S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం

వాసుదాసు వ్యాఖ్యానం *అరణ్యకాండ-2
*
వాసుదాసుగారు తాను రచించిన నిర్వచన రామాయణంలో సంస్కృత రామాయణంలో వున్న ప్రతి శ్లోకానికొక పద్యం వంతున రాశారు. మందరంలో తను రాసిన ప్రతి పద్యానికి, ప్రతి పదార్థ తాత్పర్యం సమకూర్చారు. ఒక్కో పదానికున్న వివిదార్థాలను విశదీకరించారు. భావాన్ని వివరణాత్మకంగా విపులీకరించారు. ఆయన మందరాలలోని శ్రీరామాయణ వ్యాఖ్యానంలో ‘జ్ఞాన పిపాసి’కి విజ్ఞాన సర్వస్వం దర్శనమిస్తుంది. ఇక ఆయన రాసిన నిర్వచన రామాయణంలో సాధారణంగా అందరూ రాసే చంపకమాలలు, ఉత్పలమాలలు, సీస - ఆటవెలది - తేటగీతి - కంద - శార్దూలాలు, మత్త్భాలు మాత్రమే కాకుండా, తెలుగు ఛందస్సులో వుండే వృత్తాలన్నిటినీ, సందర్భోచితంగా ప్రయోగించారు. వాటిలో, ‘మత్తకోకిలము’ ‘పంచ చామరం’ ‘కవిరాజ విరాజితము’ ‘తరలము’ ‘ప్రహరణకలిత’ ‘సుగంధి’ ‘ఉత్సాహం’ ‘మనోహరిణి’ ‘వనమయూరము’ ‘తోటకము’ ‘మానిని’ ‘ఇంద్రవంశము’ ‘లయగ్రాహి’ ‘తోదకము’ ‘మాలిని’ ‘కలితాంతము’ ‘మధురతిరగడ’ ‘స్రగ్ధర’ ‘వసంత తిలక’ ‘మాలి’ ‘కరిబృంహితము’ ‘చారుమతి’ ‘వృషభతిరగడ’ ‘స్రగ్విని’ ‘మనోరంజని’ ‘తామరసం’ ‘పద్మనాభవృత్తం’ ‘అంబురుహ వృత్తం’ ‘మందాక్రాంత’ లాంటివెన్నో వున్నాయి. ద్విపదలూ వున్నాయి. దండకం కూడా వుందో సందర్భంలో. ఎక్కడ ఎందుకు ఏ విధంగా ఛందో యతులను ఉపయోగించారో కూడా వివరించారు. వీటికి తోడు అనేక వ్యాకరణ విషయాలను అవసరమైన ప్రతి చోటా పాఠకులకు అర్థమయ్యే రీతిలో విపులంగా తెలియజేశారు.
వాసుదాసుగారి ఆంధ్ర వాల్మీకంలోని ప్రతి కాండకొక ప్రత్యేకతుంది. ప్రతికాండ ఒక్కో రకమైన విజ్ఞాన సర్వస్వం. ప్రతి కాండలోని, ప్రతి పద్యానికి, ప్రతిపదార్థం ఇస్తూ, చివరకు తాత్పర్యం రాస్తూ, అవసరమైన చోట నిగూఢార్థాలను - అంతరార్థాలను - ఉపమానాలను ఉటంకిస్తూ, సాధ్యమైనంత వరకు ఇతర గ్రంథాల్లోని తత్సంబంధమైన అంశాలను పేర్కొంటారు కవి. ప్రత్యుత్తరం కోరి చదవాల్సిన విషయాలన్నింటికీ సోదాహరణంగా జవాబిస్తారు. శ్రద్ధగా చదువుకుంటూ పోతే - అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకుంటూ చదువగలిగితే, ప్రతి కాండలో ఆ కాండ కథావృత్తాంతమే కాకుండా, సకల శాస్త్రాల సంగమం దర్శనమిస్తుంది. ఒకసారి ధర్మశాస్త్రంలాగా, ఇంకోసారి రాజనీతి శాస్త్రం