S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వంగ (బంగ) సిన్మాలు

శ్యాంబజార్ నుంచి బొన్‌హుగ్లీ వెళ్లాలంటే బస్‌లో పోవచ్చు. బొన్‌హుగ్లీకి వెళ్లాలంటే డన్‌లప్ వెళ్లే బస్ ఎక్కాలి. అక్కడ నుంచి మరింత ముందుకు సాగితే, దక్షిణేశ్వర్, బేలూర్ రామకృష్ణ మఠం వస్తాయి. అయితే మనం అంతదాకా వెళ్లడం లేదు. బొన్‌హుగ్లీ కూడా రాకముందే ఒక స్టాప్ వస్తుంది. బస్ ఎక్కిన వాళ్లు కొందరు ‘ఒనొన్నొ’ అని చప్పుడు చేయడం విన్నాను. ఈ ఒక స్టాప్ వచ్చినప్పుడు స్కంధాక్షరుడు లేదా కండక్టర్ కూడా ‘ఒనొన్నొ’ అన్నాడు. బయటకు చూడాలంటే ఆ రద్దీలో కుదరలేదు. ఒకనాడు సీటు దొరికింది. ఆ వేళ ఒనొన్నొ వెనుక రహస్యం తెలిసింది. అది ఒక సినిమా హాలు. దాని పేరు అనన్య!
నాకు సైన్స్ రచయిత అని పేరు. ఈ మధ్యన కవిత, కథ, వ్యక్తిత్వ వికాసం, కాకరకాయల గురించి కూడా రాస్తాడు అనిపించుకున్నాను. సినిమా వాళ్లను గురించి రాస్తే పుస్తకాలు బాగా పోతాయి (అమ్ముడు) అని ఎవరో సలహా ఇచ్చారు. నాకు అంత సులభంగా అమ్ముడు పోవాలని అనిపించలేదు. రాస్తే గీస్తే, అందరికన్నా ముందు షొత్తొజిత్ రే గురించి రాస్తాను. ఆయన హర్‌ఫన్ వౌలా (నా వ్యాసానికి శీర్షిక వౌలా అని వేశారు) సకల కళా పారంగతుడు. కవయిత్రి గనుక మీనాకుమారి గురించి రాస్తాను. సున్ మేరే బంధూరే సచిన్‌దా గురించి రాస్తాను. కాదు, అన్నిటికన్నా ముందు సినిమా టెక్నాలజీ పుట్టుక, పెరుగుదల గురించి రాయండి అంటారు మా మాటూరి సూరిబాబు. అది ఎప్పుడో జరుగుతుంది. ఇప్పుడు మాత్రం అనన్య గురించి!
అనన్య అన్నది ఎంత మంచి పేరు. మరొకరు కాదు, అని అర్థం! నాకు తెలిసి భారతీయ సినీ వినీలాకాశంలో షొత్తొజిత్ అను సత్యజిత్ అనన్య సామాన్యుడు. ఆయన సినిమాలు అర్థం అయినా, కాకున్నా చాలా చూచి, మళ్లీ చూచి, మళ్లీ చూచే ప్రయత్నంలో ఉన్నాను. బెంగాలీ సినిమాలు అంటే చీకటి చీకటిగా ఉంటాయి. హీరో ఇంటికి వెళ్లాడు అంటే, వెళ్లినంత సేపూ చూపిస్తారు. చివరికి సినిమాకు అవార్డు వస్తుంది, అన్నారు మా ఆచార్లు గారు ఒకప్పుడు. సత్యజిత్ రే సినిమాలు అట్లా చీకటిగా ఉన్నాయా? ఉండే ఉంటాయి. షత్రంజ్ కే ఖిలాడీ అన్నది ఆయన తీసినదే గానీ హిందీ సినిమా. నాకది ఎంత నచ్చిందో, ఎంత నచ్చిందో, అంత నచ్చింది. రే మీద అభిమానం ఆరంతలు పెరిగింది.
