S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎల్లలు లేని చదువుల లోకం

సమాజాన్ని అర్ధం చేసుకుంటూ అనునిత్యం సమాజంతో ప్రయాణించేవాడే నేటి పోటీ ప్రపంచంలో నిలవగలుగుతాడు. అలా నిలవాలంటే ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. జ్ఞాన సంపన్నులు కావాలి, ఆధునిక శాస్త్ర, సాంకేతికతతో పాటు విషయానుగతమైన పరిజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం ఉండాలి. గురుకుల విద్య కాలంలో చదువుకు, ఆధునిక సమాజంలో చదువుకు అర్ధం మారుతూ వస్తోంది. నేటి తరంలో చదువు అంటే ఎక్కువగా ఉపాధి, ఉద్యోగాలను సమకూర్చేదిగానే చూస్తున్నాం.
చదువు అంటే ఏమిటి ? స్థూలంగా చెప్పాలంటే తనను తాను సమీక్షించుకుంటూ అర్ధం చేసుకోవడంతో పాటు ఇతరులను అర్ధం చేసుకోవడం, ఇంకా విస్తృతంగా చెప్పాలంటే పాజిటివ్ దృక్పథాన్ని, జ్ఞానాన్ని పెంచుకోవడం, తనలో ఉన్న అంతర్ జ్ఞానాన్ని వెలికితీయడం, తను బతుకుతూ సమజాన్ని బతికించడం, జ్ఞానాన్ని ఇతరులకు అందించడం.
ఈ విషయంలో శతాబ్దాలకు పూర్వమే భారతదేశం ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచింది. కళలు- సంస్కృతి- వారసత్వ సంపదకు కేంద్రంగా, తక్షశిల, నలంద వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలకు నెలవుగా ఉన్న భారతదేశానికి ఇతర ప్రాంతాల నుండి వచ్చి విద్యను అభ్యసించేవారు. కాని నేడు భారత్ నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉన్నత ప్రమాణాలున్న విద్యను అభ్యసించేందుకు పోటీ పడుతున్నారు.
విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం భారతీయ విద్యార్ధులు 86 దేశాల్లో చదువుకుంటున్నారు. ఎంత మంది చదువులకు వెళ్తున్నారనే నిర్ధిష్టమైన సమాచారం ప్రభుత్వం వద్ద లేకున్నా తాజా అంచనాల ప్రకారం ఆరు లక్షల మంది విదేశాల్లో చదువుతున్నారు.
36 ఆసియా దేశాల్లో , 32 ఐరోపా దేశాల్లో, 8 ఆఫ్రికా దేశాల్లో, ఆరు దక్షిణ అమెరికా రాష్ట్రాల్లో, రెండు ఉత్తర అమెరికా రాష్ట్రాల్లో ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థుల ఉనికి ఉంది.
అయితే మొత్తంగా చూసుకుంటే దాదాపు సగం మంది విద్యార్ధులు ఉత్తర అమెరికాపైనే దృష్టిసారించారు.
విదేశాల్లోనే ఎందుకు?
ప్రపంచంలో ఎంపిక చేసిన వెయ్యి విశ్వవిద్యాలయాలను తీసుకుంటే భారతీయ వర్శిటీలు ఎక్కడో 800 స్థానం నుండి వెయ్యి మధ్య ఉంటున్నాయి. ఆక్స్‌ఫర్డు, కేంబ్రిడ్జి, కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్టాన్‌ఫోర్డు, మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మాదిరి భారతీయ ఉన్నత విద్యా సంస్థలు ఎదగలేకపోతున్నాయి. దేశంలో 38 వేల కాలేజీలు, 850 విశ్వవిద్యాలయాలున్నాయి. అయినా అత్యున్నత ప్రమాణాలతో అందించే సంస్థలు వేళ్లమీద లెక్కపెట్టవచ్చు.
ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన విద్యాలయాల్లో నిత్యనూతన బోధన అభ్యసన ప్రక్రియతోపాటు మంచి కౌశలాలు, ప్రముఖ సంస్థలు, వ్యక్తులతో నెట్‌వర్కు వస్తుంది. అన్నింటికీ మించి విద్యా ప్రమాణాలు, వౌలిక సదుపాయాలు ఉంటాయి. తరగతి గది చదువులకే పరిమితం కాకుండా ప్రాయోగిక అభ్యసనకు వీలుంటుంది. భిన్న సంస్కృతుల మేళవింపుతో విశాల దృక్పథాన్ని పెంచుకోవచ్చు. వీలైతే ఒక పక్క చదువుకుంటూ మరో పక్క సంపాదించుకోవచ్చు. ఒంటరిగా ఉండాల్సి రావడం, మిగిలిన వారితో మమేకం కావల్సి ఉండటంతో బాధ్యతాయుతంగా వ్యవహరించడం అలవడుతుంది.
లక్షలు వెచ్చించి సాధారణ యూనివర్శిటీల్లో చదువు ఎందుకూ కొరగాకుండా పోయే బదులు మంచి రేటింగ్ ఉన్న సంస్థల్లో చదువుకుని జీవితంలో బాగుపడాలనే యోచనే విదేశీ విద్యకు కారణం అవుతోంది.
భారత్‌లో ఐఐటిలు, ఐఐఎస్‌లు, ఓ 10 విశ్వవిద్యాలయాలు మినహా దేశంలోని 850 విశ్వవిద్యాలయాపై అంచనాలు అంత అనుకూలంగా మాత్రం లేవు. తేజ్‌పూర్ యూనివర్శిటీ, జాదవ్‌పూర్ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీ, అలిఘర్ ముస్లిం యూనివర్శిటీ, తెలుగు రాష్ట్రాలకు వస్తే ఉస్మానియా యూనివర్శిటీ, శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ, ఆంధ్రా యూనివర్శిటీలు మినహా మిగిలినవి రేటింగ్‌లో దరిదాపుల్లో లేవు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ రేటింగ్స్ సంస్థ, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ రేంకింగ్స్, షంగై జియావో టంగ్ యూనివర్శిటీ రేటింగ్స్ సంస్థలు ఇచ్చిన రేటింగ్స్‌లో మూడు అంశాలు సుస్పష్టం. అవి ఐఐటిలు, ఐఐఎస్‌లు మినహా మిగిలిన సంస్థలు అన్నీ ఎక్కడో జాబితా చివరిలో ఉన్నాయి. కనుకనే వ్యయం ఎక్కువైనా విదేశాలు వెళ్లి చదువుకోవాలనే ఆకాంక్ష అందరిలో ఎక్కువైంది.
అనుకుంటే అయిపోతుందా?
భారతదేశంలో యుజి, పీజీ చదివి తర్వాత పరిశోధనలకు విదేశాలకు వెళ్లేవారు, తర్వాతర్వాత మెడిసిన్ , ఇంజనీరింగ్ పీజీ కోర్సులకు వెళ్లేవారు నేడు అండర్ గ్రాడ్యూయేషన్‌కే కాదు, సెకండరీ ఎడ్యుకేషన్‌కు కూడా విదేశాలకు వెళ్తున్నారు.
విద్యార్థి ఆసక్తి, అనురక్తి, భవిష్యత్ ప్రణాళికపై స్పష్టత ఉన్నపుడు తాను ఏం చదువుకోవాలో అర్ధం అవుతుంది, అపుడు ఎక్కడ ఏ విద్యాసంస్థలో చదువుకోవాలనే అనే్వషణ మొదలవుతుంది. ఇందుకోసం కనీస పరిజ్ఞానం, అవగాహన కూడా చాలా అవసరం. ఈ విషయంలో అశ్రద్ధ వహిస్తే ఏదో ఒక దశలో తడబడి ఇబ్బందులపాలు కావల్సి వస్తుంది. కొన్ని మార్లు విమానాశ్రయం నుండే స్వదేశానికి తిరిగి రావల్సి ఉంటుంది.
అందుకే ముందుగా ఏ కోర్సులో చేరాలి? ఏ యూనివర్శిటీలో చేరాలి? అందుకు ఏ దేశం వెళ్లాలి? ఆ దేశానికి ఉన్న వీసా నిబంధనలు ఏమిటి? ఫీజులు ఎలా ఉంటాయి? అక్కడ చేరాలంటే అడ్మిషన్ల ప్రక్రియ ఏమిటి? అక్కడి సాంఘిక కట్టుబాట్లు, సామాజిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, రవాణా సౌకర్యం తదితర విషయాలను ఆలోచించుకోవాలి.
