S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మృదంగ ‘వినోద’ం

శ్రీ రామేశ్వరపు వినోద్ ప్రఖ్యాత మృదంగ విద్వాంసులు. 1995 నుండి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నృత్య శాఖలో ఆయన పని చేస్తున్నారు. కొన్ని వేల ప్రదర్శనలకు మృదంగం, ఘటం, కంజీరా వాయించారు. అతి ప్రతిష్ఠాత్మక డాన్స్ ఫెస్టివల్స్‌లో నృత్య ప్రదర్శనలకు నట్టువాంగం చేశారు. చల్లగా, హాయిగా, తీయగా మాట్లాడుతూ ఉండే మంచి మనిషి! అభంగ తరంగ మృదంగం. వినోద్‌గారి మాట సున్నితం, మనసు నవనీతం. దేశ విదేశాలలో మన కళలను వ్యాప్తి చేశారు. ఎంతోమంది ప్రఖ్యాత విద్వాంసులతో, నర్తకీమణులతో కలసి ప్రదర్శనలిచ్చారు. అయినా సాదాసీదాగా ఉంటారు. వినోద్‌గారితో ముఖాముఖి ఇలా జరిగింది.
ప్రశ్న: మీ బాల్యం గురించి..
జ: హైదరాబాద్‌లో పుట్టి పెరిగాను. ఇక్కడే ఎం.ఏ. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశాను. నాన్న విశాఖపట్టణంలో పోర్టులో మెకానికల్ ఇంజనీర్. నన్ను తాతగారు పెంచి పెద్ద చేశారు. మూడేళ్ల వయసులోనే నన్ను హైదరాబాద్ తెచ్చి, కళలు నేర్పించి, చదువు చెప్పించారు.
ప్ర: మీ గురువుగారు మీ తాతగారేనా?
జ: మా అమ్మమ్మ లక్ష్మి, తాతగారు కీ.శే.సిరిపల్లి వేంకట రమణగారు నన్ను పెంచారు. తాతగారు త్యాగరాజు మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజీ, రాంకోఠి, హైదరాబాద్‌లో మృదంగం నేర్పించేవారు. నాకు ఐదేళ్ల వయసులో మృదంగం నేర్చుకోవడం మొదలుపెట్టాను తాతగారి వద్ద. మా బావగారు నాగేశ్వరరావు కూడా ప్రఖ్యాత మృదంగ విద్వాంసులు. మా పిన్ని (వల్లూరి) సిరిపల్లి అనూరాధ ప్రఖ్యాత వేణువు కళాకారిణి.
ప్ర: మీ ప్రస్థానం గురించి.
జ: చిన్నప్పుడే ప్రదర్శనలు కూడా ఇవ్వడం మొదలుపెట్టాను. ముందులో గాత్ర కచేరీలు, వీణ, వేణువు, వయొలిన్ ప్రదర్శనల్లో మృదంగం సహకారం ఇచ్చేవాడిని. తరువాత నృత్య ప్రదర్శనల్లో మృదంగం, ఘటం, కంజీరా వాయించడం మొదలుపెట్టాను. ప్రఖ్యాత కళాకారులు శ్రీరంగం గోపాలరత్నంగారు, కీ.శే.పప్పు సోమేశ్వరరావుగారు, శ్రీ కదిరి గోపాలనాథ్‌గారు, ఇలా ఎంతోమందితో ప్రదర్శనలు ఇవ్వడం నా అదృష్టం. ఇది ఎన్నో జన్మల పుణ్యం.
ప్ర: ఏయే దేశాల్లో ప్రదర్శనలిచ్చారు?
జ: శ్రీలంక, యూరోప్, బెర్లిన్, టర్కీ, ఇస్తాంబుల్, పోలండ్, బల్గేరియా, ఫ్రాంక్‌ఫర్డ్, మారిషస్, సింగపూర్, యుఎస్‌ఏ, ఇలా ఎన్నో విదేశాలకు వెళ్లి ప్రదర్శనలు ఇవ్వడం నాకెంతో తృప్తినిచ్చింది. ప్రతి ప్రదర్శనలో ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. అమెరికాకు ఒకసారి సాప్నా, సెయింట్ అన్నమాచార్య, ప్రాజెక్ట్ ఆఫ్ నార్త్ అమెరికా ఆహ్వానంపై వెళ్లాను. అక్కడ విదేశీ కళాకారులు ఫ్లెమెంకో నృత్యం, మన కూచిపూడికి ఫ్యూజన్ ప్రదర్శనకు మృదంగ సహకారం అందించాను. అది ఒక మధురస్మృతి.
ప్ర: ప్రఖ్యాత డాన్స్ ఫెస్టివల్స్ పాల్గొన్నారా?
