S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పల్లెఒడిలో ఆటల సందడి..

సెలవులు వచ్చి ఆటవిడుపును
వెంటబెట్టుకొచ్చేశాయి.
చదువు సంధ్యలతో అలసిన మనసులకి
అమ్మమ్మగారింటి ఆహ్లాదాన్ని ఎత్తుకొచ్చేశాయి.
ఊర్లోని ప్రకృతి అందాలను తిలకిస్తూ..
అభిరుచుల మెరుగులు దిద్దుకుంటూ..
తాతయ్య మీసం మెలేస్తూ..
తియ్యటి కబుర్లు చెప్పుకుంటూ..
చుట్టుపక్కలవారికి మామయ్య చేస్తున్న
సాయానికి ఆశ్చర్యపోతూ..
ఆ సాయానికి తమ చిట్టిచేతులను కలుపుతూ..
తులసికోట దగ్గర అమ్మమ్మ చేతి
గోరుముద్దలను ఆస్వాదిస్తూ..
ఆరుబయట వెనె్నల వెలుగుల్లో నక్షత్రాల
లెక్కలను వేళ్ళపైకి తెచ్చుకుంటూ..
వానచినుకుల్లో కాగితం పడవలను
వదులుతూ..
మట్టివాసనను గట్టిగా ఆఘ్రాణిస్తూ..
మనసు ఊరివైపు పరుగులిడుతుంటే..
ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ..
వాటికి మరిన్ని జ్ఞాపకాలను
ప్రోది చేసుకుంటూ..
ఇంకా ఇంకా ఆ జ్ఞాపకాల నిధులను
పెంచుకోవాలని ఆరాటపడుతుంటారు పిల్లలు.
పెద్దలు మాత్రం మనసులో నిక్షిప్తమైన ఆ జ్ఞాపకాల తొట్టెలను అప్పుడప్పుడూ కదిలిస్తూ ఉంటారు. అందుకే ఎవరు ఎంత పెద్దవారైనా అందర్లోనూ ఎప్పుడో ఒకప్పుడు ఆ పసితనపు తాలూకు జ్ఞాపకాలు నీడల్లా మెదులుతూ.. మనసు బాల్యంలోకి పరుగులిడుతూ ఉంటుంది. అలాంటి ఆనాటి బాల్యంలో ఆడుకున్న ఆటలను, నేటి పిల్లలు ఆడకుండా కనుమరుగవుతున్న ఆటలను ఒక్కసారి గుర్తుచేసుకుందాం.
తరాలెన్ని మారినా వేసవి సెలవుల ప్రత్యేకతే వేరు. పరీక్షలు రాయడం మొదలుకాకుండానే.. రెండు మాసాల సెలవుల కోసం ఎదురుచూస్తుంటారు పిల్లలు. మునుపు సెలవులు రాగానే అమ్మమ్మగారింటికి వెళ్ళిపోయి బడి తెరిచే వారం రోజులు ముందు వచ్చేవారు. అమ్మమ్మ, తాతయ్యల గారాబం.. మామయ్యల ముద్దు మురిపాలతో గారాలు పోతూ.. ఆవరణలో ఆడుకుంటూ రోజుకు ఇరవై నాలుగు గంటలు సరిపోవడం లేదని బాధపడేవారు పిల్లలు. మధ్యాహ్నం వేళ తాటిముంజలు తింటూ.. సాయంత్రం పెరట్లో తులసిచెట్టు దగ్గర కందిపచ్చటి, కొత్త ఆవకాయ, మామిడిపండుతో అమ్మమ్మ కలిపిపెట్టే గోరుముద్దలను తింటూ.. ఆరుబయట వెనె్నల్లో వేపచెట్టు కింద మంచాలు వేసుకుని కబుర్లు చెప్పుకుంటూ, నక్షత్రాలను లెక్కపెట్టుకుంటూ.. రోజంతా ఆటలతో అలసిన శరీరాలతో ఇట్టే నిద్రలోకి జారిపోయేవారు పిల్లలు. ఇప్పటి ఏ క్యాంపింగ్ ట్రిప్ పనికొస్తుంది ఇటువంటి జ్ఞాపకాలు ముందు!? ఏ సెల్‌ఫోన్, వీడియోగేములు పనికొస్తాయి ఆనాటి అనుభవాల ముందు!?
