S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మాట - మనుగడ

‘చతుర సంభాషణ ప్రవీణ’ జంధ్యాల శాస్ర్తీగారు తానే సంపాదకుడుగా తాను నడుపుకుంటున్న ‘అపూర్వార్థ ప్రకాశిక’ మాస పత్రిక ప్రథమ వార్షికోత్సవం జరుగుతోంది. వరుసగా మూడు రోజులపాటు జరుప తలపెట్టిన ఆ వార్షికోత్సవంలో అది మూడవ రోజు సాయంత్రం, ఆఖరి అంశ సమావేశం. అంతకు ముందు వరకు రోజుకు రెండు సెషన్స్ చొప్పున సినిమాలలో అశ్లీలత - రాద్ధాంతం, ఛానల్స్ యాంకర్ల భాష - ఆధునికత, పత్రికలలో సినిమాంగనలు - ఛాయా చిత్రాలు, ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా వాణిజ్య ప్రకటనలు - వివిధ ఆకర్షణలు, పరుగెత్తే యుగం (రన్నింగ్ ఏజ్)లో పాత్ర సంప్రదాయాలా? అనే అయిదు అంశాల మీద అయిదు పూటల పాటు చర్చోపచర్చలు, వాద ప్రతివాదాలు, ఖండన మండనలు, సభ్యవక్తల మధ్య అసభ్య పద దండయాత్రలు, ప్రశంసాభిశంసనలు, మాటల కుమ్ములాటలు, సవాళ్ల ప్రతిసవాళ్ల శరసంధానాలు, ఛాలెంజ్‌లతో ఛాతీలు విరుచుకోవటాలు, తొడలు చరచుకోవటాలు, కోందరు కోమలులు మెటికలు విరుచుకోవటాలు మొదలైన వాటితో సభా సమావేశాల హాలు దద్దరిల్లిపోయింది. ముందు, వెనుకల గోడల పెచ్చులూడిపోయాయి. కిటికీల తలుపులు ఊగిపోయాయి. కొన్నిటి గుడిదెలు (హింజ్‌లు) వదులై మేకులు ఊడిపోయాయి. స్టేజీ మీద ఆరడుగుల పెడస్టల్ ఫ్యాన్ వంకర తిరిగిపోయింది. ఒక మూల సీలింగ్ ఫ్యాన్ రెక్కలు టపటపమంటూ పైకీ కిందకీ మారిపోయాయి.
మరి పాల్గొన్న వాళ్లు సామాన్యులా? వివిధ చలనచిత్ర సంస్థల నిర్మాతలు - పెట్టుబడి నిర్ణేతలు (డిస్ట్రిబ్యూటర్లు), దర్శకులు - పారదర్శకులు, రచయితలు - పంచ్ డైలాగ్స్ ‘పచయిత’లు, ఛానల్స్ డైరెక్టర్లు - ‘టెల్గీష్’ యాంకర్లు, పత్రికీయులు - రాజకీయ మానస పుత్రకీయులు, వాణిజ్య వర్గీయులు - ఏదో యథాలాభ మార్గీయులు, విప్లవ భావీయులు - విశృంఖల జీవీయులు - అబ్బ ఒక రకమా ఒక వ్యాపకమా? వివిధ మానసిక ప్రవృత్తుల వాళ్లు, వివిధ కోణ వ్యావృత్తుల వాళ్లు ఆహూత సభ్యులు (ఇన్వైటీస్)గా పాల్గొన్నారు.
