S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గత కాలమె మేలు.. వచ్చు కాలముకంటెన్

‘గతకాలమె మేలు వచ్చు కాలము కంటెన్’
కర్ణాటక సంగీతం, లలిత సంగీతం, లలిత శాస్ర్తియ సంగీతం, సినిమా సంగీతం అంటూ రకరకాల బాణీలున్నా, ఎవరికి నచ్చిన సంగీతం వారు వింటారు. ప్రతి జిహ్వకీ ఒక రుచి ఉంటుంది గదా! అలాగే సంగీతంలో కూడా ఉంటుంది. ఒకరికి నచ్చిన పాట అందరికీ నచ్చకపోవచ్చు.
ఇక్కడ వాడైన త్యాగరాజు అక్కడ తమిళనాడులో స్థిరపడి, తెలుగు భాష తెలియని శిష్యుల్ని తయారుచేయటమో వింత.
ఆ సంగీతం మత్తులో అన్నీ వదిలేసి, బలవంతంగా తెలుగు భాష నేర్చుకుని, మహావిద్వాంసులను తయారుచేసిన శిష్య ప్రశిష్య సంతతి వుండటం మరో వింత.
అందుకే దక్షిణాది సంగీత విద్వాంసులు భాష వేరైనా సంగీతం విషయంలో వారు మనవాళ్లే. తెలుగు భాష అర్థం చేసుకోగల తమిళులు అక్కడ బాగానే ఉన్నారు. తమిళ భాష పట్ల వారికున్న భాషాభిమానం ఎక్కువే అయినా, సంగీతం విషయంలో సద్గురు త్యాగరాజంటే గౌరవాభిమానాలు మనకంటే వారికే ఎక్కువేమో అనిపించటానికి చాలా కారణాలున్నాయి. త్యాగరాజ కీర్తనలు విశ్వవ్యాప్తం కావటానికి బీజావాపం చేసినది వారే.
ఎవరికైనా భాష విషయంలో ఇబ్బందులు అతి సహజం. కానీ సంగీత కళానిధులైన శెమ్మంగుడి శ్రీనివాసయ్యర్, ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, వసంతకుమారి, పట్టమ్మాళ్ లాంటి వారు తెలుగు భాషలో ఉచ్చారణ అడిగి తెలుసుకునేవారు. కీర్తనల్లోని మాటలకు అర్థం తెలుసుకుని భావంగా పాడేవారు.
తెలుగు భాషలోని లాలిత్యాన్నీ, సౌకుమార్యాన్నీ, బాగా తెలిసి సర్వజన సమ్మోదంగా, ఆబాలగోపాలానికీ దగ్గరై పాడిన గాయకుడు డా.మంగళంపల్లి బాలమురళీకృష్ణంటే అతిశయోక్తి కాదు.
ముఖ్యంగా దక్షిణాది విద్వాంసులు ఉచ్చరించే సాధారణ దోషాలను గుర్తించి, ఆ మాటలను అతి స్పష్టంగా పాడి మెప్పించిన ఘనుడు. అలా అతి స్పష్టంగా పాడటం కూడా వారిని కలవరపెట్తూండేది.
బాలమురళీకృష్ణకు కీర్తి రావటానికి అనేక కారణాలలో ఇదొకటి.
భాగవతంలో-
అపశబ్దంబుల గూడియున్ హరిచరిత్రాలాపముల్/ సర్వ పాప పరిత్యాగము సేయు గావున/ హరిన్ భావించుచుం బాడుచున్/ జపములు సేయుచు వీనులన్ వినుచు/ న శ్రాంతంబు గీర్తింపుచున్/ తపసుల్ సాధులు ధన్యులౌదురు గదా తత్త్వజ్ఞ! చింతింపుమా’ అంటాడు పోతన.