ఆటలంటే శారీరక, మానసికోల్లాసానికి తోడ్పడేవి. మానసికంగా ఉల్లాసంగా, శారీరక దృఢత్వం ఉన్నవారిని ఏ ఒత్తిడీ జయించలేదని, ఏ సమస్యా ఎదురొడ్డి నిలవలేదనీ అందరికీ తెలిసిన విషయమే. మీరు చెప్పేవన్నీ నిజమే.. కానీ ఇప్పుడు అలాంటి ఆటలు ఎక్కడున్నాయండీ అంటున్నారు కదూ.. నిజమే! మైదానాలన్నీ రియల్ ఎస్టేట్ వెంచర్లుగా, చెట్లన్నీ కాంక్రీట్ జంగిల్లో సర్వనాశమైన తరువాత ఇంకెక్కడి కోతికొమ్మచ్చి, ఖోఖోలు.. రాజు-రాణి దొంగాట కాస్తా దొంగాటగా కంప్యూటర్ గేముల్లో దూరిపోయాయి. టెంపుల్ రన్‌లో గంటలు, రోజులు, నెలల తరబడి సెల్‌ఫోన్‌లో పరిగెత్తుతూంటే పిల్లలు పరిగెత్తాల్సిన అవసరం లేకుండా పోయింది. జామకాయల దొంగతనాలు అటకెక్కి, ఫ్రూట్‌సాగాలో స్క్రీన్‌ను టచ్ చేస్తే పండు రాలిపడుతోంది. సబ్‌వే సర్ఫ్‌లో వేలు టచ్ చేస్తే చాలు ఎక్కడ నుంచి కావాలంటే అక్కడ నుంచి దూకొచ్చు.. ఇక వంగుడుదూకుడు లాంటి ఆటలతో పనేముంది? తాడాట, బొంగరాలు, టైర్లాటల గురించి చెప్పాల్సి పనేలేదు. మొత్తానికి శరీరానికి ఏ మాత్రం చెమట పట్టించకుండా ఇంట్లోనే కూర్చుని చేతులు, కాళ్లు కదలనివ్వకుండా కేవలం కంప్యూటర్, మెదడుతో ఎంచక్కా బోలెడన్ని ఆటలు ఆడేసేయొచ్చు. దెబ్బలు తగలడాలు, రక్తం కారడాలు, శరీరం గట్టిపడడాలు ఏ మాత్రం ఉండవు. పరుగెత్తడం అస్సలు తెలీదు. ఓ వందమీటర్లు పరిగెత్తాలంటే అంత దూరమా..? అనేసే రోజులు వచ్చేశాయంటే అతిశయోక్తి కాదు.
ఇక దాగులు మూతలు, వీరి వీరి గుమ్మడిపండు, చిర్రగోనె, కర్రా బిళ్ల, ఏడురాళ్ళ ఆట, కప్పగంతులు, ఖోఖో, కబడ్డీ, వామనగుంటలు, తొక్కుడు బిళ్ళ వంటి ఆటల పేర్లు చెబితే.. ఏంటివి మమీ ఈ పేర్లన్నీ.. అని పిల్లలు అడిగే పరిస్థితి నేడు దాపురించింది. విచిత్రం ఏమిటంటే ఈ ఆటలన్నీ పెద్దలకి గుర్తున్నాయి. వాటిని మరిచిపోలేదు. కాలంతో పరుగులిడుతూ వాటిని పిల్లలదాకా తీసుకెళ్ళలేదంతే.. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మనసులను తట్టి నిద్రలేపి.. ప్రతి ఆదివారం పిల్లలతో కలిసి ఏదో ఒక ఆట ఆడితే సరి. వారికీ మన సంప్రదాయ ఆటలను నేర్పినట్లవుతుంది. వారిలో మానసిక, శారీరక దారుఢ్యాలను పెంపొందించి రేపటి సమాజానికి ఉత్తమమైన బాటలను వేసినట్లు అవుతుంది.