విదేశాల్లో చదువుకునేందుకు యూజీ కోర్సుకు పోతున్నామా? పీజీ చదువులకా? పరిశోధన స్థాయిలో పోతున్నామా అనే మీమాంసను అధిగమించి స్పెషలైజేషన్ గురించి ఆలోచించుకోవాలి. అక్కడ ఆయా డిగ్రీల కాలవ్యవధి, ఫీజులు, ఉండడానికి అయ్యే ఖర్చు, అనుబంధ వ్యయం, రవాణా ఖర్చులు, ఇతర ప్రాసెస్‌కు అయ్యే ఖర్చులు లెక్కలు వేసుకోవాలి. ఇంత ఖర్చు మనం చేయగలమా? చేస్తే దాని నుండి వచ్చే ప్రయోజనం ఏమిటి? కొంత మంది తమ వ్యక్తిత్వ వికాసానికి , మరికొంత మంది జ్ఞాన సముపార్జనకు, ఇంకొంత మంది ఉపాధికి ఇలా ఒకొక్కరి ఆలోచన ఒక్కోలా ఉంటుంది , ఈ ప్రయత్నాలూ, ఖర్చు అందుకు దోహదం చేస్తాయా? చదువుపూర్తయిన తర్వాత ఆయా దేశాల్లోనే ఉపాధి లేదా స్వయం ఉపాధి, ఉద్యోగం చేసే ఆలోచనలో ఉన్నారా అక్కడ నుండి వెనక్కు రావాలని భావిస్తున్నారా , వెనక్కు వస్తే అందుకు తగ్గ అవకాశాలు భారత్‌లో ఉన్నాయా ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఒక వేళ అక్కడే స్థిరపడాలని భావిస్తే వలస చట్టాలు అనుకూలంగా ఉన్నాయా ? అనేది కూడా ముందే నిర్ణయించుకోవాలి. కొన్ని దేశాలు అత్యున్నత ప్రమాణాలున్న వారికి దేశీయ పౌరసత్వాన్ని కూడా ఇస్తున్నాయి.
ఆయా దేశాల భౌగోళిక స్వరూపం, యూనివర్శిటీ, అది ఉన్న ప్రదేశం, వాతావరణ పరిస్థితులు, జీవన వ్యయం, వర్శిటీ గుర్తింపు, ప్రపంచంలో దాని ర్యాంకింగ్, గతంలో ఎవరైనా తెలిసిన వారు అక్కడ చదివితే వారి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలి, ఇంకా అనుమానాలుంటే అక్కడ డీన్‌కు లేదా అంతర్జాతీయ వ్యవహారాలు చూసే విభాగాధిపతికి ఇ మెయిల్ ద్వారా అనుమానాలు పంపించి వాటి సమాధానాలు పొందవచ్చు.
ఏ దేశాలు అనుకూలం
మన దేశం నుండి అత్యధికంగా యుఎస్‌ఎ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు వెళ్తున్నారు. ఆ తర్వాత స్థానంలో బెహ్రైన్, చైనా, యుకె, జర్మనీ, ఫిలిప్పీన్స్, రష్యా, ఉక్రెయిన్, ఫ్రాన్స్, కర్గిస్థాన్, నేపాల్, ఒమన్, ఇటలీ, సెర్బియా, మంగోలియా, ఉబ్జెకిస్థాన్, బోస్నియాల్లో కూడా చదువుతున్నారు.అయితే వీటిలో తొలి నాలుగు దేశాలు అత్యంత అనుకూలమైనవిగా భారతీయులు భావిస్తుంటారు.
