైనా, ఆరోపణలు, ప్రత్యారోపణలు, స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ తదితర కారణాల వల్ల ఐపీఎల్‌లోని ప్రతి మ్యాచ్ ఫలితాన్నీ అనుమానంగా చూసే దుస్థితి దాపురించింది. ‘నోబాల్’ వేయడం నుంచి పరుగులు సమర్పించుకోవడం వరకూ ప్రతి బంతికీ స్పాట్ ఫిక్సింగ్ చేసే అవకాశం ఉందని శ్రీశాంత్ ఉదంతం నిరూపించింది. దీనితో ఇప్పుడు అన్ని మ్యాచ్‌లనూ అభిమానులు రంగుటద్దాలతో చూస్తున్నారు. అనూహ్య ఫలితాలు వెల్లడైన మ్యాచ్‌లు ఫిక్సింగ్‌కు గురై ఉంటాయని అనుమానిస్తున్నారు. మైదానంలో ఆటగాళ్ల ప్రతి కదలికనూ అదే ఉద్దేశంతో గమనిస్తున్నారు. ప్రతిదీ ఫిక్సింగ్‌లో భాగమేమోనన్న అనుమానం ప్రతి ఒక్కరినీ తొలిచేస్తున్నది. ఫలితంగా గతంలో మాదిరి మ్యాచ్‌లను తిలకిస్తూ ఆనందించలేక పోతున్నారు. క్రమంగా పరిస్థితి మెరుగుపడుతున్నప్పటికీ, స్పాట్ ఫిక్సింగ్ ప్రకంపనల ప్రభావం ఇప్పటికీ ఐపీఎల్‌పై కనిపిస్తునే ఉంది.
గత ఏడాది గురాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ మూడు వికెట్లకు 214 పరుగులు చేసి, ఈ జాబితాలో రెండో స్థానాన్ని ఆక్రమించింది.
2014లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కింగ్స్ ఎలెవెన్ నాలుగు వికెట్లకు 211 పరుగులు, 2012లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై చెన్నై సూపర్ కింగ్స్ ఐదు వికెట్లకు 208 పరుగులతో చేజింగ్‌లో మేటిగా నిరూపించుకున్నాయి. 2014లో చెన్నై సూపర్ కింగ్స్‌పై కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ నాలుగు వికెట్లకు 206 పరుగులతో విజయాన్ని నమోదు చేసింది. 2010లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, అదే ఏడాది కోల్‌కతా నైట్ రైడర్స్‌పై కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ రెండు వికెట్లకు 204 చొప్పున ఒకే రకమైన స్కోర్లు చేయడం విశేషం.
స్కోరు తక్కువైతేనేం...?
సామర్థ్యం, పట్టుదల, చివరి వరకూ పోరాడే తత్వం ఉండాలేగానీ, ఎంత తక్కువ స్కోరు చేసినా ఆ తర్వాత ప్రత్యర్థిని నిలువరించి విజయభేరి మోగించడం కష్టం కాదని చెన్నై సూపర్ కింగ్స్ రుజువు చేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగి, తక్కువ స్కోర్లకే పరిమితమైనప్పటికీ, ఆ తర్వాత ప్రత్యర్థులను అంతకంటే తక్కువ పరుగులకే కట్టడి చేసి విజయం సాధించిన జట్లలో జట్టును అగ్రగామిగా పేర్కోవాలి. 2009లో ఈ జట్టు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 116 పరుగులు మాత్రమే చేసింది. అయితే, అనంతరం ప్రత్యర్థి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌ను 8 వికట్లెకు 92 పరుగుల వద్ద నిలిపేసి విజయాన్ని నమోదు చేసింది. అదే ఏడాది ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 8 వికెట్లకు 119 పరుగులు చేసింది. కానీ, ఈ సాధారణ లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయిన ముంబయి ఏడు వికెట్లకు 116 పరుగులు చేసి, మూడు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 2013 సీజన్‌లో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్‌తో తలపడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎనిమిది వికెట్లకు 119 పరుగులు చేసింది. అయితే, ప్రత్యర్థిని 108 పరుగులకే ఆలౌట్‌చేసి, 11 పరుగుల గత పుణే వారియర్స్‌పై ముంబయి ఇండియన్స్ (2012), చెన్నై సూపర్ కింగ్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (2008), పుణే వారియర్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ (2013) కూడా ఈ విధంగానే తక్కువ స్కోర్లను సమర్థంగా డిఫెండ్ చేసుకున్నాయి. గత ఏడాది రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్‌పై ముంబయి ఇండియన్స్ ఎనిమిది వికెట్లకు 129 పరుగులు చేసింది. అనంతరం ప్రత్యర్థిని ఆరు వికెట్లకు 128 పరుగుల వద్ద నిలువరించి, ఒక వికెట్ తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసింది.