సంప్రదాయ ఆటలు..
సంస్కృతీ సంప్రదాయాలపరంగా మన దేశం ఎప్పుడూ గొప్పగా ఉండటానికి ప్రాచీన ఆటలు ఎంతగానో దోహదం చేశాయి.. చేస్తున్నాయి కూడా.. ఊర్లల్లో.. రమానారాయణులు సరదాగా పాచికలు ఆడటం, మహాభారతంలో పాండవులు పాచికలాటలో ఓడిన విధానం, మొఘలులు మధ్యాహ్నవేళ చదరంగం ఆడటం.. ఇలా మన పురాణ ఇతిహాసాలకు నీడపట్టున మనం ఆడే సంప్రదాయ ఆటలు ముఖ్యమైన సాధనంగా పనిచేసేవి. వీటితోపాటు ఆరుబయట ఆడే ఆటలు పిల్లల్లో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, శారీరక సౌష్టవాన్ని, స్నేహాలను పంచుకోవడానికి ఉపయోగపడుతాయి. ప్రాంతాలు, వారి భాషలను అనుసరించి ఆటల పేర్లలో మార్పు తప్ప ఆడే తీరులో ఎలాంటి తేడావుండదు. వామనగుంటలు, అష్టాచమ్మా, పచ్చీసు, గచ్చకాయలు, ఖోఖో, బిళ్లంగోడు, తాడాట, తొక్కుడు బిళ్ళ, బొమ్మా బొరుసు, కప్పగంతులు, నాలుగు స్తంభాలాట, వీరి వీరి గుమ్మడిపండు, ఏడు రాళ్ళ ఆట, కబడ్డీ, గల్లీ క్రికెట్, బొంగరాల ఆట, గోళీలాట.. ఇలా ఎన్నో ఆటలు. వీటిలో కొన్ని నీడపట్టున ఆడుకునేవి.. మరికొన్ని ఆరుబయట ఆడుకునేవి.
ఇంట్లో ఆడేవి..
వామన గుంటలు
దీర్ఘచతురస్రాకారంలో రెండు వరుసలుగా చెక్కతో చేసిన బోర్డుగేమ్ ఇది. దీనిని
వామనగుంటల పీట అంటారు. దీనికి ఒకవైపు ఏడుగుంటలు, మరోవైపు ఏడు గుంటలు ఉంటాయి. దీంట్లో ఆడటానికి చింతపిక్కలు లేదా సీతాఫలం గింజలను వాడతారు. ఇద్దరు ఆడే ఈ ఆటలో ఒక్కో గుంటలో ఐదు గింజల చొప్పున వేస్తూ ఆటను మొదలుపెడతారు. ఒక గుంటలో గింజలను తీసి అన్ని గుంటలకు పంచుతూ.. గింజలన్నీ అయిపోయాక ఆ తరువాతి గుంటలో నుంచి గింజలు తీసి మిగతా గుంటల్లో వేయాలి. మధ్య ఖాళీ గుంట తటస్థపడితే ఆ తరువాత గుంటలో ఉన్న గింజలన్నీ పంచిన వ్యక్తికే చెందుతాయి. అంటే అతను అన్ని గింజలని గెలుచుకున్నట్లు. ఒకరు గింజలను పంచుతుంటే మరొకరు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. ఎవరి దగ్గర ఎక్కువ గింజలు ఉంటే వారు ఈ ఆటను గెలిచినట్లు లెక్క. ఈ పీట అందుబాటులో లేకపోతే నేలమీద గీతలను గీసి కూడా ఆడుకోవచ్చు.