ఇంతకీ ఆఖరి సమావేశం ఏమిటి అంటే జంధ్యాల శాస్ర్తీగారి ‘బహుకోణ వ్యాఖ్యాన గోష్ఠి’ అంటే ఈ సమావేశంలో పైన చెప్పిన వర్గీయులే కాకుండా లోకజ్ఞానులు, పాక జ్ఞానులు, అక్షర జ్ఞానులు, అల్ప జ్ఞానులు, అనల్ప జ్ఞానులు, విజ్ఞానులు, అజ్ఞానులు, అర్ధ జ్ఞానులు, జిజ్ఞాసాపరులు, నవభావాశాపరులు - ఇలా ఏ తరహా వాళ్లైనా, ఏ తరగతి వాళ్లైనా, ఏ అభిరుచి కలవాళ్లైనా, ఏ ఆలోచనా అరుచిగల వాళ్లైనా పాల్గొనవచ్చు. ఏవైనా ప్రశ్నలు అడగవచ్చు. అందరికీ జంధ్యాల శాస్ర్తీగారు ఓపిగ్గా, తీరిగ్గా, ఏ రొష్ఠూ లేకుండా తన ఈ గోష్ఠిలో జవాబులు చెబుతారు తనకున్న లోకానుభవాన్ని దృష్టిలో పెట్టుకొని.
జంధ్యాల శాస్ర్తీగారే గోష్ఠి ప్రారంభించారు. ‘మహాజనులారా! మహదానందం మీ అందరి రాక. నేను ఈ ఆఖరి సమావేశంలో ఎన్నుకున్న అంశం ఏమిటంటే ‘సరదా సూక్తులు’. సూక్తులు రెండు విధాలు - ఉదాత్త సూక్తులలు, ఉదార సూక్తులు అని. విదురుడు, వ్యాసుడు, భగవద్గీత, భర్తృహరీయం మొదలైన పురాణ పురుషులు, పుస్తకాల నుంచి తెలుసుకునేవి ఉదాత్త సూక్తులు. నేటి కాలంలో బ్రతకనేర్చిన లోకజ్ఞాన ‘మనీషులు’ జనంలోకి ఊదేవి, వాటికి తమ పూచీ అనే పేచీ లేనివి అయిన రంగురంగుల ‘బెలూన్’ సూక్తులు ఉదార సూక్తులు. ఉదార సూక్తులలో ఒక రకమే సరదా సూక్తులు అంటే.
‘ఈ సరదా సూక్తులు అనే కార్యక్రమంలో మీలో ఎవరైనా సరే ఏదో ఒక విషయం మీద నన్ను కామెంటో, వ్యాఖ్యో, దృష్టి కోణమో, ఇంప్రెషనో, రియాక్షనో ఏమిటి అని అడుగుతారు. దానికి నేను లోకరీతి కోణంలో సమాధానమిస్తాను ఒక్క ముక్కలో. సరేనా?’ అంటూ జనం వైపు చూశారు. జనాలు తమ ఆమోదాన్ని ఓ.కే. అంటూ ముక్త కంఠులై తెలియజేశారు.
‘సరే అయితే కానివ్వండి. అడగండి. చూద్దాం ఎలా ఉంటుందో ఈ గోష్ఠి ఒక నూత్న ప్రయత్నంగా’ అన్నారు శాస్ర్తీగారు.
అందరిలోనూ ఒక ఉత్కంఠ మొదలైంది ఏ రీతిలో శాస్ర్తీగారు సమాధానాలిస్తారో చూద్దామని.
కొన్ని క్షణాలు నిశ్శబ్దం. ఆ వెనుక గుసగుసలు. ఒక నిమిషం సేపు సమావేశస్థుల మధ్య - పక్కపక్క కుర్చీల వాళ్ల మధ్య - సంప్రదింపులు. చాలా మంది తాము అడగదల్చుకున్న అంశాల, ప్రశ్నల గురించి పక్కవాళ్లతో అభిప్రాయాలు, సలహాలు పంచుకుంటున్నారు.
ఇంతలో ఒక లోకజ్ఞాన జిజ్ఞాసువు లేచి నుంచున్నాడు. సభ సద్దుమణిగింది. అతను అడిగాడు ‘శాస్ర్తీగారూ! నీరు - నిజాలను కలిపి ఒక సూక్తి చెప్పండి’
‘నీరు పల్లమెరుగు - నిజము ఆలి ఎరుగు’ అన్నారు ఏ మాత్రమూ తడుముకోకుండా జంధ్యాల. అందరూ ఒకటే పకపకలు. ఆడవాళ్లు మగవాళ్ల వైపు చూశారు వాళ్ల రియాక్షన్ తెలుసుకుందామని, ఏమంటారు మీ మగ పురుషులు, పురుష మేధావులు అన్నట్టూను.
