S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం (అరణ్యకాండ-19)

వాసుదాసు వ్యాఖ్యానం
ఆర్తరక్షణ పరమ ధర్మమని సీతకు చెప్పిన శ్రీరాముడు

రాముడు ఆడిన మాట తప్పేవాడు కాదు. కాబట్టి రాక్షస వధ చేయకుండా వుండడు. అలా అని నిష్కారణంగా వాళ్లను చంపడు. రాక్షసులేమో దుష్టులు.. ఊరకే వుండేవారు కాదు. రాముడి ధనస్సు చూసి తమకు కీడు కలుగుతుందని భయపడి, వారే ఏదైనా కీడు చేయడానికి ప్రయత్నం చేస్తారు. రాముడు వూరకున్నా వాళ్లు వుండరు. అందుకే రాక్షస వధ మానని సీతకు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. పతివ్రత అయిన సీతాదేవి కేవలం తన మీద ప్రేమతో, తన క్షేమం కోరి, చెప్పిన మాటలను విని, ఆమె అభిప్రాయం గ్రహించి, సీతాదేవి చెప్పిన అర్థ - కామ సుఖాల మీద కోరిక లేక, ధర్మమే పరమార్థం అని, దాని మీదే మనసున్న వాడైన శ్రీరామచంద్రమూర్తి సీతతో ఇలా అన్నాడు:
‘దేవీ! నువ్వు నన్ను క్షత్రియులకు ‘సార్తివ్రజరక్షారంభమునకు గార్ముకధారమగు’ నని అంగీకరించావు కదా? ఇప్పుడు దండకలో వున్న మహానుభావులు గొప్ప మనస్సు కలవారు. ఆ కారణాన ఇతరులను బాధించరు. అందుకొరకై ఇతరులను ప్రేరేపించరు. అలాంటి అహింసాపరులైన ఋషులు రాక్షసులకు భయపడి వారంతట వారే, నా ప్రయత్నం లేకుండా, కడు దుఃఖంతో నా దగ్గరకు వచ్చి, నేనే దిక్కని శరణుజొచ్చారు. ఇలా నేనే దిక్కని నమ్మిన ఆ ఆశ్రీతులను ఎలాగైనా పాడైపొమ్మని తిరస్కరించడం ధర్మమా? నువ్వే చెప్పు. హింస నిషేధం అని నువ్వన్నావు. అది నేను అంగీకరిస్తా. హింస అంటే ఎలాంటిది? నిరపరాధులైన సాధువులను హింసించడాన్ని హింస అంటారు కాని అసాధువులను హింసించడాన్ని హింస అనరు కదా? రాక్షస వధ మీద నాకున్న ఉద్దేశం ఏంటి? అదేమన్నా వినోద క్రీడా నాకు? వాళ్లను నేను, కామంతో కాని, క్రోధంతో కాని, లోభంతో కాని, మదమాత్సర్యాలతో కాని, మోహంతో కాని చంపాలనుకోవడం లేదు కదా? సాధువుల మేలు కొరకై చేసే పనిలో దోషముందా? దేవీ ఈ మునులు అడవుల్లో, అక్కడొక కాయ, ఇక్కడొక కూర తెచ్చుకుని దాంతోనే కడుపు నింపుకుని దేహయాత్ర చేస్తారు. ఇక రాక్షసులంటావా.. మృగాలనే కాకుండా మనుష్యులను కూడా పీక్కుని తిని భోగాలనుభవిస్తారు. మునులు ధర్మపద్ధతిన నడుస్తే, వారు దయాదాక్షిణ్యాలు లేకుండా క్రూర పద్ధతిన నడుస్తారు. మునులు ఎల్లప్పుడూ వ్రతాలు ఆచరిస్తున్నందువల్ల ఇతర కార్యాలంటే ఆసక్తి లేనివారు.. ఇక రాక్షసులు శిశ్నోదరపరాయణులై ఇతరులను బాధించడమే వ్రతంగా వున్నవాళ్లు. ఇలాంటి నిష్కారణ హింసాపరాయణులైన రాక్షసులను వధించి శిష్ట రక్షణ చేయడం అధర్మమా చెప్పు?’
