S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘ప్లాస్టిక్’పై కదనకాహళి!

** ఎటుచూసినా పాలిథిన్ కవర్లే.. ప్లాస్టిక్ వ్యర్థాలే.. డ్రైనేజీలు, చెరువులు, చెత్తకుప్పల్లో అవే.. పండ్లు, కూరగాయల వ్యాపారులు, టిఫిన్ సెంటర్లు, కర్రీ పాయింట్లు, కిరాణా దుకాణాలు, హోటళ్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, రైతుబజార్లు, చికెన్-మటన్ సెంటర్లు.. ఇలా ఎక్కడపడితే అక్కడ పాలిథిన్ సంచులు, టీ కప్పులు, ప్లేట్లు యథేచ్ఛగా వాడుతున్నారు. నిత్యావసర సరకులే కాదు.. టీ, కాఫీ, పాలు, పండ్లరసాలు, కొబ్బరి నీళ్లు- వేటికైనా పాలిథిన్ కవర్లే.. ప్రభుత్వ అధికారుల సమావేశాల్లోనే కాదు.. చివరికి ‘కాలుష్య నియంత్రణ మండలి’ (పీసీబీ) కార్యాలయాల్లోనూ ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు దర్శనమిస్తున్నాయి.. 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న పాలిథిన్ కవర్లపై నిషేధం తూతూమంత్రమే.. చెత్తకుండీలు నిండిపోయి రహదారులపై ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి.. గాలివీస్తే చాలు ఈ కవర్లు ఇళ్లలోకి చేరుతుంటాయి.. ప్లాస్టిక్ వ్యర్థాలతో డ్రైనేజీలు నిండిపోవడంతో కాలనీలను మురుగునీరు ముంచెత్తుతోంది.. చెత్తలోని పాలిథిన్ కవర్లు పశువుల పాలిట ప్రాణాంతంగా మారుతున్నాయి..
-------------------------------------------

నిషేధిత ప్లాస్టిక్ కవర్ల ఉత్పత్తిని నిలిపివేస్తే తప్ప తాము ఏమీ చేయలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు.. లక్షలాది మందికి ఉపాధి పోతుందన్న భయంతో పాలిథిన్ సంచుల తయారీ సంస్థలను మూసివేయించేందుకు ప్రభుత్వాలు వెనుకంజ వేస్తున్నాయి. 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న పాలిథిన్ కవర్లు మట్టిలో కలిసే అవకాశం లేనందున పర్యావరణానికి తీరని ముప్పు ఏర్పడింది. కొనే వస్తువు చిన్నదైనా, పెద్దదైనా పాలిథిన్ కవర్ తప్పనిసరి. హోటల్‌కెళ్తే ప్లాస్టిక్ టీ కప్పు, విందు భోజనాల్లో ప్లాస్టిక్ ప్లేట్లు, దాహమేస్తే ప్లాస్టిక్ వాటర్ బాటిల్.. ఇలా ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకూ ప్లాస్టిక్ వినియోగం నిత్యకృత్యమైంది. 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న పాలిథిన్ కవర్లను నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు నిషేధించినా, వాటి తయారీపై ఆంక్షలు లేనందున పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదన్నది కఠోర వాస్తవం.

ప్రకటన కాదు, పోరాటం..