పచ్చీసు
పచ్చీసును నలుగురు ఆడతారు. ఈ ఆటలో పదహారు కాయలుంటాయి. ప్రతి ఒక్కరూ నాలుగు కాయల చొప్పున పంచుకుంటారు. ఒకొక్కరికి ఒక్కో రంగు కాయలు వస్తాయి. పచ్చీసును నేలపై సుద్దముక్కతో గీసి నలుగురు నాలుగువైపులా కూర్చుని ఆడతారు. పందెం వేయడానికి ఏడు గవ్వలను వాడతారు. గవ్వలతో దస్, తీస్, పచ్చీస్ వేసినప్పుడు పావులు వస్తాయి. పందెం గడివైపు సాగుతుంది. ముందున్నవారు తల్లి గడివైపు వెళ్ళేలోపు వట్టి చోట్ల ఉంటే వారి తరువాత వారు ముందున్న పావును చంపవచ్చు. గడిలో చేరిన పావులను చంపకూడదు. ఈ పందాల విలువ పచ్చీసు. అంటే ఇరవై అయిదు. తీస్ అంటే ముప్ఫై, దస్ అంటే పది.. ఎవరు ముందు మధ్యలో ఉన్న ఇల్లు చేరితే, చుట్టూ నాలుగు వైపులా పూర్తిచేయగలిగితే వాళ్ళు ఆటలో గెలిచినట్లు లెక్క.
అష్టాచెమ్మా
చతురస్రాకారంలో సుద్దముక్కతో గీసి ఆడే ఆట. దీన్ని ఇద్దరు నుండి నలుగురు వరకు ఆడొచ్చు. ఆడటానికి నాలుగు గవ్వలు లేదా అరగదీసిన చింతపిక్కలను వాడతారు. ఆడేటప్పుడు నాలుగు గవ్వలను ఒకేసారి నేలకు విసురుతారు. దాంట్లో కొన్ని వెల్లకిలా, మరికొన్ని బోర్లా పడతాయి. నాలుగు గవ్వలు బోర్లాపడితే దానిని అష్టా అంటారు. నాలుగు గవ్వలు వెల్లకిలా పడితే దానిని చెమ్మా అంటారు. ఒకొక్కరి దగ్గరా నాలుగు పావులు లేదా చింతపిక్కలు ఉంటాయి. ఈ పావులు ఎవరెవరివో తెలియడానికి నాలుగు భిన్నమైన రంగులను ఎంచుకుంటారు.
గచ్చకాయలు
ఐదు నున్నటి రాళ్ళు లేదా గచ్చకాయలతో ఆడుకునే ఆట ఇది. నాలుగు రాళ్ళను కింద వదిలేసి ఒక రాయిని పైకి విసురుతూ, విసిరిన రాయి కిందకి వచ్చి పట్టుకునేలోపు నేలపై నున్న రాళ్ళని తీసుకోవాలి. ఈ ఆటను ఒకరి తర్వాత ఒకరు ఆడతారు.
చదరంగం
ఇది మనదేశపు అతి ప్రాచీన ఆట. ఈ ఆట మన దేశం నుంచి దక్షిణ ఐరోపా ఖండంలో పదిహేనవ శతాబ్దంలో కాలుపెట్టి ప్రస్తుతం అనేక మార్పులకు లోనై ‘చెస్’గా రూపాంతరం చెందింది. ఇందులో 16 తెల్లపావులు, 16 నల్లపావులు ఉంటాయి. ఇవి రాజు, మంత్రి, ఏనుగులు, గుర్రాలు, సైనికులుగా.. ఒక్కోటి ఒక్కో ఆకారంలో ఉంటాయి. 64 చదరపు గళ్ళు ఉండే ఈ ఆటలో తెల్లపావులను ఒక ఆటగాడు, నల్లపావులను మరో ఆటగాడు నియంత్రిస్తుంటాడు. అనేక ఎత్తులు, యుక్తులతో ఎదుటి ఆటగాడిని చిత్తుచేయడమే దీని ప్రత్యేకత. మెదడుకు పదును పెట్టే ఆటల్లో ఇది మొదటిస్థానంలో నిలుస్తుందని చెప్పచ్చు.