‘దండకారణ్యంలో నివసిస్తున్న మునీశ్వరుల సమూహాలు మా ఇద్దరి దగ్గరకు వచ్చి, అనేక విధాలుగా తాము పడుతున్న దుఃఖాలను చప్పి, తమను రక్షించాలని ప్రార్థించారు. అప్పుడు నేను, వారి పాదాలకు నమస్కారం చేసి, మునులు తన్ను చూడడానికి ముందే, వారిని చూడడానికి తాను పోనందుకు సిగ్గుపడుతున్నానని, తాను చేసిన అపరాధానికి దయతో క్షమించమని అన్నాను. వారి కోరికలేంటనీ, వారికి తాను చేయాల్సిన సహాయం ఏంటో చెప్పమని అడిగాను. అప్పుడు, దేవీ, ఏకవాక్యంగా వారంతా ఒక్కటే చెప్పారు. దండకలో వున్న రాక్షసులు తమపై పగబూని, తాము హోమం చేస్తున్న సమయంలో తమను బాధపెడ్తున్నారని, ఆ బాధ పడలేక తమకు రక్షకుడు ఎవరు వస్తారో అని విచారపడ్తుండగా, తమ పుణ్యఫలం వల్ల నేను దొరికానని అన్నారు. తపస్సు చేయడం సులువు కాదనీ, అది మిక్కిలి కష్టకార్యమనీ, అంత కష్టపడి చేద్దామంటే మధ్యమధ్యలో విఘ్నాలు కలుగుతున్నాయనీ, తమ తపశ్శక్తి పోగొట్టుకోదల్చుకోలేక వారిని శపించడం లేదనీ, ఎంత మందిని అలా శపించగలమనీ, ఒకవేళ శపించినా తమకింక ఏ శక్తి మిగుల్తుందనీ, జీవించినా వ్యర్థమే కదా అనీ, వాళ్లన్నారు’
వాళ్లింకా ఇలా చెప్పారు. ‘నిర్మలమైన కీర్తికలవాడా! మా స్థితిగతులను ఆలోచించు. రాక్షసులు చేసే పనులు ఆపు చేయించు. మా తపస్సులు సాగేట్లు చేయి. మా మీద దయచూపి మమ్మల్ని రక్షించు. నువ్వు, నీ తమ్మడే మాకిక్కడ దిక్కు. వేరే రక్షించేవారెవరూ లేరు. మీరు తప్ప మరే రాజులైనా వీరి బారి నుండి మమ్మల్ని కాపాడలేరు. పూబోణీ! వాళ్లిలా చెప్పగా వారిని కాపాడాలని ప్రతిజ్ఞ చేశాను. వట్టి మాటలు చెప్పి కన్నీళ్లు తుడిచి పంపలేదు. నాకు సత్యం అన్నింటి కంటే ముఖ్యం కాబట్టి ప్రాణాలున్నంత వరకు చెప్పిన మాట తప్పను. నువ్వే దిక్కని నన్ను ఆశ్రయించి, ఎప్పుడు కూడా ఇతరులకు హాని కలిగిచే వాటి జోలికి పోకుండా, దిక్కులేని వారిగా వున్న మునులను, రాక్షసులు పనిగట్టుకుని వధించారు. నువ్వు నిర్మలమైన మనసున్న దానివి కదా? ఇంతకంటే విరోధమైన పని ఏమన్నా ఉందా చెప్పు? నన్ను ఆశ్రయించే దాకా ఎవరే పాపాలు చేసినా వారి పాప ఫలం వాళ్లే అనుభవిస్తారని, వారిని నేను రక్షించే ప్రయత్నం చేయను. ఒకసారి నన్ను ఆశ్రయిస్తే, నేనే దిక్కని వారి రక్షాభారం నా మీద వేస్తే, పాపకార్యాలు చేయకుండా ఉండే దిక్కులేనివారిని రక్షించడమే నా పని. దానికి నేను కట్టుబడి ఉన్నాను. అలాంటి వారిని, నా రక్షణలో వున్నవారిని, నా ఆశ్రీతులను, రాక్షసులు చంపుతున్నారు. నా భక్తులు నా ప్రాణంతో సమానం. నా భక్తులను బాధించడమంటే నన్ను బాధించడమే. కాబట్టి పగకు దీనికి మించిన కారణం ఏం కావాలి? దీనికి జవాబు చెప్తే, సుమతీ, నువ్వు చెప్పినట్లే చేస్తా. ఇక నా మనోనిశ్చయం విను. సత్యాన్ని రక్షించేందుకు ప్రాణాలైనా విడుస్తాను. ప్రాణాలకంటే ఇష్టమైన నిన్నైనా విడుస్తాను. నీకంటే ప్రియమైన తమ్ముడినైనా విడుస్తాను. కాని సామాన్య విషయమైన ప్రతిజ్ఞ విడువను. అందునా, ముఖ్యంగా, బ్రాహ్మణులకు ఇచ్చిన మాట తప్పను.’