జీవావరణానికి, పర్యావరణానికి పెను ముప్పు తెస్తున్న ‘ప్లాస్టిక్ భూతం’ నేడు వికటాట్టహాసం చేస్తోంది.. యావత్ మానవాళినే భయకంపితులను చే స్తోంది.. దాదాపు వందేళ్ల క్రితం పుట్టుకొచ్చిన ప్లాస్టిక్ ఇప్పుడు ప్రపంచానికి నిలువెల్లా వణుకు పుట్టిస్తోంది. ఏటా 1,900 కోట్ల పౌండ్ల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లో కలుస్తున్నందున జలచరాల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. పాలిథిన్ కవర్లు, ప్లాస్టిక్ వ్యర్థాలను ఆహారంగా భ్రమించి తింటున్న చేపలు, తాబేళ్లు, ఇతర జలచరాలు మృత్యువాత పడుతున్నాయి. ఐక్యరాజ్య సమితి గణాంకాల మేరకు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నిమిషానికి ఒక మిలియన్ ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు అమ్ముడవుతున్నాయి. ఏడాదికి విశ్వవ్యాప్తంగా 5 ట్రిలియన్ల ప్లాస్టిక్ సంచులను వినియోగిస్తున్నారు. ఇందులో సగం వ్యర్థాలు కూడా మట్టిలో కలవని దుస్థితి నెలకొంది. గత శతాబ్ద కాలంలో ఉత్పత్తయిన పరిమాణం కంటే- గత దశాబ్దకాలంలో తయారైన ప్లాస్టిక్ ఉత్పత్తులు ఎక్కువని పర్యావరణ నిపుణులు అంచనా వేశారు. మన దేశంలో ప్రతిరోజూ 25,940 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలతో పాటు 97వేల టన్నుల చెత్త పోగవుతోందని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ చెబుతోంది. విశ్వవ్యాప్తంగా ఇప్పటివరకూ 830 కోట్ల టన్నుల ప్లాస్టిక్ తయారైతే, మూడేళ్ల క్రితం నాటికే సుమారు 650 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణం కలుషితమైంది. పాలిథిన్ కవర్లు, ప్లాస్టిక్ తుక్కు మట్టిలో కలవనందున భూగర్భజలాలు విషపూరితమవుతున్నాయి. ‘ప్లాస్టిక్ రాక్షసి’ని అంతం చేసేందుకు చాలా ఏళ్ల క్రితమే సమరం ప్రకటించిన మన దేశం కార్యాచరణలో మాత్రం ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా ఒక నిర్దిష్ట విధానమంటూ లేనందున ప్లాస్టిక్‌పై యుద్ధం నామమాత్రంగానే సాగుతోంది. ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’ నాడు అట్టహాసంగా ప్రకటనలు చేయడం తప్ప- అంతా ఆచరణ శూన్యంగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మహారాష్ట్ర ప్రభుత్వం అత్యంత సాహసోపేతంగా ప్లాస్టిక్‌పై యుద్ధ్భేరి మోగించింది. ఈ ఏడాది మార్చి 23న జారీ అయినా, తాజాగా అమలులోకి వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం మహారాష్టల్రో ప్లాస్టిక్ కవర్ల తయారీ, రవాణా, పంపిణీ, వినియోగం, నిల్వ చేయడం పూర్తిగా నిషిద్ధం. ప్లాస్టిక్, థర్మాకోల్‌తో తయారయ్యే గ్లాసులు, కప్పులు, ప్లేట్లు తదితర ఉత్పత్తులను పూర్తి స్థాయిలో నిషేధించిన మహారాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను బేఖాతరు చేసేవారికి భారీ జరిమానాలు, అవసరమైతే జైలుశిక్షలు కూడా వేయాలని ప్రతిపాదించింది.

ఘనమైన నినాదం..
కొద్ది రోజుల క్రితం జరిగిన ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవాని’కి ఆతిథ్యం ఇచ్చిన భారత్ ‘ప్లాస్టిక్‌పై పోరాటం’ అనే గొప్ప నినాదాన్ని వినిపించింది. పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ ప్రజలంతా దీక్ష వహించి, ప్లాస్టిక్ మహమ్మారిని తరిమికొట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని పరిరక్షించడంలో రాజీ పడరాదని, ప్రకృతిని పదిలంగా ఉంచే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన అన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా భూమి, సముద్రజలాలు కలుషితమై మానవాళికి, జలచరాలకు, సకల ప్రాణికోటికి ప్రమాదం ముంచుకొస్తోందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని ఆందోళన సహేతుకమే అయినప్పటికీ మన దేశంలో ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణకు జాతీయ విధానం అంటూ ఏదీ లేకుండా పోయింది. కొన్ని పరిమితులకు లోబడి ప్లాస్టిక్‌ను నియంత్రిస్తున్నట్లు పలు రాష్ట్రాలు ప్రకటించినా, ఆ నిషేధాజ్ఞలు సైతం కాగితాలకే పరిమితమవుతున్నాయి.

‘మహా’ సంకల్పం..
దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరం సహా మహారాష్టల్రోని అన్ని ప్రాంతాల్లోనూ ప్లాస్టిక్ వాడకంపై ఉక్కు పాదం మోపాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ప్లాస్టిక్ వస్తువుల వినియోగంపై మహారాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధం జూన్ 23 నుంచి అమలులోకి రావడంతో అధికారుల్లోనూ కదలిక మొదలైంది. క్యారీబ్యాగ్‌తో ఎవరైనా కనిపిస్తే అక్షరాలా అయిదు వేల రూపాయలు జరిమానా కట్టాల్సిందే. రెండోసారి క్యారీబ్యాగ్‌తో పట్టుబడితే పదివేలు, మూడోసారైతే పాతిక వేల జరిమానాతో పాటు మూడు నెలల జైలుశిక్షకు సిద్ధపడాల్సిందే. ఒక్కసారి మాత్రమే వినియోగించే పాలిథిన్ సంచులు, టీ కప్పులు, ప్లేట్లు, గ్లాసులు, చెంచాలు, స్ట్రాలు, థర్మాకోల్ గ్లాసులు, అలంకరణకు వాడే థర్మాకోల్ సామగ్రి, హోటళ్లలో పార్సిళ్లకు వాడే ప్లాస్టిక్ డబ్బాలను పూర్తిగా నిషేధించారు. అయితే, ఆస్పత్రుల్లో వాడే సెలైన్ బాటిళ్లు, మందులు భద్రపరిచే బాక్సులు, ప్లాస్టిక్ పెన్నులు, పాల ప్యాకెట్లకు మాత్రం ఈ నిషేధం వర్తించదు. ఆహార ధాన్యాలు, బిస్కట్లు, చిప్స్ నిల్వ చేసే బాక్సులు, ఫ్రిజ్‌లు-టీవీలు-కంప్యూటర్ల ప్యాకింగ్‌కు వాడే థర్మాకోల్‌కు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ప్లాస్టిక్‌పై నిషేధాన్ని సజావుగా అమలు చేసేందుకు రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీని నియమించారు. వర్తకులు, చిరువ్యాపారుల సమస్యలను పరిష్కరిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం అభయం ఇచ్చింది. ప్రారంభంలో కొంత కష్టమని భావించినా రానురానూ నిషేధానికి ప్రజలు అలవాటు పడతారని అధికారులు చెబుతున్నారు. నిషేధం అమలులోకి వచ్చిన తొలిరోజునే నాసిక్ నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దాడులు చేసి 72 మంది వ్యాపారుల నుంచి 3.6 లక్షల రూపాయలను జరిమానాగా వసూలు చేసి, భారీగా ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు.