ఆరు బయట ఆటలు
బిళ్ళంగోడు
దీన్ని కొన్ని ప్రాంతాల్లో ‘గిల్లీడండా’ అంటారు. మూరెడు పొడుగున్న కట్టెని గోడు అనీ, జానెడు పొడుగున్న కట్టెని బిళ్ళ అనీ అంటారు. ఈ కట్టెల్ని నున్నగా చెక్కి తయారుచేసుకుంటారు. చిన్నదైన బిళ్ళని సన్నని గుంట తీసి దానిపై అడ్డంగా ఉంచి, పెద్ద కర్రతో లేపి కొడతారు. అది వెళ్లి పడిన చోటు నుంచి గోడుతో కొలుస్తారు. ఎవరు ఎక్కువ దూరం కొడితే వారు గెలిచినట్లు లెక్క అన్నమాట.
దాగుడు మూతలు
ఇది ఏ వేళైనా, ఎక్కడైనా ఆడుకోవచ్చు. పెద్దవాళ్ళు కూడా ఈ ఆటను ఆడవచ్చు. ఒకరు కళ్లు మూసుకుని ఉంటే మిగిలినవారు దాక్కుంటారు. వారిని ఈ కళ్లు మూసుకున్న వ్యక్తి పట్టుకోవాలి. దీన్ని ‘దొంగపోలీసు’అని కూడా అంటారు.
గోళీలాట
ఈ ఆటను ఎక్కువగా అబ్బాయిలు ఆడతారు. ఇది అందరికీ తెలిసిన ఆటే అయినా ఇప్పటి పిల్లలు ఎవరూ దీన్ని ఆడటం లేదు. ఒక వృత్తాన్ని గీసి అందులో గోళీలను ఉంచుతారు. ఒక గోళీతో అందులోని గోళీలను గురిచూసి కొడతారు. తగిలిన గోళీలన్నీ కొట్టినవాడికి సొంతం. ఇలా గోళీలు పోగవడంతో పిల్లలు చాలా ఉత్సాహంగా ఈ ఆటను ఆడతారు.
బొంగరాలు
దీనే్న ఇంగ్లీషులో గేమింగ్ టాప్ అంటారు. ఈ ఆటలో ఏకాగ్రత, నైపుణ్యం, ఆసక్తి అవసరం. బొంగరానికి తాడును చుట్టేందుకు వీలుగా మెట్లుమెట్లుగా ఉండి కింద మేకు ఉంటుంది. పై భాగంలోని డోమ్ బొంగరాన్ని చేతితో పట్టుకుని విసరడానికి అనువుగా ఉంటుంది. మేకు కిందివైపు ఉండటం వల్ల బొంగరం వేగంగా, ఎక్కువసేపు తిరగడానికి అనువుగా ఉంటుంది. ఈ ఆట దాదాపు అందరికీ తెలిసిందే.. దీన్ని కొందరు చేతులపైన కూడా తిప్పుతారు.