ఆ తరువాత ఒక సంఘ విజ్ఞాన శాస్తవ్రేత్త (సోషియాలజిస్ట్) అడిగాడు ‘పురుష లక్షణం - స్ర్తి లక్షణం వివరించండి సార్’ అని.
‘ఉద్యోగం పురుష లక్షణం; యాజమాన్యం భార్య లక్షణం’ అన్నారు శాస్ర్తీగారు పురుషులు, స్ర్తిల వైపు మార్చిమార్చి చూస్తూ. మహిళల నుంచి గర్వరేఖా మందహాసాల ఫ్లాష్‌లు ఒక పరంపరగా వెలుగులు వారాయి.
‘పొరపాట్లు అనే దాని మీద మీ వ్యాఖ్య?’ అడిగాడు ఒక నడి వయస్కుడు. ‘పొరపాట్లు రెండు. పుట్టక ముందు పుట్టాలి అనుకోవడం ఒకటి. పుట్టినాక పెండ్లి చేసుకోవటం ఒకటి’ శాస్ర్తీగారి సమాధానం. తత్వం బోధపడ్డట్టు, ఔనౌను అన్నట్టు తల ఊపాడు ఆ నడి వయస్కుడు.
‘స్వచ్ఛత యొక్క ఉనికి అనే దాని మీద మీరేమంటారు?’ ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఉద్యోగి ప్రశ్నించాడు.
‘పరిసరాల స్వచ్ఛతకు కొన్ని కొన్ని ‘్ఛనళ్ళే చేటు’ అంటూ ‘శే్లష’లో చెప్పారు శాస్ర్తీగారు. ఛానల్ అంటే నీటి ప్రవాహం అని కూడా అర్థం. అది కలుషిత జల ప్రవాహమైనా కావచ్చు. ఈ రెండు అర్థాల పద సమాధానం అర్థమై ఆ ఛానల్ ఉద్యోగి తిక్కమొగం పెట్టాడు తమ మీడియా ‘డైరెక్టర్‌కు ఏమని చెప్పాలో ఆఫీసుకెళ్లాక’ అని బుర్ర గోక్కుంటూ.
ఆ తరువాత ‘కవిని వెనక్కి నడిపిస్తే ఏమవుతాడు?’ అడిగాడు ఒక వర్ధమాన కవి.
‘విక వికలాడిపోతాడు’ అన్నారు ఠక్కున శాస్ర్తీగారు.
‘రెండు ప్రధాన కవితా ప్రక్రియలను వ్యాఖ్యానించండి’ ఒక ఆధునిక కవి ప్రశ్న - తనది ఏదో ఒక గొప్ప విశే్లషణాత్మక ప్రశ్న అన్న ‘లుక్కు’లతో, దృక్కులతో.
‘పద్య కవిత, వచన కవిత అత్తాకోడళ్లు. రెండు రకాలవీ వినటం శ్రోతల మొహమాటం’ అడిగినా అడక్కున్నా కవిత్వపు సుత్తి కొట్టే కొందరి మీద చురక వేస్తున్న చూపులతో జవాబు ఇచ్చారు జంధ్యాల శాస్ర్తీ.
‘అత్త - కోడలు - మామ. వీళ్ల స్థితిగతుల మీద మీరేమంటారు?’ ఒక ముసలి మామగారి ప్రశ్న.
‘అత్త తప్పులకు ఆరళ్లు లేవు. కోడలి తప్పులకు కోరంటికం లేదు. మామ తప్పులకే - మన్నింపు లేదు’ శాస్ర్తీగారు చెప్పారు అడిగినాయన అంతరంగాన్ని, ఇంట్లో అతని పరిస్థితిని అతను అడిగేప్పుడే అర్థం చేసుకున్న వారిగా.
