S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రామాయణం.. 91 మీరే డిటెక్టివ్

హరిదాసు ఆ రోజు కథని ఇలా ఆరంభించాడు.
‘ఇవాళ మీకు 85, 86 సర్గలు చెప్తాను. అరణ్యవాసైన గుహుడు మంచి గుణాలు గల భరతుడికి మహాత్ముడైన లక్ష్మణుడి సోదర ప్రేమ మొదలైన సద్గుణాల గురించి చెప్పాడు.
‘సద్గుణవంతుడైన లక్ష్మణుడు బాణాలు, కత్తులు ధరించి సోదరుడి రక్షణ కోసం పూర్తిగా మెళకువగా ఉన్నాడు. ఆ లక్ష్మణుడితో నేను ఇలా చెప్పాను. ‘తండ్రీ లక్ష్మణా! ఈ సుఖవంతమైన పడకని నీ కోసమే ఏర్పాటు చేసాను. నిర్భయంగా దీని మీద సుఖంగా పడుకో. మేమంతా కష్టానికి అలవాటు పడ్డవాళ్లం. నువ్వు సుఖానికి అలవాటు పడ్డవాడివి. రాముడి రక్షణ కోసం మేం మెలకువగా ఉంటాం. ఈ భూలోకంలో నాకు రాముడి కంటే ప్రియమైనవాడు ఎవడూ లేడు. అందువల్ల నువ్వు భయపడకు. నిజం చెప్తున్నాను. రాముడి అనుగ్రహం వల్ల ఈ లోకంలో గొప్ప కీర్తిని, అధిక ధర్మాన్ని, పరిశుద్ధమైన అర్థ, కామాలని పొందాలని కోరుకుంటున్నాను. అలాంటి నేను నా బంధువులతో కలిసి చేతిలో బాణాలు ధరించి, నిద్రించే సీతారాములని రక్షిస్తాను. సదా ఈ అడవిలో తిరిగే నాకు ఇక్కడ తెలీందేమీ లేదు. చతురంగ సైన్యాన్ని కూడా మేం యుద్ధంలో ఎదిరించగలం’ నా మాటలు విన్న లక్ష్మణుడు ధర్మదృష్టితో ఇలా చెప్పాడు. ‘రాముడు సీతతో కలిసి నేల మీద పడుకుని ఉండగా నేను ఎలా సుఖంగా నిద్రపోగలను? ఓ గుహుడా! దేవతలు, రాక్షసులు కలిసి కూడా ఏ రాముడ్ని యుద్ధంలో ఎదిరించలేరో ఆ రాముడు సీతతో కలిసి గడ్డి మీద పడుకున్నాడు చూడు. ఈ రాముడు దశరథుడితో సమానమైన లక్షణాలు గలవాడు. గొప్ప తపస్సు చేసి, అనేక విధాలైన కష్టాలని సహించి దశరథుడు రాముడ్ని కన్నాడు. రాముడు ప్రవాసానికి వెళ్లాక దశరథుడు ఎక్కువ కాలం జీవించడు. ఈ భూమి త్వరలోనే వైధవ్యం పొందుతుంది. అంతఃపురపు స్ర్తిలు పెద్దగా అరిచి, అరిచి అలసి ఏడుపుని ఆపుతారు. ఇప్పుడు ఆ రాజు ఇంట్లో ఆ ఏడుపులు నిలిచిపోతాయి. కౌసల్య, దశరథుడు, నా తల్లైన సుమిత్ర, వీరంతా ఈ రాత్రి జీవించి ఉండగలరనే విశ్వాసం నాకు లేదు. శతృఘు్నడి చూసుకుని నా తల్లి జీవించి ఉండచ్చేమో కాని, వీరమాతైన కౌసల్య మాత్రం దుఃఖంతో మరణిస్తుంది. నా తండ్రి ఒకదాని వెనక ఒకటిగా ఏ కోరికనీ తీర్చుకోలేక, రాముడికి రాజ్యాభిషేకం చేయకపోవడం వల్ల మరణిస్తాడు. ఆ సమయం వచ్చినప్పుడు పోయిన తండ్రికి ప్రేతకార్యాలన్నీ చేసే భరత శతృఘు్నలు ధన్యులు. వారంతా మా తండ్రి రాజధానిలో సుఖంగా తిరగ్గలరు. అక్కడ ముంగిళ్లు చక్కగా అలంకరించి ఉంటాయి. విశాలమైన రాజమార్గాలు, ధనికుల ఇళ్లు, ప్రాసాదాలు ఆ నగరమంతటా ఉన్నాయి. అన్ని విధాలైన రత్నాలతో నగరం అలంకరించబడి, ఏనుగులతో, గుర్రాలతో, రధాలతో కిక్కిరిసి ఉంటుంది. అక్కడ మంగళవాద్యాలు మారుమోగుతూంటాయి. ఆ నగరం సంతోషించే ప్రజలతో నిండి ఉంటుంది. ఆ నగరమంతా ఇళ్ల వెనక చిన్నచిన్న ఆరామాలు, విశాలమైన ఉద్యానాలు ఉంటాయి. ప్రజలు సమాజాలుగా ఏర్పడి ఉత్సవాలు చేసుకుంటారు. ఈ గడువు దాటాక మాటని నిలబెట్టుకుని, క్షేమంగా ఉన్న రాముడితో కలిసి నేను సుఖంగా అయోధ్యలోకి ప్రవేశించగలనా?’
