S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పరమాత్మతో ఆత్మసమాగమం (రాస క్రీడాతత్త్వము-4)

తొమ్మిదవ దృక్కోణం :-

గోపికలలోకొంత కామముందేమో-అంటావా? ఒకే ఒక పురుషుణ్ణి వేల మంది స్ర్తిలు ఏకకాలంలో కామించి, ఏకకాలంలో చుట్టుముట్టి, ఫలితం పొందిన సందర్భాలు ఎక్కడైనా వున్నాయా?
అదీ గాక, రాసక్రీడా సమయానికి శ్రీకృష్ణుడి వయస్సు ఎంతో గూడా గమనించాలి. అది ఏడెనిమిది సంవత్సరాల ప్రాంతమని భాగవతంలో స్పష్టంగా వుంది. అప్పటికి ఆ గోపికల వయస్సెంత? రాసక్రీడకు వచ్చిన గోపికలలో కన్యలున్నారు, యువతులున్నారు, పెద్ద ముత్తయిదువ లున్నారు, పిల్లల తల్లులున్నారు. ఇన్ని వయసులవాళ్ళూ కూడ బలుక్కుని, ఒకే ఒకడికోసం వెంటబడటం కామంలో సాధ్యమా?
ఈ గోపికల పరిస్థితి అది కాదు. వాళ్ళు జన్మజన్మలుగా పరమాత్మను ప్రేమమార్గంలో, మధురభక్తి విధానంలో, ఉపాసించారు. అందుకే వారు పరమాత్మతో ఆత్మసమా గమం కోరారు. దానికోసమై పరితపించారు. దానికోసమై లోకధర్మాన్నీ, గృహధర్మాన్నీ, దేహధర్మాన్నీ, సిగ్గునూ, అసూయనూ, ఇంకా ఇలాంటి వాటినన్నింటినీ, మొదలంటా కోసివేశారు. దేహమే నేననే బుద్ధిని అతిక్రమించి, తాము పరమాత్మలో అంశలమని గ్రహించి, ఆత్మసంయోగం కోసం తపన పడ్డారు. అందువల్ల కామదృష్టితో వారి చర్యలను పరిశీలించరాదు.

పదవ దృక్కోణం :-

భక్తి భగవంతుడికి దగ్గరి దారి. భగవంతుడి దగ్గరికి చేర్చేదే భక్తి. ఈ నిర్వచనాలవల్ల ఉపయోగం లేదు. భక్తిని ఆచరణలో పెట్టే మార్గాలను తెలుసుకోవాలి. అవి పదకొండు. అన్ని మార్గాలూ ఒక దగ్గరికే చేరుస్తాయి. అయినా అన్నీ అందరికీ సరిపడవు.

(i) గుణమాహాత్మ్య భక్తి :

భగవంతుని కళ్యాణగుణాలనూ, ఆయన కళ్యాణ కర్మలనూ, అనుసంధానం చేసుకోవడమే గుణమహాత్మ్య భక్తి. నారదుడు, వేదవ్యాసుడు, సూతుడు, ఇప్పుడు నువ్వూ, నేనూ ఈ దారిలో వున్నాం.

(ii) భగవద్రూప భక్తి :

జనకుడు, మిథిలా నగరపౌరులు, దండకారణ్య మహర్షులు, ఈ మార్గాన్ని ఆశ్రయించారు.

(iii) భగవత్పూజా భక్తి :

లక్ష్మీదేవి, అంబరీషుడు, భరతుడు, మొదలైనవారిది ఈ దారి.

(iv) స్మరణ భక్తి :

ప్రహ్లాదుడు, ధ్రువుడు, ఈ కోవవారు.

(v) దాస్య భక్తి :

హనుమంతుడు, విదురుడు, అక్రూరుడు, ఈ దారివారు.

(vi) సఖ్య భక్తి :

ఈ దారికి మీ తాతే (అర్జునుడే) ముఖ్యోదాహరణ. సంజయుడు, బలరాముడు, సుదాముడూ కూడా అలాంటి వారే.

(vii) కాంతా భక్తి :

అంటే స్వామిని భర్తగా భావించడం. శ్రీకృష్ణుని అష్ట్భార్యలూ ఈ కోవకు చెందినవారే.

(viii) వాత్సల్య భక్తి :

అంటే పరమాత్మను పుత్రుడుగా భావించటం. దేవకీవసుదేవులు, యశోదా నందులు, అతిది కశ్యపులు, కౌసల్యా దశరథులు - వీరంతా అలాంటివారే.

(ix) ఆత్మనివేదన భక్తి :

బలి, విభీషణుడు, శిబిచక్రవర్తి, ఇలాంటివారిది ఈ దారి.

(x) తన్మయ భక్తి :

అంటే నిరంతరమూ పరమాత్మునిలో తాదాత్మ్యాన్ని, అంటే ఏకత్వాన్ని అనుసంధానం చేయడం. దీనికి ఉదాహరణలు ఎక్కువగా దొరకవు. యాజ్ఞవల్క్యుడు, వశిష్ఠుడు, మొదలైనవారు కొందరున్నారు.

(xi) పరమవిరహ భక్తి :

ఇదే మధురభక్తి. ఇంచుమించుగా గోకులంలోని స్ర్తిలందరూ ఈ కోవవారే. అయితే గోపికలలో విశేషమే మంటే - వారు ఈ పదకొండు రకాల భక్తిమార్గాలను కూడా ఆచరించారు.
ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈ పదకొండు భావనలూ కూడా జీవుల భావనలే. ఇందులో భగవంతుడికి ప్రమేయం ఏమీ లేదు. భగవంతుడు సూర్యుడి లాంటివాడు. ఆయన సన్నిధిలో ఎవరి కర్మఫలాలు వారికి చేరుతూ వుంటాయి. గోపికాఘట్టంలో కూడా జరిగిందదే. పరమాత్మకు ఏ కర్త ృత్వమూ లేదు. గోపికలయొక్క ఉపాసనాఫలం వారికి చేరింది. ఇది ఉపాసనారహస్యం.
(ఇంకా వుంది)

- కుప్పా వేంకట కృష్ణమూర్తి.. 9866330060