లాగా, మరోచోట ఇంకో శాస్త్రం లాగా బోధపడుతుంది. ప్రతికాండ ఒక భూగోళ శాస్త్రం - ఖగోళ శాస్త్రం - సాంఘిక, సామాజిక, ఆర్థిక, సామాన్య, నీతి, సంఖ్యా, సాముద్రిక, కామ, రతి, స్వప్న, పురాతత్వ శాస్త్రంలాగా దర్శనమిస్తుంది. బహుశా, క్షుణ్ణంగా చదివితే, ఇంకెన్నో రకమైన శాస్త్ర విషయాలు గోచరిస్తాయి. అసలు సిసలైన పరిశోధకులంటూ వుంటే, మందరం ఏ ఒక్క కాండ మీద పరిశోధన చేసినా, ఒకటి కాదు - వంద పీహేచ్‌డీలకు సరిపోయే విషయ సంపద లభ్యమవుతుంది. డాక్టరేట్‌తో పాటు, అద్భుతమైన రహస్యాలు అవగతవౌతాయి. పాదరసం నుండి బంగారం చేసే రహస్యమైన విషయాలలాంటి అనేకమైనవి తెలుసుకోవచ్చు. పరిశోధనా దృక్పథంతో చదివితే, ప్రతికాండ చివర వాసుదాసుగారు రాసిన ఆఖరు పద్యంలో, ఆ కాండలో వున్న మొత్తం పద్యాలెన్నో తెలియజేసే పంక్తులుంటాయి.
ఆంధ్ర వాల్మీకి రామాయణం రాయడానికి ప్రేరణ - స్ఫూర్తి, భాగవత గ్రంథకర్త బమ్మెర పోతన సంకల్పం ద్వారానే తనకు లభించిందంటారు వాసుదాసుగారు. పోతనను కరుణించిన శ్రీరామచంద్రమూర్తి, ఆయనతో భాగవతాన్ని తెనిగింపచేసి భవబంధ విముక్తుడిని చేసాడని, అందుకే, పలుకుపలుకులో తేనెలొలికించి, వ్యాస భాగవతాన్ని మరిపించగలిగాడని వాసుదాసుగారి అభిప్రాయం. ఆ విధంగానే, శ్రీరాముడి కరుణ తనపైన కూడా ప్రసరించిందని వాసుదాసుగారు భావించి వుండాలి. తద్రూపమే ఆంధ్ర వాల్మీకం. వాల్మీకాన్ని ఆమూలాగ్రంగా పరిశోధించిన పరమ భాగవతోత్తముడు వాసుదాసస్వామి. 108సార్లు వాల్మీకి సంస్కృత రామాయణాన్ని పఠించి - పారాయణం చేసి పట్ట్భాషేకాలు, సామ్రాజ్య పట్ట్భాషేకం నిర్వహించిన ఏకైక మహానుభావుడు వాసుదాసస్వామి.
తనకంటే ముందు కాలంనాటి పూర్వ కవులెవరు, రామాయణాన్ని (పూర్వకాండలు, ఉత్తరకాండ కలిపి) సంపూర్ణంగా తెనిగించలేదని గ్రహించిన వాసుదాసుగారు, అన్ని కాండలను తెనిగించి, విశేషించి తెలుగు పాఠక లోకానికి ఆవిష్కరించాలని సంకల్పించుకున్నారు. ‘వాల్మీకి రామాయణాన్ని సమగ్రంగా, యథామూలంగా పలికినవారు పూర్వ కవులందరూ -నేటి (ఆయన కాలంనాటి) రామాయణాలలో మూలానుసరణంగా ఉంది. సమగ్రం కాదు. సమగ్రమయింది మూలానుసరణం కాదు. తమ అభిప్రాయాలను, ఇతరుల అభిప్రాయాలకు మూలంగా చేర్చిపెడితే, అది వాల్మీకి పలికిందెలా అవుతుంది?’ అని ప్రశ్నించాడు వాసుదాసుగారు.

-వనం జ్వాలా నరసింహారావు - 80081 370 12