సూపర్ గేల్
వెస్టిండీస్ సూపర్ స్టార్ క్రిస్ గేల్‌ను ఐపీఎల్ బ్యాటింగ్‌లో సూపర్ స్టార్‌గా పేర్కొవాలి. 2013లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన మెరుపు ఇన్నింగ్స్ ఐపీఎల్‌లో రికార్డుగా నమోదై, ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. పుణే వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 66 బంతుల్లోనే అజేయంగా 175 పరుగులు సాధించాడు. 2008లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు బ్రెండన్ మెక్‌కలమ్ 73 బంతుల్లో 158 (నాటౌట్), 2015లో ముంబయి ఇండియన్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మన్ ఎబి డివిలియర్స్ 133 (నాటౌట్) చొప్పున పరుగులు సాధించి, వ్యక్తిగత అత్యధిక స్కోర్ల జాబితాలో రెండు, మూడు స్థానాలను ఆక్రమించారు. ఐపీఎల్‌లో బ్యాటింగ్ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణలు అవసరం ఉండవు.
బ్యాటింగే ప్రధాన ఆకర్షణ!
ఐపీఎల్‌లో ఆకట్టుకునే అంశాలు ఎన్నో ఉన్నాయి. బ్యాటింగ్ అందులో ప్రధానమైనది. 2013లో క్రిస్ గేల్ 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేస్తే, అంతకు ముందు, 2010లో ముంబయి ఇండియన్స్‌పై యూసుఫ్ పఠాన్ (రాజస్థాన్ రాయల్స్) 37 బంతుల్లోనే శతకాన్ని నమోదు చేశాడు. 2013లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై డేవిడ్ మిల్లర్ (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్) 38 బంతుల్లో సెంచరీలు సాధించాడు. బ్యాట్స్‌మెన్ ఇలా వీర బాదుడుతో చెలరేగిపోతారు కాబట్టే, వారిని ప్రేక్షకులు హర్షధ్వానాలతో ఆకాశానికి ఎత్తేస్తారు. గేల్ ఇప్పటి వరకూ 100 ఇన్నింగ్స్‌లో 268 సిక్సర్లు కొడితే, సురేష్ రైనా 157 ఇన్నింగ్స్‌లో 173 సిక్సర్లు సాధించాడు. రోహిత్ శర్మ 154 ఇన్నింగ్స్‌లో 172 సిక్సర్లతో రైనాకు గట్టిపోటీనిస్తున్నాడు. కాగా, గేల్ ఒక ఇన్నింగ్స్‌లోనే 17 సిక్సర్లు కొట్టి, మరో అరుదైన రికార్డును అందుకున్నాడు. ఇలాంటి సునామీ బ్యాటింగ్‌ను చూసేందుకు అభిమానులు విరగబడతారు.
*
మొదటి ఐపీఎల్..
లలిత్ మోదీ కమిషనర్ హోదాలో మొదటి ఐపీఎల్ 2008లో ప్రారంభమైంది. ఏప్రిల్ 18 నుంచి జూన్ ఒకటి వరకూ జరిగిన ఈ టోర్నీ క్రికెట్‌లో తుపానుకు కారణమైంది. అప్పటి వరకూ చీర్ లీడర్ల చిందులనుగానీ, సినీ స్టార్ల సందడిగానీ క్రికెట్‌లో చూడని అభిమానులకు ఐపీఎల్ ఒక అద్భుత దృశ్యకావ్యంగా కనువిందు చేసింది.
