S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘అణు’బంధం మంచిదే!

అణుశక్తి కేంద్రాల్ని కోరుకోవడమంటే మృత్యు గహ్వరంలోకి అడుగు పెట్టడమే.. అణుథార్మిక విష రసాయనాలతో పర్యావరణానికి పెను ప్రమాదం.. థార్మిక కాలుష్యం ప్రభావంతో ప్రజారోగ్యం, పాడిపంటలు, సముద్ర జలాలు విషపూరితం కాక తప్పదు.. మురుగునీరు, థార్మిక ధూళితో సముద్ర తీరంలో చేపలు పట్టే ప్రాంతాలు కలుషితమై మత్స్యకారుల జీవనోపాధికి తీరని విఘాతం..
-అణువిద్యుత్ కేంద్రాల ఏర్పాటుపై ఇలాంటి భయాందోళనలు, అపోహలకు అంతే లేదు.. ఇలాంటి భయాలకు అవకాశమే లేదని భరోసా ఇస్తున్నారు కల్పక్కం (తమిళనాడు)లోని ‘మ్యాప్స్’ (మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్)కు చెందిన అణు శాస్తజ్ఞ్రులు. నిర్దిష్ట ప్రమాణాలను, పూర్తిస్థాయి భద్రతా చర్యలను పాటించడం వల్ల అణుశక్తిని మానవ కల్యాణానికి వినియోగించవచ్చని వీరు నిరూపిస్తున్నారు. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్వహిస్తున్న ‘మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్’లో అణువిద్యుత్ ఉత్పాదన, ఇంధన పునఃసంవిధానం, వ్యర్థాలను శుద్ధి చేయడం వంటి ప్రక్రియలు జరుగుతుంటాయి. భారత అణువిద్యుత్ సంస్థ (నూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కల్పక్కంలో ఏర్పాటు చేసిన ‘మ్యాక్స్’ 1984 జనవరి 24 నుంచి తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ అణుశక్తి కేంద్రం నిర్మాణ పనులకు 1970లో శ్రీకారం చుట్టి 14 ఏళ్ల వ్యవధిలో ‘మ్యాప్స్’కు తుది రూపం ఇచ్చారు. మన దేశంలో పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో ఏర్పాటైన అణుశక్తి కేంద్రంగా ‘మ్యాప్స్’ చరిత్ర పుటల్లో నిలిచింది. ఈ అణుశక్తి కేంద్రంలో 220 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే రెండు యూనిట్లు పనిచేస్తున్నాయి. అణువిద్యుత్ ఉత్పాదనలో ప్రపంచ దేశాలకు భారత్ ఏ మాత్రం తీసిపోదని సగర్వంగా ‘మ్యాప్స్’ నిరూపిస్తోంది.
పర్యావరణ పరిరక్షణతో పాటు తక్కువ ఖర్చుతో ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా ‘మ్యాప్స్’ శాస్తవ్రేత్తలు సమర్థవంతమైన ప్రణాళికలను అమలు చేస్తున్నారు. కేవలం రెండు రూపాయల 17 పైసల ఖర్చుతో యూనిట్ అణువిద్యుత్‌ను ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నారు. ఎన్నో బాలారిష్టాలను ఎదురైనా వాటన్నింటినీ అధిగమించి అణువిద్యుత్ ఉత్పాదనలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఒకప్పుడు అణువిద్యుత్ పేరు వింటేనే కల్పక్కం సమీప ప్రాంతాల ప్రజలు హడలిపోయేవారు. అణుశక్తి కేంద్రం ఏర్పాటును అడ్డుకునేలా ఇక్కడ ఉద్యమాలు సైతం జరిగాయి. అన్ని రకాల ఒత్తిళ్లు, సమస్యలు అధిగమనించి ప్రజలకు ఎటువంటి ప్రమాదం లేకుండా, పర్యావరణ పరిరక్షణకు తొలి ప్రాధాన్యం ఇస్తూ ‘మ్యాక్స్’ ముందుకు దూసుకుపోతోంది.
1983లో తొలి యూనిట్ ప్రారంభం..