శ్రీరాముడు సీతతో ఇంకా ఇలా అన్నాడు: ‘ఆశ్రీత రక్షాభారాన్ని వహించిన నేను ఆ ఆశ్రీతులై, నా పరతంత్రులై, వుండే మునుల కార్యాన్ని రక్షించడం నా విధి. ఒక్కసారి వాళ్లు నాతో మేము నీ ఆశ్రీతులం అని చెప్తే చాలదా? గడియ గడియకు చెప్పాలా? నేనంత మరిచేవాడినా? వారి యోగక్షేమాలు నేను విచారించాల్సిన వాడిని. అలాంటిది, వారు వచ్చి, నేను చేయాల్సిన పనిని గుర్తు చేసిన తరువాత, వారికి ప్రతిజ్ఞ చేసి కూడా ఎలా నెరవేర్చకుండా ఉంటాను? నువ్వు జనక రాజు కూతురువు కదా! ఇది నీకు తెలియని విషయమా? అప్పు తీసుకున్నవాడు మళ్లీ మళ్లీ అడిగించుకోవచ్చా? అడిగించుకుని ఇవ్వడం శ్లాఘ్యమా? ఇవ్వకపోవడం శ్లాఘ్యమా? రెండూ కావు. నన్ను నమ్మి, నన్ను స్మరించి, నన్ను ధ్యానించి, అర్చించి, జపించి, సేవించి, వర్ణించి, కీర్తించి నాపై ఋణమెక్కించిన వారి ఋణం నేను తీర్చుకోవద్దా? నా భక్తుడిని నేను స్మరిస్తాను. నేను చెప్పిన మాట నెరవేర్చడం ఆలస్యమైందని నేను విచారపడుతుండగా వారి కార్యం నెరవేర్చకుండా ఎలా వుండగలను? నాకు నీ మీద, నీకు నా మీద, స్నేహం - మోహం వున్న కారణాన, నువ్వు మంచి మనసున్నదానివైనందున, ఇదంతా చెప్పాను. రక్షోవధకు పూనుకున్నప్పుడు నాకు నీ మీద, నీకు నా మీద కల స్నేహానికి - మోహానికి విఘ్నం కలుగొచ్చునేమొ అన్న నీ అనుమానం గ్రహించాను. అది సహించైనా కార్యం నెరవేర్చాలి. నువ్వు ఉత్తమ స్ర్తివి కాబట్టి, నీకిలాంటి మంచి మాటలు చెప్పగలిగాను. స్నేహం - మోహం భర్తకు తమ మీద లేకపోయినా, భర్తల మీద తమకు లేకపోయినా చెప్పగలరా? చెప్పరు. కాబట్టి నువ్వు ఉత్తమ గుణ సంపన్నవనీ, నిష్కపటవ్యాపారవనీ మెచ్చాను. నిర్దోషురాలా! కమలహస్తా! నువ్వు పుట్టిన జనక వంశానికి, నీ శీలానికి తగిన విధంగా చెప్పాను. ఇదేం దోషం ఉంది? నువ్వు సహధర్మచారిణివి. ప్రాణాలకంటే ఎక్కువ ప్రియమైన దానివి’ అని చెప్పి లక్ష్మణుడు, సీత తోడురాగా శ్రీరాముడు విల్లు ధరించాడు. -సశేషం

-వనం జ్వాలా నరసింహారావు 80081 370 12