కాగా, రెండో ఐపీఎల్ 2009 ఏప్రిల్ 18 నుంచి జూన్ ఒకటి వరకు జరిగింది. ఆ తర్వాత వరుసగా 2010 (మార్చి 12 నంచి ఏప్రిల్ 25 వరకు), 2011 (ఏప్రిల్ 8 నుంచి మే 28 వరకు), 2012 (ఏప్రిల్ 4 నుంచి 27 మే వరకు), 2013 (ఏప్రిల్ 3 నుంచి 26 మే వరకు), 2014 (ఏప్రిల్ 16 నుంచి జూన్ 1 వరకు), 2015 (ఏప్రిల్ 8 నుంచి మే 24 వరకు), 2016 (ఏప్రిల్ 9 నుంచి మే 29 వరకు), 2017 ఏప్రిల్ 5 నుంచి మే 21వ తేదీ వరకు ఐపీఎల్ టోర్నీలు జరిగాయి.
*
రికార్డు ధర
యువరాజ్ సింగ్‌ను అత్యధికంగా 16 కోట్ల రూపాయలకు ఢిల్లీ డేర్ డెవిల్స్ కొనుగోలు చేసింది. ఐపిఎల్ చరిత్రలో ఇదే అత్యధిక ధర. గత ఏడాది కూడా యువీకే రికార్డు ధర లభించడం విశేషం.
*
ప్రస్తుత జట్లు
1. చెన్నై సూపర్ కింగ్స్, 2. ఢిల్లీ డేర్‌డెవిల్స్, 3. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, 4. కోల్‌కతా నైట్‌రైడర్స్, 5. ముంబయి ఇండియన్స్, 6. రాజస్థాన్ రాయల్స్, 7. రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు, 8. సన్‌రైజర్స్ హైదరాబాద్.
* స్పాట్ ఫిక్సింగ్ కేసులో రెండేళ్ల సస్పెన్షన్‌కు గురైన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తిరిగి ఐపీఎల్‌లో చేరడంతో గత రెండేళ్లు ఈ జట్ల స్థానంలోనే టోర్నీలో పాల్గొన్న గుజరాత్ లయన్స్, రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ జట్లు నిష్క్రమించాయి. కాగా, వివిధ కారణాలతో డెక్కన్ చార్జర్స్, కొచ్చీ టస్కర్స్ కేరళ, పుణే వారియర్స్ ఫ్రాంచైజీలను బీసీసీఐ రద్దు చేసింది.
స్పాన్సర్లు: 2008-2012 మధ్య కాలంలో డీఎల్‌ఎఫ్ సంస్థ ఐపీఎల్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఈ సంస్థ బీసీసీఐకి చెల్లించిన మొత్తం 40 కోట్ల రూపాయలు. 2013-2018 వరకు స్పాన్సర్‌గా వ్యవహరించిన పెప్సీ 79.2 కోట్ల రూపాయలు చెల్లించింది. 2016-2017 కాలానికి వివో సంస్థ వంద కోట్ల రూపాయలతో స్పాన్సర్‌షిప్‌ను దక్కించుకుంది. ఇటీవల జరిగిన వేలంలో 2018-2022 కాలానికిగాను 439.8 కోట్ల రూపాయలతో ఇదే సంస్థ బిడ్డింగ్‌ను గెల్చుకుంది.
*
టాపర్ రైనా
ఐపీఎల్‌లో టాప్ స్కోరర్‌గా సురేష్ రైనా రికార్డును కొనసాగిస్తున్నాడు. మొత్తం 157 ఇన్నింగ్స్ ఆడిన అతను 4,540 పరుగులు సాధించాడు. విరాట్ కోహ్లీ 141 ఇన్నింగ్స్‌లో 4,418, రోహిత్ శర్మ 154 ఇన్నింగ్స్‌లో 4,207, గౌతం గంభీర్ 147 ఇన్నింగ్స్‌లో 4,132, డేవిడ్ వార్నర్ 114 ఇన్నింగ్స్‌లో 4,014 చొప్పున పరుగులు చేసి టాప్-5 జాబితాలో చోటు దక్కించకున్నారు.
*

విశ్వమిత్ర