భారీ నష్టం.. కార్మికులకు కష్టం
మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ప్లాస్టిక్, థర్మాకోల్ వస్తు పరిశ్రమకు మొదటి మూడు రోజుల్లోనే సుమారు పదిహేనువేల కోట్ల రూపాయల మేరకు నష్టం జరిగిందని, పరోక్షంగా మూడు లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని భారతీయ ప్లాస్టిక్ వస్తువుల ఉత్పత్తిదార్ల సంఘం చెబుతోంది. నిషేధం వల్ల తమ వ్యాపారాలు సగానికి పైగా పడిపోయాయని చిల్లర వర్తకుల సంఘాల సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది. వేలాది కిరాణా దుకాణాలు మూతపడ్డాయని, పాలు, పెరుగు, పండ్లరసాల విక్రయాలు పాతిక శాతం తగ్గాయని ఆ సమాఖ్య నాయకులు అంటున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ప్లాస్టిక్‌పై ఒక్కసారి నిషేధం విధించడం వల్ల వ్యాపారులు నష్టపోతున్నారని వారు పేర్కొంటున్నారు. బ్యాంకు రుణాలతో ప్లాస్టిక్ పరిశ్రమలను ఏర్పాటు చేసుకున్నవారు కూడా తమకు ప్రత్యామ్నాయ ఉపాధిని చూపాలని డిమాండ్ చేస్తున్నారు. వస్త్ర పరిశ్రమలో ప్యాకేజీ పనుల్లో పాల్గొనే వేలాది మందికి కూడా ఉపాధి గగనమవుతుందని వారు అంటున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ఫలితంగా ముంబయి నగరంలోని వేలాది హోటళ్లు, టీ స్టాల్స్, కూరగాయల మార్కెట్లు, మాంసం దుకాణాల్లో క్యారీబ్యాగ్‌ల వినియోగానికి గండి పడింది. పాలిథిన్ కవర్లను ఒక్కసారి నిషేధించడంతో తాము వ్యాపారాలు చేయలేని దుస్థితి ఏర్పడిందని హోటళ్లు, టీ స్టాల్స్ యజమానులు వాపోతున్నారు. భారీగా జరిమానాలు విధిస్తున్నందున నిబంధనలను ఉల్లంఘించేందుకు ఎవరూ సాహిసించడం లేదు. వినియోగదారులు స్టీల్ బాక్స్‌లు తెచ్చుకోవాలని హోటళ్లు, చికెన్ షాపుల యజమానులు సూచిస్తున్నారు. ప్లాస్టిక్‌ను నిషేధించడంతో గుడ్డ సంచులు, జ్యూట్, పేపర్ బ్యాగ్‌లకు గిరాకీ పెరిగింది. ముంబయిలోని కొన్ని టిఫిన్ సెంటర్ల యాజమాన్యాలే వినియోగదారులకు తాత్కాలిక ప్రాతిపదికపై స్టీల్ బాక్స్‌లను అందిస్తున్నాయి. కొంత నగదును డిపాజిట్ చేసిన వారికి స్టీల్ బాక్స్‌ల్లో తినుబండారాలను పార్సిల్ చేసి ఇస్తున్నారు. తిరిగి ఖాళీ బాక్స్‌లను తెచ్చి ఇస్తున్నవారికి ఈ తరహా సేవలను అందిస్తున్నారు.

మరోదారి లేదు..
ప్లాస్టిక్ వ్యర్థాలు గుట్టలకొద్దీ పేరుకుపోవడంతో ఏటా వర్షాకాలంలో ముంబయి సహా అనేక నగరాలు నీట మునుగుతున్నాయి. డ్రైనేజీలు వ్యర్థాలతో నిండిపోవడంతో వర్షం నీరు ఎక్కడికక్కడ నిలిచిపోతూ జనావాసాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. సముద్ర తీరాలు చెత్తతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. సాగర జలాలు కలుషితమై మత్స్యసంపద తగ్గుతోంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పూర్తిస్థాయిలో ప్లాస్టిక్‌పై నిషేధం విధించడం మినహా మరో గత్యంతరం లేదని మహారాష్ట్ర ప్రభుత్వం భావించింది. జనావాసాలను, పర్యావరణాన్ని కాపాడేందుకు ప్లాస్టిక్‌పై రణభేరి మోగించక తప్పలేదు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిలిపివేయాలని కోరుతూ చిల్లర వర్తకుల సంక్షేమ సంఘం ముంబయి హైకోర్టును ఆశ్రయించనప్పటికీ ఫలితం దక్కలేదు. మహారాష్టల్రో ప్లాస్టిక్ సంచులను తయారు చేసే 2,500 యూనిట్లు ఉన్నాయని, వాటిలో సుమారు 60 వేల మంది ఉపాధి పొందుతున్నారని ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్లాస్టిక్ యూనిట్లు బ్యాంకులకు సుమారు 11 వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందట! ఈ కారణంగా ఒక్కసారి నిషేధం సరికాదని ప్లాస్టిక్ పరిశ్రమల యాజమానులు అంటున్నారు. ప్లాస్టిక్ పరిశ్రమల్లోని కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వకపోయినా, తగిన పరిష్కార మార్గాలను కనుగొనేందుకు స్థానిక సంస్థలు దృష్టి సారిస్తాయి. ప్రత్యామ్నాయ ఉపాధిని ఎంచుకునేవారికి రుణపరపతి, ఇతర వసతులు కల్పించేందుకు అధికారులు సహకరిస్తారు.