‘మహాత్ముడైన ఆ రాజపుత్రుడు ఇలా నించుని దుఃఖిస్తూండగానే ఆ రాత్రి గడిచింది. నేను వాళ్లని సుఖంగా ఈ నదిని దాటించాను. శతృసంహారకులు, మహాబలశాలులు, గజరాజులతో సమానమైన ఆ రామలక్ష్మణులు జటాధారులై, నారచీరలు కట్టుకుని, బాణాలు, ధనస్సులు, కత్తులని ధరించి సీతతో కలిసి వెళ్లిపోయారు. (అయోధ్యకాండ 86వ సర్గ)
గుహుడు చెప్పిన ఆ బాధాకరమైన మాటలని విని, భరతుడు విన్నచోటే కూర్చుని ఆలోచించసాగాడు. సుకుమారుడు, గొప్ప బలం, సింహం వంటి మూపు, గొప్ప భుజాలు, పద్మాల్లా విశాలమైన కళ్లు గల చూడటానికి ఆనందాన్ని కలిగించే యువకుడైన ఆ భరతుడు క్షణకాలంలో తెప్పరిల్లి, బాగా విచారిస్తూ, కొరడాలతో బాగా కొట్టబడ్డ ఏనుగులా వెంటనే నేల మీద పడ్డాడు. దగ్గరే ఉన్న శతృఘు్నడు శోకంతో నేలమీద పడి ఉన్న భరతుడ్ని కౌగలించుకుని స్పృహ తప్పిన వాడిలా బిగ్గరగా ఏడ్చాడు. అప్పుడు ఉపవాసాలతో కృశించి, దీనులై, భర్తకి దూరమై దుఃఖించే తల్లులంతా భరతుడి దగ్గరకి వచ్చారు. వారంతా ఏడుస్తూ నేల మీద పడ్డ భరతుడి చుట్టూ నించున్నారు. కౌసల్య దుఃఖంతో అతన్ని కౌగిలించుకుంది. శోకంతో కృశించిన కౌసల్య వాత్సల్యంతో తన పుత్రుడ్ని కౌగలించుకున్నట్లుగా భరతుడ్ని కౌగలించుకుని ఏడుస్తూ అడిగింది.
‘కుమారా! నిన్ను ఏ వ్యాధీ బాధించడం లేదు కదా? ఇప్పుడు ఈ రాజవంశం భవిష్యత్ నీ మీదే ఆధారపడి ఉంది. రాముడు లక్ష్మణుడితో కలిసి అడవికి వెళ్లిపోయాడు. మహారాజు మరణించాడు. ఇప్పుడు నినే్న చూసుకుని జీవిస్తున్నాను. నువ్వొక్కడివే ఇప్పుడు మా రక్షకుడివి. కుమారా! లక్ష్మణుడి గురించి కాని, భార్యతో కలిసి అడవికి వెళ్లిన నా ఏకైక కొడుకు గురించి కాని నువ్వేదైనా అశుభవార్త వినలేదు కదా?’
వెంటనే భరతుడు తేరుకుని, కౌసల్యని ఓదార్చి ఏడుస్తూనే గుహుడ్ని అడిగాడు.
‘ఓ గుహుడా! నా సోదరుడు రాత్రి ఎక్కడ నివసించాడు? సీత ఎక్కడ నివసించింది? లక్ష్మణుడు ఎక్కడ నివసించాడు? వాళ్లు ఏం తిన్నారు? ఏ పక్క మీద పడుకున్నారు? ఇవన్నీ నాకు చెప్పు’
బోయరాజు గుహుడు సంతోషంగా, ప్రియుడు, హితుడైన, అతిథిగా వచ్చిన రాముడి విషయంలో తను ఎలా ప్రవర్తించాడో భరతుడికి చెప్పాడు.
