S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆత్మవిశ్వాసానికి ఆలంబన.. యోగ

యుజ్యతేతదితి యోగః
యుజ్యతే అనేన ఇతి యోగః
యోగమనగా ఇంద్రియములను వశపరచుకుని, మనసుని పరమాత్మయందు లయం చేయటమే..
సృష్టికర్త మనిషికి రూపునిచ్చాడు. మనిషి నిత్యానందుడు, ప్రేమస్వరూపుడు, ఏకాగ్రచిత్తుడు. అతని సంతోషానికి, నవ్వుకు కారణాలు అక్కర్లేదు. మనసారా నవ్వగల, ఆనందించగల ఏకైక ప్రాణి మనిషి మాత్రమే.. అలాంటి మనిషి కాస్తా నేడు అకారణ దుఃఖానికి ఆలంబన అయ్యాడు. సాటి మనిషిని మానవత్వంతో ప్రేమగా పలకరించే మనిషి కాస్తా అహం కోరల్లో చిక్కుకుపోయాడు. ఏకాగ్రచిత్తుడిగా ఉంటూ ఒక లక్ష్యాన్ని ఎంచుకుని ఆ లక్ష్యం వైపే అకుంఠిత దీక్షతో సాగే మనిషి మనసు కాస్తా మసకబారిపోయింది. లక్ష్యం ఒకచోట, ఆలోచన ఒకచోట అన్నట్లుగా అయిపోయింది అతని జీవన గమనం. వీటన్నింటికీ కారణం మనసే.. ఆధునిక జీవనశైలిలో మనిషి మనసు చేతిలో మరబొమ్మైపోయాడు. అది ఆడించినట్లల్లా ఆడుతున్నాడు. మనిషికి అందరూ ఉంటారు. కానీ మనసారా మాట్లాడుకోవడానికి ఒక్కరు కూడా దగ్గరగా లేని పరిస్థితి. అందరితో నవ్వుతూ మాట్లాడతాడు.. కానీ మనసులో వారిని చూస్తూ ఏడుస్తుంటాడు. ఎదుటివారికి ఏదైనా కష్టం వస్తే బయటికి బాధపడతాడు.. కానీ లోలోపల ఆనందంతో గెంతులేస్తూంటాడు. ఇలా ఇరవై నాలుగు గంటలూ మనసుకీ, ముఖానికి ముసుగు తొడుక్కుని జీవిస్తున్నాడు నేటితరం మనిషి. మనసుకి మకిలి పట్టింది. ఆత్మ అహం, అజ్ఞానపు పొరల్లో బందీ అయిపోయింది. ఇక శరీరం గురించి చెప్పనవసరం లేదు. మనిషి రోగాల్ని సృష్టించుకున్నాడు. ఆధునిక జీవనశైలిలో కాలంతో వేగంగా పరుగులు పెడుతూ అల్పాయువును, అనారోగ్యాన్ని కోరితెచ్చుకుంటున్నాడు. మనిషి స్వతహాగా పరిపూర్ణ ఆరోగ్యవంతుడు. అతనిలో బలమైన రోగనిరోధక వ్యవస్థ ఉంది. కానీ అది కూడా తన మీదే దాడిచేసే స్థితికి చేరుకున్నాడు మనిషి. ఇవన్నీ జీవనశైలి రుగ్మతలే..