తొక్కుడు బిళ్ళ
దీన్ని అమ్మాయిలు ఎక్కువగా ఆడతారు. ఇది ఒంటరిగా లేదా జట్లుగా ఆడవచ్చు. పక్కపక్కనే ఉన్న నాలుగు నిలువుగళ్ళు, రెండు అడ్డగళ్ళు గల దీర్ఘచతురస్రాకార గడులలో ఈ ఆటను ఆడతారు. ముందు ఒకరు బిళ్ళను ముందు గడిలో వేసి కాలు మడిచి మిగతా ఎనిమిది గడులను దాటించి బయటకు తీసుకురావాలి. తరువాత మిగిలిన గడులను దాటించాలి. ఏ సమయంలోనూ కాలుగానీ, బిళ్ళగానీ కింద పెట్టకూడదు, మధ్యలోని గడుల గీతలను తాకకూడదు. గడులన్నీ అయిపోయాక కాలి వేళ్ళమధ్య బిగించి పట్టుకున్న దాన్ని కుంటికాలితో ఎనిమిది గడులను గెంతి రావాలి. తరువాత కాలి మడమపై, తలపై, అరచేతిలో, మోచేతిపై, భుజంపై పెట్టుకుని అన్ని గడులను తిరిగి రావాలి. ఇవన్నీ దాటితే వారే గెలిచినట్లు.
నేలబండ
ఈ ఆటను ఇంతమందే ఆడాలి అని లేదు. ఎందరైనా ఆడొచ్చు. ముందు ఒకరిని దొంగగా నిర్ణయిస్తారు. దొంగని నేలకావాలో, బండ కావాలో తేల్చుకోమంటారు. దొంగ నేల కోరుకుంటే మిగిలినవారు బండపై నిలబడాలి. అప్పుడప్పుడూ నేలపైకి వచ్చి దొంగను ఆటపట్టించాలి. దొంగ బండపైకి వెళ్ళకుండా నేలపైకి వచ్చినవాళ్ళను పట్టుకోవాలి. ఎవర్ని ముందు పట్టుకుంటే వారే తరువాత దొంగ అవుతారు.
కబడ్డీ
టీవీల్లో ఖేల్ కబడ్డీ వచ్చాక అందరికీ ఈ ఆట గురించి ఎక్కువ మందికి తెలిసింది. ఒక్కో జట్టులో ఏడుగురు ఆటగాళ్లు ఉంటారు. ఒక ఆటగాడు రెండోవైపు కబడ్డీ.. కబడ్డీ.. అంటూ గుక్క తిప్పుకోకుండా వెళ్లి అవతలి జట్టువారిని టచ్ చేసి తిరిగి మధ్య గీతను ముట్టుకోవాలి. ఎంతమందిని ముట్టుకుని మధ్యగీతను ముట్టుకుంటే అంతమంది ఔట్ అయినట్లు లెక్క. తరువాత రెండోవైపు వారు కూడా ఇలా చేయాలి. ఎవరి జట్టులో వాళ్ళందరూ ముందుగా ఔట్ అయితే మరో జట్టు గెలిచినట్లు లెక్క.
ఖోఖో
ఇది సంప్రదాయక ఆట. ఈ ఆటను పనె్నండు మంది ఆడతారు. తొమ్మిదిమంది అటు, ఇటు ఒకరుగా వరుసగా కూర్చుంటారు. ఒక దొంగ ఉంటాడు. మరోవ్యక్తి నిల్చుని ఉంటాడు. దొంగ వ్యక్తి నిల్చున్న వ్యక్తిని పట్టుకోవాలి. అతను పరిగెత్తుతూ కూర్చున్న వాళ్ళని లేపి తను కూర్చుంటాడు. ఇలా ఈ ఆట సాగుతుంది.

మానసిక నిపుణులు ఏమంటున్నారంటే..