కల్పక్కంలోని ‘మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్’లో భారజల (హెవీ వాటర్) రియాక్టర్ల ద్వారా అణువిద్యుత్ ఉత్పత్తవుతోంది. 1983 జూలై 2వ తేదీన తొలి రియాక్టర్‌లో అణువిద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. మరో రెండేళ్ల తరువాత 1985 ఆగస్టు 12వ తేదిన రెండవ రియాక్టర్‌లో అణువిద్యుత్ ఉత్పత్తి మొదలైంది. ఈ రెండు రియాక్టర్లు కలిపి మొత్తం 440 మెగావాట్ల అణువిద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇక్కడ ఉత్పత్తయ్యే విద్యుచ్ఛక్తిని ‘విద్యుత్ గ్రిడ్’తో అనుసంధానం చేస్తారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో 75 శాతాన్ని తమిళనాడుకు, మిగతా 25 శాతాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, కర్నాటక, కేరళ రాష్ట్రాలకు కేటాయిస్తున్నారు. దక్షిణ తమిళనాడు విద్యుత్ అవసరాలను తీర్చడంలో ‘మ్యాప్స్’ కీలకపాత్ర వహిస్తోంది. ‘నూక్లియర్’ రియాక్టర్స్‌లో సహజ సిద్దమైన యూరేనియమ్ విరివిగా వినియోగిస్తున్నారు.
యురేనియందే కీలకపాత్ర..
మన దేశంలో విరివిగా లభిస్తున్న యురేనియంను అణుశక్తి కర్మాగారాల్లో వినియోగిస్తూ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. అణు రియాక్టర్లలో భారజలాన్ని హైఫ్రెషర్, హై టెంపరేచర్, స్టీమ్ జనరేటర్లలో వేడి చేస్తారు. ఈ ప్రక్రియలో తయారయ్యే స్టీమ్ ద్వారా టర్బయిన్ నడుస్తుంది. జనరేటర్, టర్బయిన్ షాప్ట్ ద్వారా అణువిద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అణువిద్యుత్ ఉత్పత్తిలో భారజలం కీలకపాత్ర వహిస్తుంది. అణుశక్తి కేంద్రంలోని న్యూక్లియర్ రియాక్టర్ ఓ కొలిమి లాంటిది. యురేనియం వంటి కొన్ని మూలకాల పరమాణువుల శక్తిలో కొంతభాగాన్ని ఉష్ణశక్తిగా మార్చి, ఆ వేడిని నీటి ఆవిరి (స్టీమ్) ఉత్పత్తి కోసం, తద్వారా టర్బయిన్‌ల సాయంతో విద్యుదుత్పత్తి చేయడానికి రియాక్టర్లలో వినియోగిస్తారు. అణు రియాక్టర్ల నుంచి అనేక వ్యర్థాలు, విష పదార్థాలు వెలువడతాయి.
అణువిద్యుత్ ఉత్పత్తయ్యే ప్రక్రియలో న్యూట్రాన్స్ విడుదల అవుతుంటాయి. ఇవి పరస్పరం కలవడం వల్ల ‘చైన్ రియాక్షన్’ కొనసాగుతుంది. దీంతో నిరంతరంగా విద్యుత్ ఉత్పత్తవుతుంది. భారత అణు విద్యుత్ సంస్థ పరిధిలో ‘హెవీవాటర్ బోర్డు’ పనితీరు ప్రముఖ శాస్తవేత్తల ప్రశంసలు అందుకుంటోంది. భారత అగ్రశ్రేణి శాస్తవ్రేత్త హూమీ జహంగీర్ బాబా ‘త్రీస్టేజ్ న్యూక్లియర్’కు పునాది వేశారు. అణువిద్యుత్ ఉత్పత్తిలో యూరేనియంను ఇంధనంగాను, మితకారిగా భారజలాన్ని వినియోగించడం ద్వారా అణువిద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. 