అమెరికాలో ఇటీవల వీసా నిబంధనలు కఠినతరం చేయడంతో విద్యార్థులు ఇపుడు మిగిలిన దేశాలవైపు కూడా దృష్టిసారించారు. ఫ్రాన్స్, నెదర్లాండ్, ఇటలీ, జపాన్ , వెస్టిండీస్‌లలో తక్కువ ఫీజుతో చదువులు పూర్తి చేయవచ్చు. ఫ్రాన్స్ ఉన్నత విద్యకు , పరిశోధనలకు పెట్టింది పేరు. ఆర్కిటెక్చర్, పొలిటికల్ సైన్స్, లా , జర్నలిజం -కమ్యూనికేషన్ , మేనేజిమెంట్ స్టడీస్, టెక్నాలజీ కోర్సులకు వెళ్లవచ్చు. ఇటలీ వౌలిక పరిశోధనలకు పెట్టింది పేరు. డిజైనింగ్, ఆర్కిటెక్చర్, అప్లయిడ్ సైన్స్, ఆర్ట్సుకు ఇటలీ ప్రసిద్ధి. జపాన్ పరిశోధనలకు, సివిల్ ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్‌కు, రోబో టెక్నాలజీ, నానో టెక్నాలజీలకు ప్రసిద్ధి, ఇక నెదర్లాండ్స్ ఎకనామిక్స్, బిజినెస్ మేనేజిమెంట్, సోషల్ సైన్స్‌లకు ప్రసిద్ధి. వెస్టిండీస్ , ఫిలిప్పీన్స్, కర్గిస్థాన్, ఇతర రష్యా దేశాలు వైద్య విద్యకు పేరు. వైద్య విద్యకు ఎంసిఐ ఫారిన్ మెడికల్ గ్రాడ్యూయేషన్ ఎగ్జామ్‌ను తప్పనిసరి చేసింది.
తాజా గణాంకాల ప్రకారం మన విద్యార్ధులు ఆరు లక్షలకు పైగా విదేశీ వర్శిటీల్లో చదువుతున్నారు. యుఎస్‌ఎలోనే 2,06,708 మంది కాగా కెనడాలో లక్ష మంది, ఆస్ట్రేలియాలో 63,283 మంది, న్యూజిలాండ్‌లో 30వేలు, బెహ్రైన్‌లో 27వేలు, చైనాలో 18171 మంది, యుకెలో 14,830 మంది, జర్మనీలో 13740 మంది, ఫిలిప్పీన్స్‌లో 8500 మంది, రష్యాలో 8వేలు, ప్రత్యేకించి ఉక్రెయిన్‌లో 8వేలు, ఫ్రాన్స్‌లో 5వేలు, కర్గిస్థాన్‌లో 4686 మంది, నేపాల్‌లో 3వేల మంది, ఒమన్‌లో 3వేల మంది చదువుతున్నారు. ఇలా ప్రపంచంలో 86దేశాల్లో చదువుతున్నారు. 36 ఆసియా దేశాల్లో, 32 ఐరోపా దేశాల్లో, 8 ఆఫ్రికా దేశాల్లో, ఆరు దక్షిణ అమెరికా రాష్ట్రాల్లో, రెండు ఉత్తర అమెరికారాష్ట్రాల్లో, ఆస్ట్రేలియాలోని రెండు రాష్ట్రాల్లో మన విద్యార్థులు గణనీయంగా ఉన్నారు. 32 ఐరోపా దేశాల్లో 52116 మంది ఉండగా, అమెరికాలోనే 2.06 లక్షల మంది ఉన్నారు. మరో పక్క ఈ మధ్య సింగపూర్, ఐర్లాండ్, యుఎఇ కూడా పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. వివిధ దేశాలు చెప్పే లెక్కలకు,ఈ గణాంకాలకు పొంతన లేకున్నా మొత్తం మీద పెద్ద సంఖ్యలోనే భారతీయ విద్యార్థులు విదేశాలకు ఉన్నత చదువులకు వెళ్తున్నారు.
ఏ కోర్సులకు ..
ఎక్కువగా భారత్ నుండి బిజినెస్ మేనేజిమెంట్ కోర్సులకు వెళ్తున్నారు. తర్వాతి స్థానంలో ఇంజనీరింగ్, మాథ్స్ - కంప్యూటర్ సైన్స్, సోషల్ సైనె్సస్, ఫిజికల్ - లైఫ్ సైనె్సస్ ఉంటున్నాయి. అమెరికాలో 9.74 లక్షల విదేశీ విద్యార్థుల్లో 2 లక్షల మంది బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సులోనే ఉన్నారు.