ఇలా ఎన్నో రకాల ఆటలు ఉన్నాయి. సంప్రదాయక ఆటలు శారీరక ఎదుగుదలతో పాటు మానసిక వికాసం, సాంఘిక జీవనాన్ని అలవాటు చేస్తాయి. ఇప్పటి పిల్లలు ఆడుకునే వీడియో గేమ్స్, సెల్‌ఫోన్ గేమ్స్ వల్ల వారి కంటిచూపు దెబ్బతింటుంది. మానసిక ఆందోళనలు, చికాకు ఎక్కువవుతుందని ఇటీవల పరిశోధనల్లో తేలింది. ఈ మానసిక ఒత్తిడి శారీరక ఎదుగుదలపై చాలా ప్రభావం చూపుతుందని చాలా పరిశోధనలు తేల్చేశాయి. ఇంకొన్ని వీడియో గేమ్స్ నేర ప్రవృత్తిని పెంచేలా ఉన్నాయి. మరికొన్ని ఎవరికి వారే ప్రాణాలు తీసుకునేలా (బ్లూ వేల్ తరహా ఆటలు) రూపొందించబడ్డాయి. ఇటువంటి ఆటల వల్ల పిల్లలు ఒంటరితనానికి అలవాటై సంఘజీవనానికి సంబంధించిన కలుపుగోలుతనం, చొరవ అలవడటం లేదనేది పిల్లల మానసిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయక ఆటలు ఆడటం వల్ల కలిగే లాభాలను వారు శాస్ర్తియంగా పరిశీలించి నిరూపించారు. అవేంటంటే..
* పిల్లల మానసిక నిపుణులు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఏం తేలిందంటే- మైదానంలో ఆటలు ఆడుతున్న పిల్లలు చాలా చురుగ్గా ఉంటారట. వీరు వివిధ అంశాలపై పట్టును సాధించగలుగుతారు. ఆటలు ఆడటం వల్ల వీరు మానసిక స్థైర్యాన్ని కలిగి ఉంటారు. చురుగ్గా ఉండటంతో చదువు కూడా వీరికి త్వరగా వంటబడుతుందట.
* పిల్లలకు సామాజిక నైపుణ్యాలు చాలా ముఖ్యం. పిల్లలు ఆటల్లో పాల్గొనడం వల్ల ఈ నైపుణ్యాలను పెంపొందించుకుంటారు. మిగిలిన పిల్లలతో కలిసి మెలిసి ఉండటం, వారితో సరదాగా గడపడం వంటివి చేస్తారు.
* మైదానంలో ఆడే ఆటల వల్ల పిల్లల్లో నాయకత్వ లక్షణాలు అలవడుతాయి. ఒక బృందంగా కలిసి ఆటలు ఆడటం వల్ల అందరూ చైతన్యవంతం కావడం, కలివిడిగా ఉండటం, ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు కలిసికట్టుగా దాన్ని పరిష్కరించుకోవడం వంటి లక్షణాలను పెంపొందించుకుంటారు.
* ఆరుబయట ఆడే ఆటల వల్ల మెదడు అభివృద్ధి చాలా వేగంగా, చురుగ్గా ఉంటుంది. ఫలితంగా పిల్లలు ఏదైనా త్వరగా నేర్చుకుంటారు. ఆరోగ్యకరమైన మెదడు ఏ విషయాన్నైనా సులభంగా గ్రహించగలుగుతుంది, గుర్తుకు తెచ్చుకోగలుగుతుంది.
* ఆటల వల్ల శారీరక ఎదుగుదల బాగుంటుంది. కండరాల ఎదుగుదల బాగుండి ఎముకలు దృఢంగా ఉంటూ చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారు. అందువల్ల పిల్లలను ఆటపాటల విషయంలో ప్రోత్సహించాలని చెబుతున్నారు నిపుణులు.
* మెరుగైన శ్వాసక్రియకు, గుండె ఎదుగుదలకు ఆటలు ముఖ్యం. ఆటల వల్ల ఊపిరితిత్తులు దృఢమవుతాయి. రక్తప్రసరణ బాగుంటుంది. అలాగే ప్రకృతిలోని సహజసిద్ధమైన గాలిని పీల్చడం వల్ల వారు చాలా ఆరోగ్యంగా ఉంటారు. రోగనిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆరు బయట ఆడుకునే పిల్లల్లో జబ్బులు తక్కువగా వస్తాయి.