యోగాయుధంతో ఒంట్లో ఉన్న రోగాలన్నింటినీ తరిమేయవచ్చు. ఎందుకంటే యోగాలో అంతర్లీనంగా వైద్యం ఉంది. యోగా జీవనవిధానంలో భాగమైతే చిన్నా చితకా అనారోగ్యాలు కూడా దరిచేరవు. యోగా రోగనిరోధకశక్తిని పెంచుతుందని యూనివర్శిటీ ఆఫ్ మియామీలోని టచ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో వెల్లడైంది. వెనె్నముక సమస్యలకు యోగాలో మంచి పరిష్కారాలున్నాయని బెంగళూరులోని వివేకానంద యోగా విశ్వవిద్యాలయం నిరూపించింది. అధిక రక్తపోటుతో బాధపడేవారు యోగాను ఆశ్రయించి చక్కని ఫలితాన్ని పొందారని యేల్ యూనివర్శిటీ నిపుణులు అంటున్నారు. ఊబకాయాన్ని నియంత్రించడంలో యోగాకు తిరుగులేదని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. కేన్సర్, గుండె, కాలేయ, థైరాయిడ్, మధుమేహం, ఆర్థరైటిస్ సమస్యలకు కూడా యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని పరిశోధకులు ప్రయోగపూర్వకంగా నిరూపిస్తున్నారు. యోగ సాధకుల్లో డీఎన్‌ఏ చాలా చైతన్యస్థితిలో ఉంటుందనీ, కణాలు ఆరోగ్యంగా ఉంటాయని దిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ గుర్తించింది. అందుకే నేటి వైద్యులు రోగులకు మందులతో పాటు యోగాను కూడా చేయమని చెబుతున్నారు. యోగా చేయడం వల్ల ఒంట్లోంచి ఒక్కో రుగ్మతా తొలగిపోతూ, వ్యాధి ప్రభావం క్రమంగా తగ్గుతూ పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా తయారవుతాడు మనిషి. ఆత్మవిశ్వాసం, జీవనకాంక్ష పెరుగుతుంది. ప్రతి ఆలోచన, ప్రతి నిర్ణయంలో ఆశావాదం, సానుకూల దృక్పథాలు ఉంటాయి.
యోగ అంటే..
మనిషిని అత్యున్నత స్థితికి చేరవేసే సంపూర్ణ పరిజ్ఞానమే యోగ. యుజ్ అనగా కలయిక అనే సంస్కృత ధాతువు నుండి యోగ లేదా యోగము అనే పదం ఉత్పన్నమైంది. యోగా అంటే ఐక్యం అని అర్థం. ఐక్యం అనే పదానికి చాలా నానార్థాలు ఉన్నాయి. మనసుని శరీరంతో మిళితం చేసి చివరకు ఆత్మకు చేరువ చేయడమే యోగ. ధ్యానం వంటి పద్ధతులు, సాంఘిక విధుల ద్వారా అహాన్ని దూరం చేసుకునే ప్రాచీన, ఆధ్యాత్మిక పద్ధతులే యోగ.
పురాతన భారతీయ సంప్రదాయ అపూర్వ నిధి యోగ. 5000 సంవత్సరాల క్రితం నుంచే భారతీయులు అభ్యసిస్తున్న యోగ మనస్సు, శరీర ఏకత్వాన్ని ఉద్ఘాటిస్తుంది. మానవ శ్రేయస్సుకు, ఆరోగ్యానికి ఇది పరమ పవిత్రమైన మార్గం. యోగ వ్యాయామం కాదు. మనుషులు తమను తాము తెలుసుకోవడానికి సహాయపడే జీవన మార్గం. హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయంలో భాగమైన యోగాన్ని శాస్ర్తియంగా క్రోడీకరించిన ఆద్యుడు పతంజలి. క్రీస్తు పూర్వం 100వ శకము, 500వ శకము మధ్య కాలంలో ఈ రచన జరిగినట్లు పరిశోధకులు నమ్ముతున్నారు. ఉపనిషత్తులు, భగవద్గీతలో కూడా యోగ ప్రస్తావన ఉంది. పతంజలి వీటిని పతంజలి యోగసూత్రాలుగా క్రోడీకరించి ప్రపంచానికి అందించారు. సూత్రం అంటే దారం అని అర్థం. దారంలో మణులను చేర్చినట్లు యోగశాస్త్రాన్ని పతంజలి ఒకచోట చేర్చాడు. హఠయోగ ప్రదీపిక, శివసంహిత దీనిలో ప్రధాన భాగాలు. అంతర్భాగాలైన కర్మయోగము, జ్ఞానయోగము, రాజయోగము, భక్తియోగము వంటివి హిందూతత్త్వంలో భాగాలు. పతంజలి యోగసూత్రాల ప్రకారం యోగం అంటే చిత్త వృత్తి నిరోధం. స్థిరంగా ఉండి సుఖాన్నిచ్చేదే ఆసనం. అభ్యాస వైరాగ్యాల వల్ల చిత్తవృత్తులను నిరోధించడం సాధ్యమవుతుంది. ఇలా సాధించే ప్రక్రియను పతంజలి ‘అష్టాంగ యోగం’ అంటారు. దీనినే రాజయోగం అంటారు. అయితే పతంజలి మాత్రం రాజయోగం అన్న పదాన్ని వాడలేదు.