సన్నద్ధత
ఏ కోర్సులో చేరాలనే స్పష్టత ఉంది కనుక, ఏ దేశం వెళ్లాలో నిర్ణయించుకోవాలి, అక్కడ నాలుగైదు యూనివర్శిటీలను ఎంచుకుని అందులో చేరాలంటే ఏ టెస్టులు రాయాలి? ప్రవేశ విధానం తెలుసుకోవాలి. ఉదాహరణకు అమెరికా పోవాలంటే భారత్‌కు భిన్నంగా అక్కడ ఏడాదిలో మూడు మార్లు అడ్మిషన్లు జరుగుతుంటాయి. స్ప్రింగ్ , ఫాల్, సమ్మర్ పేరుతో ఈ అడ్మిషన్లు జరుగుతాయి. ఫాల్ అడ్మిషన్లు సెప్టెంబర్‌లో , స్ప్రింగ్ అడ్మిషన్లు జనవరిలో , సమ్మర్ అడ్మిషన్లు మేలో జరుగుతాయి. దాదాపుగా అమెరికాలో వర్శిటీల్లో ఫాల్ సీజన్‌లోనే సీట్లు 80 శాతం భర్తీ అవుతాయి. 15 శాతం స్ప్రింగ్ సీజన్‌లో , 5 శాతం సమ్మర్ సీజన్‌లో అడ్మిషన్లు జరుగుతాయి. యుకెలోనూ ఫాల్ సీజన్ అడ్మిషనే్ల ఎక్కువగా జరుగుతాయి. జనవరిలో స్ప్రింగ్ సీజన్ అడ్మిషన్లు కొన్ని వర్శిటీలు చేపడతాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో చాలా వరకూ జూలైలో అడ్మిషన్లు జరుగుతాయి. ఏ దేశంలో ఏ యూనివర్శిటీలో చేరాలన్నా ఆ ప్రక్రియను ఏడాది ముందే ప్రారంభించాలి. చివరి తేదీలను తెలుసుకుని దానికి అనుగుణంగా దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఫాల్ సీజన్‌లో చేరాలంటే డిసెంబర్ 31, స్ప్రింగ్ సీజన్‌లో చేరాలంటే ఆగస్టు 31 గడువు తేదీలుగా ఉంటాయి. అయితే ఈ గడువు ఆయా వర్శిటీల రేటింగ్, ఇతర అంశాలపై మారుతుంది.
ఏ టెస్టులు రాయాలి?
చాలా వరకూ అన్ని దేశాల్లో అడ్మిషన్లకు కొన్ని అంతర్జాతీయ స్థాయి సామర్ధ్య పరీక్షలు రాయాల్సి ఉంటుంది. అందులో టోఫెల్, ఐఈఎల్‌టిఎస్, జిఎటి, జిఆర్‌ఇ, జీ మ్యాట్, పీటీఈ వంటి పరీక్షలున్నాయి. ఇందులో టోఫెల్, ఐఈఎల్‌టిఎస్, పీటీఈలు ఆంగ్లభాషా సామర్ధ్యాన్ని అంచనా వేస్తాయి. జీఆర్‌ఈ, జీ మ్యాట్‌లు అభ్యర్ధికి ఉన్న గణితశాస్త్ర విశే్లషణ సామర్ధ్యాలను , ప్రధానంగా ప్రామాణిక , పరిమాణాత్మక విశే్లషణలను పరీక్షిస్తాయి.
మూడు దశలు
ఏం చదవాలో, ఏ దేశం పోవాలో, ఏ పరీక్షలు రాయాలో, అందుకు అయ్యే ఫీజులు, ఇతర వివరాలపై స్పష్టత వచ్చిన తర్వాత విదేశీ చదువుల ప్రక్రియను మూడు దశలుగా చెప్పవచ్చు.
తొలి దశలో అంతర్జాతీయ సామర్ధ్య పరీక్షలను రాయడం, ప్రముఖుల నుండి రికమెండేషన్ లెటర్సు సిద్ధం చేసుకోవడం, స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పజ్, కాలేజీ ఎస్సే తయారుచేసుకోవడం, ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్, బ్యాంక్‌లోన్ తదితర వ్యవహారాలను చక్కబెట్టుకోవాలి.
