S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

యజమాని తప్పు

శేషుకు చాలా మామిడి తోటలు ఉన్నాయి. ఆ ఏడాది మామిడి పిందెలు విరగకాసాయి. వీటిని చక్కగా సంరక్షించుకుంటే కాయలైన పిదప అమ్ముకుని ధనార్జన చేయవచ్చని శేషు భావించాడు. దొంగల భయంవల్ల ఇద్దరు కావలి వాళ్లను నియమించాడు. వాళ్లు కంటికి రెప్పలా రాత్రి, పగలు అనే తేడా లేకుండా కాపలా ఉండి మామిడి పిందెలను కాయసాగారు. కొంతకాలానికి ఆ పిందెలు కాయలుగా మారాయి. అయితే తోటలోని మామిడి కాయలు మాయవౌతున్నట్లు శేషు కనిపెట్టాడు. కావలి వాళ్లను పిలిచాడు.
‘తోటలోని మామిడి పండ్లు మాయవౌతున్నాయి. మీరే కాజేస్తున్నారా?’ నిలదీసి అడిగాడు శేషు.
‘అయ్యా! మేమెందుకు కాజేస్తామయ్యా’ వినయంగా బదులిచ్చారు కావలి వాళ్లు.
అయినా శేషు అనుమానం తీరలేదు. కావలి వాళ్లను ఉద్యోగాల నుండి తీసేసి కొత్తవాళ్లను నియమించాడు. మళ్లీ తోటలోని మామిడి కాయలు మాయవౌతున్నాయి. ఇక చేసేది లేక ఈసారి కళ్లు లేనివాడిని, కాలులేని వ్యక్తిని మామిడి తోటకు కాపలాగా పెట్టాడు శేషు. కళ్లు లేనివాడైతే కాయలు చూడలేడు. కాలులేని వ్యక్తి చెట్టు ఎక్కలేడు. కాబట్టి తన కాయలు సురక్షితంగా ఉంటాయనేది యజమాని ఆలోచన. వాళ్లను కాపలా పెట్టినప్పటికీ కాయలు పోతూనే ఉన్నాయి.
అసలు తోటలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఒకరోజు శేషు చెట్టు చాటున దాగి చూడసాగాడు. అతను చూసిన ఒక దృశ్యం ఆశ్చర్యాన్ని కలిగించింది. కళ్లు లేని వ్యక్తి భుజాలపై ఒక కాలులేని వ్యక్తి ఎక్కి మామిడికాయలు కోస్తూ కనిపించాడు. శేషు పరుగున వెళ్లి వాళ్లను పట్టుకున్నాడు.
‘ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేరంటారు. కాపలా కాస్తున్న మీరే ఎందుకిలా మామిడికాయలు దొంగతనం చేస్తున్నారు’ ప్రశ్నించాడు శేషు.
‘అయ్యా! మేము మీ వద్ద పనిలో కుదిరినప్పుడు వారానికోసారి లెక్క చూసి జీతం ఇస్తామన్నారు. మూడు వారాలు గడిచినా మీరు సమయానికి జీతం ఇవ్వలేదు. మా కుటుంబాలు ఎలా గడుస్తాయి? అందువల్ల మామిడికాయలను దొంగచాటుగా కోసుకుని అమ్ముకుని బ్రతుకుతున్నాము’ దీనంగా చెప్పారు కావలివాళ్లు.
శేషు ఆలోచనలో పడ్డాడు. గతంలో కూడా కాపలా కాసేవారికి వారానికి ఒకసారి జీతం డబ్బులు ఇస్తానని నెలకొకసారి ఇచ్చేవాడు. ఆ విషయం అతనికి గుర్తువచ్చింది. కాపలా వాళ్లు తనకు తగిన గుణపాఠం చెప్పారని భావించాడు. తన తప్పు తెలుసుకుని ఆ రోజు నుండి తాను చెప్పిన ప్రకారం వారానికి ఒకసారి కాపలా వాళ్లకు జీతాలు ఇవ్వసాగాడు. అప్పటి నుండి తోటలో మామిడికాయల దొంగతనం జరగలేదు. కాయలు విపరీతంగా కాయడంతో శేషుకు మంచి లాభాలు వచ్చాయి. శేషు చాలా ఆనందించి తోటకు కాపలా కాసిన కాలులేని వ్యక్తికి తన డబ్బుతో కృత్రిమ కాలుని చేయించాడు. కళ్లులేని వ్యక్తికి శస్తచ్రికిత్స చేయించి చూపు తెప్పించాడు. మామిడి తోటకు కాపలా కాసే ఆ వ్యక్తులు తమ అంగవైకల్యం దూరం కావడంతో ఎంతగానో ఆనందించారు. నాటి నుండి కాపలా వారిద్దరూ శేషు వద్ద నమ్మకంగా పని చేస్తూ జీవితాన్ని గడిపారు.

-షేక్ అబ్దుల్ హకీం జాని