అపూ చిత్రత్రయం చూచానా? అపూర్ సంసార్ మాత్రం చాలా బాగుంది. అందులో షర్మిలా టాగూర్ ఎంత బాగుంటుందో? ఆ సినిమా అంతకన్నా బాగుంటుంది. ఎక్కడ చూచిందీ గుర్తులేదు గానీ ‘గణశత్రు’ అని ఒక సినిమా చూచాను. పేరు బాగుంది. జనశత్రు అంటారేమో తెలుగులోనయితే. రే సినిమాలు తీయడం మొదలుపెట్టి అపూత్రయం మూడవ చిత్రంలో, అంటే తన మూడవ చిత్రంలో హీరోగా వేసిన సౌమిత్రా ఛటర్జీయే, 31 సంవత్సరాల తరువాత గణశత్రులో కూడా వయసుకు తగిన పాత్రలో వస్తాడు. అనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో ఒక గుడి. అక్కడి అభిషేక జలాన్ని ‘చరణామృతొ’ అనే గౌరవకరమయిన పేరుతో అందరూ తీర్థంగా తీసుకుంటారు. ఆ ఊర్లో (ఊళ్లో) అంటువ్యాధులు విపరీతంగా వస్తుంటాయి. సౌమిత్రా ఆ ఊర్లోకి డాక్టర్‌గా వస్తాడు. అనారోగ్యాలకు కారణం, ఆ తీర్థమే అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. గుడ్డి నమ్మకం గల ప్రజల మధ్యన గణశత్రువు, అంటే జనశత్రువుగా మిగిలిపోతాడు. నేను నాలుగు మాటల్లో చెప్పిన ఈ సంగతి సత్యజిత్ రే సినిమా రూపంలో అందించిన తీరు అద్భుతంగా ఉంటుంది.
నేను అషొని షొంకేత్, అకాలేర్ సంధానే అనే రెండు సినిమాల మధ్యన తరుచు తికమకపడతాను. ఇందులో రెండవది మృణాల్‌సేన్ చిత్రం. మొదటిది రే సినిమా. అశని సంకేతం అని అనుకోవాలి మనం. అనుకోకుండా పడిన పిడుగు. ఇందులోనూ మళ్లీ సౌమిత్రా ఛటర్జీయే. అయితే ఈ సినిమా ఇందాకటి రెంటికీ మధ్యకాలం నాటిది. 70 దశకం మధ్యలో చూశాను. ఇందులో రెండవ ప్రపంచ యుద్ధం చివరలో వచ్చిన కరువు, బీద బిక్కి కష్టాలు, ప్రధాన విషయం. కథానాయకుడు బడిపంతులు, పురోహితుడు కూడా. పూజ కొరకు చీర కావాలి అని పట్టీలో రాయిస్తాడు. లోపలికి వెళ్లి ‘నీకు ఏ రంగు చీర కావాలి?’ అని భార్యను అడిగి వచ్చి రాయిస్తాడు. ఈ సినిమాలో ప్రజలు వలసపోయి, తిరిగి రావడాన్ని రే చిత్రీకరించిన తీరు నాకు మనసులో నిలిచిపోయింది. (మా తాతగారు పూజసామగ్రి పట్టికలో నశ్యం డబ్బీ కూడా చేర్చేవారని అన్నయ్య చెప్పడం గుర్తుకు వచ్చింది).
సత్యజిత్ రాయ్ (కాదు) రే, సినిమాలు అన్నీ అంత ప్రభావవంతంగా ఉండవు అని చెప్పడానికి కూడా ఉదాహరణలుగా ఉండే సినిమాలు నేను కొన్ని దర్శించితిని. చారులత, జనారణ్య అటువంటివే అని నా అనుమానం. చాలామంది నాతో ఏకీభవించరని నా అనుమానం. ఇక తరువాత నేను చెప్పబోయే సంగతిని కూడా అందరూ అంగీకరించరు, అని నా అనుమానం కాదు. నమ్మకం!
నేను బోలెడు బెంగాలీ సినిమాలు చూచాను. ప్రపంచ భాషల్లో బోలెడు మంచి సినిమాలు చూచాను. ఎందుకోగానీ సత్యజిత్ రే తీసిన ‘జల్సా ఘర్’ అన్న సినిమా నాకు అన్నిటికన్నా గొప్పది, అనిపించింది. ఆ గొప్పదనం ఎక్కడ నుంచి వచ్చింది, అంటే చెప్పలేను. శంకరాభరణం సినిమాలో అసలయిన కర్నాటక సంగీతం ఒక్క ముక్క కూడా లేదు. జల్సా ఘర్ సినిమా కాదేమో, సంగీత, నృత్యాల గురించి డాక్యుమెంటరీయేమో అనిపించేంత సంగీతం, డాన్సు ఆ సినిమాలో ఉంటుంది. ఇటువంటి అనన్య సామ్యం అయిన సినిమాలను బెంగాలీ వాళ్లు, అనన్య లాంటి హాలులో వేసి చూస్తారా, అని నా అనుమానం. వాళ్ల దగ్గర కూడా సలాలా చిత్రరాజములు వేరుగా ఉంటాయని నా అనుమానం. బెంగాలీ టీవీ ఛానల్స్ నా అనుమానాన్ని బలపరుస్తుంటాయి.
ఈ సినిమా చూడకముందు, దాని గురించి పట్టించుకోక ముందు, అది జల్ సాగర్ అనుకున్నాను. అది జల్సా ఘర్. అంటే సంగీతం గది. ధనికులయిన వారు ఆ కాలంలో సంగీతం కచేరీలు చేయించడానికి ఇంట్లో ప్రత్యేకంగా ఒక హాలు కట్టించేవారు. అటువంటి ఒకానొక సంగీత కళాభిమాని గురించి, తారాశంకర్ బందోపాధ్యాయ్ అనే రచయిత ఒక కథ రాశాడు. నేను దాని ఆంగ్లానువాదం సంపాదించాను. రాజభరణాలు రద్దయి, భూస్వాముల వ్యవస్థ కూలిపోతున్న కాలంలో ఈ కథ జరుగుతుంది. అంత చిన్న కథను రెండు గంటల సినిమాగా తీయడానికి రే ఎందుకు ధైర్యం చేశాడు, అన్నది ప్రశ్న. దీనికి చాలా రకాల జవాబులు ఉన్నాయి. నిజానికి 50 దశకంలోనే ఈ సినిమా పడమటి ప్రపంచ వారిని కదిలించింది అంటారు. అనన్య లాంటి తియేటర్‌లో మాత్రం దాన్ని ఎవరూ పట్టించుకుని ఉండరని నాకు గట్టి నమ్మకం.
జల్సా ఘర్ కొరకు చక్కని పాతకాలపు రాజభవనం గురించి వెతుకుతున్నారు. ఎక్కడా సంతృప్తి కలగలేదు. ఏదో పల్లె నుండి, అక్కడి భవనం చూచి తిరిగి వస్తూ సత్యజిత్ రే బృందం వారు, దాని పక్కన పాకలో టీ తాగడానికి ఆగారు. వాళ్ల చర్చ వింటున్న కొట్టు యజమాని ఒక ఊరు, అక్కడి మహల్ గురించి చెప్పాడు. విషయం తెలుసుకుంటే, కథారచయితకు కథకు ప్రేరణ ఇచ్చిన జమీందారుగారి భవనం అది అని తెలిసింది. అయితే, అందులో జల్సా ఘర్ మాత్రం షూటింగ్‌కు అనువుగా లేదు. కనుక ఆ సీన్‌లను మాత్రం కలకత్తాలో సెట్ వేసి తీశారు.
జల్సా ఘర్ గురించి నాలుగు పేరాలు రాసి, అయింది అనుకుంటే, నాకు నేనే అన్యాయం చేసుకున్న భావం నాకే మిగులుతుంది. ఇందులో పెద్ద కథ లేదు. సంగీతం వెర్రిగల భూస్వామిని ఎంత బాగా చూపించారు? అది నటన కాదు. బిశంభర్ రాయ్ పాత్రలో జీవించిన ఛబి బిశ్వాస్‌ను మరో సినిమాలో కూడా గమనించినట్లు గుర్తు. ఈ సినిమా విసుగు పుట్టేంత నెమ్మదిగా సాగుతుంది. ముఖ్యపాత్ర ఒకటే, కనిపిస్తూ ఉంటుంది. జమీందారు గనుక ఆయన కదలడు, మాట్లాడడు. మనకు కొంతసేపటి తర్వాత విసుగు మొదలవుతుంది. హిందుస్తానీ సంగీతం వినడం అలవాటు లేకుంటే, సినిమా కట్టేసి వెళ్లిపోయే ప్రమాదం కూడా ఉంది. ఏం జరిగేదీ చూడాలి అనుకున్న వారికి, రాయ్ భార్య, కొడుకు పోవడంతో జాలి మొదలవుతుంది. ఆయన సంగీతం వెర్రి మాత్రం తరగదు. మిగిలిన చివరి సొమ్ము కూడా వెచ్చించి నృత్యం పెడతాడు. చాలా సినిమాటిక్‌గా ఉండే సన్నివేశం ఈ సినిమాలో ఏదయినా ఉంది, అంటే అది అప్పుడు వస్తుంది. ఇదేమిటి అనుకునేలోగా జమీందారు ఏదో అఘాయిత్యం చేస్తాడు. చనిపోతాడు. విస్తుపోవడం ప్రేక్షకుల వంతు అవుతుంది. రచయిత తారాశంకర్ బెనర్జీ, చిత్ర దర్శకుడు సత్యజిత్ రే ఆశించిన ప్రతిక్రియ కూడా అది మాత్రమే! సాధారణంగా కథలు సినిమాలయితే జావగారిపోతాయి. జల్సా ఘర్ విషయంలో రే దాన్ని మరింత బాగా చూపగలిగాడు.
పుస్తక సమీక్ష గానీ, సినిమా, సీరియల్ పరిచయం గానీ రాస్తే, దాని కథ చెప్పడం నాకు ఎందుకో ఇష్టం ఉండదు. ఇక ఈ సినిమాలో పెద్ద కథ లేదు. అయినా రెండు గంటలు సినిమా సాగుతుంది. డయలాగులు ఎక్కువగా ఉండవు. ఛబీ బిశ్వాస్ ఏమీ చేయకుండానే, ప్రధాన పాత్రను మన ఎదలోకి నడిపించుకు వస్తాడు. నిజానికి ఓపెనింగ్ సీక్వెన్స్ నన్ను తికమకపెట్టింది. ఇంటి పైకప్పు మీద వాలుకుర్చీలో దొరగారు కూచుని ఉంటాడు. కదలడు, మెదలడు. ఫిల్మ్‌లో ఏదో సమస్య వచ్చింది అనుకున్నాను. అంతలో కెమెరా కదిలిన భావం కలిగింది. అనంతొ అనే సేవకుడు హుక్కా తెచ్చి ఏర్పాటు చేసి వెళ్లిపోతుంటాడు. దూరం నుంచి సంగీతం వినిపిస్తుంది. కొంతసేపటికి దొరగారు ‘అనంతొ’ అని పిలిచి ఊళ్లో సంగీతం ఎక్కడిది అని అడుగుతాడు. సంగీతం తన యింట్లో మాత్రమే ఉండాలని ఆయన భావం అని తరువాత తెలుస్తుంది. ఇంట్లో కచేరీ ఉంది, అనేసరికి అనంతొ అనే పాత్రలో కనిపించిన ఉత్సాహం గొప్పగా ఉంటుంది.
అంతా అడుగంటినా దొరగారి దగ్గర ముసలి ఏనుగు, గుర్రం మిగిలి ఉంటాయి. ఊళ్లో కొత్త యిల్లు కట్టుకుని, హోదాలో పోటీగా వస్తున్న వ్యాపారి గంగూలీకి ఆనవాయితీ ప్రకారం బంగారు నాణెం చదివింపుగా యివ్వడానికి, ఇంట్లో వెండి పళ్లెం లేదు! ప్రతి మాట, ప్రతి సీక్వెన్స్ ఇలా ప్రత్యేకం!
ఈ సినిమా గురించి ఒక మోనోగ్రాఫ్ రాయాలి. సత్యజిత్ రే గురించి రాసి తీరాలి. కానీ తెలుగు పాఠకులు పట్టించుకుంటారా? ఎక్సలెన్స్ ఎవరికి కావాలె?
*

-కె.బి.గోపాలం