S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రామాయణం..79

మీరే డిటెక్టివ్....
==========

మీకో ప్రశ్న:
రామ శబ్దాన్ని రామాయణంలో వాల్మీకి ఎన్ని రకాలుగా ప్రయోగించాడు?

శాంతించిన అగ్నిలా, నీళ్లు లేని సముద్రంలా, తేజస్సులేని సూర్యుడిలా ఉన్న రాజుని చూసి అనేక శోకాలతో కృశించిన కౌసల్య అతని తలని ఒడిలో ఉంచుకుని కన్నీరు కారుస్తూ కైకేయితో చెప్పింది.
‘క్రూరురాలా! చెడ్డ పనులు చేసే ఓ కైకేరుూ! నీ కోరికలు నెరవేరాయి. ఇక రాజు లేడు కాబట్టి ఎలాంటి అడ్డంకులూ లేని రాజ్యాన్ని నువ్వు అనుభవించచ్చు. రాముడు నన్ను విడిచి వెళ్లిపోయాడు. నా భర్త స్వర్గానికి వెళ్లాడు. నేను భయంకరమైన మార్గంలో గుంపు నించి విడిపోయిన దానిలా ఐపోయాను. ఇంక నాకు జీవించాలనే కోరిక లేదు. ధర్మాన్ని వదిలేసిన నువ్వు తప్ప మరే స్ర్తి ఐనా దేవుడు లాంటి భర్తని వదిలి జీవించడానికి ఇష్టపడుతుందా? విషపు పండుని తినే వాడిలా దురాశ కలవాడు తను చేసే పనిలో దోషాన్ని గుర్తించడు. చెడ్డ పని చేయమని ప్రేరేపించబడ్డ రాజు రాముడ్ని భార్యాసమేతంగా అరణ్యానికి పంపేశాడని విని జనకుడు కూడా నాలా దుఃఖిస్తాడు. ధార్మికుడైన, తామర రేకుల్లాంటి కళ్లు గల, జీవించి ఉన్నా ఇక్కడ కనపడకుండా పోయిన ఆ రాముడికి నేను భర్త చనిపోయి అనాధ ఐనట్లు తెలీదు కదా? దుఃఖానికి తగనిది, దీనురాలైన సీత అడవిలో చాలా విచారిస్తూ భయపడుతుంది. రాత్రుళ్లు జంతువులు, పక్షులు చేసే భయంకర ధ్వనులకి భయపడి తప్పక రాముడి చెంతకి చేరుతుంది. ముసలివాడు, కొడుకులు లేని వాడైన జనకుడు కూడా సీత గురించే చింతిస్తూ దుఃఖంతో ప్రాణాలు విడుస్తాడు. పతివ్రతనైన నేను నా భర్త శరీరాన్ని ఆలింగనం చేసుకుని, అగ్నిలో ప్రవేశించి ఇప్పుడే ప్రాణాలు విడుస్తాను’
దీనురాలైన కౌసల్య శోకంతో దశరథుడి శరీరాన్ని కౌగిలించుకుని ఇలా ఏడుస్తుంటే, అంతఃపుర పనులకి నియమించబడ్డ స్ర్తిలు ఆమెని అక్కడ నించి దూరంగా తీసుకువెళ్లారు. మంత్రులు రాజు శరీరాన్ని నూనె తొట్టెలో ఉంచి, తర్వాత చేయాల్సిన పనులన్నీ చేశారు. కొడుకులు ఎవరూ దగ్గర లేనప్పుడు రాజు శరీరానికి దహన సంస్కారాలు చేయడానికి ఇష్టపడక అన్ని విషయాలు తెలిసిన మంత్రులు ఆ దేహాన్ని అలా రక్షించారు. మంత్రులు రాజు శరీరాన్ని నూనె తొట్టెలో ఉంచగానే స్ర్తిలంతా ‘అయ్యో! ఇతను మరణించాడు’ అని ఏడ్చారు. కన్నీరు కారే మొహాలతో దీనులై చేతులు పైకెత్తి ఏడుస్తూ శోకంతో దీనంగా విలపించారు.
‘అయ్యో! మహారాజా! ఎప్పుడూ ప్రియంగా మాట్లాడేవాడు, నిజమే చెప్పే రాముడికి దూరమైన మమ్మల్ని నువ్వు కూడా ఎలా విడిచిపోయావు? దుష్టురాలైన కైకేయి మొదట మిమ్మల్ని రాముడికి దూరం చేసింది. ఇప్పుడు భర్త కూడా లేని మేము భర్తని చంపిన ఆమె దగ్గర ఎలా ఉండగలం? సమర్థుడు, బుద్ధిమంతుడు, శ్రీమంతుడు, అన్ని వేళలా నీకు, మాకు సంరక్షకుడిగా ఉన్న ఆ రాముడు రాజ్యలక్ష్మిని విడిచి అడవికి వెళ్లిపోయాడు కదా? నువ్వు ఇంకా వీరుడైన ఆ రాముడు లేకపోవడంతో దుఃఖంతో బాధపడే మేము కైకేయి తిట్లు కూడా సహిస్తూ ఇక్కడ ఎలా ఉండగలం? రాజుని, రాముడ్ని, మహాబలుడైన లక్ష్మణుడ్ని, సీతని కూడా వదిలేయ గలిగిన కైకేయి ఇతరులని ఎవర్నీ ఎందుకు విడిచిపెట్టదు?’
ఆనందం పూర్తిగా కోల్పోయిన దశరథుడి భార్యలంతా కన్నీళ్లతో, తీవ్ర దుఃఖంతో నేల మీద దొర్లారు. మహాత్ముడైన దశరథుడు లేని ఆ అయోధ్య చంద్రుడు లేని రాత్రిలా, భర్త లేని స్ర్తిలా అందవిహీనమైంది. ఆ నగరంలోని ప్రజలంతా కన్నీళ్లతో కలత చెందారు. కుల స్ర్తిలు హాహాకారాలు చేస్తున్నారు. ఇళ్ల ముందు వాకిళ్లు, ఇంటి మధ్య ప్రదేశాలు నిర్మానుష్యం అయ్యాయి. నగరం పూర్వపు శోభని కోల్పోయింది. దశరథుడు పుత్రశోకంతో స్వర్గస్థుడయ్యాడు. అతని భార్యలు దుఃఖంతో నేల మీద పడి ఉన్న సమయంలో సూర్యుడు అస్తమించాడు. రాత్రి సంచరించే ప్రాణుల సంచారానికి అనువుగా రాత్రి వచ్చింది. కొడుకులు లేకుండా దశరథుడికి సంస్కారం చేయడానికి వచ్చిన స్నేహితులు ఇష్టపడరని ఆలోచించి ఊహల్లో కూడా చూడలేని దశరథుడి శరీరాన్ని ఆ పక్క మీదే నూనె తొట్టెలో ఉంచారు. దశరథుడు మరణించడంతో దుఃఖాన్ని కంఠంలో నిలుపుకుని విచారించే ప్రజలతో దారులు, కూడళ్లు, ముంగిళ్లు నిండి ఉన్నాయి. అలాంటి అయోధ్య సూర్యుడు లేని ఆకాశంలా, నక్షత్రాలు లేని రాత్రిలా కాంతి లేకుండా పోయింది. దశరథుడు మరణించాక నగరంలోని పురుషులు, స్ర్తిలంతా గుంపులు గుంపులుగా చేరి భరతుడి తల్లిని నిందిస్తూ చాలా విచారించారు. ఏ మాత్రం సుఖాన్ని పొందలేక పోయారు. (అయోధ్యకాండ సర్గ 66)
ఆశే్లష హరిదాసుతో చెప్పాడు.
‘ఈ రోజు కథలో మీరు మొత్తం నాలుగు తప్పులు చెప్పారు’
వాటిని మీరు కనుక్కోగలరా?

గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు:
------------------------------
దశరథుడు చంపిన ముని కుమారుడి పేరేమిటి?
వాల్మీకి రామాయణంలో అతని పేరు
చెప్పలేదు కాని ఆ తర్వాత దాన్ని
అనుసరించి రామాయణం రాసినవారు ‘శ్రావణ కుమారుడు’ అని రాశారు.

=============
1.కొనసాగించింది దశరథుడు. కాని నారదుడు చెప్తూ కొనసాగిస్తున్నట్లుగా హరిదాసు తప్పుగా చెప్పాడు.
2.దశరథుడు తన బాణతో తన ‘ఏకైక’ కొడుకుని చంపాడని ముని ఆరోపించాడు. ఏకైక అన్నది హరిదాసు చెప్పలేదు.
3.‘సంతానం లేని నాకు మీ శాపం వరం. నాకు సంతానం కలగబోతోందన్నమాట’ దశరథుడు సంతోషించాడు అని వాల్మీకి రామాయణంలో లేదు. ఇది హరిదాసు కల్పించింది.
4.‘రాజు పడక దగ్గరికి వెళ్లే అధికారం గల స్ర్తిలు లేపడానికి వెళ్లారు’ అని వాల్మీకి రాసాడు. ఈ ముఖ్యమైన విషయాన్ని హరిదాసు ప్రస్తావించలేదు.
5.ముగిసింది 65వ సర్గ. మర్నాడు చెప్పాల్సింది 66వ సర్గ. కాని హరిదాసు పొరపాటుగా 67వ సర్గ ఆరంభిస్తానని చెప్పాడు.
==================

-మల్లాది వెంకట కృష్ణమూర్తి