రెండో దశలో పరీక్షలకు సన్నద్ధత, హాజరుకావడం, స్కోర్లు సాధించడం, విశ్వవిద్యాలయాలను ఖరారు చేసుకోవడం, మూడో దశలో ఆన్‌లైన్ దరఖాస్తులను నింపడం, ధృవపత్రాలను ఆయా వర్శిటీలకు పంపించడం, అడ్మిషన్‌ను ఖరారు చేసుకోవడం, ఈ దశలో మనం దరఖాస్తు చేసిన వర్శిటీలో ఖచ్చితంగా సీటు రావాలనేదేమీ లేదు కనుక మరో ఐదారు వర్శిటీలకు సైతం దరఖాస్తు చేసుకుని సీటు వచ్చే అవకాశాలను పెంచుకోవాలి. వీటన్నింటికీ నాలుగు నుండి ఆరు నెలల వ్యవధి పడుతుంది. దానికి అనుగుణంగానే సిద్ధం కావాలి.
కొన్ని విశ్వవిద్యాలయాలు దరఖాస్తు ఫీజును తీసుకోవు, కొన్ని వర్శిటీలు మాత్రం 25 డాలర్లు నుండి 150 డాలర్లు వరకూ వసూలు చేస్తాయి. సర్ట్ఫికేట్ల ట్రాన్‌స్క్రిప్ట్స్, లెటర్ ఆఫ్ రికమెండేషన్, స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పజ్, ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్, కొన్ని మార్లు అప్రైజల్ రిపోర్టు అన్నీ మెయిల్ చేయాలి. మనం ఏ యూనివర్శిటీల్లో చేరదలిచామో ఆ సంస్థలకు నేరుగా స్కోర్‌కార్డులను పంపించేలా టెస్టింగ్ ఏజన్సీలకు ముందుగానే సమాచారం ఇవ్వాలి. ఇవన్నీ సక్రమంగా జరిగితే యుఎస్ విషయంలో ఐ-20 ఫారం వస్తుంది. ఇది తీసుకుని వీసా ఇంటర్వ్యూకు హాజరుకావలి. ఐ- 20 షెడ్యూలు ప్రాతిపదికగా విమాన టిక్కెట్లను సిద్ధం చేసుకోవాలి. మరికొన్ని దేశాల్లో భేషరతు ఆమోద లేఖ (కండిషనల్ యాక్సెప్టెన్స్ లెటర్)లో పేర్కొన్నట్టు అవసరమైతే ఒక సెమిస్టర్ ఫీజును కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వర్శిటీ స్టడీ పర్మిట్ వీసాకు దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా లెటర్ ఆఫ్ ఆక్సెప్టెన్సీని పంపుతుంది. అదే ఆస్ట్రేలియాలో అయితే దరఖాస్తు ఫారం, సపోర్టింగ్ పత్రాలతోపాటు అకడమిక్ సర్ట్ఫికేట్లు, పాస్‌పోర్టు , టెస్టింగ్ స్కోర్ కార్డులు, పని అనుభవం, కాపీలను పంపించాల్సి ఉంటుంది. అవి సమీక్షించిన తర్వాత నెల రోజుల్లో అభ్యర్ధులకు ఏ సమాచారాన్నీ పంపిస్తారు.
ఫీజులు
ఏ యూనివర్శిటీల్లోనైనా యుజి ప్రోగ్రాంలకు 55వేల యుఎస్ డాలర్లు, పీజీ ప్రోగ్రాంలకు ఏడాదికి 50వేల నుండి 50 వేల యుఎస్ డాలర్లు ఫీజులుగా చెల్లించాలి. అంతకు సమానంగా మిగిలిన ఖర్చులు ఉంటాయి. యుకె, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో కూడా దాదాపు అంతకు సమానంగానే ఫీజులున్నాయి. అడ్మిషన్ పొందిన వారికి ఆయా వర్శిటీలే చాలా వరకూ ఆర్ధిక సాయం, రుణ సాయం అందించడంతో పాటు కొంత మేరకు స్కాలర్‌షిప్‌లను కూడా ఇస్తాయి.