జ: కాళిదాస్ సమారోహ్, సూర్య ఫెస్టివల్, ఖజురహో, కోణార్క్, నిషాగంధి, నాట్యాంజలి, సిద్ధేంద్ర యోగి, కళాక్షేత్ర, మారిషస్, విశ్వరూప ఇలా ఎన్నో ప్రఖ్యాత ఫెస్టివల్స్‌లో ప్రదర్శనలిచ్చాను. కొన్ని ఫెస్టివల్స్‌లో మృదంగం, కొన్నిట్లో నట్టువాంగం చేశాను.
ప్ర: ఏయే సంగీత దర్శకులతో కలసి పనిచేశారు?
జ: ఆర్.పి.పట్నాయక్, అనూప్ రూబెన్స్, కళ్యాణ్ మాలిక్, శశిప్రీతమ్‌గారలు. ఇలా ఎన్నో మంది ప్రఖ్యాత సంగీత దర్శకులతో పని చేశాను.
ప్ర: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎప్పటి నుండి పని చేస్తున్నారు?
జ: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్‌లో నృత్యశాఖలో మృదంగ సహకారం చేస్తున్నాను 1995 నుండి. ఎంపిఏ మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థులకు నట్టువాంగం నేర్పిస్తున్నాను. చూస్తూండగానే 23 ఏళ్లు గడిచిపోయాయి.
మృదంగంలో సర్ట్ఫికెట్, డిప్లొమా చేశాను. ఆలిండియా రేడియో, ప్రసారభారతిలో నాకు బి హైగ్రేడ్ ఉంది. సంగీత నాటక అకాడెమీ గ్రహీత డా.అలేఖ్య పుంజాల గారి ఎన్నో ప్రదర్శనలకు నట్టువాంగం చేశాను. కళాకారుడిగా ఎంతో సంతోషం, తృప్తినిచ్చిన మధురస్మృతులు అవి.
ప్ర: మిమ్మల్ని ప్రోత్సహించినవారెవరు?
జ: అమ్మానాన్న. అమ్మమ్మ తాతయ్య. నాపై కారైకూడి మణిగారి ప్రభావం ఎంతో ఉంది. నేను వారి ఏకలవ్య శిష్యుడిని. నేను మృదంగం వాయించడంలో వారి బాణీ అనుసరిస్తాను. డా.అలేఖ్య పుంజాల గారు ననె్నంతో ప్రోత్సహించారు. దాదాపు 15 ఏళ్ల క్రితం మృదంగం నుండి దూరమయ్యాను. అప్పుడు ఒక తల్లిలా నన్ను పిలిచి, మాట్లాడి మళ్లీ కళలకు దగ్గర అయ్యేలా చేశారు అలేఖ్యగారు. ఆవిడ నన్ను తమ్ముడిలా చూసుకుంటారు.
ప్ర: మీ ప్రాక్టీస్ ఎలా సాగేది?
జ: చిన్నప్పుడు తాతగారు పొద్దునే్న నాలుగు గంటలకు నిద్ర లేపేవాళ్లు. ఏడు గంటల దాకా ప్రాక్టీస్. అనురాధ పిన్ని ఫ్లూట్ వాయించేవారు. ఆవిడతో కూడా ప్రాక్టీస్ చేసేవాళ్లం. మళ్లీ స్కూల్ అయిపోయి హోంవర్క్ అయ్యాక రాత్రి 7.30 నుండి 9 దాకా అభ్యాసం. మా తాతగారే నా గురువు.
ప్ర: నృత్య ప్రదర్శనలకి మృదంగం వాయించడం ఎప్పుడు మొదలుపెట్టారు?
జ: మా బావగారు ప్రఖ్యాత మృదంగ విద్వాంసుడు నాగేశ్వరరావుగారు. ఆయన డా.కె.ఉమారామారావు గారి వద్ద మృదంగం వాయించేవారు. నేను కూడా వెళ్లి ఘటం వాయించేవాడిని. తరువాత నేను కూడా నృత్య ప్రదర్శనలకు మృదంగం వాయించడం మొదలుపెట్టాను. పద్మశ్రీ ఆనంద శంకర్ జయంత్‌గారికి, రాజేశ్వరి సాయినాథ్ గారికి ఇలా ఎంతోమంది ప్రఖ్యాత నర్తకుల ప్రదర్శనలకు మృదంగం వాయించాను. ఇప్పుడు డా.అలేఖ్య పుంజాల గారి నృత్య ప్రదర్శనలకు చేస్తున్నాను. ఆవిడ ప్రదర్శనలకు నట్టువాంగం కూడా చాలాసార్లు చేశాను.
ప్ర: కళాకారులకి మీరిచ్చే సందేశం?
జ: విద్య నేర్చుకోవాలి, అభ్యాసం చేయాలి. ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత పైకి వస్తాం. ఇందులో షార్ట్‌కట్స్ లేవు. ప్రతిభ, వ్యుత్పత్తి, సృజన మీద ఆధారపడాలి. కళ ఎన్నో జన్మల పుణ్యం వల్ల వస్తుంది. ఆ కళను బాధ్యతగా కాపాడుకోవాలి.