‘్భర్త మేధావియైతే?’ అడిగాడొక సినిమా రచయిత. ‘్భర్త మేధావైతే భార్య గడుసరో, గడుగ్గాయో అవుతుంది’ ఏ మాత్రమూ తడుముకోకుండా శాస్ర్తీగారి జవాబు.
‘ఏలుడు అనే దాని మీద ఏదైనా సరదా సూక్తి చెప్పండి’ అడిగాడు ఒక కాబోయే కలెక్టర్. ‘్భర్త జిల్లాను ఏలితే భార్య జేబును ఏలుతుంది’ అన్నారు శాస్ర్తీగారు ఆడవాళ్ల వైపు చూస్తూ. నారీమణులందరూ కొరకొర చూశారు శాస్ర్తీగారి వైపు, ప్రేక్షకులలోని మగ పురుషుల వైపూను.
‘మోడర్న్ లైఫ్‌లో మోడల్ వైఫ్ అంటే ఎవరు’ అడిగాడు సంస్కృతాన్ని ఇంగ్లీషులో చదువుకున్న ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్.
‘కార్యేషు కంప్యూటర్; కరణేషు లాయర్;
భోజ్యేషు స్టార్ హోటల్; శయనేషు మూవీ స్టార్;
క్షమయా ఈనాటి సెన్సార్ బోర్డ్’ చెప్పారు శాస్ర్తీగారు ప్రొఫెసర్ గారికి కావలసిన ఆధునిక భాష - భావాల ‘్ధ్వని’, యాసలతో.
‘మారుతున్న తరాలలో పెరుగుతున్న బుద్ధి సూక్ష్మతా గుణకం (ఐ.క్యూ.) గురించి పాజిటివ్‌గా ఏమైనా చెప్పండి’ అడిగాడు ఒక అధ్యయనశీలి.
‘్భర్త పాజిటివ్ అయితే భార్య కంపారెటివ్. సంతానం సూపర్లేటివ్’ అన్నారు శాస్ర్తీగారు కాలగతిని అధ్యయనం చేస్తున్న జెంటిల్మన్ ధోరణిలో.
ఆ సమాధానానికి సభ నిశ్శబ్దం అయిపోయింది. హాస్య సస్యంగా ఉన్న సదస్సు అర్థాంతరంగా సీరియస్సై పోయింది. శాస్ర్తీగారు అది గమనించారు. ‘మీరందరూ కలిసి నన్ను మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. గ్లాసెడు నీళ్లిప్పించండి దప్పికగా ఉంది’ అన్నారు మందహాసం చేస్తూ, సభాజన సేవా కార్యకర్తల వైపు చూస్తూను.
జనం సీరియస్‌నెస్ నుంచి కొంచెం తేరుకున్నారు.
‘ఇన్ని ప్రశ్నలు వేస్తున్నా ఇంకా మీకు దాహమేనా?’ అన్నారు సభా మధ్యంలోంచి ఒకరు.
‘దాహము, మోహము అంత తేలిగ్గా తగ్గేవి కావు ఎవరికీ’ అన్నారు శాస్ర్తీగారు.
మళ్లీ సభలో చప్పట్లు, స్వచ్ఛమైన నవ్వులు. శాస్ర్తీగారు సభాసేవా కార్యకర్త తెచ్చి ఇచ్చిన మంచినీళ్లు తాగారు. ‘ఊఁ ఇక కానివ్వండి’ అన్నట్లు చేతితో సైగ చేశారు అందరి వైపు చూస్తూ.
‘పెద్దలు చేసే పనేమిటో చెప్తారా?’ అడిగాడు ఒక కాబోయే పెండ్లి కొడుకు తండ్రి.
‘పిన్నలకు పెళ్లి చేసి పెద్దలు తమ అసూయను చల్లార్చుకుంటారు’ అని నవ్వుతూను, నాన్చకుండాను జవాబు ఇచ్చారు ఎంతో భావగర్భితంగా శాస్ర్తీగారు.