2000 సంవత్సరానికి దేశీయ విద్యుత్ వినియోగంలో అణువిద్యుత్ వాటా కనీసం పదిశాతంగా ఉండాలన్న ఉద్దేశంతో భారజల వినియోగానికి నిర్దిష్ట ప్రణాళికలను అమలు చేస్తున్నారు. భారత అణుశక్తి విభాగంలో పరిశ్రమలు, ఖనిజ మంత్రిత్వశాఖలు సైతం తమ కార్యకలాపాలు మొదలు పెట్టాయి. నూక్లియర్ ఫ్యూయల్ సైకిల్ పేరుతో 1969 మే 1న భారజల వినియోగం ఊపందుకుంది. 1989లో ‘హెవీవాటర్ బోర్డు’ ఏర్పడింది. కెమికల్ ఇంజనీరింగ్ పితామహుడు డాక్టర్ ఫరీదొద్దిన్ ఈ బోర్డుకు తొలి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి నూతన శకం వైపు నడిపించారు. తొలిదశలో గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్, ఒడిశా, తెలంగాణ హెవీవాటర్ బోర్డులు వెలిశాయి. సాధారణ నీటి అణువులో హైడ్రోజన్ పరమాణువుల స్థానంలో డ్యూటోరియం పరమాణువులు ఉంచితే అది భారజలం అవుతుంది. డ్యూటోరియంది 3.82 సాంద్రత కాగా, సాధారణ నీటికి 0.0 సాంద్రత ఉంటుంది. న్యూక్లియర్ రియాక్టర్లలో న్యూటాన్ల వేగాన్ని తగ్గించడానికి మితకారిగా భారజలాన్ని వాడుతుంటారు. ఈ భారజలాన్ని దేశీయ అవసరాలను ఉపయోగించడమే కాకుండా విదేశాలకు సైతం ఎగుమతి చేయడం భారత్ సాధించిన అద్వితీయ ప్రగతి అని చెప్పవచ్చు. దక్షిణ కొరియా, అమెరికా, రష్యా, హంగేరీ, రూమేనియా తదితర దేశాలకు దీన్ని ఎగుమతి చేస్తున్నారు. కల్పక్కంలోనే హెవీ వాటర్ బోర్టు ఉంది. ఈ బోర్డు కార్యకలాపాల నిర్వహణకు ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది. కల్పక్కంలోని హెవీ వాటర్ బోర్డుకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా యు.కమంచి ముదలి ఉన్నారు. భారజలాన్ని అణువిద్యుత్ ప్లాంట్లలోనే కాకుండా పలు ప్రజోపయోగ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నట్లు కమంచి ముదలి చెబుతున్నారు.
ఆరోగ్యం, పర్యావరణం, ఆహార పదార్థాల తయారీలో దీన్ని వినియోగిస్తున్నారు. వాణిజ్య అవసరాల నిమిత్తం కూడా దీన్ని ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించారు. సాధారణ జలం కంటే భారజలం ధర ఎక్కువగా ఉంటుంది. దీని ఉత్పత్తిలో ప్రపంచ దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉందని ఆయన తెలిపారు.

భారత్‌లో 21 చోట్ల..
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 432 అణువిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. మన దేశంలో 21 అణు రియాక్టర్లు పనిచేస్తున్నాయి. చైనాలో 26, రష్యాలో 10, కొరియాలో 5, జపాన్‌లో 2, భారత్‌లో 7, ఇతర దేశాల్లో కలిపి మొత్తం కొత్తగా 61 అణువిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మన దేశంలో బొగ్గు ద్వారా 55 శాతం, నీటితో 21శాతం, గ్యాస్-డిజీల్ ద్వారా 11.4 శాతం, అణువిద్యుత్‌తో 2.8 శాతం ఇతర మార్గాల్లో 10.9 శాతం విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. 