భారతదేశంలో వివిధ శాఖలకు చెందిన జ్ఞానులు యోగాసనాలను సాధన చేసి యోగ వల్ల కలిగే ప్రయోజనాలు, వాటి ప్రాముఖ్యతల గురించి ప్రచారం చేశారు. కానీ వీరు ఆవిష్కరించిన సాధనలు, ప్రచారం గురించి ఎక్కడా పొందుపరచలేదు. ఇవి వారి శిష్యుల ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చాయి. మొదటిసారి పొందుపరిచిన లెక్కల ప్రకారం సేజ్ అనే పతంజలి శిష్యుడికి ఈ ఘనత దక్కింది. ఇతడు యోగ గురించిన కొన్ని సూత్రాలను వాటి తత్త్వాలను రచించి, నిపుణుల ద్వారా ప్రచారంలోకి తీసుకువచ్చాడు. యోగ విద్యను చాలామంది చెబుతూ ఉంటారు. కానీ పతంజలి శిష్యులు రచించిన ప్రాథమిక సూత్రాల ద్వారా మాత్రమే యోగాసనాలను అనుసరిస్తున్నారు. బౌద్ధమతం, జైనమతం, శైవమతాలతో పాటుగా యోగ కూడా ఒక సంప దాయ పద్ధతి.
ప్రాణాయామం
పూర్వం యోగాచార్యులు శ్వాసగతిని అనుసరించి మనిషి ఎనే్నళ్ళు బతుకుతాడన్నది చెప్పేవారు. ఎందుకంటే శ్వాసగతికీ, మానసిక స్థితికీ సంబంధం ఉంది. హాయిగా, ప్రశాంతంగా ఉన్నప్పుడు శ్వాస తగ్గుతుంది. కోపంలో ఉన్నప్పుడు, అసహనంతో ఊగిపోతున్నప్పుడూ శ్వాస పెరుగుతుంది. నేటి ‘స్పీడు యుగం’లో కోపతాపాలకు కొదవేముంది? దాంతో శ్వాస పెరుగుతూ పోతుంది. ఫలితంగా ఆయువు తరుగుతోంది. ఉరుకులు, పరుగులు లేని రోజుల్లో మనిషి నిముషానికి పది నుండి పనె్నండుసార్లు మాత్రమే శ్వాసించేవాడని, అదే అసలైన శ్వాస అని చెబుతారు యోగాచార్యులు. ఆధునిక జీవనశైలిలో ఒత్తిళ్ళతో, అభద్రతలతో మానవుని శ్వాస నిముషానికి ఇరవై దాటుతోంది. అంటే ఇప్పుడు మనిషి శ్వాసిస్తున్న పద్ధతి కూడా అసలైనది కాదు! మరి నిముషానికి పది నుండి పనె్నండుసార్లు మనిషి శ్వాసించాలంటే శ్వాసను నియంత్రణలోకి తెచ్చుకోవాలి. ఇందుకు సహకరించేదే ప్రాణాయామం. ప్రాణం అంటే శ్వాస కాదు. శ్వాసను తీసుకునేట్టు చేసే ఓ శక్తి. ఒక నాసికారంధ్రం నుంచి తీసుకున్న గాలిని, కాసేపు బిగించి తరువాత మరో నాసికా రంధ్రం నుంచి నిదానంగా వదిలాలి. ఇది ఓ నిష్పత్తి ప్రకారం జరగాలి. ఇదే ప్రాణాయామం. ఇలా ప్రాణాయామంలో శ్వాసమీదా, శ్వాసలోని గాలి మీదా నియంత్రణ సాధిస్తే ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని నూటికి నూరుశాతం ఉపయోగించుకుంటాం. అప్పుడు శ్వాస మనిషి ఆధీనంలో వచ్చేస్తుంది. ఫలితంగా వందేళ్ళ జీవితం కూడా సొంతమవుతుంది.