తప్పులు దొర్లినా, ఉచ్ఛారణ దోషాలు తెలియకపోయినా, త్యాగరాజ కీర్తనా సంగీత మైకంలో, విద్వాంసులు పాడి పరవశించారు. తంజావూరు బాణీ అంటూ ఏర్పడి మూర్తిత్రయం వారి కచేరీలు విశ్వవ్యాప్తం కావటానికి దోహదపడ్డాయి. జనబాహుళ్యంలో ఆ రోజుల్లో నిజానికి మరే ఇతర వ్యాపకాలు లేని రోజుల్లో వినిపించినవన్నీ త్యాగరాజ కీర్తనలే. నాదముని ‘బాండ్’ వాద్యబృందం త్యాగరాజ కీర్తనలు గ్రామఫోన్ రికార్డులుగా విడుదలై అవే అలవాటై, ప్రసిద్ధి పొందేశాయి. అప్పట్లో అందరి నోళ్లల్లో వినిపించినవి ఆ కీర్తనలే - గమకయుక్తంగా, శ్రుతిశుద్ధమైన ఆ సంగీతమే అలా నరనరాల్లో దక్షిణాది సంగీత ప్రియులకు వొంటపట్టేసింది. అంతేకాదు. పెళ్లిళ్లలోనూ, ఇతర శుభకార్యాల్లోనూ, పర్వదినాలోలనూ నాదస్వర విద్వాంసులు వినిపించిన సంగీతం త్యాగరాజుదే. ప్రతి దేవాలయంలోనూ కనిపించేదీ వినిపించేదీ నాదస్వరమే.
స్వర వర్ణాలతో, గమకయుక్తమైన సంగీతం విన్న ఆ చెవులకు ఇతర తేలిక బాణీలు ఎలా రుచిస్తాయి? పైగా తమిళ సినిమా సంగీతం కూడా సంప్రదాయ సంగీత పరిధిని దాటకుండానే పాడేవారు.
కృష్ణన్ శీర్కాళి గోవిందరాజన్ , టి.ఎం. సౌందరరాజన్, దండపాణి దేశికర్, కె.బి.సుందరాంబాళ్, ఎం.కె.త్యాగరాజ భాగవతార్ లాంటి నేపథ్య గాయకుల సంగీతం శాస్ర్తియ రాగాల్లో సంగీత ప్రధానంగానే ఉండటం గమనార్హం. కాలం మారుతోంది. అభిరుచులూ మారతాయి. క్రమక్రమంగా అక్కడ కూడా సినిమా సంగీతం శ్రోతల స్థాయికి దిగిపోతూ వస్తోంది.
శ్రుతి మాధుర్యం తెలిసిన గాయకుడు కాస్సేపు సుస్వరం మీద ఆగుతూ ఆనందం పొందుతూ ఉంటాడు. ఈ శ్రుతి సుఖంలోని మజా గాయకులందరికీ దక్కదు. అమృతం కోసం దేవతలు, రాక్షసులు చేసిన క్షీరసాగర మధనంలో కౌస్త్భుం ఉచ్ఛైశ్రవం లక్ష్మీ దేవి ధన్వంతరి ఐరావతం చంద్రుడు మొదలైనవి ఎలా ఉద్భవించాయో అలాగే, శ్రుతి సాగరం నుంచి కొందరు గాయనీ గాయకులు ఉద్భవించారు. బడే గులాం అలీఖాన్ ఉస్తాద్, అమీర్‌ఖాన్ లాంటి హిందుస్థానీ విద్వాంసులు వెనకటి తరంలోని కర్ణాటక సంగీతం విద్వాంసులు మధురై పుష్పవనమయ్యర్, మహావైద్యనాథయ్యర్, సిమిలి సుందరమయ్యర్, ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, ఎం.ఎల్.వసంతకుమారి వంటి వారు ఇలా జన్మించినవారే. మన ఘంటసాల కూడా ఆ కోవలోని వాడే. 19వ శతాబ్దంలో కర్ణాటక సంగీత సామ్రాజ్యంలో చక్రవర్తులైన నాదస్వర విద్వాంసులు కొందరు ఇప్పటి సినీ నటుల కంటె పాపులారిటీ సంపాదించారంటే మీకు ఆశ్చర్యం కలుగవచ్చు. తమిళ రసికుల ఇళ్లల్లో జరిగే పెళ్లి ముహూర్తాలు ఈ నాదస్వర విద్వాంసులు లభ్యమైనప్పుడే నిర్ణయించే వారంటే నాదస్వర విద్వాంసులకున్న డిమాండ్ ఏమిటో అర్థమవుతుంది. వారిలో అగ్రగణ్యుడు.. టి.ఎన్.రాజరత్నం పిళ్లై. కేవలం ఆయన సంగీతం వినేందుకే పెళ్లిళ్లకు విధిగా వచ్చేవారంటే, సంగీతం పట్ల దక్షిణాది రసికులు పెంచుకున్న అభిరుచి ఏ స్థాయిలో వుండేదో ఊహించండి.
