చివరి ‘సారీ..’
Published Monday, 2 April 2018ఈమధ్య ఓ మిత్రుడు ఓ బొమ్మను షేర్ చేశాడు. అది 1914వ సంవత్సరంలో నిజాం నవాబు కట్టిన గెస్ట్ హవుజ్. ఇప్పుడు దాన్ని తీసివేసి, దాని స్థానంలో కొత్తది కట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. దాన్ని ఆపాలని అతని ఉద్దేశం. హెరిటేజ్ భవనంగా అది ఉంచాలని అతని భావన.
ఈ మెసేజీ సరిగ్గా నేను వేములవాడలోని మా ఇంటిని చివరిసారి చూసి వస్తున్నప్పుడు వచ్చింది.
ఇంటిని చివరిసారి చూడటం అంటే అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. మనుషులని చివరిసారి చూస్తాం. దాన్ని ఆఖరి చూపు అంటాం. ఇంటిని చివరిసారి చూడటం ఏమిటి?
మా ఇల్లు ఇక కన్పించదు. దాని వయసు తొంభై సంవత్సరాలు ఉంటాయి. తొమ్మిది గదులు. పైన బంగ్లా మీద మూడు గదులు. చాలా పెద్ద ఇల్లు. మా అమ్మా, బాపులకి తొమ్మిది మంది సంతానం. వాళ్ల పిల్లలు. పిల్లల పిల్లలు. ఇట్లా చాలామంది బాల్యంలో ముడిపడిన ఇల్లు.
ఇద్దరు అన్నయ్యలు, బాపూ అమ్మ చనిపోయి చాలా కాలం అయ్యింది. నేను వుండేది హైదరాబాద్‌లో. అక్కడ ఉంటున్నది మా చిన్నన్న.
ఆయన ఇల్లు పాతపడిపోయిందని వేరే ఇంటికి మారిపోయాడు. ఆ ఇంటిని కిరాయికి ఇవ్వలేదు. అట్లాగే ఉంచాం. హెరిటేజ్ భవనంలా దాన్ని ఉంచాలని నా కోరిక. కానీ అది సాధ్యంకాలేదు.
రెండు సంవత్సరాల నుంచి ఆ ఇల్లు తీసివేసి దాని స్థానంలో కొత్త ఇల్లు నిర్మించాలని అందరి కోరిక. చివరికి ఆ నిర్ణయానికి వచ్చాం.
2002వ సంవత్సరంలో నా ‘రెండక్షరాలు’ కవితా సంపుటిలో ఇల్లు గురించి ఓ కవిత వుంది. అది ఇలా కొనసాగుతుంది.
‘కాల ప్రవాహంలో మా ఇల్లు మా అమ్మలాగే-
జాజ్వల్యమానంగా మెరిసిన ఇల్లు వార్ధక్యంలో
మా ఇంటి దూలాలకి గుంజలు అవసరమై పొయ్యాయి.
మేం మా అమ్మకి అవసరమైనట్టు,
ఈ ఇల్లు మా అమ్మలాగే
ఎంత లాలనగా నన్ను అదుముకుంటుందో
ఈ ఇల్లు నా బాల్యానికి స్మృతిచిహ్నం
ఇంకా ఎందరి బాల్యానికో
ఈ ఇల్లు మా బాపుకి మా అన్నలకి మా అక్కలకి గుర్తు.
ఈ ఇల్లు మా ఆనందాలకి ఆటలకి అనురాగాలకి గుర్తు.
ఇక్కడి గచ్చు మీద టినాక్సైడ్ ప్రతిబింబాలు కన్పించవు.
కానీ ఎన్ని సుందర బింబాలో
ఇక్కడ గోడలకి లప్పం ఫినిషింగ్ లేదు
కానీ ఎన్ని లాలనలో
ఇక్కడ అటాచ్డ్ బాత్రూంస్ లేవు. కానీ ఎన్ని అటాచ్‌మెంట్స్.
నే పుట్టక ముందే పుట్టిన ఈ ఇల్లు బతికినంత కాలం బతకాలనే!
అవసాన స్థితికి చేరుకుంది.
ఇప్పుడు దాని స్థానంలో కొత్త ఇల్లు వస్తుంది.
అందుకే-
చివరిసారి చూడటానికి వెళ్లాను. అందరినీ తలుచుకుని అనుమతి తీసుకున్నాను.
కొత్త ఇల్లు కట్టడానికి.
మనుషులకే కాదు.
ఇంటికీ వుంటుంది చివరి చూపు.
అదే ఆఖరి చూపు.
ఈ సృష్టిలో ప్రతిదానికి చివరి దశ ఉంటుంది. మెసేజీ చేసిన మిత్రునికి అదే విషయం చెప్పాను.
ఆయనకు నచ్చిందో లేదో తెలియదు.