అసలు కథ మొదలు
అన్నీసిద్ధం చేసుకుని, మంచి స్కోర్ సాధించి, సీటు పొందిన తర్వాత ఇక ఆయా దేశాలకువెళ్లి హాపీగా చదువుకోవడమే అంటే తప్పులో కాలేసినట్టే. అమెరికా వెళ్లే విద్యార్థులకు విమానాశ్రయంలో దిగగానే ఇమిగ్రేషన్ అధికారులు ప్రశ్నిస్తుంటారు. ఏ యూనివర్శిటీలో చేరదల్చుకున్నారు? ఏ కోర్సు? అందులో ఉండే సబ్జెక్టులు ఏమిటి? ఎంతకాలం ? దాని శాఖాధిపతి ఎవరు? యూనివర్శిటీ ఏ ప్రాంతంలో ఉంది? మీరు అక్కడికి నేరుగా వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఫీజులు, ఆర్ధిక స్థాయిత్వం చివరికి స్పెషలైజేషన్‌లో వచ్చే సబ్జెక్టులపై కనీస అవగాహన ఉందా లేదా అన్నది కూడా పరీక్షిస్తుంటారు. ఇవన్నీ అందర్నీ అడగాలనేమీ లేదు. యాదృచ్ఛికంగా కొంత మందిని ప్రశ్నిస్తారు, అందుకు సన్నద్ధంగా ఉండాలి అంతే. ఆత్మవిశ్వాసం లేకున్నా, అపనమ్మకంగా కనిపించినా, డాక్యుమెంట్లు సరిగా లేకున్నా తిరిగి ఇంటికి రావల్సిందే.
*

లాంగ్వేజి టెస్టులు

ఐఇఎల్‌టిఎస్
టోఫెల్
పీటీఈ
ఆప్టిట్యూడ్ టెస్టులు
జి మ్యాట్
ఎల్ శాట్
ఎంకేట్
జిఆర్‌ఇ
ఎసిటి
డిఎటి
యుఎస్‌ఎంఎల్‌ఇ
*
దరఖాస్తులు
యూనివర్శిటీ అప్లికేషన్ ఫారం
స్టాండర్డ్ టెస్టుల స్కోర్
ట్రాన్స్‌స్క్రిప్టులు
స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పజ్(ఎస్‌ఓపి)
లెటర్ ఆఫ్ రికమెండేషన్ (ఎల్‌ఒఆర్)
అడ్మిషన్ ఎస్సే
స్టూడెంట్ సీవీ
స్టూడెంట్ వీసా
ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్
అప్లికేషన్ ఫీజు
*
ఏ కోర్సుకు ఏ దేశం?
జపాన్- ఎఐ, నానో టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఆర్ట్సు, యానిమేషన్, మ్యూజిక్
సింగపూర్-సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, టెక్నాలజీ, మేనేజిమెంట్,
ఆర్ట్సు కెనడా-్ఫరెస్ట్రీ, ఎన్విరాన్‌మెంట్, ఫ్యాషన్ డిజైన్, యానిమేషన్ , గేమింగ్
ఇజ్రాయిల్- అగ్రికల్చర్
యుఎస్‌ఎ-స్టెమ్, బిజినెస్‌మేనేజిమెంట్, లైఫ్‌సైనె్సస్
యుకె-ఇంజనీరింగ్, బిజినెస్ ఎడ్యుకేషన్, లా, ఆర్టు , డిజైన్
ఆస్ట్రేలియా-మేనేజిమెంట్, కామర్స్, ఫుడ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఐటి
న్యూజిలాండ్-ఇంజనీరింగ్, ఐటి, బిజినెస్ స్టడీస్, హెల్త్
జర్మనీ-ఇంజనీరింగ్, మాథ్స్, నేచురల్ సైన్స్, లా, ఎకనామిక్స్, సోషల్ సైన్స్
రష్యా-మెడిసిన్, ఇంజనీరింగ్, హ్యుమనిటీస్
ఫ్రాన్స్-ఇంజనీరింగ్, మేనేజిమెంట్, పొలిటికల్‌సైన్స్
నెదర్లాండ్స్-ఇంజనీరింగ్, మేనేజిమెంట్, మెడిసిన్, పబ్లిక్ హెల్త్, పొలిటికల్ సైన్స్
హాంకాంగ్-ఇంజనీరింగ్, మేనేజిమెంట్, సోషల్ సైనె్సస్
*
విదేశీ విద్య
ఫీజులు ఇలా..