‘నేను రాముడి భోజనం కోసం చాలా రకాలైన అన్నాలు, భక్ష్యాలు, అనేక రకాల పళ్లని తీసుకువచ్చాను. సత్యపరాక్రముడైన రాముడు వాటన్నిటినీ వెనక్కి తీసికెళ్లమని ఆజ్ఞాపించాడు. అతను క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూ వాటిని స్వీకరించలేదు. గొప్ప కీర్తిగల ఆ రాముడు, సీత కూడా లక్ష్మణుడు తీసుకువచ్చిన నీళ్లని తాగి ఆ రోజు ఉపవాసం చేశారు. లక్ష్మణుడు కూడా మిగిలిన నీటిని ఆహారంగా తీసుకున్నాడు. ఆ ముగ్గురూ వౌనాన్ని పాటిస్తూ ఏకాగ్ర మనసుతో సంధ్యోపాసన చేశారు. తర్వాత లక్ష్మణుడు స్వయంగా దర్భలని తీసుకువచ్చి రాముడి కోసం ఓ మంచి పడకని ఏర్పాటు చేశాడు. రాముడు సీతతో కలిసి దాని మీద పడుకున్నాడు. లక్ష్మణుడు వారి పాదాలను కడిగి, దూరంగా వెళ్లి నించున్నాడు. సీతారాములు ఇద్దరూ ఆ రాత్రి పడుకున్న వృక్షం ఆ గడ్డి పరుపూ ఇవే. లక్ష్మణుడు అరచేతులు, వేళ్లని రక్షించే తొడుగులు తొడుక్కుని, బాణాలతో నిండిన అంబుల పొదిని వీపున కట్టుకుని వారి నారి కట్టిన ధనస్సుని చేతిలో ఉంచుకుని రాత్రంతా రాముడి చుట్టుపక్కలే నించుని ఉన్నాడు. అప్పుడు నేను కూడా మంచి బాణాలు, ధనస్సుని ధరించి బాణాలు ధరించిన ఏమరుపాటు లేని నా బంధువులతో కలిసి, ఇంద్రుడితో సమానమైన రాముడ్ని రక్షిస్తూ లక్ష్మణుడు నిలబడ్డ చోటే నిలబడ్డాడు. (అయోధ్యకాండ 87వ సర్గ)
ఆశే్లష వెంట ఆ రోజు వచ్చి ఆ హరికథని విన్న వాడి అమ్మమ్మ మీనమ్మ తిరిగి వెళ్తూ దారిలో చెప్పింది.
‘హరిదాసు నాలుగు తప్పులు చెప్పాడ్రా. ఇంటికెళ్లాక అయోధ్యకాండలోని 86, 87 సర్గలు చదివి చూడు’
మీరా తప్పులని పట్టుకోగలరా?
*
మీకో ప్రశ్న
*
ఇంగుదీ వృక్షాన్ని తెలుగులో
ఏమంటారు?
*
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు
*
లక్ష్మణుడి సంతానం ఎవరు?.. అంగదుడు, చంద్రకేతు
*
1. ‘భరతుడి రథం మీది జెండా మీద కోవిధార వృక్షం ఉంది’ అని గుహుడు చెప్పాడని వాల్మీకి రాసింది హరిదాసు చెప్పడం విస్మరించాడు.
2. ‘రాముడు నాకు ప్రభువు మాత్రమే కాదు. స్నేహితుడు కూడా’ అని గుహుడు చెప్పిన దాంట్లో రెండో భాగాన్ని హరిదాసు చెప్పడం విస్మరించాడు.
3. కవచాలు ధరించి ఒకో పడవలో వందమంది చొప్పున ఐదువందల పడవల్లో సిద్ధంగా ఉండాలి అని గుహుడు చెప్పాడు. కానీ హరిదాసు అటుదిటు చేసి ‘పడవకి ఐదువందల చొప్పున వంద పడవల్లో సిద్ధంగా ఉండాలి’ అని తప్పు చెప్పాడు.
4. వెయ్యిమంది బంధువులతో గుహుడు భరతుడ్ని కలవడానికి వెళ్ళాడు అని వాల్మీకి రాశాడు. కానీ హరిదాసు తప్పుగా ‘తన బంధువులతో వస్తున్నాడని సుమంత్రుడు చెప్పాడని’ హరిదాసు తప్పు చెప్పాడు.
5. నేను ఏ దారిలో భరద్వాజాశ మానికి వెళ్ళచ్చో చెప్పు అని భరతుడు గుహుడ్ని అడిగాడు. కానీ రాముడు ఎక్కడ ఉన్నాడో చెప్పు అని భరతుడు అడిగినట్లుగా హరిదాసు తప్పు చెప్పాడు.
6. హరిదాసు చెప్పినవి రెండు సర్గలే.. 84, 85. కానీ పొరపాటున మూడు సర్గలు చెప్పానని తప్పు చెప్పాడు.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి