S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సుదీర్ఘ నిరసన

ప్రజాస్వామ్యంలో నిరసనలు సాధారణం. నిరసన వ్యక్తం చేయని మనిషే ప్రపంచంలో ఉండడు. ఏ నిరసన అయినా కొన్ని గంటల్లో లేదా కొన్ని రోజుల్లో ముగుస్తుంది తప్ప కాలంతోపాటు కొనసాగదు. కానీ అమెరికాలో అత్యధిక కాలం కొనసాగిన నిరసన ఒకటి ఉంది. అది కూడా వైట్‌హౌస్ సమీపంలోనే.
1981లో వైట్‌హౌస్ ఎదురుగా, కోనీ పికోటో అనే ఆమె ఓ టెంట్‌ని వేసుకుని, ప్రపంచ శాంతి కోసం నిరసనని చేపట్టింది. అప్పటికే అమెరికా మొదటి, రెండు ప్రపంచ యుద్ధాల్లో; వియత్నాం, కొరియా యుద్ధాల్లో పాల్గొని ప్రపంచ శాంతికి విఘాతాన్ని కల్పించింది. ఇందుకు కలత చెందిన కోనీ ప్రపంచం నాశనం కాకూడదనే లక్ష్యంతో ఈ నిరసనని చేపట్టింది. వాషింగ్టన్‌లో, చలికాలం మంచు పడుతుంది. ఆ తీవ్ర చలిని కూడా తట్టుకుంటూ గుడారంలోనే ఉండిపోయింది. ఆమె శరీరం అలా 35 చలికాలాలని ఎదుర్కొంది.
స్పెయిన్‌లో పుట్టిన కోనీ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో, అమ్మమ్మ పెంచి పెద్ద చేసింది. 1960లో ఆమె అమెరికాకి వలస వచ్చింది. న్యూయార్క్‌లోని స్పానిష్ కన్స్‌లేట్‌లో రిసెప్షనిస్ట్‌గా ఉద్యోగంలో చేరింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఇటలీ నించి వలస వచ్చిన పికోటోని పెళ్లి చేసుకుంది. వారికి పెళ్లై పదేళ్లు గడిచినా పిల్లలు పుట్టకపోవడంతో, 1973లో ఓగ్లా అనే పాపని దత్తత తీసుకుంది. నేరస్థుడైన ఆమె భర్త తన నేర లావాదేవీలని మరుగుపరచడానికి ఆమెని పిచ్చాసుపత్రికి పంపాడు. హాస్పిటల్ నించి విడుదలయ్యాక, తన కూతురి కస్టడీని తిరిగి పొందలేక పోయింది. తనకంటూ ఎవరూ లేని అనాథ అయిన కోనీ తను కోల్పోయిన శాంతిని ప్రపంచంలో ఇంకెవరూ కోల్పోకూడదనే సదుద్దేశంతో ఉండేది. దాంతో పెద్ద విషయాల మీద స్పందిస్తూ వాషింగ్టన్ డిసికి చేరుకుంది.
ఆ రోజుల్లో వైట్‌హౌస్ ఎదురుగా అణ్వాయుధాలకి వ్యతిరేకంగా, కొందరు నిరసన వ్యక్తం చేయటం గమనించింది. ఆమె కూడా అందులో పాల్గొంది. ఐతే వారు కొద్ది రోజుల తర్వాత వెళ్లిపోయారు. కానీ కోనీ మాత్రం ప్రపంచ శాంతి కోసం వొంటరిగా ఆ నిరసనని కొనసాగించింది. ఈమెతోపాటు విలియం థామస్ అనే మరో నిరసనకారుడు 25 ఏళ్లపాటు అక్కడే ఉండి పాల్గొన్నాడు. 2009లో అతను మరణించాక కూడా, ఆమె తన నిరసనని కొనసాగించింది. తరచూ అనేక మంది నిరసనకారులు కొద్దికాలం ఈమెతో పాల్గొని వెళ్లిపోతూంటారు. ప్రపంచ శాంతికి చెందిన వివిధ అంశాల మీద నిరసనలని ఆమె బోర్డుల మీద రాసి నిత్యం ప్రదర్శిస్తూండేది.
35 ఏళ్లపాటు వైట్‌హౌస్ ముందు నిరసనలో పాల్గొనడం కష్టమైన విషయం. రక్షణకి ఆమె సదా హెడ్ స్కార్ఫ్ మీద హెల్మెట్‌ని ధరించేది. అనేకసార్లు ఆమె మీద దాడులు జరిగాయి. ఓ టేక్సీ ఆమెని గుద్దింది. అమెరికన్ సీక్రెట్ ఏజెంట్లు ఆమెని అక్కడ నించి ఖాళీ చేయించే అనేక ప్రయత్నాలు కూడా చేశారు. కానీ కోనీ అన్నింటికీ తట్టుకుని ధైర్యంగా నిలబడింది.