2015-2016 సంవత్సరంలో కల్పక్కంలోని ‘మ్యాప్స్’ 3,210 మిలియన్ యూనిట్ల అణువిద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. 2016-2017లో 3,205 మిలియన్ యూనిట్ల ఉత్పత్తిని అందించింది. ఈ రెండేళ్ల కాలంలో గతంలో ఎన్నడూ లేనంతగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసి ‘మ్యాప్స్’ చరిత్ర సృష్టింది. పాత రియాక్టర్లు అయినప్పటికీ సమస్యలను అధిగమించి ఎక్కువ అణువిద్యుత్ ఉత్పత్తి చేయడం దేశానికి ‘మ్యాప్స్’ గర్వకారణంగా నిలుస్తోంది. పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక అవార్డులను ఈ సంస్థ సొంతం చేసుకుంది. దేశంలోనే మొదటిసారిగా ‘సబ్ మెరైన్ ఇన్‌టేక్ టనె్నల్’ను నిర్మించిన ఘనత కూడా ‘మ్యాప్స్’కు దక్కింది. సముద్ర తీరం నుంచి పొడవైన జెట్టీని నిర్మించి భూగర్భం ద్వారా సాగర జలాలను ఉపయోగించుకోవడం ఈ సంస్థ ప్రత్యేకత. కల్పక్కంలోని మొదటి రియాక్టర్ ఎలాంటి విరామం లేకుండా 346 రోజులు నిరంతరాయంగా పనిచేసి రికార్డు సృష్టించింది. రెండవ రియాక్టర్ సైతం ఇదే విధంగా 432రోజులు పనిచేసి చరిత్ర సృష్టించింది. 2001లో గ్రీన్‌టెక్ అవార్డును ‘మ్యాప్స్’ కైవసం చేసుకుంది. అదే ఏడాది పర్యవరాణ పరిరక్షణకు చేస్తున్న కృషికి గుర్తింపుగా కేంద్ర ఇంధన శాఖ సిల్వర్ షీల్డ్ అందుకుంది. 2011లో ఎఇఆర్‌బి నుండి ‘పారిశ్రామిక భద్రతా అవార్డు’ను అందుకుంది. అదే సంవత్సరంలో ‘్భరత జాతీయ భద్రతా మండలి’ నుంచి సిల్వర్ ట్రోఫీని దక్కించుకుంది. 2010లో ఎఇఆర్‌బినుండి ఫైర్ సేఫ్టీ అవార్డును, ప్రజారోగ్య పరిరక్షణకు సురక్ష పురస్కార్ లభించింది. 2009లో గ్రీన్‌సైట్ అవార్డు ‘మ్యాప్స్’ దక్కింది. సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న ఈ అణువిద్యుత్ కేంద్రాన్ని సునామీలు తాకని విధంగా నిర్మించారు. 2004లో వచ్చిన సునామీ వల్ల ఈ సంస్థకు ఎలాంటి నష్టం జరగలేదు.
కల్పక్కం అణువిద్యుత్ కేంద్రంలోని రియాక్టర్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక జోన్‌లలో రోబోల ద్వారా శాస్తవ్రేత్తలు పనిచేయిస్తుంటారు. ఎలాంటి రేడియేషన్‌కు చోటు లేకుండా దీన్ని తీర్చిదిద్దారు. ఇక్కడి ఉద్యోగులందరికీ రేడియేషన్ పరీక్షలను తరచూ నిర్వహిస్తుంటారు. ఇన్నాళ్లుగా ఏ ఒక్క ఉద్యోగి కూడా రేడియేషన్ బారిన పడక పోవడం గమనార్హం. కల్పక్కంలో ఇళ్ల నుంచి పారవేసే చెత్తాచెదారం నుంచి బయోగ్యాస్ తయారు చేస్తున్నారు. దాన్ని వంటగ్యాస్‌గా ఉపయోగిస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. మురుగునీటిని శుద్ధి చేసి మొక్కలకు, ఇంట్లో బట్టలు ఉతికేందుకు ఉపయోగిస్తుంటారు.

రేడియేషన్ భయం లేదు..