ధ్యానం
ధ్యానం మనసుకు అభ్యంగన స్నానం వంటిది. ధ్యానంలో మనిషి ఎటువంటి ఆలోచనా చేయలేడు. ధ్యానంలో ఏర్పడే నిశ్చల స్థితి మహా శక్తివంతమైనది. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలోని మానసికశాస్త్ర విభాగం- నెలలు నిండుతున్న గర్భిణులతో యోగా, ధ్యాన సాధన చేయించింది. కొద్ది రోజుల తర్వాత పరిశీలిస్తే యోగసాధన చేయని మహిళల్లో ఒత్తిడి ఎక్కువగా, యోగా, ధ్యానం చేసిన మహిళల్లో ఒత్తిడి తక్కువగా కనిపించింది. సుఖప సవాలు కూడా ధ్యానం చేసినవారికే జరిగాయి. ధూమపానం, మత్తుమందు, మద్యం వంటి వ్యసనాలకు బానిసైన వారిని బయటకు తీసుకురావడానికి యోగశక్తిని మార్గంగా ఎంచుకుంటున్నారు మానసిక నిపుణులు. ఎందుకంటే మెదడుకు తనను తాను మార్చుకునే గుణం ఉంది. ధ్యానం సానుకూలమైన మార్పుకు సంబంధించిన సంకేతాల్ని మెదడుకు పంపుతుంది. కాబట్టే ధ్యానాన్ని జీవితంలో ఓ భాగం చేసుకున్నవారిలో కష్టసమయంలో కూడా ఒత్తిడి లక్షణాలు కానీ, డిప్రెషన్ లక్షణాలు కానీ కనిపించవు. ఎప్పుడూ ఆశావాదంలోనే ఉంటారు.
యోగా చికిత్స
ఆధునిక జీవనశైలిలో ఒత్తిడులన్నీ మనిషి ఆరోగాన్ని కుదేలు చేస్తున్నాయి. శరీరం రోగాలపుట్టగా మారితే, మనసు కూడా భయాలు, బాధలతో నలిగిపోతుంది. ఇలాంటి సమయంలో మనిషికి వికాసం, ఎదుగుదల అనేది అసాధ్యం. అందుకే పతంజలి మహర్షి.. శారీరక ఆరోగ్యానికి యోగాసనాల్ని, మానసిక ఆరోగ్యానికి ప్రాణాయామం, ధ్యానాన్ని అందించారు. యోగాసనాల్లోని ప్రతి ఆసనం పరిపూర్ణ ఆరోగ్యానికి సహకరించేదే. అలాగే శరీరంలోని ఏదో ఓ జాడ్యాన్ని లక్ష్యంగా చేసుకుని నాశనం చేసేదే.. అందుకే కొంతమంది యోగాచార్యులు వ్యాధిని అనుసరించి ఆసనాలు చెబుతూ వ్యాధులను తరిమికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. డాక్టర్లు కూడా తమ దగ్గరికి వచ్చే రోగులకు మందులు ఇస్తూ ప్రత్యామ్నాయంగా యోగా కూడా చేయమని చెబుతున్నారు. పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకుంటూ, కంటి నిండా నిద్రపోతూ, రోజూ ఉదయం భుజంగాసనం, ఉష్ట్రాసనం, ధనురాసనం, సూర్యనమస్కారాలు క్రమం తప్పకుండా చేస్తే అలసట తీరిపోయి శరీరానికి కొత్త ఉత్సాహం వస్తుంది. యోగా, ధ్యానం, ప్రాణాయామం చేయడం వల్ల దీర్ఘకాలంలో మనిషి మానసిక స్థితిలో, ఆలోచనల్లో సానుకూలమైన మార్పు కలుగుతుంది. అహంకారం అడుగంటి మనిషిలో దయాగుణం వికసిస్తుంది. జయాపజయాలను, ఆనందం, దుఃఖాలను సమానంగా స్వీకరించగల స్థితప్రజ్ఞత ఏర్పడుతుంది. ఈ సద్గుణాలన్నీ మనిషిలో ముందునుంచీ ఉన్నవే.. కానీ పరిస్థితులు, పరిసరాలను అనుసరించి కాలక్రమేణా మరుగునపడ్డాయి అంతే.. యోగా, ధ్యానం, ప్రాణాయామాలు ఆ గుణాలను తట్టిలేపి పునరుత్తేజాన్ని కలిగిస్తాయి. ఫలితంగా మనిషి మానవత్వం పరిమళించే మంచి మనిషిలా మారిపోతాడు.
*

-ఎస్.ఎన్.ఉమామహేశ్వరి