యుజీ-50వేల అమెరికా డాలర్లు
పీజీ-ఏటా 50వేల నుండి 60వేల డాలర్లు
ఇతర ఖర్చులు
ఏటా-10వేల డాలర్లు మొదలు 30వేల డాలర్లు
ఆయా యూనివర్శిటీలే రుణాన్ని సమకూరుస్తున్నాయి
భారత్‌లో కూడా విద్యారుణం తీసుకుని ఫీజు చెల్లించవచ్చు
తెలంగాణ , ఆంధ్రాలో బీసీలకు, ఎస్సీ ఎస్టీలకూ వేర్వేరుగా విదేశీ చదువులకు ప్రత్యేక పథకాలు అమలులో ఉన్నాయి. గతంలో వీటిపై గరిష్ట పరిమితి 10 లక్షలు కాగా, దానిని 20 లక్షలకు పెంచారు. ఎస్సీ, ఎస్టీలకు ఆ పరిమితిని కూడా తొలగించారు.
*
అమెరికా చదువులకు హెల్ప్ డెస్క్
ఫోన్.. 1-800-103-1231
( మధ్యాహ్నం 2 నుండి 5 వరకూ)
వెబ్ పోర్టల్ : యుఎస్‌ఐఈఎఫ్ డాట్ ఆర్గ్ డాట్ ఇన్
వీసా సమాచారం కోసం: యుఎస్ ట్రావెల్ డాక్స్ డాట్ కామ్
డిఎస్-160 ఫారం నింపేందుకు :
సిఇఎసి డాట్ స్టేట్ డాట్ జీవోవీ డాట్ జిఇఎన్‌ఎన్‌ఐవి
*
ప్రసిద్ధ వర్శిటీలు
ప్రపంచంలో టాప్-10
యుఎస్- కాలిఫోర్నియా, హార్వర్డు, ఎంఐటి, సౌత్ ఇల్లినాయిస్, స్టాన్‌ఫోర్డు యూనివర్శిటీ , యూనివర్శిటీ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియా, పుర్దూ యూనివర్శిటీ, కొలంబియా యూనివర్శిటీ, పెన్సిల్వెనియా యూనివర్శిటీ, బెర్కిలీ యూనివర్శిటీ, టెక్సాస్ ఆస్టిన్ యూనివర్శిటీ
యుకె- కేంబ్రిడ్జి యూనివర్శిటీ, యూనివర్శిటీ కాలేజీ ఆఫ్ లండన్, సాల్‌ఫోర్డు, గ్లాస్గో, బర్మింగం, ఆక్స్‌ఫర్డు, నాటింగం యూనివర్శిటీ,
ఆస్ట్రేలియా-ఆడిలైడ్, క్వీన్‌లాండ్ వర్శిటీ, సిడ్నీ వర్శిటీ, చార్లెస్ డార్విన్ యూనివర్శిటీ, కాన్‌బెర్రా యూనివర్శిటీ
జర్మనీ-యూనివర్శిటీ ఆఫ్ బేరత్, టెక్నికల్ యూనివర్శిటీ ఆఫ్ బెర్లిన్, బ్రాన్స్‌విగ్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ, టెక్నికల్ యూనివర్శిటీ ఆఫ్ మ్యూనిచ్, డ్రెస్‌డెన్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ
కెనడా- యూనివర్శిటీ ఆఫ్ టొరంటో, యూనివర్శిటీ ఆఫ్ అటావో, అల్బెర్టా యూనివర్శిటీ, విండ్‌సర్ యూనివర్శిటీ, వెస్టర్న్ యూనివర్శిటీ ఆఫ్ కెనడా, యార్క్ యూనివర్శిటీ

- బీవీ ప్రసాద్