సాధారణంగా ‘వివాహ వేడుక’ అనగానే బంధువులు, భోజనాలు అటూ ఇటూ పనివున్నా లేకపోయినా తిరిగే జనంతో కోలాహలంగా ఉంటుంది. ఎవరికీ స్థిమితంగా సంగీతం వినే అవకాశముండదు. నాదస్వర విద్వాంసులతో ఎంతో రీతిగా సాగుతూ, వధూవరులను పల్లకీలో ఊరేగిస్తూ వీధివీధికీ తిప్పేవారు. అదో ముచ్చట. పల్లకి వెంట బంధుజనంతో బ్యాండ్ మేళాలుండేవి.
‘పెళ్లి వంటి ముచ్చట ఈ బ్రతుకున/ వెదకిన మరి కలదా? పెండ్లి కూతురు పెండ్లి కొడుకులున్/ వెలయు సొగసు భళిరా?’ అంటారు ఆదిభట్ల నారాయణదాసుగారు. పెట్రో మాక్సు లైట్ల కాంతిలో ముందు పల్లకీ, వెనుక నాదస్వర బృందంతో ముచ్చటగొలిపే సన్నివేశం ‘న భూతో న భవిష్యతి’ అన్నట్లుగా వుండేది. వధూవరుల జంటను అనుసరిస్తూ చిత్రవిచిత్ర విన్యాసాలతో నిండిన ‘నాదస్వర సంగీత గంగ’తో పునీతులైన ఆనాటి సంగీత రసికుల ‘అదృష్టమే అదృష్టం’ అనేవారు మా గురువుగారు. 18, 19 శతాబ్దంలో తిరుప్పాంబరం స్వామినాథయ్యర్, శివకొళుందు అనే మహావిద్వాంసుల నాగస్వరం వినేందుకు జనం తహతహ లాడేవారట.
గాత్ర విద్వాంసులకు ఆదర్శమైన వాద్యం నాదస్వరమే. మన తెలుగుదేశంలో ప్రసిద్ధి చెందిన కర్ణాటక సంగీత విద్వాంసుడైన ఎం.ఎస్. బాలసుబ్రహ్మణ్య శర్మ సంగీత గురువు ప్రసిద్ధ నాదస్వర విద్వాంసుడు పైడిస్వామి.
మనం పెళ్లిళ్లలో సాధారణంగా నాదస్వరాలు, బ్యాండ్ మేళాలు పట్టించుకోం.
కచేరీ స్థిమితంగా వినాలనే షరతుతో నాదస్వరం వాయించేవాడు నాదస్వర చక్రవర్తి టి.ఎన్.రాజరత్నం పిళ్లై. విద్వాంసులకే విద్వాంసుడు. ఊరేగింపు జరిగే మార్గంలో చిన్నచిన్న వేదికలు ఏర్పాటు చేసి కూర్చుని తన సంగీతం వినిపించేవాడు. వధూవరులు కూడా ఆసక్తిగా ఆ సంగీతం వినటం విశేషం.
ఆ రోజులు దాటిపోయాయి. యాంత్రిక జీవనమే మిగిలింది.
వివాహ వేడుకలకు ఒక దారీ తెన్నూ, గమ్యం లేకుండా, ఉచితానుచితమైన అలవాట్లన్నీ ఏర్పడ్డాయి.
సంప్రదాయాలన్నీ అటకెక్కాయి. అయినా మినుకు మినుకుమనే చుక్కల్లా సంగీతం నేర్చుకోవాలనే ఆశ మాత్రం పోలేదు. నిబ్బరంగా శుభ్రంగా నేర్చుకోవాలనే వారి సంఖ్య పెరగటం లేదు. శ్రమ పడకుండా పాడేసి పేరు ప్రఖ్యాతులు రావాలనుకునేవారు పెరిగారు.
లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి నడుపుతున్న మన ప్రభుత్వ సంగీత కళాశాలల్లో పెరగవలసినది, సంగీత జ్ఞానం కల్గిన విద్వాంసులు. కేవల గాయకులు కాదు. శాస్ర్తియ సంగీతానికి ఇతర బాణీలకూ గల తేడాను గ్రహించగలిగి, దానికి తగిన ప్రణాళికలు వేయగల సమర్థులైన అధికారులు కరువయ్యారు.
లక్ష్యం లేని భక్తి వినా సంగీతానికి అర్థం లేదు. దివ్యమైన సంగీతం పట్ల సదవగాహనంటూ లేకుండా కేవలం డిగ్రీలు, డిప్లమోలూ ఇచ్చేసి, చేతులు దులిపేసుకుంటే నెరవేరే ప్రయోజనం సున్నా.
*

- మల్లాది సూరిబాబు 90527 65490