S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

. శ్రీరాముడికి హితోపదేశం చేసిన సీతాదేవి

వాసుదాసు వ్యాఖ్యానం
అరణ్యకాండ-17

అందరూ బయటకు పోతున్న సమయంలో సీతాదేవి శ్రీరాముడు ముఖారవిందాన్ని చూసి, స్నేహభావంతో, ప్రేమతో, మెత్తటి-తియ్యటి మాటలతో ఇలా చెప్పింది: ‘ప్రాణేశ్వరా! నువ్వు అనుష్టించదల్చిన వానప్రస్థ ధర్మం కామం వల్ల కలిగే వ్యసనాలను వదిలి కూడా సూక్ష్మమైన ధర్మ మార్గంలో అనుష్ఠించవచ్చు కదా? కామజ వ్యసనం లేదంటావా? అవి మూడు. మొదటిది అసత్యం చెప్పడం. దానికంటే పెద్దది పరస్ర్తిలతో భోగించడం. దానికంటే పెద్దది పగలేకుండా ఇతరులను నిష్కారణంగా హింసించడం. ఈ మూడింటిలో మొదటిదైన మిద్యాభిభాషణం నీలో లేదు. ఇంతదాకా నువ్వు అసత్యం ఆడలేదు. ఇక, రెండోదైన పరభార్యా సంగమం విషయంలో నీకలాంటి కోరికే లేదు. నువ్వు ధర్మ నిరతుడవు కాబట్టి నీలో ఏ పాపాలు కనబడవు. కాబట్టి అధర్మకర దోషం లేదు. లక్ష్మణాగ్రజా! నాథా! నువ్వు సర్వదా సత్యం, ధర్మం తప్పనివాడివి. కాబట్టే తండ్రి వాక్యాన్ని పాలించడానికి ఇంత శ్రమ పడ్తున్నావు. సత్యం, ధర్మం నీలో ఏ కొరతా లేకుండా వున్నాయి. ఇంత సత్యం, ధర్మం విజితేంద్రియులకు తప్ప ఇతరులకు లభించవు. నువ్వెంత జితేంద్రియుడివో నాకు తెలుసు. రామచంద్రా! మిథ్యాభిభాణం పరదార సంగమాభిలాష నీలో లేవు. ఆ విషయం గురించి నేనేం చెప్పను. కామజ వ్యసనాలలో మూడోది మిగతా రెండింటి కంటే క్రూరమైనది. నువ్వు అది చేయబూనావు. జ్ఞానహీనులు పగ లేకపోయినా ఇతరుల ప్రాణం తీస్తారు. అది అలాంటి వారికి తగును కాని నీకు తగదు. అది నాకెలా తెలుసంటావా? మునీశ్వరుల కొరకు దండకారణ్య వాసులైన రాక్షసులను చంపుతానని ప్రతిజ్ఞ చేశావు. అందుకోసమే ఇక్కడకు వచ్చావు. మునిలాగా తిరగాలనుకుంటున్న నీకు, నీ తమ్ముడికి విల్లు బాణాలెందుకు? అవి హింసించే సాధనాలే కదా? ఆత్మరక్షణ కోసమని అనుకోవచ్చు కదా అంటావేమో? ఈ మునులందరూ ఆత్మరక్షణ కొరకు ఏ ఆయుధాలు ధరించారు? నువ్వు సాయుధుడవై వచ్చినందున మునులు వచ్చి నిన్ను రక్షించమని అడిగారంటావా? అలాగే నిన్ను రాక్షసులు హింసించడానికి వస్తే క్షత్రియుడవైన నువ్వు ఎవరిని ప్రార్థించాలంటావా? అలా వారు వస్తే నువ్వు ఆయుధాలు పట్టవచ్చు. కాని, ఇప్పుడు మీరు విల్లు - ఆయుధాలు పట్టిన తీరు చూస్తే యుద్ధానికి పోతున్నట్లున్నది. అందువల్ల మీ శుభం, హితం కోరినదాన్నైన నేను, నిష్కారణ విరోధంతో మీకేం అశుభం కలుగుతుందో అని భయపడుతున్నా. నువ్వు సత్యం, ధర్మం పాటించేవాడివి. ఇంతదాకా ఆ రెంటినీ సమంగా కాపాడుకుంటూ వస్తున్నావు. సంతోషమే! ఇప్పుడు రెంటికీ విరోధం వచ్చేట్లున్నది. సత్యంతో విరోధించే ధర్మం, ధర్మం కాదు. ధర్మంతో విరోధించే సత్యం, సత్యం కాదు.’
‘మీరు ఇప్పుడు అడవులకు ప్రయాణమై పోవడం సమ్మతమైన కార్యం కాదు. పోతే ఏవౌతుందంటావా? కారణం చెప్తా విను. మీరు యుద్ధానికి పోయే విధంగా చేతుల్లో విల్లంబులు, కత్తులు ధరించి పోతున్నారు. తోవలో ఎవరైనా రాక్షసుడు కనిపిస్తే ఇదిగో రాక్షసుడు దొరికాడని వాడిమీద బాణం వేస్తారు. ఆ దెబ్బకు వాడు చస్తాడు. అదే రాక్షసులకు, మనకు విరోధ కారణమవుతుంది. రాక్షసులు మనకు ప్రత్యక్షంగా అపకారం చేస్తే వారిని చంపవచ్చు కాని, ఎవరో ఋషీశ్వరులు చెప్పారని రాక్షసులను చంపి మనం కయ్యానికి కాలు దువ్వడం నాకిష్టం లేదు. రాక్షసుల మీద బాణం నువ్వు ప్రయోగిస్తావని నేనెలా ఊహించానంటావా? నువ్వు రాక్షసులను చంపుతానని ప్రతిజ్ఞ చేశావు. నువ్వు సత్య ప్రతిజ్ఞుడవు. కాబట్టి చంపక మానవు. భయపడవద్దు.. నిష్కారణంగా నువ్వెవరినీ చంపనని అంటావా? హింసించవచ్చే వారినే హింసిస్తానంటావా? అలా అని ధైర్యం చెప్తావా? అలా అయితే నీ ప్రతిజ్ఞ ఎలా నెరవేరుతుంది? దానికి సరైన కారణం కావాలి. ఆ కారణం నేనే అవుతా. అప్పుడు నా కొరకు నువ్వు రాక్షసులను వధించవచ్చు కాని, నువ్వు ఏకపత్నీవ్రతుడవు కదా! నన్ను వదిలి నువ్వెలా వుంటావు? నా వియోగం వల్ల నువ్వెంత దుఃఖిస్తావో? నీ దుఃఖం నేను సహించలేను. కాబట్టి నువ్వు అరణ్యానికి పోవడం నాకిష్టం లేదు. నా వియోగం వల్ల మీ ప్రతిజ్ఞ నెరవేరడం ఎలా? ప్రతిజ్ఞ చెడినప్పటికీ మీరు దుఃఖపడకుండా ఉండటం ఎలా? అనేదే నా ఆలోచన. క్షత్రియులకు చేతిలో ఆయుధం వుంటే బలాన్ని తేజాన్ని వృద్ధి చేస్తుంది. కాబట్టి కలహం లేకుండా వుండేందుకు మీ ఆయుధాలను ఇక్కడే వుంచి పోదాం.’

-సశేషం

-వనం జ్వాలా నరసింహారావు 80081 370 12