S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

యుద్ధం - శాంతి

యుద్ధం - శాంతి

-తంగిరాల-సోని
96766 09234
పిడికిలి బిగిస్తేనే
ప్రాణాలు విలవిలలాడీ
చచ్చిపోయే పిరికిపందల్లారా..
మీది.. ఏం యుద్ధంరా!?
ఏం ధర్మంరా..?
వీరత్వమంటే..
ప్రజల్ని రక్షించడం, ప్రేమించడం
దేశాన్ని కాపాడటం.
మీ యుద్ధం ఎవరిపై
ఉగ్రవాదులారా..
దొంగచాటుగా మాటువేసి
మారణహోమం సృష్టించే
మీది.. యుద్ధమా?
ఛీఛీ
ప్రాణాలను సైతం లెక్కచేయకుండా
పోరాడుతున్న వీరులదిరా.. యుద్ధమంటే
దేశంపై ప్రేమంటే..
అమరులైన మా సైనికులదిరా..
యుద్ధమంటే ప్రపంచాన్ని గెలవటం కాదురా..
ప్రపంచానికి శాంతినివ్వడం,
యుద్ధమంటే...
పోరాడుతున్న మా వీరుల్ని అడగండ్రా..
అమరులైన మా ధీరుల్ని అడగండ్రా..
*

కొండమీది గుడి

-డా.ఎన్.గోపి
చిన్నప్పటి నుంచి
కొండమీది గుడిని చూస్తూ
ఆ రోడ్డు మీద ఎన్నోసార్లు వెళ్లాను.
దగ్గరే ఉన్నట్టుంటుంది
నడిస్తే మైలున్నర.

పెద్ద తలకు
చిన్న కిరీటం పెట్టుకున్న
పౌరాణిక పాత్రలా ఉంటుందా గుడి.

గుడి కూడా
రోజూ నన్ను గమనిస్తుందేమో
నాకది తెలియదు
ఇక ఆ రోజు
నా ప్రయాణం ముందుకు సాగలేదు

రేకుపెట్టెలో
పాత ఉత్తరాలు కదిలినట్టు
గుడి నాకేదో
ప్రాచీన జ్ఞాపకాలను ప్రసారం చేస్తుంది.

రాళ్ల గుట్ట,
మెట్లు లేవు
కట్టని మెట్ల మీదుగా
నా నడక!

ఈ చిన్న బండ మీద
ఇంత పెద్ద గుండునెవరు పెట్టారో!
ఆ గరిమనాభికి మొక్కాలి.

నా పట్టుదలకు
ప్రతీకలాగుంది ఆ గుడి.
రెండు గంటలు కష్టపడి
శిఖరాన్ని చేరుకున్నాను.

కింది నుంచి గుట్ట
చిన్నగా కనిపించేది
ఇక్కడి నుంచి
లోకమూ అంతే!

ఇంత చిన్న గుడిలో
ఒంటరిగా
దేవుడెలా ఉంటున్నాడో!
నాకైతే భయం వెయ్యలేదు
అతడు తోడుగా ఉన్నాడని.

మూడో జాతి
-పుష్యమీసాగర్
9032215609
చిన్నతనం నుంచి
లింగ నిర్ధారణలో
ఊగిసలాడిన సందేహానివి

నువ్వు ఎవరో నీ లోపలి
మనిషికి తెలిసినా
నోరు విప్పలేని
గొంతుకవి నువ్వు...

సంఘర్షణలో రాలిపడిన
కొన్ని కన్నీటి చుక్కలు
నీచే రాయబడిన రాతలు
ధిక్కార స్వరానికి ప్రతినిధులు

మూడో జాతి వివక్షత
నీ ఆత్మగౌరవంపై ఉమ్మేసినప్పుడు
తలెత్తుకు తిరగలేని నీ
రాజీతత్వంపై కసి...

బతుకుతెరువు
ట్రాఫిక్ సిగ్నళ్లలో
పెళ్లిళ్ల గానాబజానాల్లో
బలవంతపు శృంగారపు సుఖానికి
అతుక్కుపోయినప్పుడు
అనివార్యమైన మిగులువి

సమాజానికి అనవసర గర్భస్థ పిండమై
నీ ఉనికి ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు
ఉరితాళ్లకు వేలాడబడిన నీ తలలు
చేదు నిజానికి సజీవ సాక్ష్యాలు

పుట్టుక నీది, చావు నీది
నిన్ను శాసించే హక్కు ఇంకెవరిది?
మూడో జాతికి నయా ప్రతినిధిలా
ముందు అడుగు వేయి!

నీ గళం ఇప్పుడు
లక్ష గొంతుకలై నలుదిక్కులా
మారుమోగాలి.