న్యూయార్క్ టైమ్స్ ఈమె గురించి ఇలా రాసింది.
‘యునైటెడ్ పార్క్ పోలీస్‌తో కోనీ 35ఏళ్ల పాటు పిల్లి ఎలుక ఆటని ఆడింది. పార్క్ నియమాల ప్రకారం నిరసనకారులు అందులో పడుకోవడం నిషిద్ధం. ఆమెని వారు ఖాళీ చేయించే ప్రయత్నం చేసినప్పుడల్లా, స్వచ్ఛంద సేవకులు ఆమె పక్షాన నిలబడేవారు.
2013, సెప్టెంబర్‌లో ఆమె టెంట్‌ని పోలీసులు కూల్చేశారు. ఆమె పత్రికా విలేకరులకి ఇలా చెప్పింది.
‘నేను ఏ శాంతి కోసమైతే నిలబడ్డానో, అది ఈ ప్రదేశంలోనే నాశనం చేయబడుతోంది. వేడి, చలి మంచులో జీవించడం చాలా సంఘర్షణలతో కూడిన విషయం. ప్రపంచ శాంతి కోసం నేను వీటిని ఇష్టంగా భరిస్తున్నాను అన్న సంగతి ఆ పోలీసులకి తెలీదు’
తీవ్ర వర్షాలు, వడగాలులు, మంచు తుఫాన్లు ఎన్నిటినో ఆమె చవి చూసింది. రొనాల్డ్ రీగన్, జార్జ్ హెచ్ డబ్ల్యు బుష్, బిల్‌క్లింటన్, జార్జ్ డబ్ల్యు బుష్, బరాక్ ఒబామాలని ఆమె చూసింది.
‘ఈ ఐదుగురు అధ్యక్షుల్లో ఒకరు కూడా రోడ్డు దాటి పార్క్‌లోకి వచ్చి నాతో మాట్లాడలేదు. ప్రపంచ శాంతి కోసం, న్యాయం కోసం నేను చేసే నిరసనని గుర్తించలేదు’ ఆమె ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పింది.
ఐతే వైట్‌హౌస్ లోపలి వారు ఆమెని విస్మరించినా దాని బయట వేల మంది ఆమె నిరసనని గుర్తించారు. స్థానికులు, పర్యాటకులు ఆమెని కలిసేవారు. ఆమె మీద ఫారెన్‌హీట్ 9/6 అనే డాక్యుమెంటరీని మైఖేల్ మూర్ తీశాడు. రాజ్యాంగ రక్షణలో భాగమైన వాక్ స్వాతంత్య్రాన్ని నిలబెట్టినందుకు ఆమెకి షఫీక్ నాదర్ ట్రస్ట్ అవార్డు లభించింది.
కోనీ లక్ష్యాల్లో చాలా భాగం నెరవేరాయి. అణ్వాయుధాలని తగ్గించాలని అమెరికా నిర్ణయం తీసుకోడానికి ఆమె ఓ కారణం అని న్యూయార్క్ టైమ్స్ కొనియాడింది.
35 ఏళ్ల అనంతరం 80వ ఏట ఆమె ఆరోగ్యం క్షీణించడంతో చివరికి హోమ్‌లెస్ ఉమెన్స్ షెల్టర్‌లో మరణించింది.
ఆమె మరణ వార్త తెలియగానే ప్రజలు వేల సంఖ్యలో వచ్చి ఆమె భౌతికకాయం దగ్గర, నిరసన ప్రదేశంలో పూలగుత్తులు ఉంచారు. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కూడా అధ్యక్షుడి తరఫున సంతాపం వ్యక్తం చేశాడు. ‘కోనీ నిజంగా శాంతిని ప్రేమించడంతో చలిని, వేడిని తట్టుకుంది. ఆమె హీరో’ అని కొందరు అంటే ఆమె ‘మూర్ఖురాలని’ మరి కొందరు భావించారు. ఇంకొందరు ఆమె మానసిక స్థితి మీద అనుమానాలు వ్యక్తం చేశారు. కాని ఆమె మరణానంతరం మాత్రం అంతా ఏకగ్రీవంగా ఆమె హీరో అని మెచ్చుకున్నారు. ఆమె జీవితం చాలామందిని స్పందింపజేసింది. నేడు 21 మంది స్వచ్ఛంద సేవకులు ఆ గుడారంలో వంతుల వారీగా నిరసనని కొనసాగిస్తున్నారు.

- పద్మజ