నిషేధం అమలు ఇలా..
ప్లాస్టిక్‌పై పూర్తి స్థాయిలో నిషేధాన్ని అమలుచేసే బాధ్యతను పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల అధికారులకు అప్పగించారు. స్థానిక సంస్థల అధికారులు, కలెక్టర్లు, అటవీశాఖ అధికారులు, పోలీసులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కేసులు నమోదు చేసి కోర్టుకు నివేదిస్తారు. నిషేధాన్ని ఉల్లంఘించిన వారికి రూ. 5వేలు (తొలి తప్పిదానికి), రూ. 10 వేలు (రెండోతప్పునకు), మూడోసారి తప్పుచేస్తే రూ. 25వేల జరిమానాతో పాటు మూడు నెలల జైలుశిక్ష విధిస్తారు. జరిమానాలు విధించేందుకు ‘బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్’ (బీఎంసీ) ఆధ్వర్యంలో ఇప్పటికే 250 మంది ఇన్స్‌పెక్టర్లకు శిక్షణ ఇచ్చారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించేందుకు ముంబయి నగరంలో 37 చోట్ల కలెక్షన్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఈ వివరాలన్నింటినీ బీఎంసీ తన వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచింది. ఇంటింటికీ తిరిగి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించేందుకు ఓ హెల్ప్‌లైన్‌ను కూడా ఏర్పాటు చేశారు. జరిమానాలు చెల్లించేవారి ఆధార్ కార్డు, పాన్ నెంబర్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర వివరాలను ఇన్స్‌పెక్టర్లు సేకరిస్తారు. ఈనెలలో మొదటి మూడువారాల్లో 145 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను ముంబయి మున్సిపల్ సిబ్బంది సేకరించారు. ప్రజల్లో అవగాహన పెరిగితే ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య త్వరలోనే తగ్గుముఖం పడుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఆ ఖ్యాతి ముంబయికే..
దేశ ఆర్థిక రాజధానిగా ప్రసిద్ధి చెందిన ముంబయిలో ‘నిషేధం’ పూర్తిస్థాయిలో అమలైతే ‘తొలి ప్లాస్టిక్ రహిత నగరం’గానూ గుర్తింపు దక్కే అవకాశం ఉంది. ముందుగా ప్రజల్లో, వ్యాపారుల్లో చైతన్యం పెంచేలా అవగాహన శిబిరాలను ఏర్పాటు చేయాలని బృహన్ ముంబయి నగరపాలక సంస్థ నిర్ణయించింది. కొద్ది రోజుల తర్వాత జరిమానాలు విధించడంలో రాజీపడబోమని అధికారులు హెచ్చరిస్తున్నారు. సామాన్య ప్రజలు, చిరు వ్యాపారులకే కాదు.. షాపింగ్ మాల్స్, బహుళ జాతీయ సంస్థల దుకాణాలకు సైతం జరిమానాలు తప్పవని వారు తేల్చి చెబుతున్నారు. నిషేధం అమలులోకి వచ్చిన తొలిరోజునే థానే, నవీ ముంబయి తదితర ప్రాంతాల్లో జరిమానాలు వసూలు చేశారు. భారీ ఎత్తున ప్లాస్టిక్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పాఠశాలలు, కళాశాలల్లోని క్యాంటీన్లను సైతం తనిఖీ చేస్తున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ఉన్న ప్రాంతాల్లోని మార్కెట్లలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగం ఎక్కువగా ఉందని, మొదటిసారి హెచ్చరికలు చేసినా ఆ తర్వాత జరిమానాలు, జైలుశిక్షలు తప్పవని థానే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు. షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, జ్యూస్ సెంటర్లలో నిషేధాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తామని, వ్యాపారులు ప్రత్యామ్నాయ మార్గాలు అనే్వషించాలని అధికారులు సూచిస్తున్నారు. దేశం మొత్తమీద రోజుకు 25వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పోగవుతుండగా, ముంబయిలో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. సముద్రతీరం పాడవడానికి, వర్షాల వేళ నగరం నీట మునగడానికి ప్లాస్టిక్ వ్యర్థాలే కారణమంటున్నారు.