తమ సంస్థలో పనిచేసేవారు రేడియేషన్‌కు గురయ్యే అవకాశం లేదని ‘మ్యాప్స్’ స్టేషన్ డైరెక్టర్ రావి సత్యనారాయణ, హెవీవాటర్ బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కమంచి ముదిలి తెలిపారు. పర్యావరణం విషయంలో ఎలాంటి భయం అక్కర్లేదని, రేడియేషన్ ఇబ్బంది అసలే లేదని వారు స్పష్టం చేస్తున్నారు. సమీప ప్రాంతంలో పక్షులు, జంతువులు, సముద్రంలో చేపలకు ఎలాంటి హాని జరగదన్నారు. తమ కేంద్రంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నామని అన్నారు. మన దేశంలో 22 అణు రియాక్టర్లు ఉన్నాయని, వాటిలో రెండు మినహా మిగిలినవన్నీ ఎంతో సమర్థవంతంగా పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న అణువిద్యుత్ విప్లవంలో భారత్‌కూడా భాగస్వామిగా ఉందన్నారు. అణువిద్యుత్ ఉత్పత్తి తక్కువ ఖర్చుతో కూడుకున్నదని వెల్లడించారు. 2011 నుండి 2013 వరకు జపాన్‌లో పనిచేసిన తనకు ‘మ్యాప్స్’లో విధి నిర్వహణ ఎంతో సంతృప్తిని కలిగిస్తోందని రావి సత్యనారాయణ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కల్పక్కం వద్ద ఏర్పాటైన కామిని ‘్థర్డ్ స్టేజి రియాక్టర్’ను ఉపయోగించుకుని ‘ఇస్రో’లో వాడే ఫైర్ డివైస్‌లను పరిశీలిస్తుంటారు. ఇక్కడే ‘్భవానీ’ అనే రియాక్టర్ ప్రారంభానికి సిద్ధం అవుతోందని, ఇది పనిచేస్తే మరో 500 మెగావాట్ల అణువిద్యుత్ లభిస్తుందన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే డిజిటలైజ్డ్ కంట్రోల్ రూంను అన్ని హంగులతో సిద్ధం చేశారని ఆయన వివరించారు. ఇక్కడే అటామిక్ రీప్రాసెసింగ్ ప్లాంట్ కూడా ఉందని తెలిపారు. కల్పక్కంలో వాడే యూరేనియం నుండి ఫ్లుటోనియం బయటకు వస్తుంది. ‘్భవానీ’ రియాక్టర్‌కు కావాల్సిన ఇంధనంగా దీన్ని వినియోగిస్తారు.

సామాజిక సేవలో..
‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సబిలిటీ’ పథకం కింద విద్య, ప్రజారోగ్యం, వౌలిక సౌకర్యాల కల్పన వంటి కార్యక్రమాలకు ఏటా తాము 5 కోట్ల నుండి 6 కోట్ల రూపాయల వరకూ ఖర్చు చేస్తున్నామని ‘మ్యాప్స్’ డైరెక్టర్ సత్యనారాయణ వెల్లడించారు. 44 ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాలు, ఫర్నిచర్‌ను అందజేశామని, కొన్ని స్కూళ్లలో లాబొరేటరీలను ఏర్పాటు చేశామని వివరించారు. ‘శంకర నేత్రాలయ’ సహకారంతో పలు చోట్ల కంటి వైద్య శస్తచ్రికిత్సా శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. మరికొన్ని పాఠశాలల్లో టీచర్లను నియమించామన్నారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా చిన్న పరిశ్రమల ఏర్పాటుకు సాయం చేస్తున్నామని వివరించారు. మత్స్యకారులు చేపలను భద్రపరచుకునేలా ఐస్ ప్లాంటును ఏర్పాటు చేశామన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాలను నిర్మించామని, 15 గ్రామాల్లో నీళ్లట్యాంకులను ఏర్పాటు చేశామని తెలిపారు. తుపాన్లు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల గురించి తమకు కొన్ని గంటల ముందే హైదరాబాద్ నుండి సమాచారం అందుతోందని సత్యనారాయణ వెల్లడించారు. మ్యాప్స్’లో మొత్తం 750 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 400 మంది ప్రైవేట్ ఉద్యోగులు పనిచేస్తున్నారని, 250 మంది శాస్తవ్రేత్తలు ఉన్నారని వివరించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులతో రాబోయే రోజుల్లో చాలా తక్కువ ఖర్చుతో అణువిద్యుత్ అందుబాటులోకి వస్తుందన్నారు. అణుథార్మికతపై అనుమానాలు, అపోహలు తగ్గుముఖం పట్టాయని శాస్తవ్రేత్త రవిశంకర్ తెలిపారు.

--వుక్కల్‌కర్ రాజేందర్‌నాథ్ 9440287170