* కాలంతో పాటు పరుగులెత్తే ఈ యుగంలో పోటీతత్త్వం చాలా అవసరం. ఈ పోటీతత్త్వం పిల్లలు ఆటల వల్ల చాలా సులువుగా వచ్చేస్తుంది.
* గెలుపు ఓటమి జీవితంలో భాగమన్న నిజాన్ని ఆటల ద్వారా పిల్లలు గ్రహిస్తారు. ఒకవేళ ఓడినా నష్టమేమీ లేదు.. మరోసారి పట్టుదలతో గెలవవచ్చు అనే వైఖరి వారికి ఆటల ద్వారానే అలవడుతుంది. గెలుపుకోసం పడే శ్రమను కూడా వారు గుర్తిస్తారు. ఫలితంగా శ్రమ విలువను తెలుసుకుంటారు.
* ఆటలు పిల్లల్లో ఏకాగ్రతను పెంపొందిస్తాయి. ఏ రంగంలోనైనా విజయం సాధించేందుకు ఏకాగ్రత చాలా అవసరం. ఆటలు సరిగా ఆడని పిల్లల్లో అది తక్కువగా ఉంటుంది.
* క్రీడలు పిల్లల్లో భౌతికపరమైన మార్పులను కలిగిస్తాయి. ప్రతి ఆటను చివరివరకు ఆడాల్సి రావడం, చివరి వరకు గెలుపుకోసం పోరాడటం వంటివి వారిలో ఓర్పును పెంచుతాయి. ఓర్పు అనేది జీవితానికి ఎంత అవసరమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు కదా..
* జీవితంలో గమ్యస్థానాన్ని చేరడానికి స్టామినా (సత్తువ) చాలా అవసరం. మైదానాల్లో పిల్లలను ఆడనివ్వడం వల్ల వారిలో స్టామినాను పెంచి వారి భవిష్యత్తుకు బంగారు బాటలను వేస్తున్నామని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి.
* పిల్లలు ఏదైనా ఆటలో గెలుపొందిన ప్రతిసారీ గెలుపు విలువను తెలుసుకుంటారు. గెలుపును పొందడం సులభం కాదన్న విషయాన్ని గుర్తిస్తారు. విజయాన్ని పొందడానికి ఎంత శ్రమ, పట్టుదల, కృషి ఉండాలి అనే విషయాల్ని గమనిస్తారు.
* చిన్న చిన్న విషయాలకు కుంగిపోయి, ఒత్తిడితో జీవితాల్ని అర్ధాంతరంగా ఆపేయాలన్న ఆలోచనలు ఆటలు ఆడే పిల్లలకు, విజయాన్ని చవిచూసిన పిల్లలకు రమ్మన్నా రావు.
ఆరుబయట ఆటలు ఆడటం వల్ల పిల్లలు ఒత్తిడిని ఎలా జయిస్తారు? వారి శారీరక, మానసిక స్థైర్యాలు ఎలా పెరుగుతాయి? అనే విషయాలను మానసిక నిపుణులు శాస్ర్తియంగా పలు పరిశోధనల ద్వారా నిరూపించారు. జీవితాన్ని గెలుపొందడానికి, జీవితంలో గెలుపొందడానికి పిల్లలకు ఆటలు ఎంతగానో ఉపయోగపడతాయి. తల్లిదండ్రులు, దేశం గర్వపడేలా పిల్లలు ఎదుగుతారు. సమాజంలో మంచి పౌరులుగా మారతారు. ఫలితంగా మంచి సమాజం ఏర్పడుతుంది. దేశాభివృద్ధి జరుగుతుంది. మరి ఈ రోజు నుంచి.. కాదుకాదు.. ఇప్పటి నుంచి పిల్లలను మైదానాల్లో ఆడనిద్దాం. ఆరోగ్యవంతమైన నవ సమాజాన్ని నిర్మిద్దాం.. *

--ఎస్.ఎన్. ఉమామహేశ్వరి