‘పురుష జాతకం అనే దాని మీద ఏమైనా చెప్పండి’ అడిగాడు అంతకు ముందు రోజే పెళ్లైన ఒక కొత్త పెళ్లికొడుకు.
‘ప్రతి పురుషుడు ఒక శ్రీరాముడు. వివాహ ఘట్టం నుంచి ఒక మాయలేడి కోసం సంసారారణ్యంలో కష్టాల్లో చిక్కుకుంటాడు’ అన్నారు శాస్ర్తీగారు మగవాళ్ల వైపు చూస్తూ ‘ఏమంటారు?’ అన్నట్టు. కొందరు మగవాళ్లు గిల్టీగా మొహం పెట్టారు ఎందుకో మరి.
శాస్ర్తీగారు తన చేతి గడియారం చూసుకున్నారు. ‘ఆదరణీయ ఆహూతులారా! సభ్యులారా! ఇప్పటికే కాలాతీతమైపోయింది. అన్నానికి ఆకలేస్తోంది’ అన్నారు జంధ్యాలవారు. అన్నానికి ఆకలేస్తోంది అన్న వాక్యంలోని హాస్య చమత్కార భావానికి అందరి నవ్వులతో పుష్ బ్యాక్ కుషన్ ఛెయిర్లన్నీ టకటకమంటూ ముందు వెనుకలకు ఊగిపోయాయి.
మళ్లీ అందుకున్నారు శాస్ర్తీగారు ‘ఇక ఒకే ఒక ప్రశ్నకు బదులిస్తాను. ఇంతవరకు ఏ ప్రశ్న అడగని వాళ్లు ఎవరో ఒకరు అడగండి’ అంటూ.
‘బ్రతకనేర్చిన వాడు అంటే?’ అడిగాడు ఒక స్థానిక రాజకీయ నాయకుడు.
‘ఎప్పటికెయ్యది నెసెసిటి
అప్పటికా వర్డ్స్ చెప్పి అన్యుల హార్టుల్
హర్టింపక తా హర్టక
ఎస్కేపై తిరుగువాడు ఎక్స్‌పర్ట్ సుమతీ’ అని బదులిచ్చారు శాస్ర్తీగారు ప్రాసభంగమైనా హాస భంగం కాకూడదు అనుకుంటూ, వ్రతం చెడ్డా ఫలం దక్కాలి అన్నట్టు.
సభ చప్పట్లతో మార్మోగిపోయింది. జనం వెళ్లిపోయారు కాసేపటికి. ఆఖరి ప్రశ్నకు శాస్ర్తీగారు చెప్పిన సమాధానానే్న ముఖ్యంగా తీసుకొని, వారి మేధస్సును, లోకానుభవ జ్ఞానాన్ని ఒక స్థానిక ప్రముఖ వ్యక్తి, మరి కొందరు కలిసి తమ వ్యాపకము, వృత్తి, వ్యావృత్తులలో ఒక ప్రధాన ఆయుధంగాను, ఒక ‘బ్రాండ్ మార్క్’గాను, ఒక ‘లాండ్ మార్క్’గాను ఉపయోగించుకోవాలనుకున్న ఉద్దేశంతో శాస్ర్తీగారిని ఒక సంకీర్ణ వ్యాపక రంగంలోకి దించారు.
* * *
జంధ్యాల శాస్ర్తీగారు రాజకీయ నాయకుడై పోయాడు విచిత్రంగాను, ఆత్మకు విరుద్ధంగాను, కొందరి సంతోషం కోసమూను, వారితో తనకేర్పడ్డ మొహమాటంతోను - భీష్మ ద్రోణులు తమ అంతరాత్మలకు విరుద్ధంగానే, వాటిని చంపుకునే సమర రంగంలో ప్రవేశించినట్టుగా.
చాలామంది జనానికి మాత్రం నచ్చలేదు జంధ్యాల శాస్ర్తీగారు తీసుకున్న స్టెప్.
జీవితం తన మలుపు తానే తీసుకుంటుంది.
Life takes its own turn.
చూడాలి ముందు ముందు ఏవౌతుందో.

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం 98497 79290