వ్యర్థాల విశ్వరూపం..
నగరాల్లో నిత్యం పోగయ్యే వేల టన్నుల వ్యర్థాల్లో పునశ్శుద్ధికి నోచుకుంటున్నది 21 శాతం కాగా, మిగిలిన చెత్తంతా భూమిపైన, సాగర జలాల్లో పేరుకుపోతోంది. దీంతో జంతుజాలానికి, జలచరాలకు తీరని నష్టం జరుగుతోంది. మరోవైపు కాస్మొటిక్స్ ప్యాకేజీ, ఆటబొమ్మలు, నీటి గొట్టాలు, వాటర్ బాటిళ్ల తయారీలో వాడే హానికారక రసాయనాల ప్రభావంతో చర్మవ్యాధులు, క్యాన్సర్లు, ఊబకాయం, మధుమేహం వంటి రోగాలు వ్యాపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న ప్లాస్టిక్‌లో దాదాపు 50 శాతంపైగా ఒకసారి వాడిపారేసేది అయినా వాటి వల్ల కలిగే దుష్ప్రభావాలు మాత్రం అనంతం. తినుబండారాలతో పాటు అనేకానేక ఉత్పత్తులను విక్రయించేందుకు ప్లాస్టిక్ ఎంతో అనువైనది కావడంతో ఇంతవరకూ ప్రత్యామ్నాయ మార్గాలపై ఎవరూ దృష్టి సారించడం లేదు. పర్యావరణానికి, జంతుజాలానికి, జలచరాలకు, మానవాళికి ఎంతో హాని జరుగుతోందని తెలిసినా ప్లాస్టిక్‌కు బదులు దేన్ని వాడాలన్న విషయమై తగిన పరిశోధనలు కూడా జరగడం లేదు. అందుబాటులో ఉండే ప్రత్యామ్నాయాలపై పాలకులు దృష్టి సారించినపుడే ప్లాస్టిక్ వినియోగాన్ని నిరోధించే వీలుంటుంది.
ప్లాస్టిక్‌పై నిషేధం అమలుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అదే రీతిలో ప్రజల్లో అవగాహన పెంచేందుకూ దృష్టి సారించడం ఎంతో అవసరం. ప్లాస్టిక్ కవర్లు అమ్మినా, వాడినా జరిమానాలు వేయడం కంటే వాటిని తయారుచేసే సంస్థలను శాశ్వతంగా మూసివేయాలి. అక్కడి కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి. పేపర్, జ్యూట్ బ్యాగుల వినియోగంపై అవగాహన కల్పించాలి. ఇందుకు కరపత్రాలు, పోస్టర్లు, మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలి. నిషేధం అమలులో నిర్లక్ష్యం చూపే అధికారులపైనా చర్యలు తీసుకోవాలి. నిర్ణీత కాలవ్యవధిలో ప్రభుత్వాలు నిర్దిష్ట కార్యాచరణను అమలు చేసినపుడు ప్లాస్టిక్‌ను పూర్తి స్థాయిలో నిషేధించడం కష్టసాధ్యమేమీ కాదు.
*

మట్టిలో కలిసే ప్లాస్టిక్!
=============
ప్లాస్టిక్ వ్యర్థాలు మట్టిలో కలవనందున పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతోందన్న ఆందోళన నేడు విశ్వవ్యాప్తంగా నెలకొంది. అయితే, భవిష్యత్‌లో ఇలాంటి ఆందోళన అవసరం లేదని అమెరికాకు చెందిన పరిశోధకులు భరోసా ఇస్తున్నారు. అక్కడి కరోలాడో విశ్వవిద్యాలయం పరిశోధకులు మట్టిలో కలిసిపోయే ప్లాస్టిక్‌ను తయారు చేస్తున్నారు. బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మక్రిముల కలయికతో తయారైన పాలిమర్‌తో రూపొందించే వస్తువులు మట్టిలో సులభంగా కలిసిపోతాయట! ‘పీ 3హెచ్‌బీ’గా, బ్యాక్టీరియల్ పాలీగా వ్యవహరించే ఈ పాలిమర్ పెట్రోలియం ప్లాస్టిక్‌కు అసలైన ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. మట్టిలో కలిసిపోయే ప్లాస్టిక్‌ను కనుగొంటే ప్రపంచానికి మేలే కదా!

ఇలా చేస్తే సరి..
==========
* ఇళ్లలోని చెత్తను పారిశుద్ధ్య సిబ్బందికి ఇచ్చేముందు ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేయాలి. డంపింగ్ యార్డుకు అవి చేరకుండా అన్ని స్థాయిల్లో పర్యవేక్షణ ఉండాలి.
* నీళ్లు తాగడానికి స్టీల్, రాగి, గాజు సీసాలను వాడాలి. ప్లాస్టిక్ బాటిళ్లను దూరం చేయాలి.
* భోజనాలకు, టిఫిన్లకు ప్లాస్టిక్‌తో తయారుకాని ప్లేట్లను మాత్రమే వినియోగించాలి.
* ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని క్రమేణా తగ్గించాలి. ప్లాస్టిక్ సీసాలు, చెంచాలు, కప్పులు, ప్లేట్లను కొనడానికి స్వస్తి పలకాలి.
* రైతుబజార్లు, కిరాణా దుకాణాలు, టిఫిన్ సెంటర్లు, షాపింగ్ మాల్స్, చికెన్-మటన్ సెంటర్లకు వెళ్లేవారు జ్యూట్ బ్యాగులు, స్టీల్ డబ్బాలను తమ వెంట విధిగా తీసుకువెళ్లాలి.
* ప్లాస్టిక్ సీసాలను, ప్లేట్లను, కప్పులను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా డస్ట్‌బిన్‌లలో వేస్తుండాలి. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, పార్కులు, సినిమా హాళ్లు ఇతర పబ్లిక్ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచడం అందరి బాధ్యత.

ప్లాస్టిక్ రోడ్లు!
========
ఝార్ఖండ్‌లోని ‘జుస్కో’ (జమ్‌షెడ్‌పూర్ యుటిలిటీ అండ్ సర్వీసెస్ కంపెనీ) ‘ప్లాస్టిక్ రహదారు’లను నిర్మిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. 107 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను ‘బిటుమెన్’ (పెట్రోలియం ఉప ఉత్పత్తి)తో కలిపి నిర్మించిన రహదారి తారురోడ్డువలే మిలమిల మెరిసిపోవడం ఈ ప్రాంతీయులను విస్మయానికి గురిచేసింది. ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్డు నిర్మాణాన్ని 2011లోనే ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఆ తర్వాత ‘టిస్కో’ (టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ) పరిధిలో రోడ్ల నిర్మాణాలకు, మరమ్మతులకు ప్లాస్టిక్ వ్యర్థాలను వాడుతున్నారు. రోడ్డు నిర్మాణానికి వాడే ఒక టన్ను ‘బిటుమెన్’ ఖరీదు రూ.50 వేల రూపాయలు ఉంటుందని, అదే పరిమాణంలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించేందుకు రూ. పదివేలు ఖర్చవుతుందని ‘జుస్కో’ అధికారులు చెబుతున్నారు. ఝార్ఖండ్ రాష్ట్రంలోని ధన్‌బాద్, రాంచీ, బొకారో, గిరిథ్ ప్రాంతాల్లో ప్లాస్టిక్ రోడ్లను నిర్మిస్తున్నామని, ఇప్పటికే 15 కిలోమీటర్ల రహదారిని పూర్తి చేశామని వారు తెలిపారు. ప్లాస్టిక్-బిటుమెన్ కలయికతో వేసే రోడ్లు పటిష్టంగా ఉంటున్నాయని చెబుతున్నారు.